ఎల్లారెడ్డి, జూన్ 21: జిల్లాలో వందకోట్లతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి జరుగుతుందని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ శ్రీరాంరెడ్డి అన్నారు. గురువారం ఆయన మండలంలోని మత్తమాల గ్రామంలో జరిగిన బాడిబాట కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలు కల్పిస్తుందని, తల్లిదండ్రులు సైతం ఈవిషయంలో ఆలోచించి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని అన్నారు. బడిబాట కార్యక్రమం సందర్భంగా జిల్లాలో బడిబయట ఉన్న పిల్లలను గుర్తించి వారిని బడిలో చేర్పించే కార్యక్రమం సందర్భంగా చాలామంది బడిబయట చిన్నారులు బడులకు వస్తున్నారని అన్నారు. బడిబయటి పిల్లలందర్నీ వయస్సుకు తగిన తరగతిలో బడిలో చేర్పించి ప్రత్యేక శిక్షణ ద్వారా విద్యనందించి బడిలో కొనసాగేటట్లు చూడాలని అన్నారు. 3 నుండి 5 ఏళ్ల పిల్లలను అంగన్‌వాడీ కేంద్రంలో లేదా సిఇఇలో చేర్పించి విద్యను విధిగా అందించాల్సి ఉంటుందని అన్నారు. ప్రభుత్వం 1 నుండి 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలందరికీ ఉచితంగా పుస్తకాలు, రెండేసి యూనిఫామ్స్ అందచేస్తోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని, ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అన్నారు. ఇప్పుడు కసూర్బా, గురుకుల విద్యాలయాలు సైతం విద్యార్థులకు మంచి భోజనంతో పాటు ఉచిత చదువును అందిస్తున్నాయని అన్నారు. రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్ట్ అధికారి గురుమూర్తి మాట్లాడుతూ, బడిబయట 5,100 మంది పిల్లలు ఉన్నట్లు గుర్తించామని అన్నారు. వీరందర్నీ బడిబాట కార్యక్రమం సందర్భంగా బడిలో చేర్పించేందుకు కృషి జరుగుతుందని అన్నారు. మత్తమాల పాఠశాల నిర్వహణ తీరుపై అదనపు జెసి, ఆర్‌విఎమ్ పిఓలు సంతృప్తి వ్యక్తం చేస్తూ, పాఠశాల నిర్వహణ తీరుపై పాఠశాల హెచ్‌ఎంతో పాటు ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో విలీన అధికారి రాంమోహన్‌రావు, సిఎంఓ స్వర్ణలత, మండల ప్రత్యేక అధికారి గంగాధర్, తహశీల్దార్ కొండయ్య, ఎంపిడివో సాయగౌడ్, ఎంఇఓ వెంకటేశం, పాఠశాల హెచ్‌ఎం బాల్‌రామ్‌తో పాటు ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, ప్రజలు విద్యార్థిని విద్యార్థులు హాజరు అయ్యారు.
ఎంబిఎ పరీక్షల వాయిదాకు ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్
కంఠేశ్వర్, జూన్ 21: పూర్తిస్థాయి సిలబస్ పూర్తి చేయకుండా ఎంబిఎ, ఎంసిఎ పరీక్షలు నిర్వహించడంపై ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ గురువారం జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాలలో సెమిస్టర్ పరీక్షలను బహిష్కరించారు. అనంతరం విద్యార్థులు హాల్ టికెట్లు చించివేసి నిరసన తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు నవీన్, డివైఎఫ్‌ఐ నాయకుడు శ్యామ్‌బాబులు మాట్లాడుతూ, తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ఎంబిఎ, ఎంసిఎ సిలబస్ పూర్తి కాలేదన్నారు. యూనివర్సిటీ నిబంధనల ప్రకారం ఏప్రిల్ చివరి వరకు సిలబస్ పూర్తి చేసి, మే నెలలో ప్రిపరేషన్ హాలీడేస్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కానీ జిల్లాలోని కళాశాలల్లో ఈనెల 17వరకు తరగతులు నిర్వహించినప్పటికీ, సిలబస్ పూర్తి చేయలేకపోయారన్నారు. విద్యార్థులకు పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు సమయం ఇవ్వకుండా వర్సిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల విద్యార్థులు పరీక్షలు సరిగా రాయలేక నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల వర్సిటీ అధికారులు స్పందించి, విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పరీక్షలు వాయిదా వేయాలని డిమాం డ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శ్రీకాంత్, ప్రనీత్, సంతోష్, గిరీష్, ఝాన్సీ, పుప్పలత, క్రాంతి, ప్రవీణ్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని విసి చాంబర్‌కు తాళం
ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన
డిచ్‌పల్లి , జూన్ 21: ఎంబిఎ, ఎంసిఎ సెకండ్ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్శిటీలో గురువారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థులు మూకుమ్మడిగా పరిపాలనా భవనం వద్దకు చేరుకుని వైస్ ఛాన్స్‌లర్ గదికి తాళం వేశారు. అనంతరం చాంబర్ ఎదుట దాదాపు గంటపాటు ధర్నా నిర్వహించారు. విసికి, రిజిస్ట్రార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రూప్-2 పరీక్షలకు సన్నద్ధమవుతున్నందున సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని కోరినప్పటికీ స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి మొదటి సెమిస్టర్ పరీక్షలు పూర్తయిన తరువాత 45 రోజుల విరామం అనంతరం రెండవ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడం ఆనవాయితీ కాగా, వి.సి ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి వారికి అనుకూలంగా ఉండేందుకే సెమిస్టర్ పరీక్షలు జరిపిస్తున్నారని ఆరోపించారు. తద్వారా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని, ఒకే సమయంలో పరీక్షలు ఉండడం వల్ల తాము నష్టపోవాల్సి వస్తోందని విద్యార్థులు వాపోయారు. చివరకు వైస్ ఛాన్స్‌లర్ అక్బర్‌అలీ ఖాన్ విద్యార్థి సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఎంబిఎ, ఎంసిఎ కళాశాలల యాజమాన్యాలను సంప్రదించిన మీదట సెమిస్టర్ పరీక్షల వాయిదా విషయమై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శ్రీకాంత్, సంతోష్, ఝాన్సీ, గిరీష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ ఆశయాల సాధనకు ఉద్యమం
టిఆర్‌ఎస్, విద్యార్థి జెఎసి నాయకుల పిలుపు
కంఠేశ్వర్, జూన్ 21: తెలంగాణ పితామహుడు, ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల సాధనకు ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని టిఆర్‌ఎస్, విద్యార్థి జెఎసి నాయకులు పిలుపునిచ్చారు. గురువారం జయశంకర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా తెలంగాణవాదులు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలోని టిఆర్‌ఎస్ కార్యాలయంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం వర్ధంతి సభను నిర్వహించారు. ఫులాంగ్ చౌరస్తాలో తెలంగాణ విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో వర్ధంతి సభ చేపట్టారు. టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆలూర్ గంగారెడ్డి, విద్యార్థి జెఎసి రాష్ట్ర నాయకుడు గోపాల్ మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతోనే తెలంగాణ ప్రజల అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయని జయశంకర్ తేల్చి చెప్పారన్నారు. అందుకు అనుగుణంగా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి ఉద్యమాలను నడిపి, తెలంగాణ ద్రోహుల పక్కలో బల్లెంలా జయశంకర్ నిలిచారని అన్నారు. విద్యార్థి దశ నుండి చివరి శ్వాస వరకు జయశంకర్ ఉద్యమ రథసారధిగా నిలిచారని కొనియాడారు. తెలంగాణలోని విద్యాలయాలు తిరుగుతూ, విద్యార్థులకు ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను వివరించి, జయశంకర్ వారిలో చైతన్యం నింపారని అన్నారు. ప్రజలందరూ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతుండగా, రాజకీయ నాయకులు పదవుల కోసం పాకులాడడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాగ్రహానికి ప్రభుత్వాలు కుప్పకూలడం ఖాయమని హెచ్చరించారు. జయశంకర్ ఆశయమైన ప్రత్యేక రాష్ట్రం కోసం విద్యార్థులు, యువతతో పాటు ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు సుజిత్‌సింగ్, రాంకిషన్‌రావు, రాములు, రవిచందర్, విద్యార్థి జెఎసి నాయకులు వేణు, విటల్, సంజీవ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
టిఆర్‌ఎస్ నాయకుల ఘన నివాళులు
డిచ్‌పల్లి రూరల్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్‌కు గురువారం డిచ్‌పల్లిలో టిఆర్‌ఎస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. నాగ్‌పూర్ గేట్ వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణ సాధన కోసం కొనసాగిన ఉద్యమంలో జయశంకర్ పోషించిన క్రియాశీలక పాత్ర గురించి వక్తలు కొనియాడారు. ఆయన ఆశయం మేరకు తెలంగాణ సాధించుకున్నప్పుడే నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని, ఈ దిశగా తెలంగాణవాదులంతా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ భూపతిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ షాదుల్లా, నాయకులు కృష్ణా, చందర్, లాయక్‌అలీ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ అనిల్ నివాళి
మోర్తాడ్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపిన ప్రొఫెసర్ జయశంకర్ చిరస్మరణీయుడని ప్రభుత్వ విప్ అనిల్ ఈరవత్రి అన్నారు. స్థానిక బస్టాండ్‌లోని దీక్షా శిబిరంలో గురువారం ఏర్పాటు చేసిన జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్ర సాధనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు ప్రజా జెఎసి, జెఎసిల ఆధ్వర్యంలోనూ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నేతలు పాల్గొన్నారు.
ముమ్మరంగా సోయా, పత్తి విత్తనాల పంపిణీ
కలెక్టర్ వరప్రసాద్
నిజామాబాద్, జూన్ 21: రైతులకు పత్తి, సోయాబీన్ విత్తనాల పంపిణీని మరింత వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్ డి.వరప్రసాద్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. విత్తనాల కోసం జిల్లా వ్యాప్తంగా రైతుల్లో ఎనలేని ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కలెక్టర్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమై విత్తనాలు, ఎరువుల నిల్వలు, వాటి పంపిణీ ప్రక్రియపై సమీక్ష జరిపారు. ఇటీవల రెండుమూడు రోజుల పాటు వరుసగా ఒక మోస్తరు వర్షాలు కురియడంతో రైతులంతా ఖరీఫ్ పంటల సాగుకు సన్నద్ధమయ్యారు. అయితే అవసరమైన ఎరువులు, విత్తనాలు ఇంకా చేతికందకపోవడంతో వారిలో అంతకంతకూ ఆదుర్దా పెరిగిపోతోంది. సేద్యపు పనులను పక్కనపెట్టి మరీ రైతులు విత్తనాల కోసం సొసైటీ కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారు. జిల్లాకు సరిపడా విత్తనాలు, ఎరువుల నిల్వలను తెప్పిస్తున్నామని, రైతులు అనవసర ఆందోళనకు గురికావద్దంటూ అధికార యంత్రాంగం పదేపదే భరోసా కల్పిస్తున్నప్పటికీ రైతుల్లో మాత్రం ఈ మేరకు నమ్మకం పెంపొందడం లేదు. ఎలాగైనా విత్తనాలను దక్కించుకోవాలనే ఆరాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రధానంగా సరిహద్దు ప్రాంతమైన జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్, బిచ్కుంద, పిట్లం, జుక్కల్ తదితర ప్రాంతాల్లో పత్తి పంటతో పాటు సోయా విత్తనాలకు రైతుల నుండి పెద్దఎత్తున డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇతర ప్రాంతాల్లోనూ ఈసారి రైతులు సోయా పంట సాగు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈసారి దాదాపు 75 నుండి 80 వేల హెకార్ల విస్తీర్ణంలో సోయా పంట సాగు చేస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో సోయా విత్తనాల కోసం రైతుల నుండి ఒకే సమయంలో డిమాండ్ ఏర్పడడంతో అక్కడక్కడా విత్తనాల కొరత తలెత్తుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సమీక్షా సమావేశంలో వ్యవసాయ అధికారులకు దిశానిర్దేశం చేశారు. సాధ్యమైనంత త్వరగా పత్తి, సోయాబీన్ విత్తనాల నిల్వలను జిల్లాకు రప్పించాలని, వెంటదివెంట రైతులకు పంపిణీ జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో నెలకొని ఉన్న ప్రత్యేక పరిస్థితుల గురించి ప్రభుత్వానికి విన్నవించగా, 10 వేల క్వింటాళ్ల సోయా విత్తనాలను అదనంగా సమకూర్చేందుకు అంగీకరించిందన్నారు. ఇందులో ఇప్పటికే వేయి క్వింటాళ్ల పత్తి విత్తనాలు జిల్లాకు కేటాయించారని, మిగతా 9 వేల క్వింటాళ్లను సైతం ఈ నెల 25వ తేదీ వరకు జిల్లాకు పంపించేందుకు వ్యవసాయ శాఖ కమిషనర్ హామీ ఇచ్చారని కలెక్టర్ తెలిపారు. కాగా, జిల్లాకు అజిత్ కంపెనీకి చెందిన 5500 ప్యాకెట్ల పత్తి విత్తనాలను అందజేయాలని కోరగా, వేయి ప్యాకెట్లు ఇప్పటికే పంపిణీ చేశారని, మిగతా 4500 ప్యాకెట్లను సైతం త్వరితగతిన కేటాయించాల్సిందిగా కోరుతూ వ్యవసాయ శాఖ కమిషనర్‌కు ఫ్యాక్స్ ద్వారా లేఖ పంపాలని జెడిఎ వేణుగోపాల్‌నాయుడును ఆదేశించారు. ఎరువులు, విత్తనాలకు సంబంధించి జిల్లాలో ఎలాంటి కొరత తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఈ విషయంలో రైతులు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ మరోమారు భరోసా కల్పించారు. కాగా, జిల్లాకు పెద్దఎత్తున రప్పిస్తున్న ఎరువులు, సబ్సిడీ విత్తనాలు దుర్వినియోగం కాకుండా, సరిహద్దులు దాటకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘాను ఏర్పాటు చేయాలని, నిరంతరం విత్తనాలు, ఎరువుల పంపిణీని పర్యవేక్షించాలన్నారు. రైతాంగానికి సేవలందించే విషయంలో అధికారులు ఎవరైనా నిర్లక్ష్యానికి తావు కల్పిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. సమీక్షా సమావేశంలో జెడిఎ వేణుగోపాలనాయుడు, ఎడిఎలు గంగారాం, వాజిద్‌హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
లక్ష్యం ఘనం..ఆదమరిస్తే నిధులు నిష్ప్రయోజనం
50 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయం
కోటి పైచిలుకు నిధులు వెచ్చింపు
నిజామాబాద్, జూన్ 21: నానాటికీ అంతరించిపోతున్న అటవీ విస్తీర్ణాన్ని పెంపొందిస్తూ, పర్యావరణ సమతుల్యతను పరిరక్షించేందుకు వీలుగా ప్రభుత్వం మొక్కల పెంపకానికి ఎనలేని ప్రాధాన్యతనిస్తూ వివిధ పథకాల కింద పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తోంది. అయితే మొక్కలను నిర్దేశిత ప్రదేశాల్లో నాటడం, వాటిని సంరక్షించడం వంటి బాధ్యతలను ఏమేరకు నిర్వర్తిస్తారన్నదే ప్రశ్నార్ధకంగా మారింది. ఇదివరకు పరిశుభ్రత - పచ్చదనం కార్యక్రమం సందర్భంగా పెద్దఎత్తున మొక్కలు నాటినప్పటికీ, వాటిలో కనీసం 20 శాతం మొక్కలు సైతం వృక్షాలుగా ఎదగలేకపోయాయి. మొక్కలు నాటినట్టు రికార్డుల్లో పేర్కొనగా, సంబంధిత ప్రదేశాల్లో మొక్కల ఆనవాళ్లే కనిపించకుండాపోయాయి. మొక్కలు నాటే కార్యక్రమంలో పెద్దఎత్తున నిధులు దుర్వినియోగమైనట్టు అనేక విచారణల్లో వెల్లడైంది. మరికొన్నిచోట్ల మొక్కలు నాటడంతోనే సరిపెట్టుకుని వాటి పరిరక్షణ బాధ్యతలను గాలికొదిలేయడంతో నిధులన్నీ నిష్ప్రయోజనం అయ్యాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి పకడ్బందీగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడితే తప్ప, ఆశించిన లక్ష్యం నెరవేరే అవకాశాలు లేవని, లేనిపక్షంలో లక్షలాది రూపాయల నిధులు మట్టిపాలవడం ఖాయమని పలువురు పేర్కొన్నారు. ప్రస్తుతం విద్యా పక్షోత్సవాల అమలుపై దృష్టిసారిస్తున్న జిల్లా యంత్రాంగం, జూలైలో మొదటి పక్షం రోజులు మొక్కలు నాటే కార్యక్రమానికే ప్రాధాన్యతనివ్వాలని ఆయా శాఖల అధికారులను సన్నద్ధం చేసింది. జిల్లాలో ఈ ఏడాది ప్రస్తుత సీజన్‌లో 50 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యంతో దాదాపు కోటి రూపాయల పైచిలుకు నిధులను ఖర్చు చేశారు. నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని నిర్వహించే సామాజిక అడవుల విభాగానికి నాలుగైదేళ్ల క్రితం వరకు ప్రపంచ బ్యాంకు నుండి పుష్కలంగా నిధులు మంజూరవగా, ఆశించిన లక్ష్యం నెరవేరకపోవడంతో ప్రపంచ బ్యాంకు నిధుల విడుదల నిలిచిపోయింది. దీంతో రెండుమూడేళ్ల పాటు మొక్కల పెంపకం కార్యక్రమాన్ని అటకెక్కించారు. తాజాగా, ఉపాధి హామీ పథకాన్ని మొక్కల పెంపకం పథకంతో అనుసంధానించడంతో సామాజిక అడవుల విభాగానికి నిధుల కొరత దూరమైంది. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ఇజిఎస్ పథకం కింద 65.91 లక్షల రూపాయలను మొక్కల పెంపకానికి కేటాయించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గల 41 మహాత్మాగాంధీ వన గ్రామీణ నర్సరీల్లో సామాజిక అటవీ విభాగం ఆధ్వర్యంలో 28 లక్షల మొక్కలను సిద్ధం చేశారు. ఇందులో అత్యధికంగా టేకు మొక్కలు ఉన్నాయి. వీటిని ఎంపిక చేసిన చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగా అందిస్తూ వ్యవసాయ పొలాల గట్ల వెంబడి నాటించాలని ప్రణాళిక రూపొందించారు. మొక్కలు నాటేందుకు అవసరమైన గుంతల తవ్వకంతో పాటు, మూడేళ్ల పాటు మొక్కల సంరక్షణకు అయ్యే ఖర్చులను ఉపాధి హామీ నిధుల నుండి భరించనున్నారు. అదేవిధంగా 100 కిలోమీటర్ల వరకు రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు చర్యలు చేపడుతున్నారు. కాగా, 13వ ఆర్థిక సంఘం ద్వారా 2011-12 ఆర్థిక సంవత్సరానికిగాను మొక్కల పెంపకం కోసం జిల్లాకు మరో 39.80 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులను ఖర్చు చేస్తూ దాదాపు 10 లక్షల మొక్కలను నర్సరీల్లో పెంచారు. వీటిని గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో నాటేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇందులో వివిధ రకాల పండ్ల మొక్కల పెంపకానికి ప్రాధాన్యతనిచ్చారు. వీటిని ప్రజలకు సైతం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఎసిఎ పథకం కింద 5 లక్షల రూపాయలను వెచ్చిస్తూ మరో 1.12 లక్షల మొక్కలను పెంచారు. ఇలా జిల్లాలో ఈసారి 50 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. పెద్దఎత్తున లక్ష్యాన్ని ఏర్పర్చుకోవడం వరకు బాగానే ఉన్నప్పటికీ, నిర్దేశించిన మేరకు పూర్తిస్థాయిలో మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించేందుకు పకడ్బందీ చర్యలు చేపడితేనే ఆశించిన ఫలితాలు సమకూరుతాయని, ఈ విషయంలో సంబంధిత అధికారులు ఏమాత్రం ఏమరుపాటును ప్రదర్శించినా లక్షలాది రూపాయల నిధులు నిష్ప్రయోజనం అవుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
నేడు పాఠశాలల బంద్‌కు ఎబివిపి పిలుపు
నిజామాబాద్ , జూన్ 21: ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వౌలిక సదుపాయాల కల్పనలో సర్కారు వైఫల్యాన్ని నిరసిస్తూ ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చామని ఎబివిపి జిల్లా కన్వీనర్ నారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యారంగ సేవల నుండి ప్రభుత్వం క్రమంగా తప్పుకుంటూ విద్యా వ్యవస్థను ప్రైవేటీకరించేందుకు కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు. సర్కారీ బడుల్లో కనీస వసతులు కరువవడంతో ఏటేటా విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 99,459 ప్రభుత్వ పాఠశాలల్లో ఇదివరకు 90 లక్షల మంది విద్యార్థులుండేవారని, ప్రస్తుతం ఆ సంఖ్య 54,77,427కు పడిపోయిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రభుత్వం కనబరుస్తున్న ఉదాసీన వైఖరికి ఇది అద్దం పడుతోందన్నారు. ఏటా కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం పేర్కొంటున్నప్పటికీ, వేలాది ప్రభుత్వ బడులలో కనీస వౌలిక సదుపాయాల జాడ కనిపించడం లేదన్నారు. ఫలితంగా సర్కారీ బడుల్లో విద్యాబోధన కుంటుపడుతూ ఉత్తీర్ణత శాతం తగ్గుతోందని, అదే సమయంలో కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు ర్యాంకుల పంట పండించుకుంటున్నాయని అన్నారు. దీనిని చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారీ బడుల్లో చదివించేందుకు సాహసించడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని, గుర్తింపు లేని పాఠశాలలను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల సాధన కోసం శుక్రవారం చేపట్టనున్న పాఠశాలల బంద్ కార్యక్రమానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు సహకరించి విజయవంతం చేయాలని నారాయణ కోరారు.
బోధన్ టు హైదరాబాద్
జోరుగా నకిలీ కరెన్సీ చెలామణి...?
* రైలుమార్గాన్ని ఎంచుకున్న చెలామణిదారులు
* ఆరా తీస్తున్న ఇంటెలిజెన్స్ వర్గాలు
బోధన్, జూన్ 21: పదేళ్ల క్రితం ఐఎస్‌ఐ కార్యకపాలకు అడ్డాగా మారి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పట్టణం నేడు నకిలీ కరెన్సీ చెలామణికి కేంద్ర బిందువుగా మారింది. స్థానికంగా ప్రతిరోజు వ్యాపార వర్గాల వద్దకు వేలాది రూపాయల నకిలీ నోట్లు వస్తున్నాయి. వీటిని ఎవరు చెలామణి చేస్తున్నారో అంతుచిక్కడం లేదు. నకిలీ నోట్లను ఏ మాత్రం గుర్తుపట్టని రీతిలో ముద్రించి అసలు నోట్ల మాదిరిగానే తయారు చేసి వాటిని ఎంచక్కా మార్కెట్‌లో చెలామణి చేస్తున్నారు. ఈ చెలామణి ఇటీవలి కాలం నుండి మరో అడుగు ముందుకేసింది. ఇక్కడి నుండి ప్రతిరోజు లక్ష రూపాయల నకిలీ కరెన్సీ చెలామణి నిమిత్తం హైదరాబాద్ తరలిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందుకు ఓ పదిమంది సభ్యులు గల బృందం క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు సమాచారం. వీరు ప్రతిరోజు బోధన్ నుండి తెల్లవారు జామున హైదరాబాద్ వెళ్లే ప్యాసింజర్ రైలు ద్వారా నకిలీ నోట్లను హైదరాబాద్ మార్కెట్‌కు తీసుకెళ్లి వాటిని అసలు నోట్లుగా మార్చుకుని మళ్లీ రాత్రి పూట వచ్చే రైలులో తిరుగుముఖం పడుతున్నట్లు సమాచారం. ఒక్కో వ్యక్తికి పదివేల రూపాయల విలువ చేసే నకిలీ నోట్లు ఇస్తే వారు వాటిని హైదరాబాద్‌లో చెలామణి చేసి అందులో మూడువేల రూపాయల కమీషన్‌ను తీసుకుని తిరిగి ఏడు వేల రూపాయలను నకిలీ నోట్లు ఇచ్చిన వ్యక్తికి ఇస్తున్నారని స్థానికంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. రైలులో రెగ్యులర్‌గా హైదరాబాద్ వెళ్తే ఎవరికీ అనుమానాలు రావని, అంతేకాకుండా ఎటువంటి తనిఖీలు ఉండవన్న ఉద్దేశంతోనే ఈ హైటెక్ చెలామణిదారులు రైలు ప్రయాణాన్ని ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఈ నకిలీ నోట్లు ఎవరు చెలామణి చేస్తున్నారు? వారికి ఎవరు ఇస్తున్నారు? అనేది మాత్రం తేటతెల్లం కావడం లేదు. ఈ విషయం వ్యాపారులకు తెలియడంతో బోధన్ మార్కెట్‌లో వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ వ్యాపార సంస్థలకు ఎక్కువగా ఐదు వందల రూపాయల నోట్లు వస్తుండటంతో వాటిలో అసలీ, నకిలీ నోట్లను గుర్తు పట్టలేక వారు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కొంతమంది వ్యాపారులైతే ఐదు వందల నోట్లు వస్తే వాటిని తీసుకోమని చిల్లర తీసుకొచ్చి ఇవ్వాలంటూ కొనుగోలుదారులకు సూచిస్తున్నారు. ఈ విషయం ఇంటెలిజెన్స్ వర్గాల దృష్టికి వెళ్లడంతో వారు కూడా ఈ నకిలీ కరెన్సీ బాగోతాన్ని సీరియస్‌గా తీసుకుని చెలామణిదారులను పసిగట్టేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానికంగా నెలకొన్న కొన్ని పరిస్థితులను పరిశీలిస్తే ఎటువంటి ఆదాయ మార్గాలు లేని కొందరు వ్యక్తులు వేలాది రూపాయలు పెట్టి జల్సాలు చేయడం, ఇతర ఆస్తులను కూడగట్టుకోవడం, రోజుల తరబడి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లడం అనేక అనుమానాలకు తావిస్తోంది. గతంలో ఇదేవిధంగా ఎవరూ పసిగట్టలేని విధంగా ఇక్కడ ఐఎస్‌ఐ కార్యకలాపాలు వెలుగు చూశాయి. పోలీసు ఎన్‌కౌంటర్‌లో ప్రముఖ ఐఎస్‌ఐ ఏజెంట్ ఆజంఘోరీ చనిపోయే వరకు ఇక్కడ ఐఎస్‌ఐ కార్యకలాపాలు జరిగాయన్న విషయాన్ని పోలీసు వర్గాలు గుర్తించలేక పోయాయి. ప్రస్తుతం అటువంటి కార్యకలాపాలు లేకపోయినప్పటికీ నకిలీ కరెన్సీ చెలామణి మాత్రం ఒక్కసారిగా ఊపందుకున్నట్లు కనిపిస్తోంది. పట్టణంలో పాతబస్టాండ్, కొత్తబస్టాండ్, సాత్‌పూల్ కెనాల్, అంబేద్కర్ చౌరస్తాలలో గల లాడ్జీలన్నీ గత కొంతకాలం నుండి రద్దీగా ఉన్నాయి. ఇక్కడ అంతగా వ్యాపారాలు లేకపోయినప్పటికీ లాడ్జీలు కిటకిట లాడటం గమనార్హం. ఈ లాడ్జీలలో ఉండేవారంతా స్థానికేతరులు కావడం, అందులోను వారు నెలల తరబడి అందులో కాలం వెళ్లదీయడంతో పట్టణంలో ఏమి జరుగుతోంది? ఏమి జరుగబోతోందని అని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు పకడ్బందీగా నిఘా పెట్టి విచారణ జరిపితే నకిలీ రాకెట్ వారి చేతికి చిక్కే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ ప్రాంతం మహారాష్టక్రు ఆనుకుని ఉండటంతో అక్కడి వారు ఏమైనా ఇక్కడ మకాం వేసి తమ నకిలీ కరెన్సీ బాగోతాలు నడుపుతున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.