మహమ్మద్ యూసుఫ్, కాజీపేట
జగన్ ఓదార్పు యాత్రకు ముగింపు లేదా?
అది అనంతం.
సిహెచ్.సాయి ఋత్త్విక్, నల్గొండ
పదవిలో వున్నవారు మరణిస్తే ఉప ఎన్నికలలో ఆ స్థానాలలో వారసులనే నిలబెడుతున్నాయి నేటి రాజకీయ పార్టీలు. ఆ మాత్రానికి అన్ని పార్టీలు ఒక అంగీకారానికి వచ్చి వారసులనే ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తే ఉపఎన్నికల అవసరం ఉండదు. ప్రభుత్వానికి సమయం, ధనం ఆదా అవుతాయి కదా!
వారసులు ఎక్కువ అయినప్పుడు వస్తుంది తంటా.
సి.ప్రతాప్, సూర్యాపేట
విద్యా హక్కు చట్టం క్రింద పేదవారికి కార్పొరేట్ స్కూళ్లు 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాల్సి ఉండగా ప్రభుత్వమే ఆ ఖర్చు భరించబోతోంది. ఆ వ్యయంతో ఏకంగా తమ సర్కారు బళ్ళనే బాగు చేసుకోవడం మంచిది కదా?
ప్రైవేటు మోజు తలకెక్కిన మనం మెచ్చం కదా?
రాష్టప్రతి పదవికి ఎవరిని ఎంపిక చేస్తే ఎక్కువ వోట్లు రాల్తాయన్న ప్రాతిపదికపై పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. సంస్కారవంతులు, మేధావులు, సంఘ సంస్కర్తలు, పౌర సమాజ, సేవా తత్పరుల వైపు కనీసం కనె్నత్తి చూడటం లేదు..
వాళ్లెందుకు మనకు?
ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
రాష్టప్రతి పదవి రబ్బరు స్టాంపు కాదని తెలుసుకున్నానని ప్రతిభా పాటిల్ గారన్నారు. ఆమె ఏ విషయంలో రబ్బర్ స్టాంపు కాకుండా ఉన్నారో తెలియటం లేదు. మీరైనా చెప్పండి.
చీటికీమాటికీ విదేశాలకు చెక్కెయ్యడంలో! తనది కాని భూముల మీద కనె్నయ్యడంలో!!
ఈ దేశంలో క్రైస్తవులందరూ హిందువులే. మతం తీసుకున్నంత మాత్రాన హిందూ దేవాలయ దర్శనానికి అభ్యంతరమెందుకు?
హిందువులమని వారు చెప్పుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు.
ప్రస్తుత రాజకీయ నాయకులలో రాజకీయ పరిణితి, పరిపాలనా దక్షుడు ఒక్క చంద్రబాబే కనిపిస్తున్నారు. ఆయనకు ఇంటిపోరుతో పార్టీ పరపతి సన్నగిల్లుతోంది. వారందరూ మరల ఐకమత్యంతో ఉండాలంటే మార్గమేమిటి?
మళ్లీ ఆయనకి అధికారం రావాలి.
బాస రాములు, మెట్‌పల్లి
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పొదుపు చర్యల్ని చేపడతామని చెప్పడం గర్వకారణమే. కాని సాక్షాత్ యోజన భవన్‌లో 2 మరుగుదొడ్ల మరమ్మతుకు రూ.35 లక్షలు వ్యయం చేయడం చూస్తే ప్రభుత్వ నిజాయితీని శంకించవచ్చునంటారా?
ఇలాంటి విచ్చలవిడి పిచ్చి ఖర్చులు రోజూ ఎన్నో జరుగుతుంటాయి. సమాచార హక్కు ఆయుధాన్ని ఒడుపుగా వాడటం తెలిసిన ఒక పౌరుడి చొరవ పుణ్యమా అని ఇప్పుడు ఇది వెలుగులోకి వచ్చిందంతే.
పి.రామకృష్ణ, రాజమండ్రి
విధి విచిత్రం కాకపోతే జగన్ హాయిగా జైలులో విశ్రాంతి తీసుకుంటుంటే అతన్ని తిడుతూ ప్రచారం పేరుతో చంద్రబాబు, కిరణ్‌కుమార్, చిరంజీవి మండుటెండలో చెమటలు కక్కుతున్నారు. నల్లగా కమిలిన మొహాలు ఇందుకు నిదర్శనం. చిత్రంగాలేదూ?
చేసుకున్న వారికి చేసుకున్నంత.
తాళాబత్తుల సత్యనారాయణ మూర్తి, విశాఖ
జగన్ వ్యాపారాలు అన్నింట్లోకి అక్రమంగా కోట్లు వరదలా ప్రవహిస్తున్నాయని, వేల ఎకరాలు భూ పందేరాలు, వందల ఎకరాల్లో విలాసవంతమైన భవన నిర్మాణాలు ఎలా జరిపించుకుంటున్నాడు అని 2009లో ఎలుగెత్తి చాటినా, ఫొటోలు పేపర్లో వేసి భజాయించినా చీమకుట్టినట్లు అప్పుడు ఫీలవని రాష్ట్రం, కేంద్రం ఇవాళ గొంతు చించుకోడానికి కారణం స్వంత జెండాకి చిరుగులు గుర్తించడమేనా?
రాజకీయ స్వార్థం.
రానున్న పెను మార్పులకి మూల కారణం ఒక కుటుంబ పార్టీ అని, దాని ఏకైక యువ నాయకుడు జగన్ అని దేశం గుర్తిస్తే అతడి రాజకీయ ప్రస్థానం చాణక్యుని మేధగా తలపిస్తున్నది..
మీకు
*
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003
e.mail : mvrsastry@deccanmail.com