పాడేరు, ఏప్రిల్ 26: విశాఖ ఏజెన్సీ డివిజనల్ కేంద్రమైన పాడేరు పట్టణ నడిబొడ్డున పోలీస్ కానిస్టేబుల్‌ను మావోయిస్టు యాక్షన్ టీం సభ్యులు గురువారం సాయంత్రం కాల్చి చంపారు. పోలీసు శాఖలోని ఇంటలిజెన్స్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కూడా అప్పన్న (45) గురువారం సాయంత్రం జూనియర్ కళాశాల సమీపాన ప్రధాన రహదారి పక్కన తన కారుకు తానే స్వయంగా గాలి పెట్టుకుంటుంగా వెనుక నుంచి వచ్చిన ముగ్గురు సభ్యులు గల మావోయిస్టులు మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. మావోయిస్టు సభ్యులు మూడు రౌండ్ల కాల్పులు జరపగా రెండు బుల్లెట్లు అప్పన్న తల భాగంలో దూసుకుపోయి మరో బుల్లెట్ మిస్‌ఫైర్ అయినట్టు తెలుస్తోంది. తల భాగంలోకి రెండు బుల్లెట్లు దూసుకుపోవడంతో అప్పన్న అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అప్పన్న మృత దేహాన్ని వెనువెంటనే పాడేరు కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. పాడేరు అదనపు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
=============
రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి
తిరుపతి, ఏప్రిల్ 26: చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం మామండూరు సమీపంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడిక్కడే ఐదుగురు మరణించగా రుయాలో చికిత్స పొందుతూ గురువారం ఒకరు మృతి చెందారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఎర్రపాళెం గ్రామానికి చెందిన అల్లూరయ్య కుటుంబ సభ్యులు 11 మంది తిరుమల శ్రీవారి దర్శనార్థం వాహనాల్లో బయలుదేరారు. మామండూరుకు సమీపంలో ఒక వాహనం డ్రైవర్ నిద్ర మత్తులో రోడ్డు పక్కనే వున్న పెద్ద చెట్టును ఢీకొట్టాడు. ఈ సంఘటనలో డ్రైవర్ రవితో పాటు నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్రంగా గాయపడటంతో రుయా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరు గురువారం మృతి చెందాడు. సంఘటన స్ధలంలో లక్ష్మీదేవమ్మ(42), వెంకటేశ్వర్లు (34), చిన్నమ్మ(35), బుడ్డయ్య (23), డ్రైవర్ రవి (26) మృతి చెందారు. వేగంగా వచ్చి పెద్దపాటి చెట్టును డీకొట్టడంతో మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. రుయాలో చికిత్స పొందుతూ అల్లూరయ్య (55)మృతి చెందాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. రేణిగుంట పొలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
* మావోయిస్టు యాక్షన్ టీం ఘాతుకం
english title:
cop shot dead
Date:
Friday, April 27, 2012