Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మండుతున్న ఎండలు

$
0
0

ఏలూరు, ఏప్రిల్ 27 : మండుతున్న ఎండలు జిల్లా ప్రజలను మాడ్చేస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఎండ వేడిమి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఒక వైపు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుంటే మరోవైపు మంచినీటి కొరత సతమతం చేస్తోంది. దీనికి తోడు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని విద్యుత్ జన జీవనాన్ని నరకప్రాయంగా మార్చేస్తోంది. రోజురోజుకూ వేసవి ఉష్ణోగ్రత పెరుగుతుండటంతో పగటి వేళల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు వేళాపాళా లేని విద్యుత్ కోతతో నరక యాతన అనుభవిస్తున్నారు. దీనికి తోడు పలు ప్రాంతాల్లో మంచినీటి కొరత తీవ్ర రూపం దాల్చడం వారి ఇబ్బందులను మరింతగా పెంచుతోంది. జిల్లా కేంద్రంతోపాటు పట్టణాలు, పల్లెల్లో వేసవి తీవ్రత రానురాను ఉగ్రరూపం దాల్చుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతున్న ఎండ వేడిమి 12 గంటల సమయానికి మంటెక్కిస్తోంది. రహదారులపై ట్రాఫిక్ పల్చపడుతోంది. పాదచారుల సంచారం కూడా తగ్గుతుండటంతో దాదాపు రోడ్లన్నీ నిర్మానుష్యమవుతున్నాయి. అయితే సాయంత్రం 5.30 గంటలకు ఎండ వేడిమి కొంత తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కాస్త సేదతీరుతున్నారు. అయితే కొన్ని చోట్ల విచ్చలవిడిగా అమలవుతున్న విద్యుత్ కోత వారికి తిరిగి సమస్య సృష్టిస్తోంది. పగటి సమయంలో బయట వాతావరణం వేడిగా ఉండగా విద్యుత్ కోత కారణంగా ఫ్యాన్లు తిరగక ఉక్కపోతను తప్పనిసరి పరిస్థితుల్లో భరించాల్సి వస్తోంది. రాత్రి సమయంలో కూడా ఎడాపెడా కరెంటు సరఫరాను ఆపివేస్తుండటంతో పరిస్థితి మరింత దుర్భరంగా మారుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇష్టానుసారం విద్యుత్ కోత అమలు జరుగుతోంది. అవసరానికి సరిపడా ఉత్పత్తి లేని కారణంగా విద్యుత్ కోత అనివార్యమైనప్పటికీ నిర్ణీత వేళల ప్రకారం దాన్ని అమలు జరపకపోవడంతో ప్రజల ఇబ్బందులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. పట్టణాల్లో కరెంటు సరఫరా పరిస్థితి దారుణంగా మారితే పల్లెల్లో సంగతి చెప్పనవసరం లేదు. రాత్రి వేళల్లో కూడా కరెంటు రావడం, పోవడం అనేక సార్లు జరుగుతుండటంతో ప్రజలు విద్యుత్ శాఖకు శాపనార్ధాలు పెడుతున్నారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు కొబ్బరిబొండాలు, శీతల పానీయాలు, జ్యూస్‌లు వంటి వాటిని ఆశ్రయిస్తున్నారు. అయితే వీటి ధర ఆకాశాన్నంటుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు మంచినీళ్లే గతవుతున్నాయి. జ్యూస్‌ల ధరలు ఈ ఏడాది వేసవిలో అమ్మకందార్లు విపరీతంగా పెంచి వేశారు. గతంలో గ్లాసుధర పది రూపాయలు ఉండగా ప్రస్తుతం 30 నుంచి 50 రూపాయల వరకు పండ్ల రకాలను బట్టి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కొబ్బరిబొండాలు ధర పది రూపాయలకు చేరిపోయింది. ఇక శీతల పానీయాలు ధరలు ఒక్కొక్కచోట ఒక్కొక్క రకంగా అమలవుతున్నాయి. డిమాండ్‌ను బట్టి అమ్మకందారులు వీటిని విక్రయిస్తూ వినియోగదారులను పీల్చిపిప్పి చేస్తున్నారు. ఆసరాగా ఉంటాయనుకున్న వాటర్ ప్యాకెట్ల ధరలు కూడా వేసవిలో రూపాయిన్నరకు చేరిపోయాయి. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు వంటి ప్రదేశాల్లో వీటి ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండానే పోతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పది రూపాయల వస్తువును 20 రూపాయలకు కూడా విక్రయిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించే వారిపై షాపు యజమానులు దురుసుగా వ్యవహరిస్తున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.
ఎండలు, విద్యుత్ కోత పరిస్థితి ఇలా వుంటే అంతంతమాత్రంగా వున్న మంచినీటి సరఫరా మరిన్ని సమస్యలు సృష్టిస్తోంది. చాలా ప్రాంతాల్లో కుళాయిల ద్వారా రెండుమూడు బిందెలు కంటే నీరు రాకపోవడంతో మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు శాశ్వతమైన చర్యలు కరువయ్యాయి. ఏలూరు నగర ప్రజలకు ఈ వేసవి నుంచి గోదావరి జలాలను అందిస్తామన్న ప్రజాప్రతినిధులు, అధికారుల హామీలు గాలిలో కలిసిపోయాయి. ఇక్కడ పూర్తిస్థాయిలో పనులు పూర్తికాకపోవడంతో నూతనంగా నిర్మించిన పంపుల చెరువుల నుంచి ఒక్క చుక్క నీరు కూడా సరఫరా చేయలేకపోతున్నారు. ప్రతీ ఏటా వేసవి నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు కోట్ల రూపాయలతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం, ప్రభుత్వానికి పంపడం పరిపాటిగా మారింది. ఈ ప్రతిపాదనలు ఎంతవరకు ఆమోదానికి నోచుకుంటున్నాయి. ఎంత మొత్తం విడుదలవుతుంది అన్నది అర్ధంకాని ప్రశ్నగా మారిపోతోంది. ప్రతిపాదనలు భారీగా కనిపిస్తున్నా వేసవిలో ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. వేసవిని దృష్టిలో ఉంచుకుని మంచినీటి చెరువులను ముందుగా నింపుకోవాలని అధికారులు చెవినిల్లుకట్టుకుని చెప్పినా కొన్ని మండలాల్లో చెరువులను పూర్తిస్థాయిలో నింపకపోవడం వలన రోజురోజుకూ నీటి ఎద్దడి పెద్ద సమస్యగా మారుతోంది. మొత్తం మీద ఈ వేసవి జిల్లా ప్రజలను నరకయాతనకు గురిచేస్తోంది.

సమ్మె విరమించకపోతే కొత్త నియామకాలు
ఏలూరు, ఏప్రిల్ 27 : జిల్లాలో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిఎలు వెంటనే సమ్మె విరమించి విధులకు హాజరుకావాలని, లేని పక్షంలో కొత్తగా కమ్యూనిటీ యాక్టివిస్ట్‌లను నియమిస్తామని జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, రాష్ట్ర స్ర్తినిధి బ్యాంకు ఛైర్మన్ జీవమణి స్పష్టం చేశారు. స్థానిక టిటిడిసిలో శుక్రవారం సాయంత్రం మండల మహిళా సమాఖ్యల అధ్యక్షులతో జరిగిన అత్యవసర సమావేశంలో సిఎల పనితీరుపై చర్చించారు. విధులకు హాజరుకాకుండా సమ్మెకు వెళ్లడం భావ్యంకాదని, ఏమైనా సమస్యలుంటే జిల్లా మహిళా సమాఖ్య పరిధిలో చర్చించుకుని పరిష్కరించుకోవాలే తప్ప, ఇష్టానుసారం వ్యవహరిస్తే మహిళా సమాఖ్య చూస్తూ ఊరుకోదని చెప్పారు. ప్రతీ గ్రామంలో పని చేసే సిఎకి కనీసం 500 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని, ప్రస్తుతం గ్రామ సమాఖ్యల పరిధిలో మంజూరైన రుణాలలో ఒక శాతం సొమ్ము సి ఎ పొందుతున్నారని, అంతేకాకుండా అభయహస్తం, ఆమ్ ఆద్మీ యోజన, పావలా వడ్డీ మొదలైన కార్యక్రమాల్లో కూడా ఒక శాతం సొమ్ము సిఎలు తీసుకుంటున్నా (మహిళలు ఊరుకుంటున్నారని, ఈ స్థితిలో సిఎలు సమ్మె చేయడం న్యాయం కాదని చెప్పారు. తాము నియమించిన సిఎలు తమ కష్టాలను తమకు చెప్పుకోకుండా బయట వారిని ఆశ్రయించి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగడం శోచనీయమని, సక్రమంగా పనిచేయని సి ఎలను తొలగించి మే 5 నాటికి గ్రామస్థాయిలో కొత్త వారిని ఎంపిక చేసుకుంటామని, ఈ మేరకు జిల్లా సమాఖ్య ఏకగ్రీవంగా తీర్మానించినట్లు జీవమణి చెప్పారు. సిఎలు రెండు, మూడు పదవులు నిర్వహిస్తున్నారని అన్ని చోట్ల మహిళల నుండి డబ్బు వసూలు చేస్తున్నారని, ఇకపై ఒకరు ఒక పదవే నిర్వహించాలని, దీనివల్ల పేద వారికి ఉపాధి లభించే అవకాశం వుందని చెప్పారు. గ్రామాల్లో అంతర్గత రుణాలు పొందుతున్న మహిళల నుండి కూడా సిఎలు డబ్బు వసూలు చేస్తున్నారని, అయినా సరే ప్రభుత్వ పరంగా వేతనం ఇవ్వడం లేదు కాబట్టి మహిళా సంఘాలు సిఎలకు సొమ్ములిచ్చి ఆదుకోవడం జరుగుతోందని చెప్పారు. ఇప్పటికైనా గ్రామ సంఘాల మహిళా అధ్యక్షురాలితో చర్చించి సి ఎలు తమ సమ్యలను వెల్లడించుకోవాలని, అక్కడ నుండి మండల, జిల్లా సమాఖ్య ఒక నిర్ణయం తీసుకుని సి ఎలకు న్యాయం చేస్తుందన్నారు. అలా కాకుండా మొండిగా సమ్మె బాటలోనే పయనిస్తే కొత్తవారికి అవకాశం కల్పిస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా మహిళా సమాఖ్య నాయకులు కురికురి ధనలక్ష్మి, ఎలిపే శ్రీదేవి, కె సుమిత్ర, చెరుకువాడ రాజేశ్వరి, జాలాది విజయకుమారి, టి మహాలక్ష్మి, బి మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

నరసాపురంలో మారనున్న సమీకరణాలు
--కులాల ఆధారంగా నేతల మోహరింపు--
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, ఏప్రిల్ 27: నరసాపురం సెగ్మెంట్ అంటేనే కుల రాజకీయాలకు పెట్టింది పేరు. ఈ సెగ్మెంట్‌లో ఉద్దండులైన నాయకులు మూడు పార్టీల నుంచీ పోటీ చేస్తున్నారు. ఓటర్ల నాడిని పసిగట్టడం అంత తేలికైన విషయం కానప్పటికీ నాయకులు మాత్రం కుల పాచికలను ప్రయోగిస్తున్నారు. టిడిపి తరఫున చినిమిల్లి సత్యనారాయణరావు, కాంగ్రెస్ తరఫున కొత్తపల్లి సుబ్బారాయుడు పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఆ ప్రాంతంలో నిర్ణయాత్మక శక్తిగా ఈ సామాజికవర్గం ఉండడంతో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజుకు వెన్నుదన్నుగా ఉండేందుకు జగన్ కూడా భీమవరం నుంచి కాపు సామాజిక వర్గంతోనే పై ఎత్తులు వేయిస్తున్నారు. ఆ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జ్‌లుగా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, తోట గోపి, జక్కంపూడి విజయలక్ష్మిలను నియమించారు. ప్రసాదరాజును గెలిపించే బాధ్యతను కూడా ఈ ముగ్గురి పైనే పెట్టారు. జగన్ పెట్టిన ఈ బాధ్యతను ఈ ముగ్గురూ ఒక సవాల్‌గా స్వీకరించారు. రేపటి నుంచే కార్యాచరణకు వీరంతా సిద్ధమయ్యారు. నరసాపురం సెగ్మెంట్ పరిధిలోని నరసాపురం టౌన్, రూరల్, మొగల్తూరు మండలాల్లో వీరంతా మకాం వేసి క్యాడర్‌ను అన్ని రకాలుగా బలోపేతం చేయనున్నారు. ప్రసాదరాజును అఖండ మెజార్టీతో గెలిపించి జగన్ ముందు తమ సత్తాను చాటడానికి ఉవ్విళ్ళూరుతున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిన గ్రంధి
-్భమవరం వచ్చి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన జగన్-
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, ఏప్రిల్ 27: మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందే ఆయన తండ్రి గ్రంధి వెంకటేశ్వరరావు మొగల్తూరులో జగన్‌ను కలిసి పార్టీలో చేరారు. శుక్రవారం జగన్ పార్టీలో చేరుతున్న మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ను కలిసేందుకు వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. పార్టీలో చేరినందుకు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. గ్రంధి ఇంటి వద్ద అభిమానుల కోలాహలంతో నిండిపోయింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఆయా నియోజకవర్గాల నుండి ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. మరో జన్మనిచ్చిన జగన్
నా తండ్రి గ్రంధి వెంకటేశ్వరరావు (జివిఆర్) రాజకీయాల్లో ఓనమాలు దిద్దించారు.. వైఎస్ రాజశేఖరరెడ్డి (వైఎస్సార్) రాజకీయ భవిష్యత్తును ఇచ్చి ఎమ్మెల్యేగా నిలబెట్టారని మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇక వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తనను పార్టీలోకి ఆహ్వానించి మరో జన్మనిచ్చారంటూ గ్రంధి వెల్లడించారు. శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితులు గమనిస్తున్నానని, కార్యకర్తలు, నాయకులు గ్రంధి కుటుంబ అభిమానుల కోరిక మేరకు వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి చేరానన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో తనకు ఎంతో ఆత్మీయ సంబంధముందన్నారు. భీమవరం పట్టణ ప్రజలకు సమ్మర్ స్టోరేజీ ట్యాంకు రూ.6కోట్లు మంజూరుచేసి ఇక్కడ ప్రజల దాహార్తిని తీర్చిన ఘనత వైఎస్సార్‌దేనన్నారు. అలాగే పట్టణంలోని ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని బైపాస్ నిర్మాణానికి కోట్లాది రూపాయల నిధులు విడుదల చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కుట్రలు ఏ విధంగా ఉన్నాయన్నదీ ఒక్కసారి అభివృద్ధి కార్యక్రమాల వద్దకు వెళితే తెలుస్తుందన్నారు. ఆనాడు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సమయంలో ఏర్పాటుచేసిన శిలాఫలకాలు సైతం ఇప్పుడు తొలగించారని గ్రంధి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1400కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వైఎస్సార్ దేశంలోనే గొప్ప నాయకుడన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్నీ అసత్యాలు చెబుతోందన్నారు. ప్రజానాయకుడు కనుకే రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకు వచ్చారన్నారు. పేదలకు మంచి చేసిన రాజశేఖర్‌రెడ్డిని కొందరు చాలా దారుణంగా విమర్శిస్తున్నారన్నారు. ఆయన తనయుడు జగన్మోహన్‌రెడ్డిని అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు.
జగన్ పోరాటానికి తనతోపాటు అందరూ అండగా ఉండాలని కోరారు. ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపి సీట్లలో గెలిచి తరువాత రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంటుందని తెలిపారు. అయితే ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తరువాత పార్టీలోకి వస్తే తనను స్వార్థపరుడని అనుమానిస్తారేమోనని, అభిమానుల అభిమానాన్ని పోగొట్టుకుంటానేమోనని జగన్ ఆదేశానుసారం పార్టీలో చేరానన్నారు. ఇలా ప్రజలతో మాట్లాడి రెండున్నరేళ్లయిందని, ఇక భవిష్యత్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని గ్రంధి ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కవు
వైఎస్సార్ కాంగ్రెస్ నాయకురాలు జక్కంపూడి
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, ఏప్రిల్ 27: ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పట్ల విశేష ఆదరణ కనబరుస్తున్నారని, రానున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి జోస్యం చెప్పారు. కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పని చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి శుక్రవారం చేరారు. ఈ సందర్భంగా ఆయన స్వగృహంలో జరిగిన సమావేశంలో జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే అల్లు సత్యనారాయణ తదితరులు ప్రసంగించారు. కాంగ్రెస్ చాలా తప్పులు చేస్తున్నదని, సోనియాగాంధీ లెంపలు వేసుకునే పరిస్థితి రానుందన్నారు. వైఎస్ జగన్ ప్రజల గుండెల్లో ఉన్నారని, కాంగ్రెస్ వారు చరిత్రహీనులని విజయలక్ష్మి విమర్శించారు. ప్రజలను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మోసం చేస్తున్నారని, ప్రజలు ఉద్దరిస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆ రోజు రైతుల కోసం రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 18 మంది ఎమ్మెల్యేలు జగన్ వెంట నడిచారన్న విషయాన్ని గుర్తుచేశారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇద్దరూ ప్రజల బాగోగులు పక్కనబెట్టి కుమ్ములాడుకుంటున్నారని విమర్శించారు. రాబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే రానున్న 30ఏళ్లు స్వర్ణయుగమన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్‌కు జగన్ తగిన గుణపాఠం చెబుతారని చెప్పారు. చిరంజీవి బావమరిది అల్లు సత్యనారాయణ మాట్లాడతారంటూ చేగొండి హరిరామజోగయ్య వేదికపై నుంచి చలోక్తులు విసిరారు. ఇంతలో మైకు తీసుకున్న అల్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఓట్లు అభ్యర్థించేందుకు వచ్చానే తప్ప, చిరంజీవికి, తనకు ఎటువంటి సంబంధం లేదని, ఈ విషయాన్ని ప్రజలు నమ్మాలన్నారు. భీమవరం నియోజకవర్గంలో ఎక్కడకు వెళ్లినా గ్రంధి శ్రీనివాస్ గురించే చెబుతున్నారని, ఈ నియోజకవర్గంలో గ్రంధికి ఎదురే లేదన్నారు. ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన సమయంలో ఏ విధంగా జనం వచ్చారో, అదే విధంగా జగన్‌కు కూడా జనాదరణ వస్తుందన్నారు. ఆ పార్టీ నాయకులు పరుపుల సుబ్బారావు, అందె భుజంగరావు, జోహార్‌వతి, ముదునూరి ప్రసాదరాజు, మేకా శేషుబాబు, తోటగోపి, డాక్టర్ వేగిరాజు రామకృష్ణంరాజు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పివిఎల్ నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు.

లారీ ఢీకొని ఒకరు మృతి
ఉంగుటూరు, ఏప్రిల్ 27: జాతీయ రహదారిపై నారాయణపురం సెంటరులో లారీ ఢీకొని నడింపల్లి వెంకటేశ్వరరాజు అలియాస్ చంటిరాజు (35) మృతిచెందాడు. శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. నడింపల్లి వెంకటేశ్వరరాజు నిడమర్రు మండలం ఫత్తేపురం గ్రామం. శుక్రవారం సాయంత్రం విజయవాడ వెళ్లడానికి పత్తేపురం నుండి నారాయణపురం సెంటర్‌కు బైక్‌పై స్నేహితునితో కలిసి వచ్చారు. జాతీయ రహదారిపై లారీ బైక్‌ను వెనుక నుండి ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న చంటిరాజు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. హైవే అంబులెన్స్‌లో తరలించే ప్రయత్నం చేస్తుండగా మృతిచెందాడు. చేబ్రోలు ఎస్సై రమణ కేసునమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చంటిరాజుకు భార్య అనూరాధ, కుమారుడు వంశీకృష్ణంరాజు ఉన్నారు. మామ పెనె్మత్స సత్యనారాయణరాజు గణపవరం నుండి సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు చంటిరాజు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో కాంట్రాక్టు పనులు చేస్తుంటారు. ఇటీవలే స్వగ్రామం వచ్చారు. తిరిగి ఛత్తీస్‌గఢ్ వెళ్తూ ఈ ప్రమాదానికి గురయ్యారు.

ఖాళీ బిందెలతో మహిళల నిరసన
ఉండి, ఏప్రిల్ 27: మండల కేంద్రం ఉండిలో రక్షిత మంచినీరు దుర్గంధభరితంగా మారిందని, ప్రజలకు తాగేందుకు నీరు కూడా లేదని, ఉండిలోని సిపిఐ అనుబంధ మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలు పెద్దయెత్తున ఆందోళన నిర్వహించారు. గ్రామంలోని వివిధ ప్రాంతాల నుండి మహిళలు ఖాళీ బిందెలతో ఎంపిడిఒ కార్యాలయానికి చేరుకుని ప్రదర్శనగా లోపలికి వెళ్ళారు. ఉండి ప్రత్యేక అధికారిణి, ఎంపిడిఒ బయటకు రావాలని నినాదాలు చేశారు. ఎంపిడిఒ కార్యాలయానికి రాలేదని తెలిసి ఉద్యమకారులు ఆగ్రహంతో కార్యాలయంలో ఎవరూ ఉండటానికి వీల్లేదని సిబ్బంది అందరినీ బయటకు తీసుకొచ్చి తలుపులు వేశారు. ఈ సందర్భంగా మహిళలు తాగునీరు దుర్గంధంగా ఉన్నా అధికారులు పట్టించుకోకపోవటం అన్యాయమని నినాదాలు చేశారు. చిన్న పిల్లలను చంకన పెట్టుకుని మహిళలు రావటం విశేషం. ఒక దశలో మహిళల ఆగ్రహాన్ని అదుపు చేయటం నాయకుల తరం కూడా కాలేదు. చేపల కోసం వేలాది మంది ప్రజలకు తాగునీరు లేకుండా చేస్తారా అని అధికారులు నిలదీశారు.
ఎంపిడిఒ, కార్యదర్శిని సస్పెండ్ చేయాలి
మహిళా సంఘం జిల్లా కార్యదర్శిని నేతల లక్ష్మి, సిపిఐ జిల్లా నాయకులు కలిశెట్టి వెంకట్రావు, మండల సిపిఐ కార్యదర్శి సనపల శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉండి ప్రధాన కాలువ పక్కన ఉన్న రక్షిత మంచినీటి చెరువు ఆధ్వాన్నంగా మారటానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమన్నారు. పంచాయతీ కార్యదర్శి, ఎంపిడిఒలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దుర్వాసన లేని రక్షిత మంచినీరు అందించేందుకు వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వందలాది మందితో జరిగిన ప్రదర్శన , ధర్నా అనంతరం ఎంపిడిఒ కార్యాలయ సూపరింటెండెంట్‌కు వినితిపత్రం అందించారు. రెండు రోజుల్లో మంచినీటి సరఫరాలో మార్పు రాకపోతే నిరవధిక మని ఆందోళనకారులు హెచ్చరించారు.

సినిమా టిక్కెట్ల విక్రయానికి భారీ బందోబస్తు!
కొవ్వూరు, ఏప్రిల్ 27: కొవ్వూరు గాయత్రి సినిమా థియేటర్‌లో కొత్తగా విడుదలైన సినిమా మొదటిరోజు టిక్కెట్లను భారీ పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో విక్రయించడంతో థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొవ్వూరులో గాయత్రి థియేటర్‌లో శుక్రవారం కొత్త సినిమా విడుదలైంది. అయితే సినిమా టిక్కెట్ల అమ్మకం విషయంలో గందరగోళ పరిస్థితి ఏర్పడటం, కొందరు వ్యక్తులు సినిమా ప్రారంభం రోజున టిక్కెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారని పలువురు అధికారుల దృష్టికి తీసుకురావటంతో పోలీసు, రెవెన్యూ అధికారులు శుక్రవారం థియేటర్ వద్దకు చేరుకుని టిక్కెట్ల అమ్మకంపై థియేటర్ యజమాని వెంకటేశ్వరరావుతో చర్చించారు. సినిమా టిక్కెట్ల అమ్మకంపై చెలరేగిన వివాదం కారణంగా తహసీల్దార్ పి శ్రీనివాసరావు, ఇద్దరు ఎస్‌ఐల పర్యవేక్షణలో టిక్కెట్లు విక్రయించడంతో ఇటు ప్రేక్షకులు, అటు ప్రజలు విస్మయానికి గురయ్యారు. కొవ్వూరు ఆర్డీవో కె సూర్యారావు థియేటర్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. థియేటర్ యజమాని మారిశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాము ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే టిక్కెట్లు విక్రయించామని చెప్పినా అధికారులు పట్టించుకోకుండా తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

తిరుకల్యాణ మహోత్సవంలో భక్తులకు అలంకరణ అవకాశం
ద్వారకాతిరుమల, ఏప్రిల్ 27 : చిన వెంకన్న వైశాఖ మాస తిరు కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేయించుకునేందుకు భక్తులకు అవకాశం కల్పించినట్లు ఆలయ ఇవో విష్ణుప్రసాద్ తెలిపారు. మే 1 నుంచి 8వ తేదీ వరకు జరగనున్న కళ్యాణ మహోత్సవాల సందర్భంగా స్వామివారి ప్రత్యేక అలంకరణలు శనివారం నుంచి ప్రారంభమవుతాయన్నారు. ఒక రోజు అలంకారం చేసేందుకు దాతలు అయిదు వేల రూపాయలు రుసుము చెల్లిస్తే వారికి ఆ రోజు అంతరాలయ దర్శనం, రెండు లడ్డూలు, కండువ, రవికలను శ్రీవారి ప్రసాదంగా అందజేయనున్నట్లు ఇవో తెలిపారు. 28న మురళీకృష్ణ అలంకరణ, 29న నవనీత కృష్ణన్, 30న కాళింగ మర్ధన, మే 1న స్వామివారి మహావిష్ణుగాను, 2న మోహినీ అలంకారంగా అవతరిస్తారన్నారు. అలాగే మే 3న రామావతారం, 4న శ్రీదేవి, భూదేవి, విష్ణు అలంకరణ, 5న రాజన్నార్, 6న భకసంహారం, 7న శ్రీరామపట్ట్భాషేకం, 8న శయన మహావిష్ణువుగా శ్రీవారిని అలంకరిస్తారని ఇఒ తెలిపారు.

మండుతున్న ఎండలు జిల్లా ప్రజలను మాడ్చేస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఎండ వేడిమి ప్రజలను
english title: 
m

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>