Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

‘ముఖాముఖి’లో సమస్యల వెల్లువ

$
0
0

హైదరాబాద్, జూన్ 2: ప్రజాసమస్యల పరిష్కారంతో నగరాభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో నిర్వహిస్తున్న ‘ముఖాముఖి’ కార్యక్రమం శనివారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమంలో మరోసారి ప్రజాసమస్యలు వెల్లువెత్తాయి. మేయర్ మహ్మద్ మాజీద్ హుస్సేన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆరోగ్యం, పారిశుద్ధ్యం, అక్రమ నిర్మాణాలు, శాంతిభద్రతల పరిక్షణ వంటి అంశాలకు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా వచ్చాయి. తొలుత అమీర్‌పేట ధరమ్‌కరమ్ రోడ్డు నుంచి ఫోన్ చేసిన ఓ పౌరుడు స్థానికంగా శివబాగ్‌లోని తొమ్మిది ఎకరాలో స్థలంలో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటూ ఎంతో ఆవేశంగా మేయర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే సంబంధిత అదనపు కమిషనర్ ధనంజయ్‌రెడ్డి జోక్యం చేసుకుని అది యూఎల్‌సి భూమి అని, దానికి ఎల్‌ఆర్‌ఎస్‌తో పాటు అక్కడి నిర్మించిన భవనాలను బిల్డింగ్ ఫినలైజేషన్ స్కీం కింద క్రమబద్ధీకరించుకున్నట్లు వివరించారు. ఎల్‌ఆర్‌ఎస్, బిపిఎస్ పథకాల కింద క్రమబద్ధీకరణ చేసుకున్నప్పటికీ రోడ్డు వైండింగ్ కోసం కేటాయించిన వెయ్యి గజాల స్థలాన్ని కూడా ఆక్రమించి ఆక్రమణలు వెలుస్తున్నాయని ఫిర్యాదు దారుడు వాదిస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. ఆ తర్వాత పాతబస్తీ గౌలీపురాకు చెందిన లవకుమార్ ఫోన్ చేసి స్థానికంగా తమకు వీది ధీపాలు సక్రమంగా లేవని, అదనంగా మరికొన్ని స్తంభాలను ఏర్పాటు చేసి వీధి లైట్లను ఏర్పాటు చేయాలని కోరగా, సంబంధిత అధికారులు సమస్యను పరిశీలించి పరిష్కరించే దిశగా ఆదేశాలు జారీ చేస్తామని మేయర్ హామీ ఇచ్చారు. అనంతరం లిబర్టీ నుంచి సిరాజుద్ధీన్ అనే వ్యక్తి ఫోన్ చేసి నిత్యం రద్ధీగా ఉండే లిబర్టీ, మహావీర్ ఆస్పత్రి, పురానాపూల్ వంటి ప్రాంతాల్లో ఫుటోవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలని కోరగా, మహావీర్ ఆస్పత్రి వద్ధ ఫుటోవర్ బ్రిడ్జి ఏర్పాటు విషయం ప్రతిపాదన స్థాయిలో ఉందని, మిగిలిన ప్రాంతాల్లో కూడా వీటి ఏర్పాటు విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు అర్థరాత్రి ఆటో ప్రయాణమంటే ప్రాణసంకటంగా మారిందని, దోచుకోవటంతో పాటు ప్రయాణికులను చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. పోలీసు అధికారులు జోక్యం చేసుకుని రాత్రివేళల్లో గస్తీ మరింత ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు. అలాగే హయత్‌నగర్‌లో దోమల బెడద, అలాగే బల్కంపేటలోని నాలాలో పూడికతీత పనులు జరగటం లేదంటూ పౌరులు ఫర్యాదులు చేశారు. దీంతో పాటు బన్సీలాల్‌పేట డివిజన్‌లో పాతకాలపు డ్రైనేజీలు నిత్యం పొంగిపొర్లుతూ స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మహిళా ఫిర్యాదు చేశారు. అంతేగాక, ఎన్నో సార్లు జలమండలి, గ్రేటర్ అధికారులకు కార్పొరేటర్‌తో కలిసి ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని మహిళా వాపోయారు. ఇందుకు జలమండలి అధికారి సమాధానం చెబుతూ సమస్యను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత పత్తర్‌గట్టి ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య, అలాగే పాతబస్తీలో కలుషిత నీరు సరఫరా అవుతుందని ఫిర్యాదులు అందాయి. వీటితో పాటు బల్కంపేటకు చెందిన రాథేశ్యాం బల్కంపేటలో కలుషిత నీరు సరఫరా అవుతుందని, ఈ విషయాన్ని డయల్ యువర్ ఎండి కార్యక్రమంలో విన్నవించినా, ఫలితం దక్కలేదు, కాగా, ఫిర్యాదు చేసిన తర్వాత సమస్య మరింత తీవ్రమైందని వాపోయారు. ఆ తర్వాత హిమాయత్‌నగర్‌లోని వీది నెం. 7లో ఖాళీ స్థలం కబ్జాకు గురవుతుందని, నదీంకాలనీలో నాలా నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయని స్థానికులు ఫిర్యాదులు చేశారు. అలాగే చాదర్‌ఘాట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని, 30 ఏళ్లుగా ఈ భవనానికి తాళం వేయటంతో లోపల మొత్తం చెత్తాచెదారం చోటుచేసుకుందని, దీన్ని శుభ్రపరిచి కనీసం పార్కింగ్ స్థలంగానైనా ఉపయోగించుకుంటే బాగుటుందని స్థానికులు పటేల్ మేయర్‌కు సూచించగా, పరిశీలిస్తామని సమాధానమిచ్చారు. అలాగే గడ్డిఅన్నారంకు చెందిన అశోక్‌కుమార్ అగర్వాల్ ఫోన్ చేసి తమ ప్రాంతంలో వారానికోసారి కూడా సక్రమంగా స్వీపింగ్ పనులు జరగటం లేదని ఫిర్యాదు చేయగా, దీనిపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మేయర్ హామీ ఇచ్చారు. దీనికి తోడు మేయర్ డివిజన్ అహ్మద్‌నగర్‌లో ఓ బహుళ అంతస్తు భవనంపై అక్రమంగా షెడ్డు ఏర్పాటు చేస్తున్నారని కూడా ఫిర్యాదు అందింది.

జైలులో జగన్‌ను కలిసిన న్యాయవాదులు

సైదాబాద్, జూన్ 2: జగన్‌ను సిబిఐ కస్టడీకి అనుమతి ఇవ్వడంతో చంచల్‌గూడ జైలు వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసారు. ఈనేపథ్యంలో పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు చేరుకున్నారు.జగన్‌ను సిబిఐ కస్టడీకి ఆదివారం నుంచి అప్పగిస్తున్నట్లు సాయంత్రం కోర్టు ఉత్తర్వులు వెలువడడంతో జైలువద్ద పోలీసుల సంఖ్య పెంచారు.
జగన్ తరఫు న్యాయవాదులు అశోక్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి సహా ఐదుగురు లాయర్లు జైల్లో జగన్‌ను కలిసి వెళ్లారు.
జగన్‌ను సిబిఐ కస్టడీకి ఇచ్చిన విషయమై సుప్రీంకోర్టుకు వెళ్లడంలేదని వారు తెలిపారు. కేసు విషయమై జగన్‌తో చర్చించినట్లు తెలిపారు. ఇదిలావుండగా చంచల్‌గూడ జైలులో వున్న మోపిదేవి వెంకటరమణను ఆయన కుటుంబసభ్యులు కలిసివెళ్లారు.

రహస్య మంతనాలు!
* స్థారుూ సంఘం ఎన్నికపై కార్పొరేటర్ల సమావేశాలు
* కార్పొరేటర్లతో 4న గ్రేటర్ కాంగ్రెస్ భేటీ

హైదరాబాద్, జూన్ 2: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మూడో స్థారుూ సంఘం ఎన్నిక దగ్గరపడుతున్న కొద్దీ కాంగ్రెస్, టిడిపి అభ్యర్థుల మధ్య పోటీ రసవత్తరంగా మారుతోంది. ముఖ్యంగా కౌన్సిల్‌లో ఎక్కువ బలం కల్గిన కాంగ్రెస్, ఆ పార్టీ అనధికార మిత్రపక్షమైన స్థారుూ సంఘంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎనిమిది మంది, మజ్లిస్ నుంచి ఏడుగురు ఎంపికయ్యే అవకాశముంటుంది. కానీ ఈ సారి కాంగ్రెస్ అధిష్టానం చేసిన చిన్న తప్పిదం కారణంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకంగా 19మంది కార్పొరేటర్లు నామినేషన్లు సమర్పించిన సంగతి తెల్సిందే! ఇందులో కాంగ్రెస్ అధిష్ఠానం ఎనిమిది మినహా మిగిలిన పదకొండు నామినేషన్లను ఉపసంహరించుకోవల్సి ఉండగా, విత్‌డ్రా చివరి నిమిషం వరకు కూడా కేవలం తొమ్మిది మంది అభ్యర్థులచే విత్‌డ్రాలు చేయించగలిగింది. అలాగే ప్రస్తుతం ఇద్దరు అభ్యర్థులు బరిలో కొనసాగుతున్నందున కాంగ్రెస్ అధిష్టానం క్రాస్ ఓటింగ్ జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టలాన్న ఆలోచనలో పడినట్లు సమాచారం. ఇందులోనే భాగంగా ఈ నెల 4వ తేదీన కార్పొరేటర్లతో గ్రేటర్ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, ఎంపిలు సమావేశమై క్రాస్ ఓటింగ్‌కు ఏ మాత్రం తావివ్వరాదని సూచించనున్నట్లు సమాచారం. కానీ బరిలో కొనసాగుతున్న ద్దరు అభ్యర్థులతో పాటు అధిష్టానం ఆదేశాల మేరకు విత్‌డ్రా చేసుకున్న కార్పొరేటర్లలో కొందరు ఏడో తేదీన జరగనున్న పోలింగ్‌లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నటు సమాచారం. అంతేగాక, కౌన్సిల్‌లో మజ్లిస్ కంటే రెండు సీట్లు ఎక్కువగా అంటే 45 సభ్యులున్న టిడిపి పార్టీ ఇద్దరు అభ్యర్థులను బరిలో నిలిపింది. కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగించిన ఇద్దరు కార్పొరేటర్లు నామినేషన్లను ఉసంహరించుకోకపోవటం, అలాగే నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్న తొమ్మిది మంది కార్పొరేటర్లు అసంతృప్తితో రగిలిపోవటం వంటి కారణాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో గెలుపు ఆశలు పెరగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, నాయకులు రహస్యంగా కాంగ్రెస్ కార్పొరేటర్లతో సమావేశ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు సమాచారం. రెండురోజుల క్రితం నగరంలోని ఓ క్లబ్‌లో కాంగ్రెస్, టిడిపి కార్పొరేటర్లు రహస్యంగా సమావేశమైనట్లు సమాచారం. అయితే ప్రస్తుతం బరిలో ఉన్న ఇద్దరు టిడిపి అభ్యర్థుల్లో స్థారుూ సంఘంలో ఒక్కరికైనా స్థారుూ సంఘంలో అవకాశం కల్పించేందుకు సహకరించాలని టిడిపి కోరినట్లు సమాచారం. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కార్పొరేటర్లు, వారితో పాటు వైఎస్ జగన్ పార్టీవైపు చూస్తున్న మరో ముగ్గురు కార్పొరేటర్లు టిడిపిని గెలిపించేందుకు పరోక్షంగా సిద్దమైనట్లు సమాచారం. అంతేగాక, సీక్రెట్ బ్యాలెట్ ద్వారా జరిగే ఈ ఎన్నికలో ఎవరు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ విషయాన్ని ప్రత్యేకించి గుర్తించే అవకాశం లేనందున తమకు సహకరించే వారికి ఎలాండి ఢోకా లేదని టిడిపి కాంగ్రెస్ కార్పొరేటర్లను బుజ్జగిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అవసరమైతే కొందరు కాంగ్రెస్ కార్పొరేటర్లకు టిడిపి సూట్‌కేసులు కూడా అందించేందుకు సిద్దమవుతున్నట్లు తెల్సింది.

గొంతుకోసి ఇద్దరి దారుణ హత్య
* రూ.4.70 లక్షలతో హంతకుల పరారీ
* పేట్‌బషీరాబాద్‌లో కలకలం
మేడ్చల్, జీడిమెట్ల, జూన్ 2: గొంతుకోసి అతి కిరాతకంగా ఇద్దరు వ్యక్తులను హతమార్చిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కలకలం సృష్టించింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా మెట్‌పల్లికి చెందిన తిరుపతి (29) డిసిఎం డ్రైవర్ కమ్ ఓనర్. మెట్‌పల్లికి చెందిన అంకుశ్ (45) తిరుపతి వద్ద గుమస్తా. అయితే మెట్‌పల్లిలో ఉండే ఆయిల్ దుకాణం యజమాని ఛత్రపతి తిరుపతి, అంకుశ్‌లను హైదరాబాద్‌కు వెళ్లి ఆయిల్ తీసుకురావాలని చెప్పారు.
కాగా శుక్రవారం ఉదయం 7 గంటలకు తిరుపతి, అంకుశ్‌లు 4.70 లక్షల డబ్బుతో ఏపి 03 యు 9176 నెంబరు గల డిసిఎంలో మెట్‌పల్లి నుండి హైదరాబాద్‌కు బయలుదేరారు. కాగా మేడ్చల్ జాతీయ రహదారి, గుండ్లపోచంపల్లి గ్రామం, ఇఎంఆర్‌ఐ సమీపం వద్ద రోడ్డు పక్కన గల హుడా గ్రీనరీలో తిరుపతి, అంకుశ్‌లు హత్యకు గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయిల్ దుకాణం యజమాని ఛత్రపతి తిరుపతి, అంకుశ్‌లకు ఫోన్ చేయగా వారు ఫోన్ ఎత్తకపోవడంతో ఛత్రపతి వారిని వెతుక్కుంటూ తన కారులో వచ్చాడు. కాగా మేడ్చల్ జాతీయ రహదారిపై డిసిఎం ఆగి ఉండటం చూసిన ఆయన ఆ పరిసర ప్రాంతాల్లో చూడగా, ఇద్దరూ ఇద్దరు హత్యకు గురై ఉండటాన్ని చూసి షాకయ్యాడు. విషయం తెలుసుకున్న పేట్‌బషీరాబాద్ ఏసిపి సయ్యద్ రషీక్, సిఐ జానయ్య, ఎస్‌ఐలు కాసీం పీరా, నేతాజి, సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా తిరుపతి, అంకుశ్‌ల గొంతుకోసి కిరాతకంగా హత్య చేసి వారి వద్ద ఉన్న 4.70 లక్షలతో హంతకులు పరారయినట్టు పోలీసులు భావిస్తున్నారు. అయితే లక్షల రూపాయలను వెంట తీసుకు వెళ్లడాన్ని గమనించిన వ్యక్తులే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని పలువురు అనుమానిస్తున్నారు.
అతిగా మద్యం సేవించిన ఇద్దరినీ మద్యం బాటిళ్లతోనే హతమార్చినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మృతుల గొంతు, శరీర భాగాల్లో పలు గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లు, ఓ కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి సంఘటనా స్థలంతో పాటు పరిసర ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. జాగిలం హత్య జరిగిన ప్రదేశం నుంచి సమీపంలోని బైసాకీ ఫ్యామిలీ దాబాలోకి వెళ్లి ఒక టేబుల్ వద్ద ఆగి అక్కడే కూర్చుండిపోయింది. ఆధారాల కోసం పోలీసులు క్లూస్‌టీంను రంగంలోకి దించారు.
ఈ మేరకు పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ రహదారికి ఆనుకుని ఈ సంఘటన జరగడంతో వాహనదారులు వాహనాలను నిలిపి మృతదేహాలను చూశారు. ఎలాంటి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పేట్‌బషీరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు.

శిక్షణ పేరుతో నిధులు మాయం

పలు సంస్థల బిల్లులు నిలిపేశాం * యూసిడి పనితీరుపై మేయర్ అసహనం
హైదరాబాద్, జూన్ 2: గ్రేటర్ కుంభకోణాలు, అక్రమాలను అరికట్టే వారే లేరేని చెప్ప వచ్చు. ఇదివరకే రెండేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ తరపున మహిళా మేయర్‌గా కొనసాగినపుడు ఆమెను తప్పుదోవపట్టించి నిధులను స్వహా చేస్తూ పండగ చేసుకున్న గ్రేటర్ అధికారుల ఇష్టారాజ్యానికి మజ్లిస్ మేయర్ పదవిని చేపట్టిన తర్వాత బ్రేక్ పడుతుందని అందరూ భావించారు. కానీ మేయర్ సీట్లో ఎవరుంటే మాకేంటి? అన్నట్టు నిధుల స్వాహా, దానికి నకిలీ రికార్డులను సృష్టించటంలో గ్రేటర్ అధికారులు సిద్ధహస్తులేననన్న ఆరోపణలు వస్తున్నాయ. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మొట్టమొదటి పాలక మండలి రెండో మేయర్‌గా పదవీబాధ్యతలు చేపట్టిన మహ్మద్ మాజీద్ హుస్సేన్ అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ విభాగంపై సీరియస్‌గా ఉన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి నిధులొస్తున్నా, అవి సరైన లబ్ధిదారులకు అందటం లేదన్న విషయాన్ని మేయర్ మాజీద్ హుస్సేన్ బాహాటంగానే అంగీకరిస్తున్నారు. నేటితో సరిగ్గా అయిదు నెలల క్రితం మేయర్ బాధ్యతలు చేపట్టిన మహ్మద్ మాజీద్ హుస్సేన్ ఇప్పటి వరకు పలు విభాగాలపై రహస్యంగా అధ్యయనం చేసిన సంగతి తెల్సిందే! అయితే అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ విభాగంపై ఆయన రెండుసార్లు సమీక్షలు నిర్వహించినా, సిబ్బంది పనితీరుపైనే గాక, ఆ విభాగంలో చోటుచేసుకుంటున్న అక్రమాలు ఏ మాత్రం నివారించలేకపోయారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి రాష్టస్థ్రాయిలోనే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువకిరణాలు పథకాన్ని అమలు చేస్తున్నామని ప్రకటించుకున్న యూసిడి విభాగం అధికారులు ఇందుకు తొలుత నిరుద్యోగుల్లో నైపుణ్యతను పెంచేందుకు గాను శిక్షణనిప్పిచేందుకు గ్రేటర్ వ్యాప్తంగా సుమారు 250 పై చిలుకు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, వాటిలో శిక్షణనిస్తున్న ప్రైవేటు సంస్థలకు చెందిన నిపుణులు నిరుద్యోగులకు జాబ్ గ్యారెంటెడ్ కూడా ఇస్తున్నట్లు అందర్నీ నమ్మించారు. అయితే వీరు ఏర్పాటు చేసిన ఒక్కో కేంద్రంలో 50 నుంచి వంద మంది వరకు నిరుద్యోగులు శిక్షణ పొందుతున్నట్లు అధికారుల వద్ద లెక్కలున్నా, క్షేత్ర స్థాయిలో ఈ కేంద్రాలను పరిశీలిస్తే శిక్షణ పొందుతున్న వారిని కేవలం వేళ్లపై లెక్కించేలా ఉన్నారు. కానీ అధికారుల రికార్డుల ప్రకారం ప్రతి నెల వందలాంది మందికి శిక్షణనిస్తున్నట్లు లక్షల రూపాయలు డ్రా అయ్యాయి. మేయర్ తనిఖీ చేసిన ఓ కేంద్రంలో కూడా 48 మంది శిక్షణ పొందుతున్నట్లు రికార్డుల్లో చూపగా, అక్కడ కేవలం నలుగురు మాత్రమే శిక్షణ పొందుతున్నట్లు మేయర్ తనిఖీల్లో వెల్లడైంది. గతంలో గ్రేటర్ నిర్వహించిన జాబ్ మేళాల్లో ఉద్యోగాలు పొందిన వారు, ఉద్యోగాల కోసం వచ్చి ఉద్యోగం దక్కని వారి వివరాలను చిరునామాలు మార్చి నకిలీ రికార్డులు సృష్టించి నిధులను స్వాహా చేస్తున్నట్లు కూడా ఆరోపణలొచ్చాయి. దీంతో శిక్షణ కేంద్రాలు, జాబ్ గ్యారెంటెడ్ ట్రైనింగ్ అంటూ గ్రేటర్ నిధులు దారి మళ్లిస్తున్నారన్న విషయాన్ని గుర్తించిన మేయర్ ఇప్పటి వరకు చెల్లించిన బిల్లులు చాలనీ, ఇస్ తరహా బల్దియాకు లూట్ లేరే..ఆగే యే నహీ చెలేంగీ..! అంటూ మేయర్ సీరియస్ కావటంతో బిల్లుల చెల్లింపులకు బ్రేక్ పడింది.
4 నుంచి ట్రెంజ్ బ్రైడల్ కలెక్షన్

హైదరాబాద్, జూన్ 2: మహానగరంలో ఫ్యాషన్ రంగం రోజురోజుకి అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో ఎప్పటికపుడు వస్తున్న కొత్త డిజైన్లను డిజైనర్లు సెలబ్రిటీలకు పరిచయం చేస్తున్నారు. ఇక పెళ్లి సమయంలో ధరించే సాంప్రదాయ వస్త్రాలకు ఆనాదిగా ఎంతో ప్రత్యేకత ఉంది. వధూవరులు మెచ్చే వివిధ డిజైన్లలో వీటిని తీర్చిదిద్దుతున్నారు. సెలబ్రిటీలు, ఫ్యాషన్ ప్రియుల అభిరుచికి తగ్గట్టగానే ట్రెంజ్ రూపొందించిన కొత్త కొత్త బ్రైడల్ డిజైనింగ్‌లు ఈ నెల 4వ తేదీనుంచి నగరవాసులకు అందుబాటులోకి రానున్నాయి. శ్రీనగర్‌కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో ఎంకోర్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 4న ఉంచి ఆరో తేదీ వరకుమూడురోజుల పాటు బ్రైడల్ కలెక్షన్ ప్రదర్శన ఉంటుందని తెలిపారు. అలాగే ఈ ప్రదర్శనలో డిజైనర్ చీరలతో పాటు 916 ఆభరణాలు, ఓ గ్రాము జ్యుయెలరీ, కుర్తీస్, యువత ఇష్టపడే కుర్తీస్, నార్త్ ఇండియన్ ప్రత్యేక జార్జెట్ చీరలు, కోయంబత్తూర్ తదితరు ప్రాంతాల నుంచి ఎత్నిక్ వేర్ వంటి ఉత్పత్తులు ఏర్పాటు చేయనున్నట్లు ఎంకోర్ ఈవెంట్స్ అధినేత శాంతి తెలిపారు. ఈ ప్రదర్శనలో మొత్తం 40 స్టాల్స్‌ను ఇందులో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాటన్ డ్రస్ మెటీరియల్స్‌తో పాటు ఫ్యాషన్ జ్యుయెలరీ కూడా ఇందులో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శన ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.

జలకాలాట... రోగాల బాట!
బేగంపేట, జూన్ 2: ఎండలు ఠారెత్తిస్తున్నాయి.... ఉష్ణోగ్రతలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నగరజీవికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నీళ్ళు కన్పిస్తే చాలు... జలకాలాట ఆడేందుకు చిన్నా పెద్దా అన్న తారతమ్యం లేకుండా ఉబలాట పడుతుంటారు. మరీ ఆ నీళ్ళు ఎంతవరకు సురక్షితం అంటే ఒక్కసారి అలోచించుకోవాల్సిందే. ముఖ్యంగా పిల్లల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ నిర్వహణలోని లుంబిని పార్కులో ఇలాంటి ప్రమాకర పరిస్థితులే ప్రస్తుతం దర్శనమిస్తున్నాయి. చిన్నపిల్లల ఆరోగ్యంతో ఇక్కడ అధికారులు, సిబ్బంది ఆటలాడుకుంటున్నారు. కలుషిత నీటితో వారిని అనారోగ్యం పాలుచేస్తోంది. ఈ పార్కుకు నిత్యం 8వేలనుంచి 9 వేల వరకు సందర్శకులు వస్తుంటారు.
పాఠశాలలకు వేసవి సెలవలు కావడంతో అంతా కుటుంబాలతో విచ్చేస్తుంటారు. పార్కు ప్రారంభంలో ఉన్న కృత్రిమ జలపాతం ప్రస్తుతం పిల్లల పాలిట ప్రమాదకారిణిగా తయారైంది. వాస్తవానికి దీనికి కేవలం పార్కు అందం కోసమో ఏర్పాటుచేసిన అదికారుల పర్యవేక్షణ లేమి, నిర్లక్ష్యం ప్రస్తుతం పిల్లలతోపాటు పెద్దలను కూడా సమస్యల్లోకి నెడుతుంది. జలకాలాటలకు అవకాశం లేకపోయినా సిబ్బంది యద్ధేచ్ఛగా ఆనుమతి ఇచ్చేస్తున్నారు.
కలుషిత నీటిలోనే....
జలపాతానికి పైన ఒక ట్యాంకర్‌ను పెట్టి మోటార్ సాయంతో కిందకు నీళ్ళు పడేవిధంగా ఏర్పాట్లు చేస్తారు. కింద పడిన నీళ్ళు మళ్ళీ పైకి పంపింగ్ అవుతుంటాయి. ఈ నీళ్లను జలమండలి సరఫరా చేస్తుంది. ట్యాంక్‌లో రోజుల తరబడి నీరు నిల్వకారణంగా నీళ్ళు వాసన వస్తున్నాయి. కనీసం క్లోరినేషన్ ప్రక్రియకూడా లేదు. కనీసం యేడాదికి ఒక్కసారికూడా ట్యాంకర్‌ను శుభ్రంచేసే వారే కరువయ్యారు. ఈ నీళ్ళతోనే పిల్లలు స్నానాలుచేసి రోగామ బారిన పడుతున్నారు. కలుషిత నీటితో స్నానంచేస్తే దద్దుర్లు, ఇతరత్రా చర్మ వ్యాధులతోపాటు జలుబు, జ్వరం వచ్చే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కలుషిత నీరు శరీరంలోకి వెళ్లడంద్వారా డయోరియా, టైపాయిడ్, పచ్చకామెర్ల లాంటి వ్యాదులు బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
ప్రస్తుతం లుంబిని పార్కులో ఎంట్రి టిక్కెట్ల రూపంలో లైసెన్సులుకూడా యేడాదికి రెండుకోట్లనుంచి 3 కోట్ల రూపాయల వరకు ఆదాయం సమకూరుతుంది. పార్కలో సమస్యలను పరిష్కరిండంలో అధికారులు చొరవ చూపడంలేదని సందర్శకులు వాపోతున్నారు.

ప్రజాసమస్యల పరిష్కారంతో నగరాభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను
english title: 
face to face

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>