Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

‘మెరుపు’

$
0
0

ధిద్దుబాటు - కథ

ఎంతో మంది కవులు, కళాకారులకు గోదావరి నది, వంతెనలు స్ఫూర్తిని, ఉత్తేజాన్ని అందించాయి. గోదావరి నదంటే నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. తరచు గోదావరి నది గురించి వింటుంటే ఆ సుందర ప్రదేశాన్ని చూడాలని నాకూ అనిపించేది.
నా పేరు రాజేష్. నేను ఒక కాలేజీలో లెక్చరర్‌ని. పెళ్ళై రాజమండ్రిలోని అత్తవారింటికి వెళ్ళాను. తలవని తలంపుగా గోదావరిని చూడాలన్న కల నెరవేరుతున్నందుకు నాకు ఆనందంగా ఉంది. ఉదయమే లేచి అన్ని పనులు ముగించుకుని గోదావరికి బయలుదేరాను.
అందమైన ఆ పరిసరాలను చూసి నా ఒళ్ళు పులకరించింది. అక్కడ కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు. కొంచెం పెద్దవాళ్ళు ఈత కొడుతున్నారు. అందమైన, ప్రశాంతమైన ఆ వాతావరణం నాకు ఎంతో నచ్చింది.
అంతలో ఆ వంతెనపై నుండి ఎవరో గోదావరిలో పడడాన్ని గుర్తించాను నేను. అంతా మాయలా నా ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది. అందర్నీ అప్రమత్తం చేసేలా కేకలేస్తూ అటు పరిగెత్తాను.
ఓ కాలేజీ విద్యార్థి దూకేసాడు. ఆలస్యం చేయకుండా అతన్ని బయటికి తీసుకొచ్చాను. అతని జేబులో ఒక ఉత్తరం నా కంట పడింది.
దాన్ని ఆసాంతం చదవడం ప్రారంభించాను.
‘అమ్మా, నాన్న నన్ను క్షమించండి...
ఎన్నో సంవత్సరాలుగా మీ కల, నా తపన, దీక్ష అన్నీ ఈనాటితో వ్యర్థమవుతున్నాయి. నేను నేర్చిన చదువుకు విలువ లేదిక్కడ. నా కల భౌతికశాస్త్ర సైంటిస్టును కావాలని. కాని కేవలం ఇంటర్‌తో నేను నా కలను సాధించలేనని తేలిపోయింది. లేని ప్రశ్నలకు సమాధానాలను నా మెదడు చెప్పలేకపోయింది. ఈరోజు ఎంతో మంది కోచింగ్ సెంటర్లు, ప్రైవేట్ క్లాసుల పేరుతో సిలబస్ అంతా ముందే నేర్పేస్తున్నారు. కేవలం పుస్తకాల్లో ఉన్న విషయానికి ప్రాధాన్యత లేక, మార్కుల కోసం నేర్పే ఈ విద్యా విధానంతో నేర్చుకున్నది ఎంత? నేర్పింది ఎంత? ఎంత నిజాయితీగా, కష్టపడి చదివినా కళాశాలల్లో నేర్చుకున్న దాని కంటే ఇతరత్రా వేలు, లక్షలు చెల్లించి నేర్చుకున్న వారికే ఎటువంటి అవకాశాలు అయినా వస్తున్నాయి. అలా చెల్లించలేని వారు ఎంత తెలివైన వారైనా వెనుకబడిపోతున్నారు. దాంతో పాటు సిలబస్‌లో పేర్కొన్నట్లు కాకుండా పరీక్షల్లో వేరే రకంగా ప్రశ్నలు ఈయబడుతున్నాయి. ఎక్కువ మార్కులకు రావలసిన ప్రశ్నలు బిట్లుగాను, బిట్ల వంటి ప్రశ్నలు ఎక్కువ మార్కుల ప్రశ్నలుగానూ ఇస్తున్నారు. దానివల్లే కదా ఇటీవల చాలా మంది విద్యార్థులు ఫిజిక్స్ పరీక్షలో తప్పారు. ఇటువంటి విద్యా విధానం మారుతుందా? నాలాంటి ఎందరికో సమాధానం దొరకని ఈ ప్రశ్నకు నా చావుతోనైనా సమాధానం దొరకాలని నేనీ పనికి సిద్ధమయ్యాను. ఏదైనా ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒక చోట మొదలు కావాలనే నేనిలా చేస్తున్నాను. నన్ను ఎవరూ అనుకరించవద్దు. నాలాంటి నిర్ణయం తీసుకోవద్దు. తల్లిదండ్రులారా, స్నేహితులారా నన్ను క్షమించండి. చదువు వ్యక్తి వికాసానికి ఉన్నత, ఆశయాల సాధనకు, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలి. బట్టీ పట్టే చదువులకు స్వస్తి పలకాలి...
- మీ కిరణ్’
ఓ లెక్చరర్‌గా నా తప్పు నాకు తెలిసొచ్చింది. ఈరోజు ఏ కాలేజీ అయినా కేవలం వ్యాపారాత్మకంగానే ఆలోచిస్తుంది. ర్యాంకుల వేటలో, అనుబంధ సంస్థల పెరుగుదలలో ఉన్న ఆసక్తితో విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. ఎవరో ఒకరు నిజాయితీగా ఉన్నంత మాత్రాన ఏమీ లాభం లేదు. ప్రభుత్వం అందరికీ అనుకూలంగా క్వశ్చన్ పేపర్లు తయారు చేయలేకపోవడం ఎందరో విద్యార్థులకు శాపంగా మారుతోంది. ఈ విద్యా విధానానికి స్వస్తి పలకాలి.
నా సపర్యల వల్ల కిరణ్‌కి మెలకువ వచ్చింది. అతనికి నచ్చజెప్పి ఈ విషయం ఇంట్లో చెప్పవద్దన్నాను. తన కర్తవ్యాన్ని గుర్తు చేశాను. భవిష్యత్తులో తనో సైంటిస్టుగా మారతాడని, అందుకు తాను సహకరిస్తానని అతనికి భరోసా ఇచ్చాను. దాంతో కిరణ్ కళ్ళలో మెరుపు సంతరించుకుంది. అతను తన చిరునామా, ఫోన్ నెంబర్ నాకిచ్చాడు. నేను నా చిరునామా, ఫోన్ నెంబర్ అతనికిచ్చి ‘‘నీకు ఎప్పుడే అవసరం వచ్చినా, ఏ సందేహం వచ్చినా మొహమాటం లేకుండా నాకు ఫోన్ చేయి. నేను నిన్ను గైడ్ చేస్తాను’’ అన్నాను. కిరణ్ నాకు థ్యాంక్స్ చెప్పి బయలుదేరాడు. నా విహారయాత్ర విషాదాన్ని మిగులుస్తుందనుకున్నాను నేను. అయితే విలువలతో కూడిన విద్యను అందించే దిశగా నా బాధ్యత ఏమిటో తెలిసొచ్చేలా అది రూపాంతరం చెందినందుకు ఒక్కసారి గోదావరి వైపు తిరిగి ఇంటి వైపు నడవసాగాను.

పి. రాజేష్
=================
నవ్వుల హరి

సాహితీ సంధ్య

‘నవ్వు నాలుగు విధాల చేటు’ అని పెద్దలు చెప్పిన మాట చాదస్తమని కొట్టిపారేయడానికి లేదు. భారతంలో ద్రౌపది నవ్వు, పంచమ వేదంలో ఎన్నో గొప్ప మలుపులకు కారణమయిందని మనమందరం ఎరుగుదుం. రామాయణ కథాంతంలో, ప్రజలు చెప్పుకునే గాథగానయినా లక్ష్మణ దేవర నవ్వు, ప్రతి ముఖ్య పాత్రనూ తమ గురించి తాము ఆలోచించుకునేలా చేస్తుంది. వర్తమాన కాలంలో సైకాలజిస్టులు నవ్వుకు దూరమై ఎంతో ఆందోళనకు గురవుతూ మనుషులు నిరంతరం స్ట్రెస్ (ఒత్తిడి)కి గురవుతూ జీవిస్తున్నారని, నిత్య జీవితలో హాయిగా నవ్వుకోగలగడం ఆరోగ్యాన్ని కాపాడుతుందని ఎంతో ప్రాముఖ్యతనిస్తూ ‘నవ్వు నలభై విధాల గ్రేటు’ అని చెబుతున్నారు.
నవ్వుకోవాలంటే జోకును మించిన సాధనం లేదు. అలాంటి నవ్వుల మతాబులు నాలుగు వందల యాభై ఆరు సేకరించి, ముద్రించి, నవ్వులమ్మకు నైవేద్యం ఇచ్చారు మేడా మస్తాన్‌రెడ్డి. ఇదాయన అనుకోకుండా హఠాత్తుగా చేసిందేమీ కాదు. తాను క్రియేటివ్ కామెడీ క్లబ్ పేరిట, వుడా వారి సౌజన్యం, సహకారాలతో గత కొనే్నళ్ళుగా విజయవంతంగా ప్రతి రెండో ఆదివారం, ఈ నవ్వుల కొలువు కూటమిని నిర్వహిస్తున్న వ్యక్తి. వేగంగా చదువుకునేందుకు ఏదయినా తేలికపాటి సమాచారం గల పుస్తకాలు, కార్యక్రమాల పట్ల ఎప్పుడూ ప్రజాబాహుళ్యపు ఆసక్తి ఎక్కువే ఉంటుంది. ఇది మస్తాన్‌రెడ్డికి దశాబ్ద కాలంగా అనుభవపూర్వకంగా తెలుసు. ఈ అవగాహనతో, లైట్ రీడింగ్ మెటీరియల్‌గా ఇటీవల వెలుగు చూసిన ‘నవ్వుల హరివిల్లు’ పాఠకుల అభిమానాన్ని చూరగొంటుందనడంలో సందేహం లేదు.
జోకేమిటో చెప్పేసి, జోకుల పుస్తకం కొనుక్కోండన్న మార్కెటింగ్ పద్ధతి చాలా చౌకబారు పద్ధతి కనుక, ఒక్క జోకు కూడా ఈ సమీక్షలో బయటపెట్టడం లేదు. కానీ మన చుట్టూ ఉన్న జీవితం, సమాజం, తారసపడే పలు రకాల మనస్తత్వాల వ్యక్తులు, వారి పలుకుబడులు ఇవన్నీ ఈ జోకుల్లో మీకు కనిపిస్తాయని హామీ ఇస్తున్నాను.
పుస్తకం ధర కూడా కొనుగోలుదారుల్ని ఏడిపించకుండా, కనీసం మనసు చివుక్కుమనిపించకుండా ఉండేలా కేవలం 20/-లకే నూట ముప్పయి పేజీలు గల ఆకర్షణీయ గ్రంథంగా నవ్వుల హరివిల్లును ప్రచురణకర్తలు ముద్రించారు. అందువల్ల దరహాసాలు వడిలిపోకుండా ఈ సరసమైన ధర చెల్లించి ఈ హరివిల్లును సొంతం చేసుకున్న వారికి నవ్వుకున్న వారికి నవ్వుకున్నంత మహదేవా! అని ఇష్టకామ్యార్థ ఫలసిద్ధి లభిస్తుంది. ప్రముఖ కళాకారుడు కళ్ళు చిదంబరం ముందు మాటతో లభించే ఈ పుస్తకం కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబరు 94413 44365.
- రాంబాబు
================

మనోగీతిక

నా పల్లెలు
దేశానికి ఉన్నాయి ఎల్లలు
ప్రేమ, కరుణ, ఓర్పు
పనిలో నేర్పు నా పల్లెలకు ఎల్లలు
అనుబంధాల బంధాలతో
సోదరీ సోదర సంబంధాలతో
అనురాగ పంటలను పండిస్తూ
అన్ని మతాలు మాకు సమ్మతమని
మానవ కులమే
మా ‘నవ’కులమని
మత వ్ఢ్యౌన్ని సమాధి చేస్తూ, కుల సంకురానికి కత్తెర వేస్తూ
అందరి దైవం ఒకటేనంటూ,
దైవ ప్రార్థనలు చేసుకుంటూ
అభివృద్ధికి బాటలు వేసుకుంటూ
ఆదర్శానికి నిదర్శనంగా
మంచిని పెంచుతూ
మమతను పంచుతూ,
జానపద జావళీలతో
ప్రకృతి కన్యను తిలకిస్తూ
(జనపద) జానపద
ఆట పాటలతో నా పల్లెల అందాలు పూ మకరందాలుగా
జాలువారుతుండగా,
ఆస్వాదిస్తూ, నేత్రోత్సవం
కలిగిస్తున్న
నా పల్లెలు జానపద కళలకు పుట్టినిల్లులుగా భాసిస్తూ
కళామతల్లి సిగలో
వాడని పువ్వులాగ
కళామతల్లి మోములో
వీడని నవ్వులాగ
ఉన్నాయి నా పల్లెలు ఆకాశమంత విశాలంగా
భూ మాతంత ఓర్పుగా...!
అందుకే నా పల్లెలు
జీవన సౌందర్యానికి
పట్టుగొమ్మలు...!

- గర్రేపల్లి వెంకటకృష్ణారావు

===============

‘మెరుపు’ రచయితలకు విజ్ఞప్తి
మొదటి ఏడాది పూర్తయి, రెండో ఏట ప్రయోజనకరంగా నడుస్తున్న ‘మెరుపు’
ఉత్తరాంధ్ర సాహిత్యవేదికకు మీ నుండి రచనలు, కార్టూన్లు, వ్యాసాలు కోరుతున్నాము.
* కథలు మూడు ఎ-4 సైజు పేజీలకు మించకుండా పంపాలి
* కవితలు ఒక ఎ-4 సైజు పేజీకే పరిమితం అయి ఉండాలి.
* కార్టూన్లు ఇండియన్ ఇంక్, లేదా రంగుల్లో అయినా సరే పంపవచ్చు.
* రచన/కార్టూన్ స్వీయ సృజన అనే హామీ పత్రం తప్పనిసరి.
* పుస్తకాలు సమీక్ష కోరి పంపేవారు రెండు ప్రతులు పంపాలి.
* మీ పూర్తి చిరునామా, ఫోన్ నెంబరు, ఈ-మెయిల్ అడ్రస్ జతపరచడం మర్చిపోవద్దు.

=====

‘టాగోర్ మార్గ్ బ్లాగ్‌స్పాట్’ హలో!

నడిపేది తెలుగు రవీంద్రనాథుడు. పేరేమో బెంగాలీ రవీంద్రుడు గుర్తుకొచ్చేలా ‘టాగోర్ మార్గ్!’ డాక్టర్ రవీంద్రనాథ్ జంధ్యాల మంచి సాహిత్యాభిరుచి గల వ్యక్తే కాక ఈ సాంకేతిక యుగంలో సాహిత్య సమాచారాన్ని ఎలా వెబ్ పల్లకి ఎక్కించి సగౌరవంగా ఎల్లలోకంతో పంచుకోవచ్చో తెలిసిన వారు. వారు ఆంగ్ల సాహిత్యంలో డాక్టరేట్ కలిగి ఉన్నారు. ‘టాగోర్ మార్గ్.బ్లాగ్‌స్పాట్’ను నిర్వహిస్తున్నారు. గాయత్రి విద్యా పరిషత్ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న వీరు 2009 నుండి బ్లాగ్‌స్పాట్ నిర్వహిస్తున్నారు. ‘సౌదస్ప్రింగ్’ ది డవ్ అండ్ ది మదర్ ఎర్త్’ ఆంగ్ల కవిత్వ సంపుటాలు, ‘రష్యన్ గీతాలు’ తెలుగు అనువాదం ఇప్పటి దాకా ముద్రితాలు.
చదవడం, సంగీతం, ధ్యానం అంటే ఇష్టం గల రవీంద్రనాథ్ ‘టాగోర్ మార్గం’ అనే పేరిట బ్లాగ్ పెట్టడం విశేషం. టాగూర్ రచనలపై స్పందనలు, కరుణశ్రీ, గోపీచంద్, చలంల సాహిత్య విశేషాలు, కరుణశ్రీ ఎన్నో పద్య రచనలకు ఆంగ్లానువాదాలు, ‘జ్ఞాపకాల పటాలపై సిరిచుక్కలు’ అంటూ తాము తిరిగొచ్చిన ఊర్లూ, పల్లెటూర్లూ పరిచయం చేయడం ఈ బ్లాగులో ఆసక్తిదాయకమైన అంశాలు. అప్పుడప్పుడూ తెలుగులో రాసిన కవితలు కూడా ఈ టాగోర్‌మార్గ్ బ్లాగులో ఉంచారు. అందులో ఇంటింటా, ఊరూరా క్రికెట్టాట గురించిన రచనలో
‘బోడిగాడి తోట శ్మశానం
బుడతలకు క్రికెట్ మైదానం
గుడిసెల్లో పుట్టి పెరిగి
పుర్రెల వికెట్లతో, ఎముకుల బ్యాట్లతో
ఆడతారు సచిన్ టెండుల్కర్లా
సృజనాత్మకంగా’ అంటూ ఈ దేశంలో అత్యంత జనాదరణ గల ఆటను గురించి తెలుపుతారు. సాంకేతిక యుగపు ఆవిష్కరణలు సామాన్యులకి ఏమైనా మేలు చేసేనా అన్నది ఇవాళ ప్రపంచ దేశాలన్నింటా గల పెద్ద సందిగ్ధత. దానే్న రవీంద్రనాథ్
‘ముంగాళ్ళు లేని ఆవుదూడ
కుప్పి గంతులు వేయలేదు
నిలబడలేదు, తల్లి పాలు తాగలేదు
రైతు కన్నుల్లో వేదన
టెక్నాలజీ చేసేనా ఏమైనా’ తన స్పందనలో చిత్రిస్తూ, మనల్ని ఆ దిశగా ఆలోచించేలాగా చేస్తాడు.
రష్యన్ గీతాలు తొలుదొల్ల తెలుగు అనువాదం చేసిన బసవరాజును తలచుకోవడమూ, ధరణి గురించి ‘నేనే ధరను - నా విలువ అమూల్యం’ అంటూ డెక్కా నారాయణరావు రాసిన తెలుగు కవితను తన బ్లాగులో సమాదరించడం చూస్తుంటే బ్లాగు భాష ప్రజల భాష అని తెలుస్తుంది.
ఒకింత ఉదార హృదయం లేని వారి బ్లాగులు ఒంటెత్తు పోకడలతో, వారి అహంకారానికి అద్దాల్లా ఉంటాయి. అటువంటి లక్షణాలు లేకపోవడంతో కవి, ఆలోచనా శీలి, మంచి చదువరి అయిన జంధ్యాల రవీంద్రనాథ్ ‘టాగోర్ మార్గ్’ బ్లాగు నాగరికత విలువలతో సభ్య సమాజం మెచ్చుకోదగ్గదిగా ఉంది.
ఎటొచ్చీ వారు చురుగ్గా బ్లాగింగ్ చేయాలని, ఇంకెన్నో ఆసక్తికరమైన అంశాలకు తన బ్లాగును కూడలిగా మార్చాలనీ ఆశిద్దాం. ‘ఆలోచించే శక్తి కావాలి, పిడివాదం కాదు, శాంతి కావాలి, యుద్ధం కాదు, బహుళ స్వరాల సంస్కృతి కావాలి మూస సమాజం కాదు’ అన్నదే టాగోర్ మార్గంగా ఎరిగి, నలుగురికీ ఎరుక కలిగిస్తున్న ఈ యువ మిత్రుడు నిజంగా వెబ్ ప్రపంచ పౌరుడు. అందుకు అభినందనలు.
- జగద్ధాత్రి
============================

శివభారతంపై జానమద్ది హనుమచ్ఛాస్ర్తీ ప్రసంగం
-- విశేషవార్త --
విశాఖ మహానగరపు పేరిన మీగడ వంటి సాహిత్య లోక ప్రఖ్యాతులెందరో గల సభ, జానమద్ది వారి ప్రసంగానంతరం, అధ్యక్షులు, సాహిత్య రసజ్ఞులు డి.వి. సుబ్బారావు సూచనను పాటిస్తూ, లేచి నిల్చుని నిండుగా శాస్ర్తీకి అభివాదాలు తెలియజేసింది కరతాళ ధ్వనులతో. వ్యాస పాఠాన్ని తన ముదిమి వయసులో కూచుని చదువుతూనే, రోషావేశం ముప్పిరిగోనే రుద్ధ స్వరంతో, జానమద్ది శివాజీ చరిత్రం ఇతివృత్తమయిన శివభారతంలోని ఘట్టాల వివరణలో మమేకులై కంట కన్నీరు కార్చిన దృశ్యం వారెంతటి సాహిత్య ప్రియంభావుకులో తెలియజెప్పింది.
సాహిత్య రంగంలో ఉన్నత స్థాయి భావాల నివేదనకు ప్రముఖులు, త్యాగధనులు అయిన వారి పేరిట ఏర్పాటు చేసే స్మారకోపన్యాసాలు (ఎండోమెంట్ లెక్చర్స్) వక్తకు గల చిత్తశుద్ధీ, అంకితభావానికి అనుగుణంగా, ఉత్తమ సందర్భాలుగా రూపుదాలుస్తాయి. అలాంటి ఒక విశేషమే, గత ఆరేళ్ళుగా వార్షిక ఉపన్యాస పరంపరగా సాగుతూ వస్తున్న గరిమెళ్ళ సీతారాం, మహాలక్ష్మి స్మారకోపన్యాసాలు.
ఇటీవల విశాఖ పౌర గ్రంథాలయంలో ఆరవ ఏడాది ఎండోమెంట్ లెక్చర్ అందించేందుకు వచ్చినది ఒక జ్ఞానవృద్ధుడు. స్వాగతించిన ఆచార్య కోలవెన్ను మలయవాసిని పలుకుల్లో ఆయన గ్రంథాలయాల్ని అభివృద్ధి పరిచిన దీక్షాదక్షుడు. అదీ మామూలు లైబ్రరీ కాదు. నలబై ఎనిమిది వేల గ్రంథాలున్న సి.పి. బ్రౌన్ లైబ్రరీ స్థాపించింది, బ్రౌన్ కార్యక్షేత్రమయిన కడపలో. స్థాపనాచార్యులు డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్ర్తీ. ఎనభై ఆరేళ్ళ వయసులో, వారు ఎంతో మంది యువకులకు సైతం ఈ కాలంలో లేని ఓపికతో ‘గడియారం వేంకట శేష శాస్ర్తీ జీవితం- శివభారతము కావ్య సమీక్ష’ అంశంపై తన విపులమైన ప్రసంగ వ్యాసాన్ని సమర్పించిన సాహిత్య శ్రద్ధ అసమానం.
విశాఖ మహానగరపు పేరిన మీగడ వంటి సాహిత్య లోక ప్రఖ్యాతులెందరో గల సభ, జానమద్ది వారి ప్రసంగానంతరం, అధ్యక్షులు, సాహిత్య రసజ్ఞులు డి.వి. సుబ్బారావు సూచనను పాటిస్తూ, లేచి నిల్చుని నిండుగా శాస్ర్తీకి అభివాదాలు తెలియజేసింది కరతాళ ధ్వనులతో. వ్యాస పాఠాన్ని తన ముదిమి వయసులో కూచుని చదువుతూనే, రోషావేశం ముప్పిరిగోనే రుద్ధ స్వరంతో, జానమద్ది శివాజీ చరిత్రం ఇతివృత్తమయిన శివభారతంలోని ఘట్టాల వివరణలో మమేకులై కంట కన్నీరు కార్చిన దృశ్యం వారెంతటి సాహిత్య ప్రియంభావుకులో తెలియజెప్పింది.
రాయలసీమ సాహిత్య రత్నమనదగిన ‘శివభారతం’ కావ్యాన్ని మానవులను చరితార్థులుగా చేయు కవితా కళతో జగములున్నంత వరకు ఎల్ల జనులు చదివి తనియ వలెనన్న మహోన్నత లక్ష్యంతో, తెలుగు జాతి గర్వింపదగిన మహా కావ్యమును రచించిన వారు డాక్టర్ గడియారం వేంకట శేష శాస్ర్తీ అంటూ తన ముచ్చటయిన ముప్పావు గంట ప్రసంగాన్ని, కవి రాసిన పద్యాలను ఉదహరిస్తూ 1940లో వెలువర్చిన ఈ రచనలో ధ్వనిగా భారత స్వాతంత్య్ర పోరాటపు గడ్డు దినాలలో కావలసిన స్ఫూర్తిమంత స్వేచ్ఛాకాంక్షలు కూడా దాగి ఉన్నాయని జానమద్ది వివరించారు.
మూడు వేల పద్యాలు పైబడి సాగిన శివభారతం కొనియాడదగిన బంగారు తునకగా ప్రస్తావిస్తూ నేటికీ రాయలసీమలో శివభారత కావ్యగానము జనప్రియంగా సాగుతూ ఉంటుందని, ఆకాశవాణి మద్రాసు కేంద్రం నుండి శ్రీమతి గాడేపల్లి సుందరీ శంకరగారు ‘శివభారత ప్రాశస్థ్యం’ అను పేరిట పదహారు ప్రసంగాలను చేశారని నివేదిస్తూ ఇలా ధారావాహిక ప్రసంగాలకు నోచుకున్న వాటిలో శివభారతమే తన ఎరుకలో మొదటిదని తెలిపారు.
రాయలసీమ సాహిత్య పరిషత్తుకు గడియారం వేంకట శేష శాస్ర్తీ తొలి అధ్యక్షులు అని, ఆ సంఘానికి కార్యదర్శిగా తాను ఇరవై ఏళ్ళు పని చేసి, అటుపై బ్రౌన్ గ్రంథాలయ వ్యవస్థాపనలో పడ్డానని, నింపాదిగా చెప్పే నిరాండబర మూర్తి జానమద్ది హనుమచ్ఛాస్ర్తీ.
విశాఖపట్నం పౌర గ్రంథాలయం, ఉత్తరాంధ్రలోనే సర్వజనాకర్షక సాహిత్య వేదికగా ఎదుగుతున్న తీరు అభినందనీయం. సర్వశ్రీ డి.వి. సుబ్బారావు, సీతారామయ్య, వరహాలచెట్టి వంటి పూనిక గల ఎందరో ధీమంతుల సమష్టి కృషి నేపథ్యంలో ఈ పుస్తకాల గుడి దినదినాభివృద్ధి చెందుతున్న బలమైన నమ్మకం, కడప గడప ముంగిట అక్షరాల ముగ్గు వంటి పండితుడు, ఎండోమెంట్ లెక్చర్ అందించేందుకు రావడంతో మరింత బల పడింది. వైజాగ్ ప్రొఫైల్స్ గ్రూపు వారు ఈ మంచి సభలో లైబ్రరీకి లక్ష రూపాయల వరకు మూలనిధి విరాళం ఇచ్చిన సత్కార్యమూ, సభకు ఎంతో సంపన్నతను తీసుకొచ్చింది.
జానమద్ది లఘు వ్యాసం, ఎండోమెంట్ ప్రసంగం కాబట్టి విశాఖ పౌర గ్రంథాలయం ముద్రించి సభా వేదిక వద్ద అందరికీ అందజేసింది. కొద్ది ప్రతులు దొరికే అవకాశం ఉంది. ప్రతులకు సంప్రదించవలసిన వారు --- ‍‍జి. కృష్ణారెడ్డి, లైబ్రేరియన్. ఫోన్ నెంబర్ 0891 - 2719009. - రామతీర్థ

=====

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ-మెయిల్ అడ్రస్‌కు పంపించండి.
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9. ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17.,
merupu@deccanmail.com
‍==================

ధిద్దుబాటు - కథ
english title: 
vizag merupu
author: 
నిర్వహణ - రామతీర్థ ramateertha27@gmail.com

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>