హైదరాబాద్, జూన్ 21: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి సంవత్సరం వేలాది కోట్లతో బడ్జెట్ తయారు చేస్తున్న సంగతి తెల్సిందే! అయితే వీటిలో పౌర సేవల నిర్వహణ, విపత్కర పరిస్థితుల్లో చేపట్టాల్సిన అత్యవసర సేవలకు భారీగానే కేటాయింపులు జరుపుతున్నా, వాటిని ఎంత వరకు సరిగ్గా ఖర్చు పెడుతున్నారన్న ప్రశ్నకు అధికారుల నుంచి వౌనమే సమాధానంగా వస్తుంది. ఇందులో ముఖ్యంగా ప్రతి వర్షాకాలానికి ముందే నాలాల్లో పూడికతీసే పనులను ప్రతి ఏటా చేజిక్కించుకుని గ్రేటర్ నిధులను జేబులు నింపుకునేందుకు పలువురు ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు మాఫియాగా మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగరాన్ని వరద ముప్పు నుంచి రక్షించుకోవాలంటే ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే నెలాఖరుకల్లా నగరంలోని అన్ని నాలాల్లోని పూడికను తొలగించాలంటూ పనె్నండేళ్ల క్రితమే కిర్లోస్కస్ కమిటీ స్పష్టమైన సిఫార్సులు జారీ చేసినా, అధికారులు ఈ సిఫార్సులను సక్రమంగా అమలు చేయకుండా, అమలు చేస్తున్నామంటూ ఎప్పటికపుడు నమ్మిస్తూ గ్రేటర్ నిధులను జేబులు నింపుకుంటున్నారే తప్ప, పనులు మాత్రం అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి. ఇరవై అడుగుల లోతుంటే భారీ నాలాల్లో అడుగుభాగం నుంచి సుమారు పదిహేను అడుగుల ఎత్తు వరకు నేటికీ నాలాల్లో బురద, చెత్తాచెదారం దర్శనమిస్తుందంటే అధికారులు ఏ స్థాయిలో పూడికతీత పనులు చేపడుతున్నారో అంఛనా వేసుకోవచ్చు. నగరం గ్రేటర్‌గా రూపాంతరం చెందక ముందు ఏడు సర్కిళ్లకే పరిమితమైన నగరంలోని నాలాల్లో పూడికతీతకు ఏటా రూ. 6 కోట్లను కేటాయించేవారు. నగరంలో అయిదు భారీ నాలాలు, మరో పద్నాలుగు మధ్య తరహా, 22రెండు చిన్న తరహా నాలాలున్నాయి. అయితే రూపాంతరం చెందిన తర్వాత శివార్లలోని పలు నాలాలు కూడా గ్రేటర్ బల్దియా పరిధిలోకి రావటంతో ఈ నాలాల్లోని పూడికతీత పనులకు ఏటా రూ. 16 కోట్ల మేరకు అధికారులు ఖర్చు చేస్తున్నట్లు తెల్సింది. అయితే గత ఎండాకాలం చివరి వరకు కూడా నగరంలోని పలు నాలాల్లో సుమారు రూ. 16 కోట్లు వెచ్చించి నాలా పూడికతీత పనులు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నా, దాదాపు అన్ని నాలాల్లో ఎక్కడ పూడిక అక్కడే ఉంది. వాస్తనానికి కూడా నగరంలోని అన్ని నాలాల్లో కలిపి అధికారులు ఆరు లక్షల క్యూబిక్ మీటర్ల పొడువున, మూడు లక్షల టన్నుల పూడికను తొలగించాల్సి ఉంది. ఈ పూడికను తొలగించేందుకు లారీ కనీసం లక్ష ట్రిప్పులు కొట్టాల్సి ఉంది. కానీ ప్రతి ఏటా అధికారులు నామమాత్రంగా పూడికను నాలాల్లో నుంచి తీసి బయట వేసి చేతులు దులుపుకుంటున్నారు. అయినా పూడికను అక్కడి నుంచి తొలగించినట్లు లారీల ట్రిప్పులకు సంబంధించిన బిల్లులు కూడా సృష్టించి అక్రమంగా బిల్లులు డ్రా చేసుకుంటున్నట్లు తెల్సింది. గ్రేటర్‌లో విధులు నిర్వహిస్తున్న కొందరు ఇంజనీర్ల పుణ్యమాని ప్రతి ఏటా అడ్డదారిలో ఈ నాలా పూడికతీత పనులను చేజిక్కించుకునే కాంట్రాక్టర్లు నాలాల్లో ఇరువైపులా పేరుకుపోయిన చెత్తాచెదారం, కాగితాలను తూతూమంత్రంగా తొలగించి పనులు పూర్తి చేసినట్లు రికార్డులు సృష్టించి బిల్లులు డ్రా చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. పనులు కేటాయించిన తర్వాత అసులు కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నారా? లేదా? చేస్తుంటే నాలాల్లోని అడుగుభాగం వరకు పేరుకుపోయిన చెత్తా, పూడిక, బురదను తొలగించారా? లేదా అన్న విషయాన్ని కనీసం నిర్ధారించుకోకుండానే అధికారులు గుడ్డిగా బిల్లులు మంజూరు చేస్తూ, అందులో వాటాలు స్వీకరిస్తున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. ఎండాకాలం ముగింపుకొచ్చిందంటే చాలు అధికారులకు పండుగ. ప్రతి సంవత్సరం కచ్చితంగా నాలాల్లోని పూడికను తొలగించాల్సి ఉన్నందున, వారికి ఎండాకాలం మధ్య భాగం నుంచి మే నెలాఖరు వరకు కాసుల పండుగే. ఒక రకంగా చెప్పాలంటే నాలాల్లోని పూడికతీత పనులు ఇంజనీర్ల పాలిట వరంలా మారిందనే ఆరోపణ బలంగా ఉంది.
కార్మికులకు భద్రతా ప్రమాణాలేవీ?
సాధారణ భారీ నాలాల్లో పొక్లెయిన్ సహాయంతో పూడికను తొలగించాల్సి ఉన్నా, అక్కడ విధులు నిర్వహిస్తున్న కార్మికుల భద్రత కోసం ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు కొన్ని భద్రతా ప్రమాణాలను పాటించాల్సి ఉంది. అదే మధ్య తరహా, చిన్న తరహా నాలాల్లో లోపలికి దిగి పూడిక, బురద, చెత్తను తొలగించే కార్మికులకు మాస్కులు, గ్లౌజెస్‌లు, ప్రత్యేకమైన డ్రెస్, బూట్లు, అవసరమైతే ఆక్సిజన్ సిలెండర్లను కూడా కేటాయించాల్సి ఉంది.
ఈ ప్రమాణాలను కార్మికులకు కేటాయిస్తే ఏదైనా ప్రమాదం జరిగినా, వారి ప్రాణాలకు పెద్దగా ముప్పు ఏర్పడే అవకాశముండదు. కానీ బుధవారం సికింద్రాబాద్‌లో జరిగిన నాలా దుర్ఘటనలో మృతి చెందిన దేవరాజు వీరస్వామికి ఇంజనీర్లు గానీ, కాంట్రాక్టర్ గానీ ఎలాంటి భద్రతా ప్రమాణాలు, పరికరాలు ఇవ్వలేదు. కానీ బిల్లుల్లో మాత్రం ఈ అంశాలన్నీ పొందుపర్చి కోట్లాది రూపాయలను డ్రా చేసుకోవటం గమనార్హం.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి సంవత్సరం వేలాది
english title:
funds plenty
Date:
Friday, June 22, 2012