Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

దర్యాప్తులో మరింత సమాచారం ఇవ్వండి

$
0
0

* మద్యం వ్యాపారులకు మళ్లీ ఎసిబి నోటీసు
మహబూబాబాద్, జూన్ 21: మద్యం వ్యాపారులకు అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు గురువారం మరో నోటీసు జారీచేశారు. తమ దర్యాప్తులో మరింత సమాచారం అందచేయాలని ఆ నోటీసుల్లో కోరారు. ఈ నెలాఖరుతో ముగుస్తున్న ఎక్సైజ్ సంవత్సరం ఆరంభంలో మద్యం దుకాణాలకు టెండర్లు దాఖలు చేసిన సర్ట్ఫికెట్లన్నింటినీ తమకు అందచేయాలని అధికారులు ఆ నోటీసుల్లో మద్యం వ్యాపారులకు సూచించారు. మద్యం షాపు ఖరారు అయినపుడు చెల్లించిన మూడోవంతు లైసెన్సు ఫీజు వివరాలు, బ్యాంకు అక్కౌంట్ల సమాచారాన్ని తమ వివరాల్లో పొందుపరచాలని కోరారు. మద్యం వ్యాపారికి ఉన్న ఆస్తుల సమాచారంతోపాటు సొంత ఇల్లు కలిగినా.. లేక అద్దె ఇల్లు ఉన్నా వాటి ఫొటోలు కూడా జత చేయాలని ఆదేశించారు. అదే విధంగా మద్యం దుకాణం లైసెన్సు పొందినపుడు చూపించిన ఆస్తుల మొత్తం విలువను మరోమారు తెలియచేయాలని.. కుటుంబీకుల ఎవరెవరి ఆస్తులను అందులో చూపించారోతెలియచేయాలని ఆదేశించారు. బినామీ పేర్లతో మద్యం దుకాణాలను సొంతం చేసుకున్నారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో..ఎసిబి అధికారులు లోతైన విచారణ నిర్వహించేందుకే మద్యం వ్యాపారులకు నోటీసులు జారీచేశారని తెలుస్తోంది. లైసెన్సు పొందే తరుణంలో ఆస్తుల వివరాలను తప్పుగా చూపించారని.. ఆడిట్ రిపోర్టులతోపాటు చార్టెడ్ అక్కౌంట్ వివరాలను కూడ తప్పుగా నమోదు చేయించారనే అనుమానం ఎసిబి అధికారులకు వస్తున్నట్లు తెలుస్తోంది. తెలుపురంగు రేషన్‌కార్డులు కలిగిన బినామీ వ్యక్తుల పేరిట మద్యం వ్యాపారులు టెండర్లలో ధరలను ‘కోట్’చేసి వాటిని దక్కించుకున్నారని ఇటీవలి విచారణల్లో వెలుగుచూసింది. ఈ క్రమంలో మద్యం వ్యాపారుల ఆస్తుల వివరాలు వెలికితీస్తే వారి వ్యవహారం మొత్తం బయటపడుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అన్ని వివరాలు అందచేయాలని మళ్లీ నోటీసులు జారీచేసినట్లు తెలుస్తోంది.

ఒకేరోజు రెండు లక్షల మొక్కలు
కలెక్టర్ రాహుల్ బొజ్జా
వరంగల్, జూన్ 21: జిల్లాలో ఒకేరోజు విద్యార్థులచే రెండులక్షల మొక్కలు నాటించనున్నామని కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ స్వచ్చంద సంస్థ, జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ స్వచ్చంద సంస్థ, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రతి ఒక్కరికి ఐదు చెట్లను ఇస్తామని, అందులో మూడు పండ్ల చెట్లు, రెండు నీడను ఇచ్చే వృక్షాలు ఉంటాయని తెలిపారు. వీటిని నాటి సంరక్షించే బాధ్యత విద్యార్థులు తీసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంపైన ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పించడానికి డివిజన్‌స్థాయిలో అవగాహన సదస్సులను నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లా అటవీ, ఉపాధిహామీ పథకం, పంచాయితీరాజ్ శాఖల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ తరపున హాజరైన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి బాబురెడ్డి మాట్లాడుతూ 2011 సంవత్సరంలో రాష్టవ్య్రాప్తంగా కోటి మొక్కలను నాటి సంరక్షించాలని సంకల్పించినట్లు తెలిపారు. ఇంతవరకు ఐదులక్షల మొక్కలను పాఠశాల విద్యార్థులచే నాటించి, సంరక్షిస్తున్నామని అన్నారు. విద్యార్థులు 80శాతం మొక్కలను సంరక్షించారని చెప్పారు. మెదక్, నల్గొండ జిల్లాలలో జిల్లా యంత్రాంగం సహకారంతో ఒకేరోజు 10లక్షల మొక్కలను నాటడానికి ప్రణాళిక రూపొందించామని తెలిపారు. మెదక్ జిల్లాలోని పరిశ్రమలు మొక్కలను స్పాన్సర్ చేశాయని చెప్పారు. మొక్కలు నాటి సంరక్షించడం వలన విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన ఏర్పడుతుందని అన్నారు. త్వరలోనే కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ బి.సంజీవయ్య, జిల్లా పంచాయితీరాజ్ అధికారిణి పద్మజారాణి, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ ఆంజనేయులు, సిపిఓ నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

‘కపాలిని’గా భద్రకాళి
వరంగల్ బల్దియా, జూన్ 21: వరంగల్ నగర ప్రజల కొంగుబంగారమై విలాసిల్లుతున్న శ్రీ భద్రకాళీ దేవస్థానంలో భద్రకాళీ అమ్మవారి శాకాంబరీ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. గురువారం భద్రకాళీ అమ్మవారు ‘కపాలని’ క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధానార్చాకులు భద్రకాళీ శేషు ఆధ్వర్యంలో భద్రకాళీ అమ్మవారికి నిత్యాహ్నికం, వేదపారాయణం, జపములు, చండీహోమాలు నిర్వహించారు. అనంతరం పలు కూరగాయలు వంకాయ, బెండకాయ, పాలకూరలతో అలంకరించారు. శాకాంభరి నవరాత్రుల మహోత్సవాలు ఆషాడ శుద్ద విదియ రోజున మండల దేవతారాదనలో భాగంగా భద్రకాళీ అమ్మవారిని కపాలిని క్రమంలో అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కొబ్బరి, కుంకుమ, పసుపు సమర్పించుకుని తమ కుటుంబాలను చల్లగా చూడాలని వేడుకున్నారు. ప్రతి ఏడాది అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్న శాకాంభరి వేడుకలను కన్నుల పండువగా నిర్వహిస్తున్నామని ఆలయ ఇఓ కట్టా అంజనీదేవి తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ సిహెచ్.జయశంకర్, విజయ్‌కుమార్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

భవిష్యత్తులో కాంగ్రెస్‌తో
టిఆర్‌ఎస్, టిడిపి కుమ్మక్కు
* బిజెపి ఉద్యమ కమిటీ కన్వీనర్ రాజేశ్వర్‌రావు
హన్మకొండ, జూన్ 21: భవిష్యత్తులో కాంగ్రెస్‌తో కుమ్మక్కు కావడానికి టిఆర్‌ఎస్, టిడిపి ఇప్పటినుండే ప్రయత్నాలు మొదలుపెట్టాయని బిజెపి తెలంగాణ ఉద్యమ కమిటీ కన్వీనర్ డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు అన్నారు. గురువారం హన్మకొండ ఎన్‌జివోస్ కాలనీలోని బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరకాల ఉపఎన్నికలో గెలిస్తే మూడు మాసాల్లో తెలంగాణ వస్తుందని చెప్పిన టిఆర్‌ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తెచ్చి తెలంగాణ సాదిస్తారో తెలియచేయాలని డిమాండ్ చేసారు. టిఆర్‌ఎస్ గెలిచిన శాసనసభ స్థానాల్లో అభివృద్ధి చేస్తామని ప్రకటించడం ప్రభుత్వంతో కుమ్మక్కు అయినట్లేనని విమర్శించారు. అభివృద్ధికి బిజెపి అడ్డుకాదని.. అభివృద్ధి పేరుతో తెలంగాణ అంశాన్ని పక్కనపెడితే సహించేదిలేదని హెచ్చరించారు. టిఆర్‌ఎస్ ఉపఎన్నిక మైకంనుండి ఇంకా తేరుకోలదని పరకాల విజయోత్సవ సభలో ఆపార్టీ ఎల్పీనేత ఈటెల రాజేందర్ బిజెపిని టార్గెట్ చేసి మాట్లాడడం బాదాకరమని అన్నారు. చావుతప్పి కళ్లు లొట్టబోయినట్లు 1400 ఓట్లతో టిఆర్‌ఎస్ గెలిచిందని ఎద్దేవ చేశారు. టిఆర్‌ఎస్, కారు గుర్తును పోలిన ఆటో, టోపితోపాటు తెలంగాణవాదం పేరుతో బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి నళినికి వచ్చిన మొత్తం ఓట్లు 68వేలని అన్నారు. సమైక్యవాద పార్టీలు వైఎస్సార్ సిపి, టిడిపి, కాంగ్రెస్‌లకు 85వేల ఓట్లు పడ్డాయని, పోలైన ఓట్లలో టిఆర్‌ఎస్‌కు 50శాతం పడతాయని ఆపార్టీ శాసనసభ ఉపనేత హరీశ్‌రావు చెప్పిన మాటలపై స్పందించాలని డిమాండ్ చేసారు. ఆయన చెప్పిన లెక్కల ప్రకారం 75వేల ఓట్లు టిఆర్‌ఎస్‌కు రావలిసి ఉండగా 50వేల ఓట్లు మాత్రమే వచ్చాయని విమర్శించారు. టిఆర్‌ఎస్ గెలుపును హర్షించిన బిజెపిపై విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

ఎరువుల దుకాణాలపై దాడులు
వరంగల్, జూన్ 21: జిల్లాలోని ఎరువులు, విత్తన దుకాణాలపై వ్యవసాయశాఖ, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు గురువారం రాత్రి దాడులు నిర్వహించారు. కలెక్టర్ రాహుల్ బొజ్జా ఆదేశానుసారం జిల్లాలోని ఎరువులు, విత్తన డీలర్లు ఎరువులను, పత్తి విత్తనాలను బ్లాక్ చేసి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించారు. వరంగల్ స్టేషన్‌రోడ్‌లోని ఎరువులు, విత్తనాల షాపులను వ్యవసాయశాఖ, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు ఐదు బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించారు. వ్యవసాయశాఖ జెడి నాగేశ్వర్‌రావు, ఎడి నర్సింహదాస్, ఎఓ ఆదిరెడ్డి, వరంగల్, హన్మకొండ తహశీల్దార్ సంజీవ, సలీమోద్దీన్, వరంగల్ డిఎస్పీ లావణ్యనాయక్, ఇంతెజార్‌గంజ్ సిఐ సత్యనారాయణ, ప్రభాకర్‌రావు, ఎస్సైలు శ్రీనివాస్ ఈ దాడులు నిర్వహించారు. పత్తి విత్తనాలను రైతులకు సక్రంగా పంపిణీ చేస్తున్నారా లేదా వివరాలను రిజిష్టర్‌లో పరిశీలించారు. శాయంపేటలో వ్యవసాయశాఖ అధికారులు దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో బ్లాక్ చేసి విక్రయిస్తున్న 15 పత్తి విత్తన ప్యాకేట్లను స్వాధీనం చేసుకున్నారు.
మానుకోటలో...
మహబూబాబాద్ పట్టణంలోని విత్తనాలు, ఎరువుల అమ్మకపు దుకాణాలపై గురువారం రాత్రి 9.30గంటల వ్యవసాయశాఖ అధికారులు దాడులు చేశారు. కురవి మండలంలో పత్తి విత్తనాలను బ్లాక్ చేసిన వ్యవహారం వెలుగుచూసిన క్రమంలో ఈ దాడులు నిర్వహించారు. దుకాణాల వారిగా కేటాయించిన విత్తన ప్యాకేట్లను రైతులకు సక్రమంగా విక్రయించారా లేదా అనే వివరాలను స్టాక్ రిజిష్టర్‌లో పరిశీలించారు. అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి మానుకోట పట్టణంలోని కొత్తబజార్, పాతబజార్‌లలో ఉన్న విత్తనాల దుకాణాల అన్నింటిని తనిఖీ చేశారు.

జయశంకర్‌కు ఘన నివాళి
వృద్ధులకు దుప్పట్ల పంపిణీ * కొవ్వొత్తుల ర్యాలీ
హన్మకొండ, జూన్ 21: తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశకంర్ ప్రథమ వర్థంతి వేడుకలు నగరంలో కనులపండువలా జరిగాయి. టిఆర్‌ఎస్, తెలంగాణ రాజకీయ జెఎసిల ఆధ్వర్యంలో ఎకశిలాపార్కు, హన్మకొండ చౌరస్తాలో ఈ వర్థంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ పొలిటికట్ జెఎసి పిలుపుమేరకు ఉదయం 8గంటలకు టిఆర్‌ఎస్ అర్బన్ కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండ ఏకశిలాపార్కులోని జయశంకర్ స్మృతివనంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ, వివిధ జెఎసిల నాయకులు, కార్యకర్తలు భారీసంఖ్యలో హజరయ్యారు. టిఆర్‌ఎస్ అర్బన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దాస్యం వినయ్‌బాస్కర్, స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల ఎమ్మెల్యేలు డాక్టర్ తాటికొండ రాజయ్య, మొలుగూరి భిక్షపతి, జిల్లా అధ్యక్షుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎంపి వినోద్‌కుమార్, టిజిఎ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, జెఎసి జిల్లా అధ్యక్షుడు ప్రొఫెసర్ పాపిరెడ్డి, న్యాయవాదుల జెఎసి నాయకులు గుడిమళ్ల రవికుమార్, రాజేంద్రకుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు జయశంకర్ విగ్రహానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జయశంకర్‌ను కొనియాడుతూ నాయకులు ప్రసంగించారు. అనంతరం వరంగల్ హంటర్‌రోడ్డులోని ఏకశిలా వృద్ధాప్య అనాథ ఆశ్రమంలో జయశంకర్ వర్థంతిని పురస్కరించుకుని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ వృద్ధులకు దుప్పట్లు, చీరెలు పంపిణీ చేసారు. జయశంకర్ వర్థంతిని పురస్కరించుకుని రాత్రి ఏడుగంటలకు తెలంగాణవాదులు హన్మకొండ చౌరస్తాలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ వేయిస్తంభాల దేవాలయంనుండి హన్మకొండ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో తెలంగాణవాదులు నయిమొద్దీన్, చీకటి రాజు, ఎక్బాల్ అహ్మద్, మందాటి కిషన్ తదితరులు పాల్గొన్నారు.

తెరపైకి మళ్లీ వీణవాణిల సర్జరీ
మధ్యప్రదేశ్ అవిభక్త కవలల ఆపరేషన్ సక్సెస్‌తో చిగురించిన ఆశలు * నిలోఫర్ వైద్యులను అడుగుతానంటున్న తండ్రి
మహబూబాబాద్, జూన్ 21: తలలు అతుక్కుపోయి జన్మించిన అవిభక్త కవలలు వీణవాణిల ఉదంతం మరోమారు తెరపైకి వస్తోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పదార్ జిల్లాలో గుండె, కాలేయం అతుక్కుపోయి జన్మించిన యేడాది వయసున్న అవిభక్త కవలలు స్థుతి, ఆరాధనలను బుధవారం వైద్యులు విజయవంతమైన ఆపరేషన్‌తో వేరుచేసిన ఉదంతంతో..వీణవాణిల ఆపరేషన్‌పై వారి కుటుంబంలో ఆశలు చిగురిస్తున్నాయి. వీణవాణిల శస్తచ్రికిత్సపై మరోమారు ఆలోచన చేయాలని నీలోఫర్ వైద్యులను కోరతానని వీరి తండ్రి మురళి గురువారం రాత్రి ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ చెప్పారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ డివిజన్‌లోని నర్సింహులపేట మండలం బీరిశెట్టిగూడెంకు చెందిన అవిభక్త కవలలు వీణవాణిలు ప్రస్తుతం హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రి వైద్యుల సంరక్షణలో ఉన్న సంగతి పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం తొమ్మిదేళ్ల వయసుకు చేరిన వీరు గత ఆరేళ్లుగా నీలోఫర్ ఆసుపత్రిలోనే ఉంటున్నారు. పుట్టుకతోనే తలలు అతుక్కుపోయి వీరిద్దరూ జన్మించారు. ఆపరేషన్ ద్వారా వీరిని వేరు చేయించేందుకు ఎంత ఖర్చయినా భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గుంటూరుకు చెందిన ప్రఖ్యాత శస్తచ్రికిత్స నిపుణుడు నాయుడమ్మతోపాటు సింగపూర్‌కు చెందిన వైద్యులు తొలుత ముందుకొచ్చినా ఎందువల్లనో ఆపరేషన్ చేయడమనేది ఆచరణ సాధ్యంకాలేదు. ఇద్దరు పిల్లల వయసు పెరుగుతున్న క్రమంలో మూడు నెలలకిందట వీరిద్దరి పరిస్థితిపై పునరాలోచన చేయాలని నీలోఫర్ వైద్యులు ప్రభుత్వానికి లేఖ రాయడం..చర్చకు దారి తీసింది. ప్రభుత్వ చొరవతో పరీక్ష చేసిన వైద్యులు.. ఇద్దరుపిల్లల మెదడులో రక్తనాళాలు కలసి ఉండడంతో ఆపరేషన్ చేస్తే ఎవరో ఒకరే జీవించి ఉండే అవకాశముందని, ఈ కారణంగా ఇప్పుడప్పుడే ఆపరేషన్ జరపడం సాధ్యంకాదని తేల్చడంతో వీణవాణిలు మళ్లీ నీలోఫర్ వైద్యుల సంరక్షణలోనే ఉండిపోవలసి వస్తోంది. ఇప్పుడు మధ్యప్రదేశ్ అవిభక్త కవలల ఆపరేషన్ సక్సెస్ కావడంతో వీణవాణిల పరిస్థితిపై చర్చ వస్తోంది. 34మంది వైద్యనిపుణుల ఆధ్వర్యంలో 23మంది డాక్టర్లు 12గంటలపాటు ఏకధాటిగా ఆపరేషన్ చేసి మధ్యప్రదేశ్ కవలలు స్థుతి, ఆరాథనను వేరుచేశారు. మీడియాలో ఈ ఆపరేషన్‌పై వార్తలు రావడంతో తమ పిల్లల గురించి నిలోఫర్ వైద్యులను సంప్రదిస్తానని పిల్లల తండ్రి మురళి చెప్పారు. మరి వైద్యుల స్పందన ఎలా ఉంటుందో తేలాల్సి ఉంది.

విత్తనాలు, ఎరువుల పంపిణీకి పటిష్ట చర్యలు
* అధికారులకు కలెక్టర్ ఆదేశం
వరంగల్, జూన్ 21: జిల్లాలో పత్తి విత్తనాలు, ఎరువులను పంపిణీకి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. గురువారం ఆర్డీఓలు, పోలీసు అధికారులు, వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్‌తో విత్తన సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎరువులు, విత్తనాల పంపిణీ పర్యవేక్షణకు డివిజన్‌స్థాయిలో ఆర్డీఓ ఆధ్వర్యంలో, మండలస్థాయిలో వ్యవసాయశాఖ అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను నియమించామని అన్నారు. రెవెన్యూ, పోలీసు, వ్యవసాయశాఖ అధికారులు సంయుక్తంగా డీలర్ల దుకాణాలను తనిఖీ చేస్తారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు విక్రయించని డీలర్లపై కేసులను నమోదు చేస్తారని అన్నారు. డీలర్ల వద్ద పర్మిట్లను, రైతులకు అమ్మిన రసీదులను తనిఖీ చేస్తారని తెలిపారు. పత్తి విత్తనాలు బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్న డీలర్లపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యవసాయశాఖ కేటాయించిన విధంగానే డీలర్లు రైతులకు పత్తి విత్తనాలను విక్రయించాలని అన్నారు. రైతులు ఒకే కంపెనీ విత్తనాలపై ఆధారపడ వద్దని, అన్ని కంపెనీల విత్తనాలు ఒకే దిగుబడి ఇస్తాయని పరిశోధనలలో తేలిందని చెప్పారు. జిల్లాలో పత్తి విత్తనాలకు సరిపడా ఎరువులు ఉన్నాయని తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. విత్తన సరఫరాను క్రమబద్దీకరించడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
డీలర్ల అక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. ఈ సమావేశంలో వరంగల్ ఆర్డీఓ సర్వే సంగీత, డిఎస్పీ లావణ్యనాయక్, వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

పత్తి విత్తనాలు, ఎరువుల
బ్లాక్‌మార్కెట్‌ను అరికట్టాలి
* ఎపి రైతు సంఘం రాస్తారోకో
వరంగల్, జూన్ 21: జిల్లాలో పత్తి విత్తనాలు, ఎరువుల బ్లాక్‌మార్కెట్‌ను అరికట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఐ అనుబంధ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు గురువారం వరంగల్ హెడ్‌పోస్ట్ఫాస్ సెంటర్‌లో భారీ రాస్తారోకో చేపట్టారు. సుమారు గంటపాటు జరిగిన ఈ రాస్తారోకోతో వరంగల్-ఖమ్మం, వరంగల్-హన్మకొండ ప్రధాన రహదారిలో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి ట్రాఫిక్ స్థంభించిపోయింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయినా కూడా పత్తి విత్తనాలు, ఎరువులు అందించడంలో పూర్తిగా విఫలమయిందని ఆరోపించారు. ఎకరాకు ఒకటే పత్తి విత్తన ప్యాకేట్ పంపిణీ చేయడంతో మూడు, నాలుగు ఎకరాలున్న రైతులు మిగతా పత్తి విత్తనాల కోసం ఏక్కడిపోవాలని ప్రశ్నించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. దాంతో రైతులకు అడిగినన్ని పత్తి విత్తన ప్యాకేట్లను అందించకపోవడంతో బ్లాక్ మార్కెట్‌లో కొనుగోలు చేయవలసిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు పత్తి విత్తనాలను అరకొరగా పంపిణీ చేసి బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యంగా పత్తి విత్తనాలను పర్మిట్ల పేరిట పంపిణీ చేయడంతో వాటికోసం రైతులు పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తీరా కొద్దిమందికి మాత్రమే పత్తి విత్తన పర్మిట్లను పంపిణీ చేసి చేతులు దులుపుకుంటోందని ఆరోపించారు. ఎరువులను పాత ధరలకు విక్రయించాలని ప్రభుత్వం చెబుతున్నా వ్యాపారులు అదనంగా పెంచిన ధరలతో విక్రయిస్తూ రైతులను నిలువుదోపిడి చేస్తున్నారని విమర్శించారు. ఎరువులను పెంచిన ధరలతోనే విక్రయిస్తున్నా పాలకులు పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు. బ్లాక్‌మార్కెట్‌ను వెంటనే అరికట్టాలని, లేనిపక్షంలో ఎరువులను వెలికితీసి మేమే రైతులకు పంచుతామని హెచ్చరించారు. ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.విజయసారథి మాట్లాడుతూ ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వలనే బ్లాక్‌మార్కెట్ దందా యథేచ్చగా కొనసాగుతోందని ఆరోపించారు. జిల్లాకు ఇద్దరు మంత్రులు, ప్రభుత్వ చీఫ్‌విప్ ఉన్నా ఏనాడు రైతుల సమస్యలను పట్టించుకున్న పాపానపోలేదని విమర్శించారు. పత్తి విత్తనాలు, ఎరువుల బ్లాక్‌మార్కెట్ అరికట్టి, జిల్లా రైతంగానికి సరిపడా ఎరువులు, విత్తనాలు అందించనిపక్షంలో రైతుల పక్షాన నిలబడి ఆందోళన కార్యక్రమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ రాస్తారోకోలో సిపిఐ నగర కార్యదర్శి మేకల రవి, తూర్పు నియోజకవర్గ కార్యదర్శి వీరగంటి సదానందం, రైతు సంఘం నాయకులు రాజిరెడ్డి, నర్సింహరావు, సుదర్శన్, సరోజన తదితరులు పాల్గొన్నారు.

* మద్యం వ్యాపారులకు మళ్లీ ఎసిబి నోటీసు
english title: 
warangal

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>