మహబూబ్‌నగర్, జూన్ 21: మహబూబ్‌నగర్ జిల్లాలో ఎరువులు, విత్తనాలకు ఎలాంటి కొరత లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. గురువారం మహబూబ్‌నగర్‌కు విచ్చేసిన సందర్భంగా రెవెన్యూ మీటింగ్‌హాల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎరువులు, విత్తనాలకు రైతులు ఇబ్బందులు పడకుండా గత నవంబర్ నుండే చర్యలు చేపట్టి వ్యవసాయశాఖను ఈ సంవత్సరం ఖరీఫ్‌కు ముందస్తుగానే సన్నద్ధం చేసినట్లు తెలిపారు. ఈ సంవత్సరం మే నెలలోనే విత్తనాలను జిల్లాకు పంపామని, గత సంవత్సరం రాష్ట్రంలో 90.50 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు పంపిణీ చేయగా ఈ సంవత్సరం 1.27 కోట్ల ప్యాకెట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కొన్ని జిల్లాల్లో మైకో పత్తి విత్తనాలు కావాలని రైతులు కోరిన చోట సమస్య వచ్చిందే తప్ప ఇంకెక్కడ సమస్య రాలేదన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు 11.64 లక్షల ప్యాకెట్లు పత్తి విత్తనాలు పంపగా ఇప్పటి వరకు 7 లక్షల ప్యాకెట్లు రైతులకు అమ్మారని, ఇంకా 4 లక్షల ప్యాకెట్లు ఉన్నాయని ఆయన వెల్లడించారు. అదేవిధంగా 31వేల మెట్రిక్ టన్నుల ఎరువులను జిల్లాలో సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఎరువులు, విత్తనాలకు కొరత ఉందని అపోహాలే తప్ప అది నిజం కాదన్నారు. ఎరువులకు కూడా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వమే అడ్వాన్స్‌గా మార్క్‌ఫేడ్ వద్ద నిధులను ఉంచుతుందని అన్నారు. ఈ సంవత్సరం కూడా రూ. 250 కోట్లను మార్క్‌ఫేడ్ వద్ద ఉంచినట్లు చెప్పారు. గత సంవత్సరానికి సంబంధించి పాత ఎరువులను పాత ధరలకే అమ్మాలని, అయితే జిల్లాలో ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో పాత ఎరువులను స్వాధీనం చేసుకొని తహశీల్దార్ల ద్వారా పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడైనా.. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే పోలీసు కేసు నమోదుతో పాటు లైసెన్స్ రద్దు, క్రిమినల్ కేసు నమోదు చేస్తామని మంత్రి హెచ్చరించారు. కల్తీ విత్తనాలు, ఎరువులు అమ్మే వారు, ఎక్కువ ధరకు అమ్మే వారంతా వ్యవసాయ అధికారులు కుమ్మక్కైతే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు రూ. 258 కోట్ల ఇన్‌ఫుట్ సబ్సిడీ మంజూరు కాగా రైతులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి వేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అందులో భాగంగా ఈనెలాఖరు వరకు మొత్తం ఖాతాలు తెరిపించి వారి ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు మహబూబ్‌నగర్ జిల్లాలో రూ. 125 కోట్లు విత్ డ్రా చేసినట్లు పేర్కొన్నారు. ఇకపై ఎరువులు, విత్తనాల విషయాన్ని జాయింట్ కలెక్టర్ పర్యవేక్షించాలని మంత్రి తెలిపారు. కొత్త విత్తన విధానాన్ని రూపొందించేందుకు జూలై 15లోగా మేధావులతో, శాస్తవ్రేత్తలతో రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అంతేకాకుండా సీడ్ విలేజ్ కార్యక్రమాన్ని మరింత విస్తృత పరిచి రైతులే విత్తనాల తయారీ చేసుకునేందుకు మరింత అవకాశం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 500 ఎఓ పోస్టులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కూడా పూర్తి చేసిందని, అయితే కొందరు కోర్టుకు వెళ్లడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయిందని, ప్రభుత్వం నుండి ఈ సమస్య త్వరగా పరిష్కారమయ్యేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్ర సమాచారశాఖ మంత్రి డికె అరుణ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు రూ. 125 కోట్ల ఇన్‌ఫుట్ సబ్సిడీ ట్రెజరీ నుండి డ్రా చేయడం జరిగిందని, మిగతా పరిహారాన్ని కూడా త్వరలోనే రైతుల ఖాతాల్లో వేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. విలేఖరుల సమావేశంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి మధుసూదన్‌రావు, కలెక్టర్ పురుషోత్తంరెడ్డి, వ్యవసాయశాఖ జెడి వినయ్‌చంద్ తదితరులు పాల్గొన్నారు.
పాత ఎరువుల నిల్వలు స్వాధీనం
* మంత్రి కన్నా లక్ష్మీనారాయణ
మహబూబ్‌నగర్, జూన్ 21: డీలర్లు, మార్క్‌ఫెడ్ దగ్గర ఉన్న పాత ఎరువులన్నింటిని స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను, అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆదేశించారు. జిల్లాలో ఎరువులు, విత్తనాలు, ఇన్‌పుట్ సబ్సిడీపై వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ గురువారం మహబూబ్‌నగర్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఎరువులు, విత్తనాల పంపిణీలో అవకతవకలు జరగకుండా, గొడవలు తలెత్తకుండా సక్రమ పర్యవేక్షణకు జాయింట్ కలెక్టర్‌కు బాధ్యతలను అప్పగించాలని సమావేశంలో మంత్రి సూచించారు. జిల్లాలో ఎరువులు, విత్తనాలకు ఎలాంటి కొరత తలెత్తకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పత్తికి సంబంధించి వివిధ కంపెనీలకు సంబంధించిన ప్యాకెట్లు 11.61 లక్షలు పంపడం జరిగిందని అన్నారు. ఇప్పటి వరకు 7 లక్షల ప్యాకెట్లు అమ్మినట్లు సమాచారం ఉందన్నారు. ఎరువులు జిల్లాలో 31వేల మెట్రిక్ టన్నుల స్టాక్ ఉందని, 2012 ఖరీఫ్‌కు సన్నద్ధం చేసేందుకు గత నవంబర్ నుండే చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇవ్వనున్నట్లు తెలిపారు. పొలంబడి, విత్తన గ్రామ కార్యక్రమాలను రైతుల వద్దకు తీసుకెళ్లడంలో వ్యవసాయ అధికారులు మరింత శ్రద్ధ కనబరిచి ఉండాల్సి ఉందని మంత్రి అభిప్రాయ పడ్డారు. అలాగే మైకో పత్తి విత్తనాలే ఎక్కువ దిగుబడి ఇస్తాయని దురాభిప్రాయాన్ని కూడా రైతుల్లో పూర్తిగా తొలగించడంలో అధికారులు సఫలం కాలేదని, ఇతర కంపెనీ విత్తనాలు సైతం మంచి దిగుబడిని ఇస్తాయనే విషయం అవగాహన కల్పించాలని కోరారు. గత సంవత్సరం కన్నా ఈ ఏడాది విత్తనాలు ఎక్కువ కేటాయించామని, ఎఓలు ఈ విషయాన్ని విస్తృతంగా తెలియజేయాలని అన్నారు. పాత ఎరువులను కొత్త ధరకు అమ్మరాదని, ఒకవేళ అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. డీలర్ల వద్దకు వెళ్లి బిల్లుల ఆధారంగా పరిశీలించినట్లయితే ఎక్కువ ధరలు అమ్మే వారు సులభంగా దొరికిపోతారని ఎఓలకు మంత్రి సూచించారు. పంట నష్టపరిహారం అందించడంలో బ్యాంకర్లు తాత్సార్యం చేస్తున్నారని, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో బ్యాంకర్లందరు ఎలాంటి డిపాజిట్ కోరకుండానే రైతుల నుండి బ్యాంకు అకౌంట్ తెరిచేందుకు సమ్మతించారని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహించే బ్యాంకు మేనేజర్ల విషయమై 27న జరిగే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హెచ్చరించారు. ఇన్‌పుట్ సబ్సిడీ పాత రుణాలకు ముడిపెట్టడం, రుణాలు రీ షెడ్యూల్డ్‌కు ముడిపెట్టడం వంటివి చేయరాదని, ప్రాధాన్యత క్రమంలో అకౌంట్లు తెరవాలని కోరారు. వ్యవసాయశాఖ అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని, ప్రతినిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ మరింత సేవలు అందించాలని అన్నారు. విత్తనాలు, ఎరువులను రైతులకు అందించడంలో వ్యవసాయశాఖ అధికారులు ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని సమావేశంలో మంత్రి డికె అరుణ సూచించారు. రిజర్వ్ బ్యాంకు నియమాల ప్రకారం సంపూర్ణ ఆర్థిక చేకూర్పు కింద ఒక కుటుంబానికి ఒక బ్యాంకు అకౌంట్ ఉండాలనే నిబంధన ఉందని, అలాంటపుడు రైతులకు ఎలాంటి డిపాజిట్లు లేకుండా అకౌంట్లు తెరువడంలో బ్యాంకర్లకు సమస్య ఏమిటని వ్యవసాయశాఖ కమీషనర్ కె.మధుసూదన్‌రావు ప్రశ్నించారు. అందువల్ల బ్యాంకర్లు అకౌంట్లు లేని రైతులందరికి అకౌంట్లు తెరువాలని, ప్రాధాన్యత ప్రక్రియలో తెరిపించాలని కోరారు. భవిష్యత్తులో రైతులకు ప్రభుత్వ పరంగా ఎలాంటి సబ్సిడీలు గానీ, పరిహారాలు వస్తే నేరుగా వారి అకౌంట్లకు పంపనున్నందున బ్యాంకర్లు రైతులకు ఎలాంటి డిపాజిట్ కోరకుండా అకౌంట్ తెరిపించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పురుషోత్తంరెడ్డి, వ్యవసాయశాఖ జెడి వినయ్‌చంద్, వ్యవసాయశాఖ, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్సుఢీకొని వ్యక్తి మృతి
మృతుడి బంధువులు, గ్రామస్థుల ఆందోళన
వనపర్తిటౌన్, జూన్ 21: వనపర్తి పట్టణశివారులోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ముందు గురువారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న టివిఎస్ ఎక్సెల్‌ను ఢీకొనడంతో మోపెడుపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పట్టణ ఎస్సై లక్ష్మీనారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నాగర్‌కర్నూలు మండలం తూడుకుర్తి గ్రామానికి చెందిన గొల్ల శ్రీనివాసులు యాదవ్(40) అనే వ్యక్తి ఎపి22 ఎ ఎఫ్ 3549 అనే టి వి ఎక్సల్ పై స్వగ్రామం నుండి వనపర్తికి వస్తూ డిగ్రీ కళాశాల ముందు నాగర్‌కర్నూలు డిపోకు చెందిన ఎపి 22 ఎక్స్2865 ఆర్టీసీ హయ్యర్‌బస్సు ఎదురుగా వచ్చి ఢీకొనడంతో శ్రీనివాసులు తలపగిలి మెదడు బయటకు రావడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. ఈప్రమాదంలో టివి ఎస్ ఎక్సల్ పూర్తిగా ధ్వంసమైంది. మృతుడికి భార్య మనెమ్మ, ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. కాగా తూడుకుర్తి గ్రామం నుండి మాజీ ఎంపిపి కోటయ్య, మాజీ సర్పంచ్ నర్సింహరెడ్డి, నాయకులు సుభాష్ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో సంఘటన స్థలానికి గ్రామస్థులు వచ్చి రాస్తారోకో చేపట్టి మృతుడి కుటుంబానికి నష్టపరిహారంతోపాటు ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్ చేసూ సాయంత్రం 6గంటలవరకు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. మృతుడు వ్యవసా యపనులు చేస్తూ పెరల్స్ ఏజెంట్ గాపనిచేస్తున్నాడని, సమావేశంకోసం వనపర్తికి వస్తూ ఈప్రమాదానికి గురైనట్లు గ్రామస్థులు తెలిపారు.
ఆర్టీఓ అధికారుల దాడులు
* 12 స్కూల్ బస్సుల సీజ్
* 13 ట్రావెల్ బస్సులపై కేసులు
మహబూబ్‌నగర్, జూన్ 21: రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న బస్సుల ప్రమాదాలపై ఆర్టీఓ అధికారులు కనె్నర్ర చేశారు. అందులో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం మహబూబ్‌నగర్‌లో పాఠశాలల సమయంలో ఆర్టీఓ అధికారులు రోడ్లపైకి వచ్చి ప్రతి ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల బస్సులను ఆపి తనిఖీలు చేశారు. బస్సుల కండిషన్‌తో పాటు లైసెన్స్‌లు, బస్సులకు అన్ని డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అదేవిధంగా డ్రైవర్లకు కూడా పలు ప్రశ్నలు వేసి ఉక్కిరిబిక్కిరి చేశారు. వాహనాలు నడిపేటపుడు తీసుకోవల్సిన జాగ్రత్తలను కూడా ఆరా తీశారు. అదేవిధంగా సీట్లకు దగ్గ కెపాసిటి ప్రయాణికులనే ఎక్కించుకోవాలని ఆదేశించారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలల బస్సులలో సామర్థ్యానికి మించి విద్యార్థులను తరలిస్తున్న బస్సులను సీజ్ చేశారు. సామర్థ్యానికి మించి విద్యార్థులను తరలిస్తున్న బస్సులతో పాటు వివిధ రకాల సమస్యలతో కూడిన దాదాపు 12 స్కూల్ బస్సులను జిల్లా ఆర్టీఓ అధికారి రాజారత్నం సీజ్ చేశారు. అదేవిధంగా మహబూబ్‌నగర్‌లోని, ఇతర ప్రాంతాలలో పలు ట్రావెల్ బస్సులపై కూడా దాడులు చేసి వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించారు. అయితే 13 ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు రాజారత్నం వెల్లడించారు. కాగా ఆర్టీఓ అధికారులు దాడులు చేస్తున్నారని సమాచారం తెలుసుకున్న ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యజమానులు ఉక్కిరిబిక్కిరయ్యారు. కెపాసిటికి మించి బస్సుల్లో తరలిస్తున్న విద్యార్థులను మార్గమధ్యలోనే దింపి కొన్ని పాఠశాలల యజమానులు ముందస్తుగా హుషారు పడి కెపాసిటి తగ్గట్టుగా విద్యార్థులను పాఠశాలలకు తీసుకెళ్లారు. ఈ దాడులు తరచుగా నిర్వహిస్తామని, జిల్లాలో అన్ని ప్రధాన రహదారులపై, అన్ని మున్సిపల్ పట్టణాలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని ఆర్టీఓ రాజారత్నం తెలిపారు.
ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
ఉత్తీర్ణత శాతంలో 23వ స్థానం
మహబూబ్‌నగర్, జూన్ 21: ఇంటర్మీడియట్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 24429 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 12483 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 51.10శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా ఈ ఫలితాల్లో జిల్లా 23వ స్థానంలో నిలిచింది. ఫస్టియర్ రెగ్యులర్ ఫలితాలు నిరాశ పరిచినా సప్లిమెంటరీ పరీక్షల్లో కూడా నిరాశే మిగిలింది. కాగా ఈ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల కన్నా ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు ఎక్కువ శాతం ఉత్తీర్ణులైనట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఆర్‌ఐఓ మల్లయ్య 2008 నుండి 2012 వరకు సాధించిన ఉత్తీర్ణతను వివరించారు. 2008లో 15108 మంది పరీక్షలు రాయగా 4642 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు పేర్కొన్నారు. ఆ ఏడాది 31శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు. 2009 అకాడమిక్‌లో 19934 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 8254 మంది ఉత్ణీరులయ్యారు. ఈ సంవత్సరం 41శాతం ఉత్తీర్ణత సాధించారు. 2010లో 17834 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 9641 మంది ఉత్తీర్ణులయ్యారు. 54శాతం ఉత్తీర్ణత సాధించారు. 2011లో 22557 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 12001 మంది ఉత్తీర్ణులు కాగా 53శాతం ఫలితాలు సాధించారు. 2012 ఈ ఏడాది 24429 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 12483 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా ఈ ఏడాది ఫస్టియర్ ఫలితాల్లో 23వ స్థానంలో జిల్లా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. కాకపోతే ప్రతి ఏడాది విద్యార్థుల సంఖ్య పెరగడం, ఉత్తీర్ణత సంఖ్య కూడా పెరుగుతుందని ఆర్‌ఐఓ మల్లయ్య పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫస్టియర్ ఫలితాల్లో మహబూబ్‌నగర్ పట్టణంలోని ప్రతిభ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు మంచి ఫలితాలను సాధించినట్లు ఆర్‌ఐఓ మల్లయ్య తెలిపారు. ఎంపిసి విభాగంలో మహ్మద్ ముషారఫ్ అలీ 465 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారు. అదేవిధంగా కె.హన్మంతు, బి.సంజీవలు 464 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు. బైపిసి విభాగంలో విద్యార్థి త్రివేద్ 431 మార్కులు సాధించారు. కాగా ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులను ఆర్‌ఐఓ మల్లయ్యతో పాటు కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలి
మహబూబ్‌నగర్, జూన్ 21: జిల్లా ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ వారి అభివృద్ధి కోసం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పురుషోత్తంరెడ్డి కొత్తగా వచ్చిన డిఆర్‌ఓ రాంకిషన్‌కు సూచించారు. గురువారం కొత్త డిఆర్‌ఓగా రాంకిషన్ విధుల్లో చేరిన అనంతరం కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిఆర్‌ఓకు పలు సూచనలు ఇచ్చారు. జిల్లాలో గతంలో తహశీల్దార్‌గా పని చేసిన అనుభవాన్ని డిఆర్‌ఓ విధుల్లో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా వెనుకబడినందున ప్రజలు పలు సమస్యలతో కలెక్టర్ కార్యాలయానికి వస్తారని, అయితే అలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేయాలని కోరారు. కాగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన డిఆర్‌ఓ రాంకిషన్ తన శాయశక్తులా కృషి చేసి జిల్లా ప్రజలకు సేవలు అందిస్తానని, అందరు అధికారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
గద్వాలలో మోటార్ సైకిళ్ల దొంగ అరెస్టు
గద్వాల, జూన్ 21: గద్వాల మండల పరిధిలోని అనంతాపురం గ్రామానికి చెందిన మోటార్ సైకిళ్ల గజదొంగను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు గద్వాల సిఐ నర్సింహులు తెలిపారు. సిఐ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పెబ్బేరు మండలం సూగూరు గ్రామానికి చెందిన నేష బలరాం గత పది సంవత్సరాల నుంచి అనంతపురం గ్రామంలో జీవిస్తున్నాడు. కర్నూలు పరిసర ప్రాంతాల్లో మోటార్ సైకిళ్లను దొంగతనం చేస్తూ అనంతాపురం శివారు గ్రామాల్లో వాటిని విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ విషయంపై పోలీసులు నిఘా ఉంచి నేష బలరాంను అదుపులోకి తీసుకొని విచారించగా బీరెల్లి, లత్తిపురం, అనంతాపురం, బసల్‌చెర్వు ప్రాంతాల్లో 24 టివిఎస్ ఎక్సల్ సూపర్ బండ్లను విక్రయించినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు మోటార్ సైకిళ్లన్నింటిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. మోటార్ సైకిళ్ల స్వాదీనానికి క్రైం బ్రాంచ్ పోలీసులు సవారన్న, గోవర్ధన్‌రెడ్డి, ప్రభాకర్, నర్సింహులు కృషి చేశారని ఆయన వారిని అభినందించారు. కర్నూలు పరిసర ప్రాంతాల్లోని పోలీస్‌స్టేషన్లకు మోటార్ సైకిళ్ల సమాచారం అందించామని సిఐ తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ ఎఎస్‌ఐ ఇసాక్, పోలీసులు ఉన్నారు.
పదోన్నతి పొందిన వారు మరింత ఉత్సాహంతో పని చేయాలి
* జిల్లా ఎస్పీ లక్ష్మిరెడ్డి
మహబూబ్‌నగర్, జూన్ 21: పదోన్నతి పొందిన వారు ఏ ఉద్యోగి అయినా మరింత ఉత్సాహంతో పని చేయాలని జిల్లా ఎస్పీ లక్ష్మిరెడ్డి సూచించారు. గురువారం హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన 27 మంది ఎఆర్ కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు. ఎఆర్ సిబ్బంది పోలీసు శాఖకు అత్యంత ప్రధానమైన రీతిలో సేవలు అందిస్తున్నారని, విఐపిల రక్షణ, అలజడుల నివారణలో అర్మ్‌డ్ రిజర్వ్ సిబ్బంది చురుకైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. పదోన్నతి పొందిన అధికారులకు మరింత బాధ్యత పెరిగిందని, బాధ్యతాయుతంగా ప్రజల రక్షణ కోసం, సమాజ శ్రేయస్సు కోసం పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. నిష్పక్షపాతంగా పని చేయవల్సిన అవసరాన్ని ఎస్పీ పదోన్నతి పొందిన హెడ్‌కానిస్టేబుళ్లకు సూచించారు. పదోన్నతి పొందిన హెడ్‌కానిస్టేబుళ్లకు వారికి సంబంధించిన బ్యాడ్జీలు, బెల్టులను కూడా ఎస్పీ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ నీలకంఠేశ్వర్‌రెడ్డి, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు బుచ్చన్న, పోలీసు పిఆర్‌ఓ రంగినేని మన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.