వరదరాజు (చిత్తూరు)
ప్రశ్న: వారసత్వ ఆస్తి స్వరూపం ఏమిటి? వారసత్వ ఆస్తిపై హక్కు ఎవరికి ఉంటుంది?
జ: ఆస్తి వారసత్వ ఆస్తిగా రూపాంతరం చెందడానికి ముందు సదరు ఆస్తిని సంపాదించిన వ్యక్తి ఒకరు ఉండాలి. అంటే మీ తండ్రి సంపాదించిన ఆస్తి. అది ఆయన వ్యక్తిగత ఆస్తిగా పరిగణించబడుతుంది. తండ్రి కష్టార్జితంతో సంపాదించిన ఆస్తిపై హక్కు, అధికారం వారసులకు లభించదు. తండ్రి మరణానంతరం సదరు ఆస్తిని తండ్రి ఎవరికీ ఇవ్వని పక్షంలో కొడుకుకు పూర్తి అధికారం, హక్కు లభిస్తుంది. అలాగే తండ్రి జీవించి ఉండగానే కొడుకుకు పిల్లలు పుడితే వారికి తాత ఆస్తిలో వారసత్వ హక్కు లభిస్తుంది. అప్పుడు ఆస్తి వారసత్వ రూపం చెందుతుంది. తండ్రి స్వార్జిత ఆస్తిలో ఆయన పిల్లల్లో ఎవరికీ తండ్రి జీవించినంత కాలం వారికి అధికారం, హక్కు లభించదు. అయితే మనవళ్లకు, మనవరాళ్లకు మాత్రం సదరు ఆస్తిపై పుట్టుకతోనే హక్కు, అధికారం లభిస్తుంది.
మురళి (వికారాబాద్)
ప్రశ్న: నేను ఒక ఇంటి కొనుగోలు నిమిత్తం ఒక వ్యక్తికి అడ్వాన్సు చెల్లించి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ డాక్యుమెంట్‌ను రూపొందించాను. ఒప్పందం ప్రకారం మిగతా సొమ్మును చెల్లించి ఆస్తిని రిజిస్టర్ చేసుకోవడానికి నేను సంసిద్ధత వ్యక్తపరిచాను. అయితే ఇంటిని రిజిస్టర్ చేయడానికి విక్రయదారుడు ముందుకు రావడం లేదు. కోర్టును ఆశ్రయించవచ్చునా?
జ: ఇంటి కొనుగోలు నిమిత్తం అడ్వాన్స్ మొత్తాన్ని చెల్లించి అలాగే విక్రయ సొమ్మును మొత్తం చెల్లించడానికి మీరు సిద్ధంగా ఉన్నందున బాకీ సొమ్మును తీసుకుని విక్రయ దస్తావేజును సదరు విక్రయదారుడు మీ పేరున రిజిస్టర్ చేయాల్సింది. అలా జరగని పక్షంలో మీరు కోర్టును ఆశ్రయించవచ్చు. అయితే కోర్టును ఆశ్రయించడానికంటే ముందుగా మీరు విక్రయదారుడికి ముందస్తు నోటీసును జారీ చేయండి. విక్రయ సొమ్ములోని బాకీ సొమ్మును చెల్లించడానికి మీరు సిద్ధంగా ఉన్నందున విక్రయ దస్తావేజును మీ పేరు మీద రిజిస్టర్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ నోటీసును జారీ చేయండి. నోటీసును స్వీకరించిన తర్వాత కూడా విక్రయదారుడు రిజిస్ట్రేషన్‌కు ముందుకు రాని పక్షంలో మీరు సంబంధిత సివిల్ కోర్టును ఆశ్రయించండి. ఇల్లు ఏ ప్రాంతంలో ఉందో ఆ ప్రాంతంపై ‘టెరిటోరియల్’ భౌగోళిక పరిధి ఉన్న సివిల్ కోర్టులో ‘స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్’ కింద మీరు కేసును దాఖలు చేయాల్సి ఉంటుంది. మీరు సరైన సాక్ష్యాలను, డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పిస్తే కోర్టు మీకు అనుకూలంగా డిక్రీని జారీ చేస్తుంది. బాకీ సొమ్మును తీసుకుని ఇంటిని మీ పేరు మీద రిజిస్టర్ చేసి ఇంటిని మీకు అప్పగించాలని కోర్టు డిక్రీ ఇస్తుంది. కోర్టు డిక్రీ అందిన తర్వాత సదరు ఇంటిని విక్రయదారుడు మీ పేరు మీద రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. అయితే డిక్రీ అందినా సదరు విక్రయదారుడు స్పందించని పక్షంలో డిక్రీని అమలుపర్చాలంటూ మీరు కోర్టులో ‘ఎగ్జిక్యూషన్ పిటీషన్’ను దాఖలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు కోర్టు మీ పేరున రిజిస్టర్ చేయాలని ఆదేశిస్తుంది.
వరదరాజు (చిత్తూరు)
english title:
mana
Date:
Sunday, June 24, 2012