నల్లగొండ, జూన్ 21: జిల్లాలో రైతులకు ఖరీఫ్ పంటల సాగుకు అవసరమైన విత్తనాలు..ఎరువుల సరఫరాలో ఎలాంటి కొరత లేదని, అవసరమైనన్ని విత్తనాలు పంపిణీ చేసేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ ఎన్. ముక్తేశ్వరరావు తెలిపారు. గురువారం జెడిఏ నర్సింహ్మరావుతో కలిసి ఆయన కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జిల్లాకు వచ్చిన ఎరువులు, విత్తనాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. విత్తనాలు, ఎరువులకు కొరత నెలకొందన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కేవలం మహికో పత్తి విత్తనాల కోసం రైతులు కొన్ని చోట్ల డిమాండ్ చేయడంతోనే విత్తన కొరత సమస్య ఉన్నట్లుగా కనబడుతుందన్నారు. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో వరి 2.20లక్షల హెక్టార్లలో, పత్తి 2లక్షల హెక్టార్లలో సాగవుతుందన్న అంచనా వేసి అందుకు అవసరమైన విత్తనాలు, ఎరువుల సరఫరాకు చర్యలు తీసుకున్నామన్నారు. వివిధ రకాల వరి విత్తనాలు 23వేల 938క్వింటాళ్లను జిల్లా రైతులకు సరఫరా చేయగా ప్రస్తుత నిల్వలు 5484క్వింటాళ్లు ఉన్నాయని తెలిపారు. పత్తి ప్యాకెట్లు 6,17,489ప్యాకెట్లు తెప్పించగా 2,82,302ప్యాకెట్లు విక్రయించగా, 3.34,187ప్యాకెట్లు రైతులకు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. రైతులు మహికో పత్తి విత్తనాల కోసం కొన్ని చోట్ల డిమాండ్ చేయడంతో విత్తన కొరత ఉన్నట్లుగా తప్పుడు ప్రచారం సాగుతుందని, నిజానికి మహికో కంటే అధికంగా ఇతర కంపనీల విత్తనాలతోనే మంచి దిగుబడులు వస్తున్నాయన్న విషయాన్ని శాస్ర్తియ ఫలితాలు రుజువు చేస్తున్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి మహికో కంపనీ ఇస్తామన్న మేరకు విత్తన ప్యాకెట్లు ఇవ్వకపోవడంతో జిల్లాకు 1లక్ష 20వేలు రావాల్సివుండగా, కేవలం 25,766ప్యాకెట్లు సరఫరా జరిగాయని అందులో 23,770ప్యాకెట్లను రైతులకు అందించామన్నారు. అలాగే ఎరువుల కొరత సైతం లేదని, 1,70,695మెట్రిక్ టన్నుల ఎరువులకు జూన్ 31వ తేది వరకు కావాల్సిన నిల్వలు జిల్లాలో ఉన్నాయన్నారు. యూరియా 36వేల టన్నులకు సరఫరా జరిగింది పోగా 9568టన్నులు బ్యాలెన్స్ ఉందని, డిఎపి 20వేల 101టన్నులకు సరఫరా జరిగింది పోగా 5575టన్నుల బ్యాలెన్స్ ఉందని, ఎంవోపి, కాంప్లెక్సు ఎరువులు సైతం సరఫరా జరిగింది పోగా సమృద్దిగా నిల్వలు ఉన్నాయని తెలిపారు. జిల్లా రైతులు ఇక్కడి భూముల స్వభావం మేరకు పోటాషియం, భాస్వరం అధికంగా వాడరాదని తాను ప్రత్యేకంగా సూచిస్తున్నానన్నారు. జిల్లాలో ఎరువులు, విత్తనాల సరఫరాలో బ్లాక్ మార్కెటింగ్‌ను నివారించేందుకు ఇప్పటికే విజిలెన్స్, టాస్క్ఫోర్స్ బృందాలు రంగంలో ఉన్నాయని పలు దాడులు నిర్వహించి దాచిన నిల్వలను, నకిలి నిల్వలను పట్టుకోవడం జరిగిందన్నారు. స్వయంగా తన తరుపునా కొన్ని ప్రత్యేక బృందాలు దుకాణాలకు రైతుల మాదిరిగా వెళ్లి విత్తనాలు, ఎరువులు కావాలంటు బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలపై తనిఖీలు సాగిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. దుకాణాల వద్ధ విధిగా స్టాక్ బోర్డులు పెట్టుకోవాలని తెలిపారు. రైతులకు విత్తనాలు, ఎరువులకు సంబంధించి ఏదైన సమస్యలుంటే టోల్‌ఫ్రి నెంబర్ 8096696394నెంబర్‌కు ఫోన్ చేయాలని కలెక్టర్ సూచించారు.
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి
ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్
రాజాపేట, జూన్ 21: ఆలేరు నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో దశలవారీగా అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నట్లు ఆలేరు శాసనసభ్యులు బూడిద బిక్షమయ్యగౌడ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తాగునీటికోసం 86కోట్ల నిధులతో కృష్ణాజలాలను నియోజక వర్గానికి అందించన్నునట్లు, రెండునెలల్లో పని పూర్తవుతుందని వివరించారు. నియోజక వర్గంలో మంచినీటి శుద్ధి ప్లాంట్లను 182 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాగు నీరు అందించడానికి మండలంలోని పాముకుంట, పాలెంగండ్డి చెరువుకు 15 వేల కోట్లు రుణమంజూరికై ఐబి అధికారులతో నివేదికలను పంపించామన్నారు. నియోజకవర్గంలో 210 చెరువలు ఉండగా 88 చెరువులక మరమ్మత్తులు చేయడానికి 9కోట్లు నిధులు మంజూరు చేశామన్నారు. పార్టీలకతీతంగా అభివృద్ధికి సహరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఆల్డా చైర్మన్ బొందుగుల నర్సింహ్మరెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ చండ్రవౌలిగౌడ్, రాజాపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగిర్తి జనార్ధన్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు ఎడ్ల బాలలక్ష్మి, నెమ్మిల మహేందర్, బాలయ్య, గుట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు బీల్ర ఐలిమల్లయ్య గుట్ట మహిళ అధ్యక్షురాలు ప్రమీల, ఆలేరు మండల పార్టీ అధ్యక్షులు, జయకుమార్, తదితరులు పాల్గొన్నారు.
రిలయన్స్ వైద్య సేవలు అభినందనీయం
ఎమ్మెల్యే బాలునాయక్
చింతపల్లి, జూన్ 21: గ్రామీణా ప్రాంతాలోని ప్రజలకు రిలయన్స్ సంస్థ అందిస్తున్న వైద్య సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు. మండలంలోని కుర్మేడు స్టేజి వద్ద రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ రిలయన్స్ సంస్థలో సభ్యత్వం లేని వారికి కూడా వైద్యసేవలు అందించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి రాములు నాయక్, స్థానిక ఆర్‌ఎంపి వైద్యుడు నిజాముద్దీన్‌లు సుమారు 200 మంది రోగులకు పరిక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలునాయక్ వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు దుశె్చర్ల యాదగిరి, మాల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్‌లు జంగయ్య, శెక్రూ నాయక్, కుర్మేడి బజార్ ఎండి షఫి, గౌస్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
25న ప్రైవేట్ వైద్యశాలల బంద్
ఐఎంయు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు
నల్లగొండ టౌన్, జూన్ 21: ప్రజారోగ్య రక్షణలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 25న దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రైవేట్ వైద్యశాల బంద్ నిర్వహిస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసిషియేన్(ఐఎంయు) జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్‌రావు తెలిపారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బంద్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ వైద్య వ్యవస్థపై నియంత్రణ పేరుతో ప్రైవేట్ వైద్యులపై అధికారాలు చెలాయించడానికి సిఇ యాక్ట్‌ను ప్రవేశపెట్టడం అన్యాయమన్నారు. నేషనల్ కమీషన్ ఫర్ హ్యుమన్ రిసొర్సెస్ ఫర్ హెల్త్(ఎస్‌సిహెచ్‌ఆర్ హెచ్) నామినేటెడ్ కార్యవర్గంతో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవటానికి కేంద్రం సిద్దమవడం వైద్య రంగానికి వ్యతిరేకంగా ఉందన్నారు. డాక్టర్ వృతి చేసిన వారు మరే ఇతర వృతులు నిర్వహించరాదని తెలపడం బాధకరంగా ఉందన్నారు. ఈ నెల 25న సమ్మెలో భాగంగా అన్ని రకాల అత్యవసర సేవలను జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర వైద్య శాలలో మాత్రమే సేవలు అందించడం జరుగుతుందని, ఒక ఐఇసియు మాత్రమే పనిచేస్తుందని తెలిపారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కారించాలని లేని పక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామరని హెచ్చరించారు. బంద్‌కు అందరు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎసి హెచ్.పుల్లారావు, ఉపాధ్యక్షుడు జయప్రకాష్‌రెడ్డి, డాక్టర్ హరినాధ్ తదితరులు పాల్గొన్నారు.
3.80 కోట్లతో మంచినీటి నివారణ చర్యలు
- జడ్పీ సిఇఓ కోటిరెడ్డి -
నేరేడుచర్ల, జూన్ 21: జిల్లాలో 3.80కోట్ల రూపాయలతో మంచినీటి నివారణ చర్యలు తీసుకొన్నట్లు జిల్లా పరిషత్ సిఇఓ గుండ్రెడ్డి కోటిరెడ్డి అన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్ 2010నుండి 2012 ఆర్ధిక సంవత్సరాల రాబడి ఖర్చులను తనిఖీ చేసిన సందర్భంగా మాట్లాడుతూ ఈ సంవత్సరం గతంలో ఎన్నడూలేనివిధంగా వేసవికాలంలో 2కోట్ల రూపాయలతో మంచినీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకొన్నామన్నారు. ఇంకా 1.80 కోట్ల రూపాయలు మంచినీటి కోసం విడుదలైనట్లు ఇవి ఖర్చుచేయాల్సి ఉందని ఆయన అన్నారు.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది నిధులనుండి జిల్లాకు 29 కోట్ల రూపాయలు మంజూరుకాగా ఇప్పటికే 12 కోట్ల రూపాయల నిధులు ఆయా మండలాల్లో అభివృద్ది పనులు చేశామని, 17కోట్లు ఇటీవల విడుదలైనట్లు జిల్లాలోని మండలాలకు కేటాయించనున్నట్లు వివరించారు. 13వ ఆర్ధిక సంవత్సరం నిధుల క్రింద 75లక్షలు మంజూరు కాగా మంచినీటి బోర్ల మరమ్మత్తు, విడి భాగాల కొనుగోలుకు కేటాయించినట్లు తెలిపారు. ఇవికాకుండా మంచినీటి ఎద్దడి నివారణకు సిఆర్‌ఎఫ్ క్రింద రవాణా ద్వారా మంచినీటి అందించడం, ప్రయివేట్ బోర్డు అద్దెకు తీసుకోని నీరు సరఫరా చేయించడం జరిగిందన్నారు. జిల్లా ఈ సంవత్సరం వనమహోత్సవ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నామని ఈ నెలాఖరులోగా ఎంఇఓ, ఎండిఓ, పంచాయితీరాజ్ కార్యకర్తలు, విఆర్‌ఓలతో వేర్వేరుగా డివిజన్ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్థుత వర్షాకాలంలో సీజనల్ వ్యాదులు, అంటురోగాలు రాకుండా చర్యలు తీసుకొనున్నట్లు తెలిపారు. మండల పరిషత్‌కు ఏఏగ్రాంటు క్రింద ఎన్ని నిధులు వచ్చాయో, జనరల్ ఫండ్ క్రింద ఎన్ని నిధులు వచ్చాయో, ఏ శాఖకు ఎన్ని నిధులు కటేయించారు రికార్డులు పరిశీలించానని, రికార్డులు సక్రమంగా ఉన్నాయని సంతృప్తివ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ ఐ.పద్మ, ఎంఇఓ నర్సింహానాయక్, ఇఓఆర్‌డి వెంకటేశ్వర్లు, పర్యవేక్ష ణాధికారి మూర్తి తదితరులు పాల్గొన్నారు.
నేడు సామూహిక అక్షరాభ్యాసం
- కలెక్టర్ ముక్తేశ్వరరావు రాక -
నల్లగొండ రూరల్, జూన్ 21: విద్యాపక్షోత్సవాల్లో భాగంగా నేడు నల్లగొండ మండలంలలోని అప్పాజీపేట గ్రామంలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముక్తేశ్వర్‌రావు హజరు కానున్నారు. ఈ సందర్భంగా ఉదయం కలెక్టర్ రాగానే ఒకటవ తరగతిలో ప్రవేశం పొందిన 25 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి ప్రభుత్వ పాఠశాలల నిర్వాహణ, వౌలిక వసతులపై మాట్లాడి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు అవసరమైన సలహలు, సూచనలు ప్రధానోపాధ్యాయులకు ఇవ్వ డం జరుగుతుంది. మెరుగైన విద్యాభోధనే లక్ష్యం గా పాఠశాలను తీర్చిద్దిదేందుకు పాఠశాల యాజమాన్య కమిటీలకు సందేశం ఇవ్వనున్నారు. కలెక్టర్ గ్రామానికి వస్తుండటంతో అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఎమ్మార్పిలు, రెండు రోజుల నుండి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గురువారం ఆర్‌విఎం ప్రాజెక్ట్ అధికారి బాబు భూక్య పాఠశాలకు వచ్చి ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న బోజన ఏజెన్సీ వద్దకు వెళ్ళి విద్యార్థులకు వండుతున్న వంటను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పథకాలను చిత్తశుద్ధితో అమలుచేయాలి
రామన్నపేట, జూన్ 21: ప్రభుత్వ రైతులకు, మహిళలకోసం ప్రవేశపెడుతున్న వివిధ పథకాలను అధికారులు చిత్తశుద్దితో అమలుచేయాలని డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ జె. రాజేశ్వర్‌రెడ్డి కోరారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపిడివో కార్యాలయంలో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రైతులకు, మహిళలకు ప్రభుత్వం ప్రకటించిన వడ్డీలేని రుణాలు సక్రమంగా అందేలా చూడాలని అన్నారు. కౌలు రైతులకు, రైతుల పంటరుణాలు ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో పంపిణి చేయాలని సూచించారు. ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలోని రైతుల పంటరుణాల కోసం ప్రభుత్వం 955కోట్ల రూపాయలు విడుదల చేసిందన్నారు. రుణంకోసం బ్యాంకు వచ్చిన రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండా సకాలంలో మంజూరు చేయాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న అర్హులైన కౌలు రైతులకు కూడా పంటరుణాలు మంజూరు చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో లీడ్‌బ్యాంకు మేనేజర్ పిజె.జేమ్స్, నాబార్డు ఏజిఎం వీరశంకర్, బిసి, ఎస్సీ కార్పోరేషన్ ఏడిలు కె. గంగాధర్, విజయనాయక్, రామన్నపేట, వలిగొండ ఎంపిడివోలు కె. ఇందుమతి, జానకిరెడ్డి, ఏవో కె. మాధవరెడ్డి, స్థానిక ఎస్‌బిహెచ్ మేనేజర్ భావనారుషితో పాటు రామన్నపేట, వలిగొండ, చౌటుప్పల్ మండలాలకు చెందిన బ్యాంకు, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఫిట్‌నెస్‌లేని స్కూల్ బస్సుల సీజ్
జిల్లాలో విరివిగా తనిఖీలు
నల్లగొండ, జూన్ 21: నిబంధనల మేరకు బస్సుల ఫిట్‌నెస్ కండిషన్ లేకుండా, ప్రావీణ్యం లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తు ప్రమాదాలకు, ప్రయాణీకుల, విద్యార్థుల ప్రాణహరణకు కారణమవుతున్న బస్సులపై రవాణా శాఖ యంత్రాంగం చేపట్టిన స్పెషల్ డ్రైవ్ జిల్లాలో సైతం ముమ్మరంగా సాగుతుంది. జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు లేనప్పటికీ పాఠశాలలు, కళాశాలల బస్సులను రవాణాశాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తు వాటిని విద్యాసంస్థల యాజమాన్యాలు సరిగా నిబంధనలకు మేరకు నడుపుతున్నారో లేదోనని పరిశీలించారు. బస్సులకు ఫిట్‌నెస్ సర్ట్ఫికెట్లతో పాటు డ్రైవర్ల లైసెన్స్‌ల పరిస్థితిని ఈ సందర్భంగా తనిఖీలు చేసి జిల్లావ్యాప్తంగా ఫిట్‌నెస్ లేని 15 బస్సులను సీజ్ చేశారు. భువనగిరిలో 7, బీబీనగర్‌లో 2, దేవరకొండలో 3, నల్లగొండలో 3 బస్సులను సీజ్ చేశారు. మిర్యాలగూడ, సూర్యాపేటలో సైతం బుధవారం 7 బస్సులను సీజ్ చేశారు. పాఠశాలలు, కళాశాలల బస్సుల ఫిట్‌నెస్ తనిఖీలు మరింత ముమ్మరం చేసి చట్టపర చర్యలు తీసుకుంటామని, విద్యాసంస్థలు నిబంధనల మేరకు బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని అవసరమైన వివరాల కోసం తమను సప్రదించాలని జిల్లా రవాణాశాఖాధికారులు తెలిపారు.
విత్తనాలకొరకు ఎగబడిన రైతులు
కోదాడ, జూన్ 21: విత్తనాలకొరకు కోదాడ వ్యవసాయశాఖ కార్యాలయానికి గురువారం పెద్దసంఖ్యలో రైతులు ఒకేసారి చేరుకోవడంతో విత్తనాల పంపిణీలో గందరగోళపరిస్ధితి నెలకొన్నది. వాస్తవంగా గత శుక్రవారంనుండి రైతులకు విత్తనాలను పంపిణీ చేస్తామని మండల వ్యవసాయాధికారి నాగేష్‌కుమార్ ప్రకటించినా గురువారం ఒకేసారి మండల పరిధిలోని వివిద గ్రామాలకు చెందిన రైతులు వరివిత్తనాలకొరకు మండల వ్యవసాయాధికారి కార్యాలయానికి గురువారం చేరుకొన్నారు. రైతుల పాస్ పుస్తకాలను పరిశీలించిన తరువాత విత్తనాల కూపన్‌లను వ్యవసాయశాఖ అధికారులు అందచేస్తే వాటిని తీసుకెళ్లి గోదాం దగ్గరనుండి విత్తనాలను తీసుకోవాల్సివుంటుంది. రైతులు ఒకేసారి కూపన్‌ల కొరకు ఎగబడటంతో గందరగోళ పరిస్ధితి నెలకొన్నది. పాస్ పుస్తకాలను వరుస క్రమంలో ఇవ్వకుండా రైతులు తమకంటే తమకు కూపన్‌లు ఇవ్వాలని ఎగబడటంతో గందరగోళ పరిస్ధితి ఏర్పడింది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి రైతులను సీరియల్‌లో వుంచి విత్తనాలను పంపిణీ చేసేవిధంగా చేశారు. రైతులు విత్తనాలను తీసుకొని వెళ్లిపోవడంతో పరిస్ధితి ప్రశాంతంగా ముగిసింది. విత్తనాలను ఇచ్చేందుకు తాము సిద్దంగానే వున్నామని, రైతులు సహకరించాలని మండల వ్యవసాయాధికారి నాగేష్‌కుమార్ కోరారు. అయితే మండల వ్యవసాయశాఖ గ్రామాలవారీగా విత్తనాల పంపిణీ తేదీలను ప్రకటిస్తే ఇలాంటి పరిస్ధితి ఏర్పడేది కాదని, ఇప్పటికైనా విత్తనాల పంపిణీ తేదీలను గ్రామాలవారీగా ప్రకటించాలని రైతునాయకులు డిమాండ్ చేస్తున్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి కృషి
సూర్యాపేట, జూన్ 21: సూర్యాపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపేందుకు కృషిచేస్తున్నట్లు స్థానిక శాసనసభ్యుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి చెప్పారు. గురువారం పట్టణంలోని చౌదరిచెరువు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికోసం ప్రణాళికాయుతంగా పాటుపడుతున్నానన్నారు. ప్రధానంగా సూర్యాపేట పట్టణ అభివృద్ధికి అధిక నిధులు మంజూరీ చేయిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డుల ప్రజలకు వౌళిక సదుపాయాలు కల్పించేందుకు కృషిచేస్తున్నానన్నారు. జాతీయస్థాయిలో గుర్తింపుపొందిన సూర్యాపేట మున్సిపాలిటీ ఆ ఖ్యాతిని కోల్పోకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించనున్నట్లు చెప్పారు. అన్ని గ్రామాలలో ప్రజలకు కావాల్సిన కనీస వౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణారెడ్డి, పోతు భాస్కర్, బైరు వెంకన్నగౌడ్, నాయకులు తోట శ్యామ్, జహీరోద్ధిన్, మడిపెల్లి విక్రమ్, అంజాద్ అలీ, వట్టె జానయ్యయాదవ్, ఇరిగి కోటేశ్వరీ తదితరులు పాల్గొన్నారు.
కారు, ఆయిల్ ట్యాంకర్ ఢీ ఇద్దరు మృతి
ఐదుగురికి తీవ్రగాయాలు
దామరచర్ల, జూన్ 21: మండల కేంద్రం సమీ పంలోని కొండ్రపల్లి ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ సమీపంలో అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై గురువారం తెల్ల వారుజామున కారు, ట్యాంకర్ ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలైన సంఘటన చోటుచేసుకుంది. వాడపల్లి గ్రామానికి చెందిన రణపంగ సుధాకర్, రణపంగ జయరాజ్, ముడి జీవ సుధాకర్, తగరం బిక్షం, వట్టెపు పెద్దఅక్కులు, కొమ్ముదాసు, కొమ్ము వెంక టేశ్వర్లు కారులో దామరచర్ల మండల కేంద్రానికి వస్తుండగా మిర్యాలగూడ నుండి దాచేపల్లి వైపు వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి కారును ఢీకొట్టడంతో వట్టెపు పెద్దఅక్కులు(25) అక్కడికక్కడే మృతిచెందాడు. మిగతా ఆరుగురికి తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో డాక్టర్‌లు హైద్రాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి పంపించారు. మార్గమధ్యలో రణపంగ సుధాకర్ (18) మృతిచెందాడు. తగరం భిక్షం, కొమ్ముదాసుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వాడపల్లి ఎస్‌ఐ టి.శ్రీనివాస్ తెలిపారు.