మేడ్చల్, జీడిమెట్ల, జూన్ 2: గొంతుకోసి అతి కిరాతకంగా ఇద్దరు వ్యక్తులను హతమార్చిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కలకలం సృష్టించింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా మెట్‌పల్లికి చెందిన తిరుపతి (29) డిసిఎం డ్రైవర్ కమ్ ఓనర్. మెట్‌పల్లికి చెందిన అంకుశ్ (45) తిరుపతి వద్ద గుమస్తా. అయితే మెట్‌పల్లిలో ఉండే ఆయిల్ దుకాణం యజమాని ఛత్రపతి తిరుపతి, అంకుశ్‌లను హైదరాబాద్‌కు వెళ్లి ఆయిల్ తీసుకురావాలని చెప్పారు.
కాగా శుక్రవారం ఉదయం 7 గంటలకు తిరుపతి, అంకుశ్‌లు 4.70 లక్షల డబ్బుతో ఏపి 03 యు 9176 నెంబరు గల డిసిఎంలో మెట్‌పల్లి నుండి హైదరాబాద్‌కు బయలుదేరారు. కాగా మేడ్చల్ జాతీయ రహదారి, గుండ్లపోచంపల్లి గ్రామం, ఇఎంఆర్‌ఐ సమీపం వద్ద రోడ్డు పక్కన గల హుడా గ్రీనరీలో తిరుపతి, అంకుశ్‌లు హత్యకు గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయిల్ దుకాణం యజమాని ఛత్రపతి తిరుపతి, అంకుశ్‌లకు ఫోన్ చేయగా వారు ఫోన్ ఎత్తకపోవడంతో ఛత్రపతి వారిని వెతుక్కుంటూ తన కారులో వచ్చాడు. కాగా మేడ్చల్ జాతీయ రహదారిపై డిసిఎం ఆగి ఉండటం చూసిన ఆయన ఆ పరిసర ప్రాంతాల్లో చూడగా, ఇద్దరూ ఇద్దరు హత్యకు గురై ఉండటాన్ని చూసి షాకయ్యాడు. విషయం తెలుసుకున్న పేట్‌బషీరాబాద్ ఏసిపి సయ్యద్ రషీక్, సిఐ జానయ్య, ఎస్‌ఐలు కాసీం పీరా, నేతాజి, సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా తిరుపతి, అంకుశ్‌ల గొంతుకోసి కిరాతకంగా హత్య చేసి వారి వద్ద ఉన్న 4.70 లక్షలతో హంతకులు పరారయినట్టు పోలీసులు భావిస్తున్నారు. అయితే లక్షల రూపాయలను వెంట తీసుకు వెళ్లడాన్ని గమనించిన వ్యక్తులే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని పలువురు అనుమానిస్తున్నారు.
అతిగా మద్యం సేవించిన ఇద్దరినీ మద్యం బాటిళ్లతోనే హతమార్చినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మృతుల గొంతు, శరీర భాగాల్లో పలు గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లు, ఓ కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి సంఘటనా స్థలంతో పాటు పరిసర ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. జాగిలం హత్య జరిగిన ప్రదేశం నుంచి సమీపంలోని బైసాకీ ఫ్యామిలీ దాబాలోకి వెళ్లి ఒక టేబుల్ వద్ద ఆగి అక్కడే కూర్చుండిపోయింది. ఆధారాల కోసం పోలీసులు క్లూస్‌టీంను రంగంలోకి దించారు.
ఈ మేరకు పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ రహదారికి ఆనుకుని ఈ సంఘటన జరగడంతో వాహనదారులు వాహనాలను నిలిపి మృతదేహాలను చూశారు. ఎలాంటి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పేట్‌బషీరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలం
శంకర్‌పల్లి, జూన్ 2: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలోని లక్షలాది ఎకరాలకు నీరు అంది పలు జిల్లాలు సస్యశ్యామలం కానున్నాయి. తెలంగాణ ప్రాంతంలోని కొన్ని జిల్లాలను తాగునీరు, సాగునీరుతో సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు పనులను 28 ప్యాకేజీలుగా విభజించారు. 23వ ప్యాకేజీ (రంగారెడ్డి-మెదక్) సొరంగం పనులను తీసుకున్న పటేల్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ నిర్వాహకులు ఈ పనులను ప్రారంభించారు. అందులో భాగంగా గత సంవత్సరం నుంచి శంకర్‌పల్లి మండలంలోని చందిప్ప గ్రామంలో ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపుపొందబోతున్న ఈ ప్రాజెక్టుపై ఈనెల ఐదున ఆంధ్రప్రదేశ్, మహారాష్ట ముఖ్యమంత్రులు కూడా ఒప్పందంపై సంతకాలు పెట్టడం ఒక చారిత్రాత్మక ఘట్టంగా పేర్కొనవచ్చు. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 40 వేల 300 కోట్లుగా అంచనా.
ప్రాణహిత నుంచి 160 టిఎంసిల నీటిని మళ్లించి 16.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు సరఫరా చేయడం, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 30 టిఎంసిల నీటిని సరఫరా చేసేందుకు 2008 నవంబర్‌లో ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. ప్రభుత్వ ఒప్పందం ప్రకారం పటేల్ కంపెనీకి 1059 కోట్లు మంజూరు కావాల్సి ఉంది. గత పది నెలల నుంచి మండలంలోని చందిప్ప-మహాలింగపురం గ్రామాల పరిధిలో రాత్రిపగలు పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా సొరంగం, సంపు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. 23వ ప్యాకేజీలో మెదక్ జిల్లాలోని మామిడిపల్లి నుంచి రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని చందిప్ప గ్రామం వరకు పనులు జరుగుతాయి. పటేల్ అండ్ కంపెనీ చందిప్పలో రైతుల నుంచి రెండున్నర ఎకరాలను కొనుగోలు చేసి సంపు నిర్మాణ పనులు చేస్తోంది. గడువులోపు పనులు పూర్తి చేయాలన్న ఆశయంతో కంపెనీ 50 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ రెండున్నర ఎకరాలలో 75 మీటర్ల లోతులో సంపు నిర్మాణానికి ఒక భారీ క్రేన్‌తో తవ్వకాలు జరిపారు. ఇంకో ఐదు మీటర్లు ఈ నెల పదిలోగా పూర్తి చేయనున్నారు. సంపు వెడల్పు తొమ్మిది మీటర్లు, లోతు 80 మీటర్లు పూర్తికాగానే మరో 40 మీటర్ల లోతు, 20 మీటర్ల వెడల్పుతో తవ్వకాలు జరుపుతారు. 124 మీటర్ల లోతు సంపు తవ్వి అందులో 110 మెగావాట్ల రెండు విద్యుత్ మోటార్లు బిగించి నీటిని లిఫ్టు చేస్తారు. సంపుకు కొద్దిదూరంలో భూగర్భంలో నీటిని నిలువచేసే దానిని నిర్మిస్తారు. దాని పక్క నుంచి మొదలయ్యే 24వ ప్యాకేజీలో కలుపుతారు. ఈ నీరు ఓపెన్ కెనాల్ గుండా వెళ్లి 25వ ప్యాకేజీలోని చేవెళ్ల మండలం ఊరెళ్ల గ్రామంలో నిర్మించే రిజర్వాయర్‌లో కలుస్తుంది. అక్కడి నుంచి నీటి పంపిణీ జరుగుతుంది. ఈ నీరు హైదరాబాద్‌కు 30 టిఎంసిలు, శంకర్‌పల్లి, చేవెళ్ల, పరిగి ప్రాంతాలకు సరఫరా అవుతుంది. అయితే మెదక్‌లోని సంగారెడ్డి మండలంలోని మామిడిపల్లి నుంచి రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి మండలం చందిప్ప దాకా 19 కిలోమీటర్ల వరకు 124 మీటర్ల లోతులో సొరంగ మార్గం తవ్వనున్నారు. దీని వెడల్పు ఏడు మీటర్లు. సొరంగ మార్గం నుంచే చందిప్పకు నీరు వస్తుంది. దీనికి నాలుగు కిలోమీటర్లకు ఒక సంపును నిర్మిస్తున్నారు. అలాగే మహాలింగపురం వద్ద సంపుకు సంబంధించి 25 మీటర్ల వరకు తవ్వకం పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది లోగా సంపు నిర్మాణం పూర్తవుతుందని నిర్వాహకులు తెలపారు. ఇక్కడ ప్యాకేజీ సొరంగం పనులు, తదితరాలు 2015 ఏప్రిల్ లోగా పూర్తి చేయాల్సి ఉంది.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా తీసుకువచ్చే నీటితో ఇక్కడి తెలంగాణ భూములకు సాగునీరు, తాగునీరు అందుతుందని నిపుణులు చెబుతున్నారు. పెద్దమొత్తంలో ఈ ప్రాజెక్టుకు నిధులు ఖర్చవుతాయి. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పిస్తే 90 శాతం నిధులను కేంద్రమే భరిస్తుంది. దీనివల్ల రాష్ట్రప్రభుత్వానికి భారం తగ్గుతుందని వారు పేర్కొన్నారు.
వికారాబాద్ బస్‌డిపోకు మహర్దశ
వికారాబాద్, జూన్ 2: హైద్రాబాద్ మినహా కేవలం గ్రామీణ ప్రాంతాలకే బస్సులు నడుపుతూ గ్రామీణ డిపోగా పేరుపొందిన వికారాబాద్ బస్‌డిపోకు మహర్దశ పట్టనుంది. ఇక నుండి వికారాబాద్ డిపో బస్సులు జిల్లానే కాదు రాష్ట్రాన్ని దాటి పోనున్నాయి. అందుకు అధికారులు ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. అధికారులు ఉద్యోగుల తరఫున యూనియన్ నాయకులు అవగాహనకు వస్తే బస్సులు నడవడం ప్రారంభమవుతాయి. హైద్రాబాద్-1 డిపో వారు నడిపే మహారాష్ట్ర మీరజ్, పండరీపూర్, షోలాపూర్‌లతో పాటు మంత్రాలయం, సేడెం ప్రాంతాలకు బస్సులు నడిపే అవకాశం వికారాబాద్ డిపోకు లభించనుంది. వికారాబాద్ శాటిలైట్ టౌన్‌గా ఎంపికై పనులు ప్రారంభమైన సందర్భంలో డిపో బస్సులు ఇతర రాష్ట్రాలకు నడపడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా వికారాబాద్ డిపోకు కేవలం ఎక్స్‌ప్రెస్ బస్సులే కాకుండా డీలక్స్, లగ్జరీ, గరుడ బస్సులను సైతం ఇవ్వాలని వికారాబాద్ ప్రాంత వాసులు కోరుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలంకు నడుపుతున్న స్పెషల్ బస్సులను శాశ్వతంగా నడపాలని కోరుతున్నారు.
ఛత్రపతిని ఆదర్శంగా తీసుకోవాలి
మహేశ్వరం, జూన్ 2: హిందూ సామ్రాజ్యం కోసం వీరోచితంగా పోరాడిన ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకున్న ప్రతి ఒక్కరు తెలంగాణ కోసం ఆత్మత్యాగం చేసిన సిరిపురం యాదయ్యను కూడా ఆదర్శంగా తీసుకుని ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి రాష్ట్రాన్ని సాధించాలని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ఆచారి పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని నాగారం గ్రామంలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్య దినోత్సవం, తెలంగాణ ధూంధాం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచారి మాట్లాడుతూ, పార్టీల కతీతంగా ప్రతి ఒక్కరు తెలంగాణ కోసం పోరాడాలని ఆచారి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు తమ పదవులు కాపాడుకోడానికి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చ ప్రధాన కార్యదర్శి బి.పాపయ్య, ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ సమసేవా ప్రముఖ్ బల్వంతరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఎం.సుదర్శన్‌రెడ్డి, ఎ.యాదయ్యగౌడ్, అశోక్, యాదేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
జగన్‌కు బెయిల్ ఇవ్వాలని వైఎస్సార్ సిపి నేతల దీక్షలు
ఉప్పల్, జూన్ 2: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పీర్జాదిగూడలోని ఉప్పల్ బస్‌డిపో ఎదుట శనివారం రిలే నిరహారదీక్ష చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యూత్ విభాగం రాష్ట్ర యువ నాయకుడు ఎంఏ ముజీబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ యూత్ జిల్లా అధ్యక్షుడు జి.సురేష్‌రెడ్డి, స్టీరింగ్ సభ్యులు డి.సుఖేందర్‌రెడ్డి, పద్మారెడ్డి, నేతలు ఎ.్భస్కర్‌రెడ్డి, జి.సంజీవరెడ్డి, పి.బాల్‌చందర్‌రెడ్డి, ఎ.మధుసూదన్‌రెడ్డి, విజయ్‌కుమార్, ఎం.మహేందర్‌రెడ్డి, బి.రత్నం, శ్రీ్ధర్‌రెడ్డి, యాకన్న, మంగమ్మ, జయలక్ష్మి, సరళాభాయి, లక్ష్మమ్మ, సరస్వతి, కిషోర్, మహమ్మద్ జహీర్, వినోద్ తదితరులు దీక్షలో కూర్చున్నారు.
ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారన్న భయంతో కాంగ్రెస్, టిడిపితో సిబిఐ కుమ్ముక్కై జగన్‌ను జైలులో పెట్టడం మంచిదికాదన్నారు. చేసిన తప్పును తెలుసుకుని జగన్‌ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిచో ప్రజాందోళన మరింత ఉదృతమవుతోందని వారు హెచ్చరించారు.
ఇందిరమ్మ కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి
కుత్బుల్లాపూర్, జూన్ 2: బౌరంపేట్ ఇందిరమ్మ (జెఎన్‌ఏన్‌ఏం) కాలనీలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ అన్నారు. శనివారం బౌరంపేట్ ఇందిరమ్మ (జె ఎన్‌ఎన్‌ఎం ) కాలనీ నుంచి బాలానగర్ వరకు ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న సమస్యలను అధికారులతో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.
వారం రోజుల్లో బోరుమెటార్లు బిగిస్తారన్నారు. గుంతలు గుంతలుగా మారిన రోడ్లను మరమ్మతు చేయాలని అధికారులను అదేశించారు. కాలనీలో రేషన్‌షాపు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను రాజకీయాలకు అతీతంగా చేపట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ మల్లారెడ్డి, మాజీ సర్పంచులు వీరేశంగౌడ్, సత్తయ్య, రాముగౌడ్, ధర్మారెడ్డి, యాదవ్‌రెడ్డి, యాదయ్య, రంగయ్య, సాల్‌మాన్, రాధాకృష్ణ, సాగర్, సంజీవయ్య, గోపాల్, స్పెషలాఫీసర్ వెంకటలక్ష్మి, కార్యదర్శి ఉషారాణి, ఆర్టీసీ ఆసిస్టెంట్ మేనేజర్ పాల్గొన్నారు.
నీటినిల్వల పెంపునకు ప్రభుత్వం కృషిచేయాలి
మొయినాబాద్, జూన్ 2: చేవెళ్ల నియోజకవర్గంలో తాగునీటి పథకాల మాట దేవుడెరుగు తాగునీటి విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని చేవెళ్ల ఎమ్మెల్యే కెఎస్ రత్నం అన్నారు. శనివారం మండలంలోని మేడిపల్లి, సురంగల్ గ్రామాల్లో చెరువుకట్ట మరమ్మతు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో 111 మూలంగా నియోజకవర్గంలో ఎక్కడా చెక్‌డ్యాంలు కాని, ఇతరత్రా సాగునీటి ప్రాజెక్టులు గాని లేకపోవడంతో ఇక్కడి ప్రజలు పూర్తిగా బోరుబావుల మీద ఆధారపడాల్సి వస్తోందన్నారు. నియోజకవర్గంలో భూగర్భ జలాలన్నీ అడుగంటిపోతున్న ప్రస్తుత తరుణంలో చెరువులో కుంటలన్నీ పునరుద్ధరణ చేసి నీటినిల్వలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఈ ప్రాంతం గుండా వెళ్లే వరద నీటితో నిండే జలాశయాలైన గండిపేట,హిమాయత్‌సాగర్‌ల ద్వారా నగరవాసులకు తాగునీటిని సరఫరా చేయడంతో పాటు మంజీరా, కృష్ణా వంటి జలాలు సైతం అందిస్తున్నారన్నారు. అయితే ఇక్కడి ప్రజలు మాత్రం కనీస తాగునీరులేక అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున నియోజకవర్గ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అధికమొత్తంలో నీధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే రత్నం డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నుంచి దేశంలోకి చేరిక
మండలంలోని సురంగల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మహేందర్ రెడ్డి, విక్రంరెడ్డి, నర్సింహ్మారెడ్డి, మహిపాల్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, సోమయ్యగౌడ్, సత్తార్, జంగయ్య, రాజు తదితర కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు వేసి సత్కరించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి అనంతరెడ్డి, జిల్లా కార్యదర్శి హన్మంత్ యాదవ్, కొండల్‌గౌడ్, గడ్డం వెంకట్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, మధుకర రెడ్డి, విఠలయ్య, మంజుల, నర్సింహ్మ పాల్గొన్నారు.
విద్యుత్ కోతలతో జనం విలవిల
కుత్బుల్లాపూర్, జూన్ 2: ఓ వైపు భానుడు భగ్గున్న మండిపోతుండగా, మరోవైపు విద్యుత్‌కోతలు విపరీతంగా విధిస్తుండటంతో జనం విలవిల్లాడిపోతున్నారు. రోడ్లన్నీ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదున్నర వరకు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఇంట్లో ఉంటే కరెంట్ కోత.. బయటకు వెళితే ఎండ భగభగ భయపెడుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇటీవల వరకువిధించిన కోతలను ఎత్తివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో అటు కార్మికులు, ఇటు ప్రజలు సంతోషపడ్డారు. అయితే వారి సంతోషం ఎంతోకాలం నిలువలేదు. మళ్లీ విద్యుత్ కోతలు మొదలయ్యాయి. విచక్షణా రహితంగా విద్యుత్ కోతలు విధిస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రెండురోజులుగా కరంటు లేక పరిశ్రమలు మూతపడటంతో పనులు లేక ఇంటివద్దనే ఉండాల్సి వస్తోందని కార్మికులు
అంటున్నారు. మళ్లీ విద్యుత్ కోతలు మొదలుకావడంతో పనులు దొరుకుతాయో లేదో అని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ కొతలు ఇలా విధిస్తే పరిశ్రమలు ఎలానపడాలో అర్థం కాకుండా ఉందని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. మరోపక్క మంచినీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చడంతో గుక్కెడు నీటి కోసం నానా ఇబ్బందులు పడాల్సి వస్తోందని అంటున్నారు. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో ఎన్నిబోర్లు వేస్తున్నా ప్రయోజనం మాత్రం శూన్యం. ఎండవేడిమి తట్టుకోలేక జనం చల్లని పానీయాలు, పళ్లను ఆశ్ర యిస్తున్నారు.
చర్లపల్లి జైలును సందర్శించిన జైళ్ల శాఖ డిజి
కుషాయిగూడ, జూన్ 2: రాష్ట్ర జైలు శాఖ అడిషనల్ జనర్‌గా బాధ్యతలు చేపట్టిన టిపి దాస్ శనివారం చర్లపల్లి జైలును సందర్శించారు. జైళ్ల శాఖను చేపట్టిన సందర్భంగా ఆయన ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. జైలులో ఖైదీలకు కనీస సౌకర్యాలపై ఆయన అధికారులను ఆరాతీశారు. జైలులో ఖైదీల మధ్య తరచూ గొడవలు, అసాంఘిక చర్యలు చోటుచేసుకోకుండా జైలు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చర్లపల్లి జైల్ ప్రతి బ్యారక్‌ను ఆయన క్షుణ్నంగా పరిశీలించినట్టు సమాచారం. ఇటీవల చర్లపల్లి జైల్‌లో వెంకటరమణ అనే ఖైదీకి స్వైన్‌ఫ్లూ సోకడంతో ఖైదీలకు వైద్యపరంగా తగిన పరీక్షలు నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు.
జైల్ అదాలత్‌లో కేసుల పరిష్కారం
చర్లపల్లి జైలులో ప్రతి శనివారం జైలు అధికారులు, జైలుఅదాలత్ నిర్వహించనున్నట్టు జైల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రావు తెలిపారు. సుమారు 218 కేసులకు 134 కేసులకు పరిష్కారం లభించినట్టు ఆయన చెప్పారు. అదేవిధంగా చర్లపల్లి జైల్‌లో స్వైన్ ఫ్లూ లక్షణాలపై రంగారెడ్డి జిల్లా మెడికల్ అధికారితో వైద్య పరీక్షలు నిర్వహించినట్టు ఆయన తెలిపారు.
రైతుల పడిగాపులు
చేవెళ్ల, జూన్ 2: ఖరీఫ్ ప్రారంభం కావడంతో రైతుల్లో రోజురోజుకూ ఆందోళన అధికమై విత్తనాలకోసం పరుగులు తీస్తున్నారు. వ్యవసాయశాఖ ముందస్తు చూపు లేకపోవడంతో రైతుల పాలిట శాపంగా మారింది. ప్రతి ఏడాది విత్తనాలకోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బంది రైతులకు నేటికీ తప్పకపోవడంతో దిగాలు చెందుతున్నారు. శనివారం నాలుగవరోజు రైతులు పత్తి విత్తనాలకోసం స్థానిక వ్యవసాయ కార్యాలయం ముందు పర్మిట్లకోసం పాస్ పుస్తకాలతో బారులు తీరారు.
అధికారులు రాగానే తమకు పత్తి విత్తనాలు కావాలని రైతులు ఎగబడుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు ఒక్కొక్క రైతుకు ఒక్క ప్యాకెట్ పర్మిట్లు రాసి అందజేస్తున్నారు. రైతులు కోరిన పత్తి విత్తనాలు మార్కెట్‌లో సరిపడా లేకపోవడంతో రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
ప్రతి ఏడాది జరిగే పరిణామాలను అధికారులు గుర్తించకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడంలేదని వాపోతున్నారు. చాలీచాలని విత్తనాలను అందుబాటులో వుంచితే అవి ఏమేరకు సరిపోతాయని రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నారు.
ఒక పాస్ పుస్తకానికి ఒక ప్యాకెట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని రైతులు అంటున్నారు. ఇకనైనా జిల్లా ఉన్నతస్థాయి అధికారులు స్పందించి పత్తి విత్తనాలు సరిపడా అందజేయాలని రైతులు కోరుతున్నారు.
జోరుగా ప్రైవేట్ పాఠశాలల ప్రచారం
ఘట్‌కేసర్,జూన్ 2: స్కూళ్లు తెరిచే సీజన్ ప్రారంభం కావడంతో ప్రైవేట్ పాఠశాలలు జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నాయ. రకరకాల పేర్లతో ప్రైవేట్ పాఠశాలల వారు విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. అయతే ఎటువంటి గుర్తింపు లేకుండా పుట్టగొడుగుల మాదిరిగా వెలుస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవటంపై నిర్లక్ష్యం చేస్తున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. ఘట్‌కేసర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో 66 ప్రైవేట్ పాఠశాలలకు ఉండగా, ఆందులో 36 పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు ఉండగా 30 పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు లేకుండా నడుస్తున్నాయి.
ఈ విషయమై మండల విద్యాధికారి దృష్టికి తీసుకువచ్చినా నోటీసులతో సరిపెట్టుకుంటున్నారు తప్ప చర్యలు తీసుకోవటంలో శ్రద్ధ చూపటం లేదన్న విమర్శలు అధికంగా ఉన్నాయి. మండల పరిధిలో ఇటీవల నూతనంగా వెలసిన ప్రైవేట్ పాఠశాలలు ఆకర్షణీయమైన పేర్లతో పాటు, బ్రాండెడ్ పాఠశాలల పేర్లు వాడుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు గాలం వేస్తున్నారు. ప్రభుత్వం విద్యార్ధుల అడ్మిషన్ ఫీజులతో పాటు టర్మ్ ఫిజ్‌ల వివరాలు ప్రకటించి ఎక్కువ మొత్తం వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జారీచేసిన ఆదేశాలు అధికారుల నిర్లక్ష్యంతో బుట్టదాఖలు అయ్యాయి. విద్యార్థులకు అన్నిసౌకర్యాలు కల్పిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్న పాఠశాలలు తీరా విద్యార్థులు చేరిన తర్వాత అసలు రూపం చూపిస్తారు. విద్యాధికారులను మచ్చిక చేసుకుని ఫీజులు భారీగా వసూలు చేస్తున్నారు. ఇదేమని ఎవరైనా అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమని దబాయిస్తున్నారు. ఘట్‌కేసర్ మండలంలో గుర్తింపులేని పాఠశాలలపై పలు విద్యార్ధి సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అయా పార్టిలు అధికారులపై వత్తిడి తీసుకు వస్తే నోటిసులు అంటించి చేతులు దులుపుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. మండల పరిధిలో పుట్ట గొడుగుల మాదిరిగా వెలసిన గుర్తింపులేని పాఠశాలలు మండల విద్యాధికారి కథనం ప్రకారం ముప్పైకి పైగా ఉన్నాయి.
ప్రభుత్వ గుర్తింపు పొందటానికి కనీస సౌకర్యాలు లేకున్నప్పటికీ అధికారుల అండదండలతో గుర్తింపుకు దరఖాస్తు చేసుకున్నవారికి కనీస విచారణ జరుపకుండా అనుమతులు మంజూరు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలలో ఇరుకైన గదులు ఉంటాయని, ఆట స్థలం అసలు ఉండదని ఆరోపణలు బలంగా ఉన్నాయి. విద్యాబోధన చేసే ఉపాద్యాయులకు కనీస విద్యార్హతలు ఉండవని ఆరోపిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి ప్రభుత్వ అనుమతులు లేని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.