కొంగకు జ్ఞానోదయం
కథ
ఒక జువ్విచెట్టు మీద ఒక కాకుల గుంపు,
కొం గల గుంపు కాపురముండేవి.
కొంగలరాజు ఎప్పుడూ కాకుల రాజును
విమర్శిస్తుండేవాడు. ఒకరోజు కొంగలరాజు
‘ఓ కాకుల రాజా..! చివరిసారిగా
చెబుతున్నాను.. అందమైన మల్లెపువ్వు
లాంటి తెల్లని రంగుతో, అందమైన
ఆకారంతో హుందాగా ఉండే మాతో కలిసి
బొగ్గులా నల్లగా, వికారంగా ఉండే మీరు
ఒకేచోట నివసించటం కుదరదు. వెళ్లి
మరోచోట కాపురాలు ఏర్పాటు
చేసుకోండి’.. అంది. కాకుల రాజు వౌనంగా
ఉండిపోయాడు. తమకు నల్లని రంగు, ఈ
ఆకారం ఆ భగవంతుడు ఎందుకిచ్చాడా..
అని మనసులో బాధపడ్డాడు. ఇంతలో
ఒక వేటగాడు తుపాకీ తీసుకుని
జువ్విచెట్టు వద్దకు వచ్చాడు. చెట్టు మీద
తెల్లటి కొంగల గుంపును చూసి
ముచ్చటపడ్డాడు. తన తుపాకీ తీసి
గురిపెట్టి కొంగల గుంపు మీదకు కాల్చటం
మొదలుపెట్టాడు వేటగాడు. ఆకుల్లా రెండు
కొంగలు రాలి నేల మీద పడ్డాయి. వాటిని
తన బుట్టలో వేసుకున్నాడు. తుపాకీ
శబ్దానికి కొంగలతో పాటు కాకులూ
మెరుపు వేగంతో ఎగిరిపోయాయి.
కొంగలరాజు, కాకులరాజు దూరంగా వున్న
మర్రిచెట్టు మీద వాలాయి. ‘మిత్రమా..!
వేటగాడు రెండు కొంగల్ని తుపాకీతో కాల్చి
బుట్టలో వేసుకున్నాడు, గమనించావా’
అంది కాకులరాజు. ‘ఆ(.. కొంగల్ని
కాకపోతే కాకుల్ని కాల్చి వాడేమి
చేసుకుంటాడు. మీ మాంసం తినటానికి
కూడా వాళ్ళు ఇష్టపడరు. ఆ కొంగలకి
పోయే సమయం వచ్చింది కాబట్టి అవి
దొరికాయి’ అంది వ్యంగ్యంగా కొంగలరాజు.
మరుసటి రోజు వేటగాడు తిరిగి జువ్విచెట్టు
వద్దకు వచ్చాడు. తన దగ్గరున్న పెద్ద
తుపాకీతో గురిచూసి కొంగల గుంపును
కాల్చాడు. ప్రాణభయంతో కొంగలు,
కాకులు జువ్విచెట్టు మీద నుండి
ఎగిరిపోయాయి. ఈసారి రెండు కొంగలతో
పాటు పొరపాటున ఒక కాకి కూడా
వేటగాడి తుపాకీకి బలి అయింది.
వేటగాడు రెండు కొంగల్ని ఏరుకుని
బుట్టలో వేసుకున్నాడు. పక్కనే కింద
పడివున్న కాకిని చూసి ఒక క్షణం
ఆలోచించి దాన్ని కూడా తన బుట్టలో
వేసుకుని ముందుకు కదిలాడు. దూరంగా
మర్రిచెట్టు మీద కూర్చున్న కొంగలరాజు,
కాకులరాజు ఆ దృశ్యాన్ని చూశాయి.
‘అయ్యో..! అనవసరంగా మా మిత్రుడు
కూడా బలి అయ్యాడే..’ అంది
కాకులరాజు. ‘పోయేకాలం వచ్చింది..
పోయింది!’ అంటూ నవ్వింది కొంగలరాజు.
కాకులరాజు ఒక్కుదుటున మర్రిచెట్టు మీద
నుండి ఎగిరి ‘కావ్.. కావ్..’ అంటూ
పెద్దగా అరుస్తూ వేటగాడికి అడ్డుపడింది.
ఆ మరుక్షణమే తలో దిక్కు నుండి అనేక
కాకులు ‘కావ్.. కావ్’మని అరుస్తూ
అక్కడికి వచ్చాయి. వేటగాడిని
చుట్టుముట్టాయి. వేటగాడు కింద వున్న
కట్టెను తీసుకుని వాటిని అదిలించాడు.
అవి దూరంగా వెళ్లి తిరిగి వేటగాడిని
అడ్డుకున్నాయి. కాకులు వేటగాడి
చేతిమీద ముక్కుతో పొడిచాయి. దాంతో
వాడిక తట్టుకోలేక దాడి భయంతో బుట్టను
నేల మీద విడిచి పరుగులంకించాడు.
కాకులన్నీ తుపాకీ కాల్పులకి చనిపోయిన
కాకి చుట్టూ మూగి అరుస్తున్నాయి. కాకి
చనిపోయిన విషయం అడవంతా తెలిసేలా
గోల చేసి బాధపడ్డాయి. కొంగలరాజు
కాకుల ఐక్యతను చూసి సిగ్గుపడ్డాడు.
ఒక్క కాకి కోసం అన్ని కాకులు
బాధపడటం ఆశ్చర్యం కలిగించింది.
‘మిత్రమా..! ఐక్యత లేని తెల్లని
కొంగలకన్నా ఐకమత్యం ఉన్న నల్లని
కాకులే గొప్ప. రంగు కాదు గుణం
ముఖ్యమని లోకానికి తెలిపి మీరు
పక్షిజాతి గర్వపడేలా చేశారు. ఇంతకాలం
మిమ్మల్ని అసహ్యించుకున్నందుకు
నన్ను క్షమించండి’ అని వేడుకుంటూ
జ్ఞానోదయం పొందింది.
- మహంకాళి స్వాతి
ఖమ్మం, ఫోన్: 9247564962
===
సేవల్లో మాస్టారు..
సాహితీ మాధుర్యాల ‘అజ్మీరు’!
కృష్ణా జగ్గయ్యపేట సాహితీ చరిత్రలో
అజ్మీరు వీరభద్రయ్య సుస్థిర స్థానాన్ని
సంపాదించారు. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి
ఎందరో విద్యార్థుల్లో అక్షర జ్ఞానం నింపటమే
కాకుండా తన విద్యార్థులను
సాహితీవేత్తలుగా, రచయితలుగా,
సామాజిక సాహితీ విశే్లషకులుగా
తయారుచేశారు. అందుకు నిదర్శనం
తాను స్థాపించిన ‘రసమయి సాహితీ
సమితి’. ఈ సాహితీ సంస్థ ద్వారా
జగ్గయ్యపేటలోని అన్నివర్గాల వారిని
సాహిత్యం వైపు నడిపించారు.
అంతేకాకుండా యువ కవులను,
కవయిత్రులను ప్రోత్సహించి వారిద్వారా
ఎన్నో రచనలు చేయించారు. సహజ కవి
అజ్మీరు వీరభద్రయ్య పద్య సాహిత్యం,
వచన సాహిత్యం, చారిత్రక పరిశోధనలో,
జీవిత చరిత్రలను రచించడంలోనూ
చేయితిరిగిన వారు. తాను రాసిన కొన్ని
ప్రముఖ గ్రంథాల్లో శాంతిశ్రీ, తులసి
స్మృతులు, శ్రీ ఆంజనేయ స్తోత్రం,
మక్కపేట శ్రీ రఘురామ శతకము
పదకావ్యాల్లో ప్రఖ్యాతి చెందినవి. చారిత్రక
పరిశోధనలో భాగంగా జగ్గయ్యపేట
ధనంబోడు బౌద్ధస్తూపం- కృష్ణాతీరంలో
బౌద్ధ పరిణామాలు.. పరిశోధనాత్మక
వచన కావ్యంగా పేరు గాంచినది.
భక్తితత్వంతో కలియుగ వైకుంఠ దేవుడైన
శ్రీ తిరుమలగిరి వెంకటేశ్వరస్వామి క్షేత్ర
వైభవం, వెంకటేశ్వరస్వామి వరప్రసాదంతో
జన్మించిన పెనుగంచిప్రోలు శ్రీ
లక్ష్మీతిరుపతమ్మ అమ్మవారి
మహిమలను గురించి రాశారు.
సౌజన్యమూర్తులు అనే ఖండకావ్యాన్ని,
అజ్మీరు గీతాలు అనే కవితా సంపుటిని
ముద్రించారు. తెలుగు భాష, చరిత్రల
పరిశోధనా పితామహుడైన శ్రీ కొమ్మరాజు
వెంకట లక్ష్మణరావు జీవిత చరిత్రను
సమగ్రంగా గ్రంథ రూపంలో ప్రచురించారు.
రసమయి సాహితీ సమితి ఆధ్వర్యంలో
రాష్టస్థ్రాయిలో మూడు ప్రత్యేక సంచికలను
ఆవిష్కరించారు. ప్రథమ వార్షికోత్సవ
సంచిక ఆలోచన. ఆలోచనలో వడుగు
గోపాలరావు గారు రచించిన అలుపెరుగని
యోథుడు- కాళోజి అనే వ్యాసాన్ని విక్రమ్
పబ్లికేషన్స్ డిగ్రీ ద్వితీయ సంవత్సరం
తెలుగు పాఠ్యాంశాల్లో పొందుపరిచారు.
ద్వితీయ సంచిక మార్పు కోసం. ఈ
సంచికలో రాష్టస్థ్రాయిలో యాభై మంది
ప్రముఖ కవుల కవితలను సంకలనంగా
ముద్రించారు. రాష్టస్థ్రాయిలో రైతులు
ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి కొన్ని
పరిష్కార మార్గాలను చూపుతూ
‘తూర్పార’ అనే పద్యకావ్యాన్ని తృతీయ
వార్షికోత్సవ సందర్భంగా ముద్రించారు.
అజ్మీరు వీరభద్రయ్య అనేక సాహితీ
పురస్కారాలను అందుకున్నారు. మాజీ
ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను
చేతుల మీదుగా నియోజకవర్గ ఉత్తమ
సాహితీ పురస్కారాన్ని అందుకున్నారు.
జగ్గయ్యపేట శాసనసభ్యుడు శ్రీరాం
రాజగోపాల్ ఉగాది పురస్కారంతో
ఆయనను సత్కరించారు. జిల్లా కలెక్టర్
రిజ్వీ చేతుల మీదుగా జిల్లా సాహితీ
పురస్కారం అందుకున్నారు. జిల్లా
రచయితల సంఘం ఆధ్వర్యంలో మాజీ
మంత్రి మండలి బుద్ధప్రసాద్ చిన్నయ
సూరి సాహితీ పురస్కారం అందజేశారు.
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య జగ్గయ్యపేట
మహోత్సవాల్లో ఉత్తమ సాహితీ
పురస్కారాన్ని అందజేశారు.
అంతేకాకుండా సామాజికవేత్త బిఎస్
రాములు, సాహితీ విమర్శకులు విహారి
గారి ప్రశంసలను పొందారు. తన
వయస్సును సైతం లెక్కచెయ్యకుండా ఒక
సాహితీ యువకిరణంలా సమాజానికి
సాహితీ సేవను అందిస్తున్న అజ్మీరు
వీరభద్రయ్య గారికి అక్షర
నమస్సుమాంజలి.
- పూసపాటి జ్యోతి వేదాద్రి
జగ్గయ్యపేట, ఫోన్: 9912191694
పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతోనే..!
దుర్గమ్మ దర్శనం చేసుకుని వస్తున్నాను.
కారుకి ఆనుకుని నిలబడ్డ రేవతిని చూసి
ఆశ్చర్యపోయాను. వంటినిండా నగలతో
శశికళలా ఎప్పుడూ కనిపించే రేవతి
దేశముదురులో హంసికలా రుద్రాక్ష
మాలతో కనిపించింది. రేవతి దగ్గరకెళ్లి
‘నువ్వు నువ్వేనా?’ అన్నాను. నేనే..
అంది చిదానందంగా! ‘ఈమధ్య గురువు
గారితో కలిసి చాలా దేశాలు తిరిగివచ్చాను.
ఇహలోక విషయాలకి రాంరాం. అంతా ఆ
భగవంతుని లీల’ అంటూ చాలా
విషయాలు చెప్పింది. కొనే్న
అర్ధమయ్యాయి. మరి నేను అజ్ఞానిని
కదా! ఎంతసేపూ మొగుడూ, పిల్లలు.
నాలాంటి వాళ్లకి మోక్షం దొరకదని.. నా
యోగం బాగుండలేదని.. ఇలా ఎన్నో
విషయాలు అనర్గళంగా వివరించింది.
‘మల్లీశ్వరి ఈమధ్య కనిపించిందే.. పక్కన
కొత్త మొగుడు.. చంకలో పాప. పాత
మొగుడికి పుట్టిన పిల్ల..’ నా చెవిలో సీసం
పోసినట్లు ఫీలయ్యాను. రవి దాన్ని మోసం
చేసి పారిపోతే వివేకమూర్తి దాని
విషయాలన్నీ విని ధైర్యం చెప్పి పాపతో
సహా దాన్ని స్వీకరించాడు. అటువంటి
వాళ్ల గురించి రేవతి అసహ్యంగా
మాట్లాడుతుంటే ఆత్మస్థుతి, పరనిందను
అది మానలేదని అర్ధమైంది. పుట్టుకతో
వచ్చిన బుద్ధి పుడకలతోనే పోద్దంటారు
కదా! మరి కాషాయం.. రుద్రాక్షలు? అది
జనాన్ని మోసం చేస్తోందా? లేక తనని
తానే..? ఆ భగవంతుడికే తెలియాలి..!
- చావలి శ్యామల (టీచర్)
విజయవాడ
ముఖాముఖి
తుమ్మేటి రఘోత్తమ రెడ్డి
ప్రశ్న: కథ రాయడానికి ఏమి కావాలి?
జవాబు: అనేక మందికి అనేక కారణాలు,
నాకు కొన్ని కారణాలు. నేను పుట్టి
పెరిగింది ఫ్యూడల్ గ్రామం -వెలంపల్లి.
ఇప్పటికి 52 ఏళ్ల క్రితం రేడియో, టివి,
పేపర్, ఫోన్, కరెంటు, రోడ్డు ఇలాంటి
ఆధునిక కమ్యూనికేషన్ రవాణా సౌకర్యాలు
లేని, అనేక వందల ఉత్తర తెలంగాణ
గ్రామాల తీరుగానే మా గ్రామం. మాది
మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం,
అంటే పదెకరాల వరి పండే భూమి, మరో
ఇరవై ఎకరాల ఖుష్కి (మెట్ట) భూమి
ఉండేది. తిండికి, బట్టకు లోటు లేని
కుటుంబం కాని గ్రామం లోపలి
జీవితంలోని తారతమ్యాల గురించి నేను
పెరిగే వయసులో నాకు చాలా ప్రశ్నలు
కలిగేవి. నాకు మూడేళ్ల లోపు వయసు
ఉండవచ్చు. మా నాయనమ్మ మరణం
నన్ను కలవరానికి గురి చేసింది. మరణం
అంటే ఏమిటి? నాకు మరణంతోనే
ప్రశ్నలు ప్రారంభం. ఫ్యూడల్ గ్రామం
అన్నాను కాదా! గ్రామానికి బయటి
ప్రపంచంతో సంబంధాలు తక్కువ,
అవసరాలు తక్కువే. అన్నీ గ్రామంలోనే
ఉత్పత్తి చేసుకునే వారు. అన్ని వృత్తుల
వారు ఉండేవారు. మా ఊళ్లో గ్రామీణ
భూస్వామ్యపు అక్రమాలు, మనుషులు
పాటించే కులభేదాలు, అంతిమంగా
మనుషుల్లోని స్వార్థం వీటి పట్ల కలిగే
ప్రశ్నలు, మరోవైపు మా బాపు ఉన్నత
ప్రవర్తన. మొత్తం మీద ఆనాటి గ్రామీణ
జీవితం నాకు ఇరుకుగా అనిపించింది.
ఇంటో విశాల ప్రపంచమేదో ఉందనిపించేది.
బయట ప్రపంచాన్ని తెలుసుకోవడానికి
చేసే ప్రయత్నాలు అందుకు కథా సాహిత్యం
ఒక వాహికగా భావించుకోవడం. జీవితం
ఇట్లా ఇరుకుగా, అనూనవీయంగా,
అశాస్ర్తియంగా ఎందుకు ఉన్నది? దానికి
కారణాలు ఏమిటి? అయితే మంచి
జీవితం, మంచి విలువలు ఏవి? ఇట్లాంటి
విచికిత్సకు లోనై కథలు చదివే క్రమంలో,
కథలు రాయాలని అనుకోవడం
ప్రారంభమైంది. కథ రాయడానికి భూమిక
పైదంతా నా వెనుక ఉందని నేను
భావిస్తాను. నేను కథలు రాయడానికి అవి
ముఖ్య కారణాలని అనుకుంటాను.
కథ రాయడానికి ట్రైనింగ్ అవసరమా?
కథలు రాయాలని పదమూడు లేదా
పధ్నాలుగేండ్ల వయసులో నా మనసులో
మొదలైంది. అది కార్యరూపం
దాల్చడానికి, నేను ఆ ప్రక్రియ గురించి
తెలుసుకోవడానికి, కథ రచన
ప్రారంభించడానికే మరో పదేండ్లు పట్టింది.
కథా రచన గురించి సాంకేతిక విషయాలు
తెలియకపోవడమే ఆ ఆలస్యానికి ఒక పెద్ద
కారణం. జీవితంలో అన్ని విషయాలు
నేర్పడానికి బడులున్నాయి. కానీ,
సాహిత్య సృష్టి గురించి చెప్పే బడులు
లేవు. అదొక తండ్లాట, పెనుగులాట.
రాద్దామని ఉన్నవారికి రచన విషయాలు
అందించడం అవసరమేనని, అవి
సకాలంలో లభించక నేనెంతో ఇబ్బంది
పడ్డాను. అలాంటి ఇబ్బంది ఇతరులు
పడకూడదని నేను కొన్ని కథా వర్క్‌షాప్‌ల
నిర్వహణలో పాల్గొన్నాను. సాహిత్య సృష్టికి
రచయితకు ఉండాల్సిన నేపథ్యంతో పాటు
తగిన శిక్షణ ఉండాలనేది నా అనుభవం.
అభిప్రాయం.
యువత సాహిత్యాన్ని
చదవడానికి ఏం చేయాలి?
ఇది మంచి ప్రశ్న. ఈ కాలానికి
అత్యవసరమైన ప్రశ్న. ఈ ప్రశ్న దాదాపు
పదిహేను ఇరవై సంవత్సరాలుగా నా
మెదడులో ప్రారంభమైన ప్రశ్న. మన
తరువాత తరం సాహిత్య పఠనం పట్ల ఆసక్తి
ప్రదర్శించడం లేదు. దీనికి కారణాలు
ఉన్నాయి. ఒకటి మన నేపథ్యం వేరు,
మన పిల్లల నేపథ్యం వేరు. మనది
ఎటువంటి నేపథ్యమో నేను మొదటే
చెప్పిన. దానికి పూర్తిగా భిన్నమైన
నేపథ్యం మన తరువాత తరానిది. ఇది
మన సమాజికాభివృద్ధిలో కలిగిన పెద్ద
మార్పు. స్థూలంగా చెప్పాలంటే
తరతరాలుగా మనది శ్రోత సాంప్రదాయం.
మన దగ్గరకు వచ్చేసరికి అది పాఠక
సాంప్రదాయంలోకి మారింది. మన
పిల్లలదిపుడు ప్రేక్షక తరం. పదునాలుగు
భువన భాండము ఇపుడు టివి రూపంలో
నట్టింట్లోనే చూసే అవకాశం మన పిల్లలకు
అందివచ్చింది. ఇది కాదనలేని నిజం.
మనం ఏది తెలుసుకోవాలన్నా
సాహిత్యమో, పత్రికలో ఆధారం. ఇపుడట్లా
కాదుకదా. దృశ్య మాధ్యమం తెచ్చిన
మార్పు. అయితే ఈ దృశ్య మాధ్యమం
యుగంలో రచయితలు కొత్త రూపాల
గురించి, ఈ తరానికి పట్టే సాహిత్య రూపాల
గురించి మన సాహిత్య ప్రపంచం అంతగా
ఆలోచించడం లేదు అనేది నా ఫిర్యాదు.
దృశ్య మాధ్యమంలోకి రచయితలు
ప్రవేశించడం, కొత్త రచనల్ని సాధ్యమైనంత
క్లుప్తంగా సరళంగా చెప్పడం, కుటుంబ
చరిత్రల్ని నిర్మించడం. పైన చెప్పిన దృశ్య
మాధ్యమం లోకి ప్రవేశించడం విషయంలో
నేను ఒక ప్రయత్నం చేసిన. మన
ఆధునిక లిఖిత కథ రూపాన్ని తీసుకుని
ఆశువుగా స్క్రీన్ మీద చెప్పిన. ఏడు ఆశు
కథల డీవీడీని 2009లో విడుదల
చేసిన. ఆ ప్రయత్నం సరైనదేనని నాకు
నమ్మకం కలిగింది. రాత కథ సాధించిన
విస్తృతీ, లోతుల్ని కూడా ఆశు కథలో
మనం సాధించవచ్చనే నమ్మకం నాకా
ప్రయత్నం వల్ల కలిగింది. నేను రెండో ఆశు
కథల డీవీడీ ఆలోచనల్లో ఉన్నాను. ఇక
రచనని మరింత క్లుప్తీకరించడం అనే
విషయంలో నేను రెండో ప్రయత్నంగా
కొటేషన్ను ఒక ప్రక్రియగా భావించి మానవ
జీవితంలోని అనేక సూక్ష్మ స్థూల విషయం
గురించి లిరికల్‌గా ఒకటి రెండు
వ్యాఖ్యాల్లోనే, నాకు కలిగిన నిర్ధారణల్ని
రాసి 2011లో జీవించు, నేర్చుకో
అందించు అనే పుస్తకాన్ని విడుదల
చేసాను. యూత్‌నుంచి నాకు మంచి
రెస్పాన్స్ వచ్చింది. ఆ పుస్తకం మరింత
పెరిగి రెండో ముద్రణగా రాబోతోంది. ఇక
మూడో అంశం కుటుంబ చరిత్రలని
వీడియో నిర్మాణాలు చేయడం, కుటుంబ
చరిత్రలని నిర్మించడం గురించి, సామాజిక
చరిత్ర తెలియకపోతే పిల్లలకు ఏమి లోటు
కలుగుతుందో తమ తమ కుటుంబ
చరిత్రలు తెలుసుకోకపోవడం వల్ల కూడా
అలాంటి నష్టమే కలుగుతుంది. నేను మా
అమ్మా బాపుల్లో మా అబ్బాయి చేత రెండు
గంటల వీడియో ఇంటర్వ్యూ చేయించి
బంధువులకు, స్నేహితులకు ఇచ్చాను.
కూలంకషంగా ఇంటర్వ్యూ చేయించి
భ్రదపరిచాను, తరువాతి తరాలు ఆ కృషిని
కొనసాగించాలనే సంకల్పంతో.
వచనంలో భాష వాహకం అవుతుందా?
అదే సాహిత్యం అవుతుందా?
మొత్తం తెలంగాణ సాహిత్యాన్నంతా ఇవాళ్టి
పిల్లలకు అర్థమయ్యే తెలుగులో తిరగ
రాయించి అచ్చు వేయాలని నాకు
అనిపిస్తూ ఉంది. ప్రతీ తరానికి భాషలో
కొంత మార్పు వస్తుంది. పుస్తకాలు
పునర్ముద్రణ చేయబోయే ముందు ప్రతీ
ఇరవై అయిదు సంవత్సరాలకు ఒకసారి
పాత సాహిత్యాన్ని సమకాలీన భాషలోకి
తిరగరాసి అచ్చు వేయాలి.
రఘోత్తమ రెడ్డి
ఫోన్ : 9346263210
====
మనో గీతికలు
ఎన్నాళ్ళని..
నేనిప్పుడు జీవితాన్ని
ఆసాంతం అవలోకనం చేస్తూ
ఆమూలాగ్రంగా
అధ్యయనం చేస్తున్నాను
అక్షరానుక్రమణంలో
అనుశీలనా దృష్టితో
పరిశీలిస్తున్నాను
నడచివచ్చిన బాటంతా
నాణ్యమైనదేనని
అంగీకరించకపోయినా
నగుబాట్లపాల్జేసే రీతిగా లేదని మాత్రం
కరాఖండీగా చెప్పగలను
ఏ దిశను చూసినా
దశమారని జీవితాలు
ఎప్పుడు చెవులు రిక్కించినా
పునరంకితవౌదామన్నా
పునరుక్తి సంభాషణలు
చెవిదగ్గరగా హోరుపెడుతూ..
ఆప్యాయతానురాగాలకు
అవధుల్లేని అడ్డంకులు
ప్రేమాభిమానాలకూ
పొసగని రీతిలో వెలువడే
కీలకమా సంకేతాలు
అన్నీ మనీ చుట్టూ పరిభ్రమిస్తూ
మానవత్వానే్న
మకిలబరుస్తున్న దాఖలాలు
ఎన్నాళ్ళని ఈ ఒంటరి ప్రయాణాలు!
ఎడతెగని పోరాటాలు?
ఏ వొరలోనూ
ఒదగడానికిష్టపడని
వైయక్తికమైన
ద్వేష వైషమ్యాల చురకత్తులు
- రావెల పురుషోత్తమరావు
గుంటూరు
ఫోన్: 9394100531
నరకం చివర్లకు..
ధరాఘాతం శరాఘాతంలా తగిలి
రెక్కలు తెగిన గువ్వలా కుదేలయ్యాడు
నిత్యావసరాల నిప్పుల్లో మండుతున్నాడు
పండుగకి పబ్బానికి పచ్చడి మెతుకులతో
కడుపుకి శాంతి చేస్తున్నాడు
సంసార బండిని ఈదినా, లాగినా
ఎగేసి దిగ్గొట్టినా అదే జీతం రాళ్ళు..
ఫీజులు.. అద్దెరాళ్ళు ఎగిరెగిరి
మాడు పగులకొడుతున్నాయ్
క్షణక్షణం ఉరుకులు, పరుగులు
గాయాలు, మాయని మచ్చలు
మనసుని గిచ్చుతున్నాయ్
ఇంకా పరుగుపెట్టమని!
రోజు గడవాలంటే
నరకం చివర్లకు వెళ్ళిరాక తప్పట్లేదు
చస్తూ బతుకుతూ.. బతుకుతూ చస్తూ
రోజుకో జీవిత పాఠం జేబులో జమ!
మాటల మూటలతో కడుపు
నింపుకోవడమే
మార్కెట్లో రూపాయికి అరటి పండు
దొరకదు
ఆఫర్‌లో సింకార్డు తప్ప!
జీతం, జీవితం అతుకుల
బొంతలవుతున్నాయ్
ధరలు, అన్ని బిల్లులపై సర్‌చార్జీలు
కొంపలు ముంచేస్తున్నాయ్
మధ్యతరగతి మనుషులను
లాగి తంతున్నాయ్!
ముప్ఫైకే ముసలై
రోగాలు, రొస్టులు, బీపి, షుగర్,
ఒత్తిళ్లు జీవితాలను చిత్తడి చేసి
చోద్యం చూస్తున్నాయ్!
ఎక్కడికీ ప్రస్థానం అంటే
బుర్రగోక్కుంటూ జవాబు దొరక్క
డామిట్! రోజులు మారిపోయాయ్..
మనసుని సమాధానపరచుకుని
సాగిపోతున్నాడు సామాన్యుడు!
- అమూల్య తెర్లి
విజయవాడ
ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు
ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల
సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది
చిరునామాకు పంపండి. కార్టూన్లు
పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో
ఈ -మెయిల్ అడ్రస్‌కు
పంపించండి.మెరుపు శీర్షికకు.. ఎడిటర్,
ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి-
3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ
- 520 007.
vijmerupu@gmail.com
ఫోన్: 9059824800