హైదరాబాద్, ఏప్రిల్ 26: విశాఖ జిల్లా వాకపల్లి గిరిజన మహిళలపై అత్యాచారం సంఘటనలో బాధ్యులైన పోలీసులపై క్రిమినల్ కేసు విచారణ కొనసాగుతోంది. వారిపై దాఖలైన కేసుల్ని కొట్టివేయడానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి శేషశయనారెడ్డి నిరాకరించారు. ఈ సంఘటనలో పదమూడు మంది పోలీసులపై కేసు కొనసాగించాలని ఆయన ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన గిరిజన మహిళలపై పోలీసులు అత్యాచారం జరిపిన సంఘటనలో మొత్తం 21 మందిపై కేసులు నమోదయ్యాయి. అసలు ఇటువంటి సంఘటన జరగలేదని, తమపై అత్యాచారం జరిగిందని బాధితులు చెప్పారేతప్ప అత్యాచారం చేసిన వ్యక్తుల్ని గుర్తించలేదని, అసలు నిందితుల గుర్తింపునకు ‘ఐడి పేరేడ్’ నిర్వహించలేదని వాదిస్తూ ఎ రవికుమార్ సహా 21 మంది పోలీసులు హైకోర్టులో క్యాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో విచారణను నిలిపివేస్తూ స్టే ఉత్తర్వులను గతంలో హైకోర్టు జారీ చేసింది. న్యాయమూర్తి జస్టిస్ బి శేషశయనారెడ్డి ఎదుట ఈ కేసు విచారణకు రాగా పిటిషనర్లు లేవనెత్తిన వాదనలను హైకోర్టు క్యాష్ పిటిషన్‌లో పరిశీలించజాలదని తీర్పు చెప్పారు. అయితే సంఘటన జరిగినపుడు సెంట్రీ డ్యూటీలో ఉన్న ఎనిమిదిమందిపై క్రిమినల్ కేసును న్యాయమూర్తి కొట్టివేశారు. మిగిలిన పదమూడు మందిపై కేసు కొనసాగించాలని శేషశయనారెడ్డి ఆదేశించారు.
‘వాకపల్లి’ ఘటనపై క్యాష్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
english title:
vakapally
Date:
Friday, April 27, 2012