ఆదిలాబాద్, జూన్ 21: తెలంగాణ ఉద్యమానికి పునాది వేసి నిరంతరం రాష్ట్ర సాధన కోసం తపించి అమరుడైన ప్రొఫేసర్ జయశంకర్ లేని లోటు ఉద్యమానికి పూడ్చలేమని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరు పాటుపడాల్సిన అవసరం వుందని పలువురు ఉద్యమకారులు అభిప్రాయపడ్డారు. ప్రొఫేసర్ జయశంకర్ వర్థంతి సభ ఆదిలాబాద్‌లోని తెలంగాణచౌరస్తాలో ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్టమ్రే లక్ష్యంగా ఆర్ అండ్ బి అతిథి గృహం ఎదుట కొనసాగుతున్న రిలే దీక్షలు 900 రోజుకు చేరుకున్న సందర్భంగా అమరవీరులను స్మరిస్తూ తెలంగాణ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ ఇంచార్జి లోక భూమారెడ్డి మాట్లాడుతూ ప్రొఫేసర్ జయశంకర్‌తో ఆదిలాబాద్ జిల్లాకు విడదీయలేని అనుబంధముందని, ఆయన బాటని అనుసరిస్తూ వేలాది మంది ఉద్యమంలో స్వచ్చంధంగా పాలుపంచుకున్నారన్నారు. తెలంగాణ ఉద్యమానికి భీజం వేసిన జయశంకర్ స్ఫూర్తితోనే టిఆర్‌ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారన్నారు. విద్యార్థి లోకాన్ని, యువతను కదిలిస్తూ వెనుకబాటుకు గల కారణాలను ఎత్తి చూపిన జయశంకర్ మరణం ఉద్యమ చరిత్రకే తీరని లోటుగా అభివర్ణించారు. పార్టీ నాయకులు గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం సాధించే వరకు పోరాడుతూనే వుండాలని, ఇటీవల జరిగిన పరకాల ఎన్నికలు తెలంగాణ వాదాన్ని చాటి చెప్పాయని అన్నారు. ఆత్మహత్యల బాట విడనాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రక్తదానం కోసం డైరీలో సంతకాలు సేకరించారు. అనంతరం తెలంగాణ జెఎసి ఆధ్వర్యంలో పట్టణంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి జయశంకర్‌కు నివాళులుఅర్పించారు.జిల్లాలో రాష్ట్ర సాధన కోసం అమరులైన వారి త్యాగాలను ఈ సందర్భంగా నేతలు స్మరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జెఎసి కోకన్వీనర్ దామోదర్, మాజీ ఎమ్మెల్యే సి వామన్‌రెడ్డి, కస్తాల సుధాకర్, తెలంగాణవాదులు శ్రీనివాస్, హబీబోద్ధీన్, శోభ, లక్ష్మీ, శ్రీరంజని, దార్ష పొచ్చన్న, నర్సయ్య, భూమారెడ్డి, పొచ్చన్న, రఫీక్, గంగన్న, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
మద్యం దరఖాస్తు బాక్స్‌ల ఏర్పాటు
ఆదిలాబాద్, జూన్ 21: జిల్లాలో మద్యం దుకాణాల కోసం నోటిఫికేషన్ జారీ కాగా, గురువారం షెడ్యూల్ మేరకు ఎక్సైజ్ కార్యాలయంలో ప్రత్యేకంగా డివిజన్‌ల వారీగా దరఖాస్తుల నిమిత్తం సీల్డ్ బాక్స్‌లను ఏర్పాటుచేశారు. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 25న ఆఖరి గడువు కావడంతో కార్యాలయంలో నుండి దరఖాస్తులు స్వీకరించి సుమారు 50 మంది తొలి రోజు దరఖాస్తులు వేశారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఉట్నూరు, బెల్లంపల్లి ప్రాంతాలకు ప్రత్యేకంగా బాక్స్‌లను ఏర్పాటుచేశారు. జిల్లాలో 207 మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానిస్తుండగా, ఈ నెల 30తో పాత దుకాణాల గడువు ముగుస్తున్న విషయం విధితమే. దరఖాస్తుల స్వీకరణ అనంతరం ఈ నెల 26న ఆదిలాబాద్‌లోని తిరుమల పెట్రోల్ బంక్ ఎదురుగా కెజిఆర్ గార్డెన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు లాటరీ పద్దతిన జిల్లా కలెక్టర్ సమక్షంలో లాటరీలు తీసి మద్యం షాపులు ఖరారుచేయన్నట్లు అధికారులు వివరించారు.
బడికి రాని ఉపాధ్యాయులపై కఠిన చర్యలు
* ఆకస్మిక తనిఖీలో డిఇఓ హెచ్చరిక
తలమడుగు, జూన్ 21: పాఠశాల విధులకు ఎగనామం పెట్టే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి అక్రముల్లాఖాన్ హెచ్చరించారు. గురువారం మండలంలోని కప్పర్‌దేవి, దేగామ, ఉమ్రి ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి ఉపాధ్యాయుల పనితీరు, పాఠ్యపుస్తకాల పంపిణీ తదితర అంశాలపై ఆరాతీశారు. ఉమ్రి పాఠశాలలో నాందేవ్ ఉపాధ్యాయుడు గైర్హాజరు కావడంపై అసంతృప్తివ్యక్తం చేయగా, అనారోగ్య కారణాలతో సెలవు పెట్టినట్లు హెచ్‌ఎం వివరించారు. అయితే ఆ గ్రామస్తులు ఆ ఉపాధ్యాయుడు విధులకు గైర్హజరు కావడం సర్వసాధారణ విషయమని ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఆయన జీతం నుండి 3 రోజుల వేతనాన్ని కోత విధించాలని ఎంఇఓను డిఇఓ ఆదేశించారు. కప్పర్‌దేవి పాఠశాలను తనిఖీ చేయగా విద్యార్థుల సంఖ్య తక్కువగా వుండడంతో సంఖ్య పెంచాలని అన్నారు.
బదిలీల సందడి షురూ...!
* ఆన్‌లైన్‌లో ఉపాధ్యాయుల దరఖాస్తుల వెల్లువ
* ఖాళీల జాబితా విడుదలలో విద్యాశాఖ జాప్యం
ఆదిలాబాద్, జూన్ 21: ఉపాధ్యాయుల బదిలీల కౌన్సిలింగ్ షెడ్యూల్ జీఓ 38 విడుదల కావడంతో గురువారం నుండి ఆన్‌లైన్‌లో టీచర్లు బదిలీల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. తొలి రోజు 200 పైనే దరఖాస్తులు సమర్పించుకున్నారు. బదిలీ షెడ్యూల్ ప్రక్రియలో భాగంగా ఈ నెల 26 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ చేపడుతున్నప్పటికీ జిల్లా విద్యాశాఖ నిర్లక్ష్యం ఉపాధ్యాయులను విస్మయానికి గురిచేస్తోంది. ఇంత వరకు ఉపాధ్యాయుల ఖాళీల జాబితాను, పాఠశాలల కేటగిరిలను ప్రకటించక పోవడంపై సర్వత్రా నిరసనలువ్యక్తం అవుతున్నాయి. ఈ నెల 27న పదోన్నతుల జాబితా, 28,29 తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ, 30 నుండి జూలై 2 వరకు అభ్యంతరాల పరిశీలన, 2వ తేదీన తుధి జాబితా విడుదల, జూలై 3 నుండి 8 వరకు బదిలీ కౌన్సిలింగ్ కోసం షెడ్యూల్ విడుదల అయింది. అయితే ఈ సారి జరిగే బదిలీల్లో జూలై 1 నాటికి 8 యేళ్ళ సర్వీసు ఓకే చోట పూర్తి చేసుకున్న వారికి తప్పని సరిగా బదిలీ చేయాలని, రిటైర్మెంట్‌కు రెండేళ్ల సర్వీసు వున్న వారిని మాత్రం ఆ పోస్టింగ్‌ను కదలించరాదని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజేష్ తివారి స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. జీఓ 38లో అసంబద్ధ నిబంధనలు, అస్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయడంపై ఉపాధ్యాయుల్లో గంధరగోళం నెలకొంది. ఏజెన్సీ నుండి మైదాన ప్రాంతాలకు, మైదాన ప్రాంతాల నుండి ఏజెన్సీ ఏరియాలకు బదిలీ విషయంలో ఎటువంటి ఉత్తర్వులు జారీ కాలేదు. రాజీవ్ మాద్యమిక్ శిక్ష అభియాన్ ద్వారా జనవరి నుండి ఖాళీ అయిన పోస్టింగ్‌లలో అడహక్ ప్రమోషన్ల స్థానాల్లో బదిలీలు కల్పిస్తామన్న ప్రభుత్వం వాటి ఖాళీలు ప్రకటించక పోవడంపై టీచర్లలో అయోమయం నెలకొంది. సుమారు 280 మంది స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలపై విద్యాశాఖ అధికారులు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాల్సి వుండగా, కొందరు అదే పోస్టింగ్‌లో వుండేందుకు కోర్టుకు వెళ్ళడం వల్లే కాస్త జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. అంతేగాక 2010 జూన్‌లో బదిలీ అయిన 80 మంది ఉపాధ్యాయుల స్థానంలో సబ్‌స్ట్యూట్ ఉపాధ్యాయులు ఆ పోస్టింగ్‌లో చేరక పోవడంతో రెండేళ్ల సర్వీసు కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీని వల్ల మ్యాథ్స్, ఫిజిక్స్ సంబంధించి 42 మంది టీచర్లు అడహక్ బదిలీల అవకాశం కోల్పోవాల్సి వస్తోందని అంటున్నారు. ఉపాధ్యాయుల బదిలీలపై ప్రాధాన్యత పాయింట్లను ప్రకటించగా, సుమారు 2 వేల పైనే టీచర్లు బదిలీలకు అవకాశం కలిగినట్లయింది. టీచర్ల బదిలీల కౌన్సిలింగ్‌లో మొదట గ్రేడ్ 2 ఉపాధ్యాయులు, పిజి హెచ్‌ఎంలకు బదిలీ వుంటుందని ఆ తరువాత స్కూల్ అసిస్టెంట్లు, ఎస్‌జిటిలు, భాషా పండితులు, పిఇటిలకు బదిలీ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా బదిలీల కోసం ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొంటుండగా, గుర్తింపు వున్న ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులకు సైతం పది పాయింట్లు కేటాయిస్తుండడంతో వారు కూడా ఉత్సాహంగా ప్రాధాన్యత పోస్టుల కోసం ఆశలు పెట్టుకున్నారు.
జైలు వార్డర్ పోస్టులకు పోటీ పరీక్ష
* 4వ రోజు 506 మంది హాజరు
ఆదిలాబాద్, జూన్ 21: పోలీసుశాఖలోని జైలు విభాగంలో వార్డర్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా 4వ రోజు గురువారం ఆదిలాబాద్‌లో పరుగు పోటీ పరీక్ష నిర్వహించగా, 1000 మంది అభ్యర్థులకు గాను 506 మంది హాజరయ్యారు. వీరిలో 259 మంది మలివిడతగా నిర్వహించే శారీర ధారుడ్య పరీక్షలకు అర్హత సాధించినట్లు జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి తెలిపారు. పోటీ పరీక్షలను ఏలాంటి లోటుపాట్లు లేకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా పరుగు పోటీల్లో 5 వీడియోలతో చిత్రీకరించడం గమనార్హం. ప్రతి బ్యాచ్‌కు 100 మంది చొప్పున పరుగు పోటీ పరీక్ష నిర్వహిస్తుండగా, పట్టణంలో ట్రాఫిక్ సమస్య జఠిలం కాకుండా కొద్ది సేపు ట్రాఫిక్‌ను వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నారు. శుక్రవారం చివరి రోజు ఉదయం 5 గంటలకే పరేడ్ మైదానానికి అభ్యర్థులు హాజరుకావాలని, జూలై 2వ తేదీ నుండి ప్రతిరోజు 500 మందికి శారీర ధారుడ్య పరీక్షలు నిర్వహిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. అభ్యర్థుల శక్తిసామర్థ్యాలు, ప్రతిభ కొలమానంగా జైలు వార్డర్ పోస్టుల భర్తీ కొనసాగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్‌వి కిషన్‌రావు, డిఎస్పీలు టి అప్పారావ్, కె నారాయణరావు, ఇన్స్‌పెక్టర్లు జె భిక్ష్మయ్య, వెంకటేశ్వర్‌గౌడ్, ఎస్‌ఐలు కృష్ణ, అజయ్, అంకోలి పిహెచ్‌సి డాక్టర్ కస్తూబా, సిఆర్ గంగారాం, పోలీసు సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.
పిఎంఇజిపి స్వయం ఉపాది రుణాలకు దరఖాస్తులు ఆహ్వానం
ఆదిలాబాద్ , జూన్ 21: ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం కింద పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఔత్సాహిక అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రవీందర్ ఓ ప్రకటనలో కోరారు. జాతీయ బ్యాంకుల రుణ సాయంతో 2012-13 సంవత్సరానికి గాను కొత్త పరిశ్రమల స్థాపన కింద జిల్లాకు 50 యూనిట్లు మంజూరు చేయడం జరిగిందని, రూ.25 లక్షల వ్యయంతో కూడిన ఉత్పత్తి పరిశ్రమలకు, రూ.10 లక్షల వ్యయంతో కూడిన ఉత్పాదేతర సర్వీసు పరిశ్రమలకు కనీస విద్యార్హతగా 8వ తరగతి చదివి వుండాలన్నారు. 18 సంవత్సరాలు వయస్సు కలిగిన యువతీ యువకులు 2012 జూలై 2వ తేదీలోగా తమ దరఖాస్తులను జిల్లా పరిశ్రమల కేంద్రం ఆదిలాబాద్‌కు పంపించాలని కోరారు. పరిశ్రమలను బట్టి 15 నుండి 35 శాతం వరకు సబ్సిడీ లభిస్తుందని రవీందర్ వివరించారు.
ఇందిరాక్రాంతి పథం ద్వారా 27న ఉపకార వేతనాల పంపిణీ
ఆదిలాబాద్ టౌన్, జూన్ 21: జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఇందిరాక్రాంతి పథం ద్వారా జిల్లాలో అర్హత గల పిల్లలకు శుక్రవారం పంపిణీ చేయాల్సిన స్కాలర్‌షిప్‌లను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని డిఆర్‌డిఎ పిడి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. 2011-12 సంవత్సరానికి గాను ఆమ్ ఆద్మీ బీమాయోజన, జనశ్రీ బీమాయోజన, డాక్టర్ వైఎస్‌ఆర్ అభయహస్తం కింద సభ్యత్వం గల వారి పిల్లలకు మొత్తం 31552 మందికి స్కాలర్‌షిప్‌లు అందజేస్తామని, ఈ మార్పును గమనించాలని కోరారు.
ఏజెన్సీలో ప్రొఫెసర్ జయశంకర్ సార్‌కు ఘన నివాళి
ఉట్నూరు, జూన్ 21: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతగానో శ్రమించి కార్యక్రమాలు రూపొందించిన ఉద్యమస్ఫూర్తి ప్రొఫేసర్ జయశంకర్ సార్ ప్రథమ వర్థంతిని ఉట్నూరులో గురువారం తెలంగాణవాదులు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక రాంజీగోండ్ భవన్‌లో తెలంగాణ జెఎసి కన్వీనర్ తిరుపతి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ జెఎసి, ఉద్యోగ జెఎసి నేతలు పాల్గొని జయశంకర్ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జెఎసి నాయకులు మాట్లాడుతూ 60 యేళ్ళుగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు నడిపిన మహనీయుని బాటలో ప్రతీ ఒక్కరు నడవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడే జయశంకర్ ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు. విద్యార్థి దశ నుండే తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాన్ని ప్రారంభించిన జయశంకర్ అందరికి ఆదర్శనీయుడని అన్నారు. సీమాంధ్ర పాలకులకు బుద్ది చెప్పేందుకు తెలంగాణ ప్రజలందరు ఏకమై ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం సాధించేందుకు ఉదమాలను చేపడ్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఆదివాసి సంఘాల నాయకుడు సిడాం శంభు మాట్లాడుతూ రాష్టప్రతి ఎన్నికల్లో గిరిజన అభ్యర్థి సంగ్మాకు ప్రతీ ఒక్కరు మద్దతు ఇవ్వాలని అన్నారు. అదే విధంగా తెలంగాణపై పాలక ప్రభుత్వాలు స్పష్టమైన వైఖరి కనబర్చినప్పుడే తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆత్రం భుజంగ్‌రావు, శ్యాముల్, కట్ట లక్ష్మణచారి, దిలేష్ చౌహాన్, బొంత ఆశారెడ్డి, కుడ్మెత భీంరావ్ తదితర నేతలు పాల్గొన్నారు. కాగా ఏజెన్సీలోని నార్నూరు, జైనూర్, సిర్పూర్-యు, కెరమెరి, ఆసిఫాబాద్ తదితర ప్రాంతాల్లో జయశంకర్ వర్థంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో తెలంగాణవాదులు పాల్గొన్నారు.
దేవాలయాలు ధర్మానికి ప్రతీకలు
* హంపి పీఠాధిపతి విద్యారణ్యభారతి స్వామీజీ
* బాసర నుండి రథయాత్ర ప్రారంభం
బాసర, జూన్ 21 : ధర్మానికి ప్రతీకలుగా మన దేవాలయాలు నిలుస్తున్నాయని హంపి పీఠాధిపతి విద్యారణ భారతి స్వామీజీ అన్నారు. గురువారం బాసర క్షేత్రంలో హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శ్రీ కమలానంద భారతీస్వామీజీ తలపెట్టిన సంపూర్ణ గ్రామ దేవాలయాల సందర్శన రథయాత్ర ప్రారంభ కార్యక్రమాన్నుద్దేశించి వారు మాట్లాడారు. దేశవ్యాప్తంగా 70వేల పై చిలుకు ఆలయాలు ధూపధీపాలకు నోచుకోవడంలేదన్నారు. ఆ దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు అందేలా చూడాల్సిన అవసరం ప్రతీ హిందూ సోదరుణిపై ఉందన్నారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను ఇతర మతస్తులు కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నా పాలకులు వారి ఓటు బ్యాంకుకు ఆశపడి ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు. భగవద్గీతను అందరూ ఉచ్ఛరించేలా ప్రతీ ఒక్కరూ కృషిచేయాల్సిన అవసరముందన్నారు. సంపూర్ణ గ్రామ దేవాలయ రథయాత్ర చేపట్టడం ఎంతో మహోన్నతమైన కార్యక్రమమని పలువురు పీఠాధిపతులు కొనియాడారు. రథయాత్ర నిర్వాహకులు శ్రీ కమలానంద భారతి స్వామీజీ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలోని దేవాలయాలను సందర్శించి అక్కడి హిందూ సోదరులను ఏకతాటిపై తీసుకువచ్చి వారిచే సమాజ సేవ చేయడానికి కృషిచేయడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు. అంతకు ముందు గ్రామానికి చెందిన శిశుమందిర్ విద్యార్థులు పీఠాధిపతులకు ఘనస్వాగతం పలికారు. వివేకానందుని 156వ జయంతిని పురస్కరించుకొని వివేకానంద రచనలను ఈ సందర్భంగాపీఠాధిపతులు విడుదల చేశారు. సంపూర్ణ గ్రామ దేవాలయాల సందర్శన రథయాత్రను పీఠాధిపతులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రథయాత్రను ప్రారంభించారు. గ్రామంలోని చింతామణి గణపతి ఆలయం వద్ద కమలానంద భారతి స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ కమిటీ సభ్యుడైన అంశారావుతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, ఆలయ వ్యవస్థాపక వంశీయుడు శరత్‌పాఠక్, ఈ ఓ ముత్యాలరావు, బీ జేపీ రాష్ట్ర నాయకులు అయ్యన్నగారి భూమయ్య, బీజేపీ జిల్లా కార్యదర్శి పాకాల రాంచందర్, మాజీ ఎంపీటీసీ రాజన్న, గ్రామంలోని వివిధ ఆలయాల కమిటీ చైర్మన్‌లు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారి సన్నిధిలో పీఠాధిపతుల పూజలు
బాసర, జూన్ 21 : చదువుల తల్లి కొలువుదీరిన బాసర శ్రీ జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారి సన్నిధికి గురువారం పలువురు పీఠాధిపతులు విచ్చేశారు. సంపూర్ణ గ్రామ దేవాలయాల సందర్శన రథయాత్ర కార్యక్రమానికి విచ్చేసిన పీఠాధిపతులతో ఆలయ ప్రాంగణంలో పండగ వాతావరణం నెలకొంది. పలువురు పీఠాధిపతులను ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పీఠాధిపతులకు ఆలయ అర్చకులు ప్రవీన్‌పాఠక్ అమ్మవారి ప్రసాదంతో పాటు ఫోటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీతేంద్ర భారతిస్వామీజీ(తమిళనాడు), విద్యానంద భారతీ స్వామీజీ(హంపి), మాధవానంద సరస్వతి స్వామీజీ(తోగుట), రామదూత స్వామీజీ(సాయిరాం,కేసగుట్ట), సత్యానంద స్వామీజీ(్భవనేశ్వరి పీఠాధిపతి), రాధానంద భారతి స్వామీజీ(కూర్తులం, తమిళనాడు పీఠాధిపతి), నిర్మలానంద భారతీ స్వామీజీ(హైదరాబాద్)లు పాల్గొన్నారు.
ఆలయ సూపరింటెండెంట్‌గా గిరిధర్
బాసర, జూన్ 21 : బాసర శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న వి.గిరిధర్‌ను ఆలయ సూపరింటెండెంట్‌గా నియమించినట్లు ఆలయ ఈ ఓ ముత్యాలరావు ఒక ప్రకటనలో తెలిపారు.
రైతుల బాధలు ప్రభుత్వానికి పట్టవా?
* నిజామాబాద్ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ
బాసర, జూన్ 21 : తొలకరి జల్లులు సకాలంలో కురియడంతో రైతన్నలు ఎంతో సంతోషంతో ఉన్నా ప్రభుత్వం వారి ఆశలపై నీరు చల్లేలా వ్యవహరిస్తుంది.. రైతుకు అవసరమయ్యే పత్తి, సోయా విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడం సిగ్గుచేటని బీజేపీ ఎమ్మెల్యే యెండెల లక్ష్మీనారాయణ ప్రభుత్వ తీరుపై దుయ్యబట్టారు. గురువారం బాసరలో విలేకరులతో మాట్లాడుతూ రైతులకు కావాల్సిన డీ ఏపీ ఎరువులు సైతం బ్లాక్ మార్కెట్‌కు తరలించి రైతులకు అన్యాయం చేస్తుందని ఆయన అన్నారు. రైతాంగానికి జరుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 22న జైల్‌భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతకు ముందు బాసర అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు అయ్యన్నగారి భూమయ్య, నాయకులు పాకాల రాంచందర్, మాజీ ఎంపీటీసీ రాజన్న, జే ఏసీ చైర్మన్ మనోహర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
సంఘటనా స్థలాన్ని సందర్శించిన డీ ఎస్పీ
బాసర, జూన్ 21 : బాసర గ్రామంలోని శారదానగర్ కాలనీలో ఈ నెల 17వ తేదీ ఆదివారం రాత్రి తమ్ముని చేతిలో అన్న హత్యకు గురైన సంఘటనా స్థలాన్ని గురువారం భైంసా డీ ఎస్పీ దేవిదాస్‌నాగుల సందర్శించారు. కుటుంబ సభ్యులను సంఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట ముధోల్ సీ ఐ శ్రీనివాసరావు, బాసర ఎస్సై సతీష్ ఉన్నారు.
పంట రుణాల పంపిణీపై అలసత్వం వద్దు
* వాటర్‌షెడ్‌ల నిర్మాణంపై అసంతృప్తి
* విజిలెన్స్ మానిటరింగ్ సమావేశంలో కలెక్టర్ అశోక్
ఆదిలాబాద్, జూన్ 21: జిల్లాలో రైతులు ఖరీఫ్ సాగుకు సమాయత్తం అవుతున్నా, పంట రుణాల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతుందని, రైతుల అవసరాలను సత్వరమే తీర్చాల్సిన బాధ్యత అధికారులు, బ్యాంకర్లపై వుందని జిల్లా కలెక్టర్ ఎ అశోక్ అన్నారు. గురువారం జరిగిన జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ సమావేశానికి కలెక్టర్ హాజరై వివిధ శాఖల అభివృద్ధి, పనితీరుపై సమీక్షించారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ద్వారా చేపడుతున్న వాటర్‌షెడ్ల పనితీరు అధ్వాన్నంగా మారిందని, స్వచ్చంధ సంస్థలు సకాలంలో పూర్తి చేస్తున్నా, ప్రభుత్వం చేపట్టే పనులే నత్తనడకన సాగుతున్నాయని అసంతృప్తివ్యక్తం చేశారు. వాటర్‌షెడ్లకు అవసరమైన విద్యుత్ స్తంభాలు అమర్చక పోవడం వల్ల వాటర్‌షెడ్లు ప్రయోజనం చేకూర్చడం లేదని డిఆర్‌డిఎ పిడి వెంకటేశ్వర్లు కలెక్టర్‌కు వివరించారు. ఎన్‌జిఓలు చేపట్టి అమలు జరుపుతున్న సంస్థలు వేగవంతం చేస్తున్నామన్నారు. వాటర్ షెడ్లకు సత్వరమే డ్రిల్ చేయించి వాటర్ షెడ్లకు పవర్ జనరేషన్ చేయించుట వల్ల వ్యవసాయదార్లకు విద్యుత్ అందించడంలో ఎపి ట్రాన్స్‌కో అధికారులు తోడ్పడాలన్నారు. పంచాయితీ రాజ్ ఇఇ ఆసిఫాబాద్ ఉమామహేష్‌తో కలెక్టర్ మాట్లాడుతూ ఆసిఫాబాద్ డివిజన్‌లో బిడ్స్ పనులు సకాలంలో పూర్తి చేయాల్సిందిగా కోరారు. నిర్ణీత కాలంలో పనులు పూర్తిగా జరిగే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని పనులు చేపట్టాలని కోరారు. ఉన్నత అధికారులు పనులను సమీక్షించడంలో పాజిటివ్, నెగెటివ్‌లు అధికారులు అందించే జవాబులపై ఆధారపడి వుంటాయన్నారు. పనులు చేయించడం, ఆలస్యాలకు ఎన్నో సమస్యలుంటాయని, వాటిని గుర్తించి లోపాలకు తగిన సమాధానం అందించడం ముఖ్యమన్నారు. తాగునీటి సరఫరాను గ్రామాల్లో అందించడంలో ఏర్పడుతున్న సమస్యల గురించి కలెక్టర్ అడిగినప్పుడు జిల్లా గ్రామీణ నీటి పారుదల విభాగం ఎస్‌ఇ వీరప్రతాప్ సమాధానమిస్తూ తాగునీటి సరఫరాను ట్రాక్టర్ల ద్వారా నీటిని అందిస్తున్నామని, జనాభా ప్రాతిపధికన 250 మంది ప్రజలకు ఒక బోరుబావి చొప్పున వేయిస్తున్నామన్నారు. మంచిర్యాల డివిజన్‌లో గృహ నిర్మాణ సంస్థ 48,958 చెల్లించాల్సి వుందన్నారు. గ్రామాల్లోని ప్రజలు మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయించుకొని వినియోగించుకోవడం వల్ల పారిశుధ్య పనులు సులభతరంగా తగ్గిపోయి ఆరోగ్యవంతమైన గృహ వాతావరణం ఏర్పడుతుందన్నారు. గ్రామాల్లోని ప్రజలందరు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకొని వాడుకోవడంలో ప్రజలను చైతన్యవంతులను చేయాలని, కుటుంబమంతా విజ్ఞానవంతులై మరుగుదొడ్లను వాడుకోవడానికి అలవాడు పడ్తారని కలెక్టర్ అన్నారు. మంచిర్యాల డివిజన్ ప్రాంతాల్లో నిర్మిస్తున్న రోడ్ల నిర్మాణాలకు అవసరమైన విద్యుత్‌ను వాడుకోవడం, కరెంటు పోల్స్ సరఫరా గురించి ఎపి ట్రాన్స్‌కో ఎస్‌ఇ కిషన్‌ని కలెక్టర్ అడుగగా, నాబార్డు నిధుల ద్వారా 15 రోజుల్లో పోల్స్ 11,12 పునలు చేయాల్సి వున్నా, అవి అభివృద్ది దశలో వున్నాయన్నారు. నిర్మల్ డివిజన్ మహబూబ్‌ఘాట్ వద్ద ఒకటి, ఆదిలాబాద్‌లో ఒకటి వున్నాయని, అన్ని పనులు రొటేషన్ పద్దతిలో వేసుకొని రిపేర్ చేయించాలని కలెక్టర్ అన్నారు. మంచిర్యాల డివిజన్ బతుకమ్మ వాగు వంతెన నిర్మాణం, అర్జునగట్టు వాగుల నిర్మాణాలు జరగవలసి వున్నందున యుద్దప్రతిపాధికపై చేపట్టాల్సిన అవసరం వుందని కలెక్టర్ పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. ఇక నుండి జిల్లా సమావేశ మందిరంలో నిర్వహించనున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల సమీక్ష సమావేశాలకు విధిగా పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కార్యక్రమాలను జిల్లా అధికారులకు తెలియపర్చాలని కలెక్టర్ అన్నారు. కేవలం కార్యక్రమాల వివరాలను సమావేశంలో తెలపడంతో అందరు అధికారులకు అర్థంకాక పోవచ్చన్నారు. అధికారులకు నివేదికలతో పాటుగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేయించాలన్నారు. ఈ సమావేశంలో ఎజెసి వీరమల్లు, జడ్పీ సిఇఓ వెంకటయ్య, డిఎహెచ్‌ఓ మాణిక్యరావు, డిపిఓ పోచయ్య, ఎపి ట్రాన్స్‌కో ఎస్‌ఇ కిషన్, జెడిఎ రోజ్‌లీలా తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ మృతి తెలంగాణ ప్రజలకు తీరని లోటు
* మంచిర్యాల ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి
దండేపల్లి, జూన్ 21: ప్రొఫెసర్ జయశంకర్ మృతి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు తీరని లోటని మంచిర్యాల ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రానికి చెందిన గుండ రవిందర్ ఏర్పాటు చేసిన జయశంకర్ విగ్రహాన్ని మండల కేంద్రంలోని మండల విద్యాధికారి కార్యాలయం ముందు ఆయన ఆవిష్కరించారు. జయశంకర్‌కు రెండు నిమిషాలు వౌనం పాటించి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటే తన ధ్యేయంగా పని చేసిన ఆచార్యులు మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. ఆయన మన మధ్యలో లేకున్నా ఆయన చూపిన దారిలో నడుస్తూ తెలంగాణ ఏర్పాటు కోసం అలుపెరగని ఉద్యమం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమం ఆరంభానికి ముందు నుంచే ఆంధ్ర వలస వాదులపై ఉద్యమం చేస్తూనే ఉన్నారని తెలంగాణ కోసం అలుపెరగని పోరాటం చేసిన మహాయోధున్ని కోల్పోవడం దురదృష్టంకరమని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు తెలంగాణ కోసం కార్యోన్ముకులు కావాలని ఆయన కోరారు. తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడమే కాకుండా ఆయన తెలంగాణ ఆవశ్యకతపై ప్రజల్లోకి వెళ్ళి వివరించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప తహశీల్దార్ ఆనంద్‌రావ్, మాజీ జెడ్పీటీసి సభ్యుడు మంద రాజయ్య, మార్కెట్ మాజీ కమిటీ చైర్మన్ ముత్తే రాజమల్లయ్య, మాజీ ఎంపిపి జాబు కాంతరావ్, తెరాస మండల పార్ట్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చీర్ల వెంకటేశ్వర్లు, సందెల తిరుపతి, తెరాస యువజన విభాగం తూర్పు జిల్లా అధికార ప్రతినిధి ఆకుల దుర్గప్రసాద్, జిల్లా కార్యదర్శి గోపతి రాజయ్య, కుల సంఘాల జెఎసి కోశాధికారి ముత్తే రాజన్న, నాయకులు గడ్డం శ్రీనివాస్, బండ ఉదయ్, రేణి శ్రీనివాస్ యాదవ్, అంబేద్కర్ సంఘం జిల్లా కార్యదర్శి గోల్ల రాజమల్లు, మండల ఆధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బచ్చల అంజన్న, మంత్రి దేవయ్య, తెరాస పట్టణ కమిటీ అధ్యక్షుడు కట్ట వెంకటేశ్, గోట్ల భూమన్న, అజ్మీర కిషన్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ నినాదంతో ముందుకు...
బెల్లంపల్లి, జూన్ 21: సింగరేణిలో గుర్తింపు ఎన్నికలకు సమయం వారం రోజులే ఉండడంతో గెలుపుకోసం పోటీలో ఉన్న సంఘాలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అయితే ఈ సారి జరిగే ఎన్నికల్లో బరిలోని సంఘాలన్నీ జైతెలంగాణ నినాదం చేయడంతో పాటు, తమతమ ఎన్నికల ప్రణాళికలో సైతం తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయమంటూ పేర్కొంటుండంతో కార్యకర్తలు నీది తెలంగాణే మాదీ తెలంగాణే అంటూ కార్మికులను మచ్చిక చేసుకోడానికి నానా పాట్లు పడుతున్నారు. ఎన్నికల వేళ అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ప్రత్యర్థి సంఘాలకు పిండా, ప్రధానం చేసినంత పని చేస్తున్న కొన్ని సంఘాలు సింగరేణిలో ఎన్నికల్లో తెలంగాణ నినాదం లేనిదే మనుగడ లేదని గుర్తించినట్లు ఎన్నికల ప్రచార శైలి చూస్తే అర్థమవుతోంది. అయితే సింగరేణి ఎన్నికల్లో జాతీయ సంఘాలకు ధీటైన పోటీనిస్తున్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిబిజికెఎస్) మొదటి నినాదం జైతెలంగాణతోనే మొదలు పెట్టి తెలంగాణ నినాదంతోనే ముగిస్తున్నందున బొగ్గుగని కార్మికుల్లో సహజంగానే తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉండడంతో దాని విరుగుడుకు అనేక ప్రయత్నాలు చేసి చివరికి సింగరేణి ఎన్నికలకు, తెలంగాణ వాదానికి సంబంధం లేదంటూ ప్రచారం చేసినా చివరికి ఆయా సంఘాలు సైతం జై తెలంగాణ అంటూ నినదించడం గమనార్హం. గత ఎన్నికలతో సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల్లో ఆరంగ్రేటం చేసిన టిబిజికెఎస్ గని కార్మిక సమస్యలతో పాటు తెలంగాణ నినాదంతోనే గుర్తింపు సంఘం గెలుపునకు అతిసమీపంలోకి వచ్చి స్వల్ప ఓట్లు మెజార్టీతో గుర్తింపుకు దూరమైన ఈసారి పక్కా ప్రణాళికతో తెలంగాణ నినాదంతో పాటు, వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ, కొత్తగనులు, ఉద్యోగాలు, లాభాల్లో 25 శాతం వాటా మన తెలంగాణ మన సింగరేణి అనే నినాదాల్ని భుజాన వేసుకోవడంతో తెలంగాణ నినాదం కేవలం టిబిజికెఎస్‌కు మాత్రమే అనుకూలం కాకుండా ఉండేందుకు జాతీయ సంఘాలతో పాటు ప్రాంతీయ సంఘాలు తెలంగాణ నినాదం బాట పట్టడంతో సకలజనుల సమ్మె విరమణ తర్వాత తెలంగాణ జిల్లాల్లో సద్దుమణిగిన జై తెలంగాణ నినాదాలు సింగరేణిలో బొగ్గు గనుల్లో నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయ.