కరీంనగర్ , జూన్ 21: చదువు ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని, ప్రతి ఒక్కరు చదువుకునే విధంగా చైతన్యపర్చడానికి జమాఅతె ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ఈ నెల 22నుంచి 29వ తేదీ వరకు విద్యా జాగృతి ఉద్యమం పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జమాఅతే ఇస్లామి హింద్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హై షోహెబ్ లతీఫ్ తెలిపారు. నగరంలోని ప్రెస్‌భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వారం రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చెప్పారు. 22న నగరంలోని అన్ని మసీద్‌లలో విద్యాప్రాముఖ్యతపై ప్రసంగాలు, 23న నగరంలోని స్లమ్ ఏరియాలో సర్వే నిర్వహించి డ్రాపవుట్, ఆర్థికంగా వెనుకబడిన పిల్లలను గుర్తించడం జరుగుతుందని, 24న టీచర్స్ మీట్ ఏర్పాటు, 25నుంచి 27వరకు పేద, డ్రాప్‌వుట్ పిల్లలకు పాఠశాలలో చేర్పించి వారికి ఉచితంగా నోట్‌బుక్స్, కంపాక్స్ బాక్స్‌లను అందించడం, 28న పాఠశాల, కళాశాల విద్యార్థులను ఉచితంగా ఆన్‌లైన్ ద్వారా స్కాలర్‌షిప్‌ల ధరఖాస్తులు పంపించడం, చివరి రోజు 29న చదువుతోనే ఉజ్వల భవిష్యత్తుకు భరోసా అనే నినాదంతో నగర వీధుల్లో మహార్యాలీ నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాల్లో జమాఅతె ఇస్లామి హింద్ సభ్యులు, కార్యకర్తలు, మహిళా విభాగం సభ్యు లు, ఎస్‌ఐఓ, జిఐఓ కార్యకర్తలు పాల్గొంటారని లతీఫ్ తెలిపారు. ఈ సమావేశంలో ఆ సంస్థ నాయకులు మహమ్మద్ ఖైరొద్దిన్, నయిమొద్దిన్, మహెమూద్ అలీ సాబీర్, మునీర్ అహ్మద్, అబ్దుల్ సుఖ్‌దేవ్, సయ్యద్ అప్జల్, అబ్దుల్ రహీం, జహిరొద్దిన్ తదితరులు పాల్గొన్నారు.
అధికారులు బాధ్యతతో పనిచేయాలి
* విప్ ఆరెపల్లి మోహన్
మానకొండూర్, జూన్ 21: ప్రజా సమస్యల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండి సకాలంలో స్పందించి బా ధ్యతగా పనిచేయాలని, ప్రస్తుత వర్షాకాలంలో ప్రజారో గ్యం పట్ల అధికారులు, సిబ్బంది జాగ్రత్తలు తీసుకొని పనిచేయాలని, బాధ్యతారాహిత్యంగా పనిచేసే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో విప్ మాట్లాడారు. పంచాయితీలలో సర్పంచ్‌ల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో గ్రామ పంచాయితీలకు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని, చాలా గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్‌లు సక్రమంగా పనిచేయడం లేదన్న ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు. స్పెషల్ ఆఫీసర్‌ల పనితీరు బాగా లేకుంటే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే అలాంటి అధికారులను సస్పెండ్ చేస్తామని విప్ హెచ్చరించారు. అధికారులు, సిబ్బంది పనితీరును తెలుసుకునేందుకు ఇక నుండి గ్రామాల్లో పర్యటించి ఆకస్మిక తనిఖీలు చేయనున్నట్లు చెప్పారు. వర్షాకాలంలో గ్రామాల్లో సానిటేషన్‌పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. మురికి కాలువలు సకాలంలో శుభ్రం చేయకుంటే దోమల కారణంగా ప్రజలకు వ్యాధులు ప్రబ లే ప్రమాదం ఉందని, గ్రామాల్లో పనిచేసే పంచాయితీ కార్యదర్శులు, వైద్య సిబ్బందిని కలుపుకుని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజారోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మురుగు కాలువలు శుభ్రం చేయడం, శుభ్రమైన తాగునీరు అందించడం, విద్యుత్ సరఫరాపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో శుద్ధి నీరందించాలన్నారు.
మహికో మాయాజాలం..!
కరీంనగర్, జూన్ 21: విత్తనాల కోసం రైతులు కుస్తీపట్లు పడుతుంటే అధికారులు డీలర్లతో కుమ్మక్కై రైతన్నలను దగా చేస్తున్నారు. మైకో ఉత్పత్తి చేసిన బోల్‌గార్డ్ (బిజి-2) రకం విత్తనాలను బోగస్ రైతుల పేరుతో నకిలీ పర్మిట్లను సృష్టించి దొడ్డిదారిన బ్లాక్ మార్కెట్‌కు తరలించి రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో అత్యంత పకడ్బంధీగా సాగుతున్న ఈ వ్యవహారంలో వ్యవసాయశాఖ అధికారులు, డీలర్ల పాత్రపై రైతులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో గత వారం రోజులుగా జరుగుతున్న మైకో విత్తనాల పంపిణీ ప్రక్రియను పరిశీలిస్తే..అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కంపెనీ విత్తనాలకు భారీ డిమాండ్ ఏర్పడడంతో లాటరీ పద్ధతిపై విత్తనాలను సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ మేర కు మండల, గ్రామస్థాయిల్లో టీములను ఏర్పాటు చేశా రు. అలాగే లాటరీ పద్ధతిపై జారీ చేసే పర్మిట్లలో 50 శా తం ఎస్సీ, ఎస్టీ రైతులకుఅందజేయాలని నిర్ణయించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. జిల్లాకు మొత్తం 72 వేల ప్యాకెట్ల మైకో విత్తన ప్యాకెట్లు సరఫరా కావాల్సి ఉండగా, 52 వేల ప్యాకెట్లు మినహా ఒక్క ప్యాకెట్ కూడా అదనంగా ఇచ్చేది లేదని కంపెనీ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో జిల్లాకు 52 వేల ప్యాకెట్ల విత్తనాలు సరఫరా జరిగినట్లు అధికారులు ప్రకటించారు. కానీ వాస్తవానికి 42 వేల నుంచి 45 వేల ప్యాకెట్లు మాత్రమే సరఫరా చేసినట్లు తెలుస్తోంది. మిగతా ప్యాకెట్లను నేరుగా డీలర్లకే సరఫరా చేసినట్లు అనుమానిస్తున్నారు. ఇందుకు గాను అధికారులకు 20 లక్షల రూపాయల మేర ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి రెండువేల ప్యాకెట్ల విత్తనాలను బ్లాక్ మార్కెట్ చేస్తే 20 లక్షల రూపాయల లాభం చేకూరుతుందని డీలర్లు చెబుతుండడం ఈ సందర్భంగా ప్రస్థావనార్హం. జిల్లాకు కేటాయించిన విత్తన ప్యాకెట్ల నుంచి మిగిలిన 40 వేల ప్యాకెట్లను గ్రామాల వారీగా పంపిణీ చేయాల్సి ఉంది. కానీ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపిలు తమ అనుచరులకు విత్తన ప్యాకెట్లు సమకూర్చేందుకు అధికారులపై ఒత్తిడి తేవడంతో ప్రత్యేకంగా లాటరీ నుంచి ఐదు వేల ప్యాకెట్లను మినహాయించి, ఒక్కో ఎమ్మెల్యేకు 200 ప్యాకెట్లు, ఎంపిలకు 300 ప్యాకెట్ల చొప్పున పర్మిట్‌లు ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరే కాకుండా జిల్లాలోని వివిధ డివిజన్లకు చెందిన రాజకీయ ప్రముఖులు, అధికారుల బంధువులకు కూడా ప్రత్యేకంగా పర్మిట్ల రూపంలో విత్తనాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సరిగ్గా ఇక్కడే బ్లాక్ మార్కెటింగ్‌కు తెరలేచినట్లు భావిస్తున్నారు. అసలు వ్యవసాయ భూములే లేని వ్యక్తుల పేరుపై పర్మిట్లు సృష్టించి విత్తన ప్యాకెట్లను జారీ చేస్తున్నారు. ఫలితంగా 930 రూపాయలకు విక్రయించాల్సిన ప్యాకెట్లను సదరు నకిలీ రైతులు బ్లాక్ మార్కెట్‌లో 1800 నుంచి 2000 రూపాయల మొత్తానికి విక్రయిస్తున్నారు. ఇవన్నీ కూడా నగరంలోని ఒకే విత్తన దుకాణానికి కేటాయించడంతో ఈ విషయం బహిర్గతమైంది. ఇదిలా ఉంటే కరీంనగర్ జిల్లాలో ప్రధానంగా మైకో కంపెనీ ఉత్పత్తి చేసిన మూడు రకాల పత్తి వెరైటీలలో నీరజ, డాక్టర్ బ్రెంట్, కనక్‌లకు భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే అధికారులు లక్కీ డ్రాలో ఎంపికైన రైతులకు కేవలం ఒకే రకం విత్తనాలను అంటగడుతున్నట్లు చెబుతున్నారు. డిమాండ్ ఉన్న వెరైటీకి బదులు రైతులు రెండవ ప్రాధాన్యతగా భావిస్తున్న నీరజ ప్యాకెట్లను ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే విత్తన పంపిణీ ప్రక్రియలో చోటు చేసుకుంటున్న అక్రమాలు బట్టబయలయ్యే అవకాశముంది.
చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
కరీంనగర్ టౌన్, జూన్ 21: చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని మానకొండూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ క్రీడాకారులకు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక అంబేద్కర్ స్టేడియంలో ఎంటిఎస్ మోబైల్ సంస్థ సహకారంతో ఒలింపిక్ అసోసియేషన్, క్రీడాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలంపిక్ డే రన్‌ను ఆరెపల్లి మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులు ఒలంపిక్ స్థాయికి ఎదగాలని కోరారు. ఒలంపిక్స్ స్ఫూర్తితో క్రీడాకారులు రాణించాలని అన్నారు. వందల యేళ్ల నాటి క్రీడా స్ఫూర్తి నేటికి కొనసాగుతుందని తెలిపారు. ప్రతియేటా రాష్ట్ర హెడ్‌క్వార్టర్స్‌లో 23వ తేదీన ఒలంపిక్ డే రన్ జరుగుతుండగా, జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో 21,22 తేదీలలో నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే ఈ రన్‌ను నిర్వహించారు. ఈ రన్ అంబేద్కర్ స్టేడియంలో ప్రారంభమై వెంకటేశ్వర దేవాలయం, ఎస్పీ కార్యాలయ కెప్టెన్ రఘునందన్‌రావు చౌరస్తా, తెలంగాణ చౌక్, బస్టాండ్ మీదుగా తిరిగి స్టేడియంకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో కెడిసిసి బ్యాంక్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు, జిల్లా క్రీ డల అభివృద్ధి అధికారి వెంకటరమణ, ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మొగిలయ్య, మహిపా ల్, అర్జున్ అవార్డు గ్రహీత శ్రీనివాసరావు, క్రీడా సంఘాల కార్యదర్శులు ఆనంద్, సిద్దారెడ్డి, సుకుమార్‌రావు, శంకర్, గోవిందరావు, ఎంటిఎస్ మోబైల్ కంపెనీ హెడ్ అను, ఏరియా మేనేజర్ శ్రీనివాస్, ప్రణీత్, వెంకట్‌లతోపాటు వివిధ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
జయశంకర్ ఆశయసాధనకు కృషి
కరీంనగర్ , జూన్ 21: తెలంగాణా సిద్దాంతకర్త, తుదిశ్వాస వరకు తెలంగాణా కోసం మడమ తిప్పని పోరాటం చేసిన ఆచార్య జయశంకర్ ఆశయసాధనకు సమైక్యంగా పోరాటం చేయాలని గురువారం జరిగిన ఆచార్య జయశంకర్ ప్రథమ వర్థంతిని పురస్కరించుకుని తెలంగాణా జాగృతి కన్వీనర్ కల్వ కుంట్ల కవిత పిలుపునిచ్చారు. జయశంకర్ ప్రథమ వర్థంతిని పురస్కరించుకుని నగరంలోని మదీనాకాంప్లెక్ వద్ద గల జయశంకర్ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి ఆమె జిల్లా తెలంగాణా జాగృతిసంస్థ సంస్థ నిర్వాహకులు పేదలకు ఎర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొని, వంటకాలను వడ్డించారు. పెద్దసార్ ఆశయాలను ఊరూరా ప్రచారం చేయాల్సి వుందని, పేదలకు, నిర్భాగ్యులకు సత్ఫలితాలు చేకూరే వరకు ఈ పోరాటం ఆపరాదని ఆమె అన్నారు. తెలంగాణా కోసం అందరూ కలిసి పోరాడవలసి వుందని, తెలంగాణా ద్రోహులను ఏరి వేయాల్సి వుందని ఆమె ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. తెలంగాణా సాధనే అదే పెద్దసార్‌కు ఇచ్చే నిజమైన నివాళియని అన్నారు. ఆచార్య జయశంకర్ విగ్రహానికి నివాళులర్పించిన వారిలో తెలంగాణా జాగృతి జిల్లాశాఖ అధ్యక్షుడు తిరుపతిరావు, జిల్లా స్వాతంత్య్రసమరయోధుల సంఘం నేత డా.బోయినపల్లి వేంకటరామారావు, జెఎసి చైర్మన్ వేంకటమల్లయ్య, తెలంగాణా జాగృతి కార్యకర్తలు అనంతరావు తదితరులు పాల్గొన్నారు. జయశంకర్‌కు టిఎన్‌జీవోల నివాళి
తెలంగాణాస రాష్ట్ర ఏర్పాటుకై ఆచార్యుడు వెలిగించిన స్ఫూర్తి ఇప్పటికి ఉద్యమ శ్రేణులకు మార్గనిర్దేశం చేస్తోందని, ఆ వెలుగుబాటలోని ఉద్యోగులందరూ పయనించి తెలంగాణా రాష్ట్ర ఎర్పాటుకై నిరంతరం పోరాటం చేయాలని, రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థలు జయశంకరుడి మార్గదర్శకాలను మననం చేసుకోవాల్సిన అవసరం వుందని టిఎన్జీవోల సంఘంలో జరిగిన ప్రథమ వర్థంతి వేడుకలలో పాల్గొన్న అథ్యక్ష, కార్యదర్శులు ఎంఎ.హమీద్, ఎన్.నరసింహస్వామిలు అన్నారు. సంఘకార్యాలయంలో జరిగిన నివాళి సభలో పాల్గొన్న వక్తలు జయశంకర్ ఆశయాలను సాధించాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో టిఎన్‌జీవోల నాయకులు గాజుల నర్సయ్య, సుద్దాల రాజయ్యగౌడ్, ఎస్.లక్ష్మణరావు, వి.మాదయ్య, ఎస్.లక్ష్మీ, ముత్తోజి శ్రీ్ధర్, స్వర్ణలత, ఎన్.సుధీర్, కాళీచరణ్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
టిఆర్‌ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో..
తెలంగాణా రాష్ట్ర సమితి యువజన విభాగం ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్‌కు ప్రథాన కార్యదర్శి పెండ్యాల మహేశ్‌కుమార్‌తోపాటు, నాయకులు ప్యాట సురేష్, చెరకుబండి రవి, సూర్య, నరేష్ తదితరులు నివాళులర్పించారు. తెలంగాణా విద్యార్థి కార్యాచరణ కమేటి ఆధ్వర్యంలో చైర్మన్ జక్కనపల్లి గణేశ్, జిల్లా నాయకులు కొంకటి శేఖర్, జిల్లా అధికార ప్రతినిధి రామగిరి సంతోష్, బిజిగిరి నవీన్, కె.ప్రవీణ్, కె.హరీష్ తదితరులు నివాళులర్పించారు.
ముమ్మరంగా ఆర్టీఎ తనిఖీలు
కరీంనగర్ , జూన్ 21: హైదరాబాద్‌లోని ఓ ప్రై వేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఇటీవలే మహారాష్టల్రో కాలువలోపడిపోయిన ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ముప్పై మంది యాత్రికులు మృతి చెందిన సంఘటన దరిమిలా రాష్ట్ర ప్రభుత్వం సదరు ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణించి ఫిట్‌నెస్ లేని వాహనాలపై దృష్టి సారించాల ని రవాణా శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కరీంనగర్ ప్రాంతీయ రవాణా శాఖ అధికారు లు తనిఖీలను ముమ్మరం చేశారు. జిల్లాలో రెండుమూ డు రోజులుగా జరుపుతు న్న తనిఖీల్లో సుమారు 89 వాహనాలను సీజ్ చేసిన రవాణా శాఖ అధికారులు తా జాగా గురువారం జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లోని కోర్టు సమీపంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నిబంధనలను అతిక్రమించి ఫిట్‌నెస్ లేకుండా తిరుగుతున్న వివిధ పాఠశాలలకు చెందిన 19 బస్సులను సీజ్ చేశారు. సీజ్ చేసిన వాహనాలను కలెక్టరేట్‌లోని రవాణా శాఖ కా ర్యాలయానికి అధికారులు తరలించారు. కరీంనగర్ ఉప రవాణాధికారి ప్రభురాజ్‌కుమార్ ఆధ్వర్యంలో ఎంవీఐ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. మొత్తం మీద రవాణాశాఖ అధికారులు తనిఖీలను ముమ్మరం చేయడంతో నిబంధనలను అతిక్రమించి, ఫిట్‌నెస్ లేకుండా నడుపుతున్న స్కూల్స్, కళాశాలలు, ఇతర ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు చూసిచూడనట్టుగా వ్యవహరించిన ఆర్టీఏ అధికారులు కొరఢా ఝులిపిస్తుండటంతో వాహనాల ఫిట్‌నెస్ చేయించుకునేందుకు స్కూల్స్, కళాశాలలు, ట్రావెల్స్ యజమానులు సిద్ధమవుతున్నారు.