పాట్నా, జూలై 14: రాష్టప్రతి ఎన్నికల్లో తాను సంప్రదాయాలను, హుందాతనాన్ని పాటించడం లేదని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు విడ్డూరంగా ఉన్నాయని రాష్టప్రతి అభ్యర్థిగా ప్రతిపక్ష బిజెపి మద్దతుతో పోటీ చేస్తున్న పిఏ సంగ్మా వ్యాఖ్యానించారు. ఆర్థిక మంత్రిగా ఘోరంగా విఫలమైన యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ కోసం రాష్టప్రతి భవన్‌ను ‘డంపింగ్ యార్డ్’గా మారుస్తున్నారంటూ సంగ్మా ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో సంగ్మా రాష్టప్రతి ఎన్నికల్లో హందాతనాన్ని, కనీస మర్యాదలను పాటించడం లేదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. అయితే ఈ ఆరోపణలు విడ్డూరంగా ఉన్నాయని శనివారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడిన సంగ్మా అన్నారు. ప్రణబ్ ముఖర్జీ ఆదాయం వచ్చే పదవుల్లో కొనసాగుతున్నారంటూ సంగ్మా చేసిన ఆరోపణల గురించి విలేఖరులు ప్రశ్నించగా రాష్టప్రతి ఎన్నికల తర్వాత ఈ విషయమై కోర్టుకు వెళ్లనున్నట్లు ఆయన చెప్పారు. రాంజెత్మలానీ, సుబ్రహ్మణ్య స్వామి న్యాయవాదుల బృందంలో సభ్యులుగా ఉంటారని, ఎన్నికల తర్వాత వారితో తాను ఈ విషయమై సంప్రదిస్తానని సంగ్మా చెప్పారు. తన అభ్యర్థిత్వాన్ని సమర్థించరాదని ఎన్డీఏ భాగస్వామి అయిన జెడి(యు) తీసుకున్న నిర్ణయాన్ని విలేఖరులు ఆయన దృష్టికి తీసుకురాగా, ఈ పరిణామం పట్ల తాను నిరాశ చెందడం లేదని సంగ్మా చెప్పారు. నితీశ్ కుమార్ తనకు మంచి మిత్రుడని, అయితే ప్రతి ఒక్కరికీ వారి సొంత రాజకీయ సిద్ధాంతాలు ఉంటాయని ఆయన చెప్తూ, అయితే నితీశ్ తన అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తారని అనుకున్నానని చెప్పారు. కాగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మద్దతు తనకే లభిస్తుందని ఆశిస్తున్నట్లు సంగ్మా చెప్పారు.
మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యుపిఏ ప్రభుత్వ హయాంలో అవినీతి పెచ్చుమీరిపోయిందని, ధరలు విపరీతంగా పెరిగి పోయాయని సంగ్మా ఆరోపించారు. పెట్టుబడులకు దేశంలో వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదని, పారిశ్రామిక ఉత్పత్తి నానాటికి దిగజారిపోతోందని ఆయన అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పని తీరుపట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారని, మార్పును కోరుకుంటున్నారని ఆయన చెప్పుకున్నారు. రాష్టప్రతి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకోవడం ద్వారా తాను 1977లో జయప్రకాశ్ నారాయణ్ చేపట్టిన ఉద్యమం తరహా ఉద్యమాన్ని మరోసారి ప్రారంభించానని ఆయన చెప్పుకున్నారు. ఈ ఎన్నికల్లో ఏదో అద్భుతం జరిగి తాను విజయం సాధిస్తానన్న విశ్వాసాన్ని సంగ్మా వ్యక్తం చేసారు. బీహార్ తొలి రాష్టప్రతి రాజేంద్ర ప్రసాద్ జన్మస్థలమని ఆయన అంటూ, మిగతా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, ఇతర పార్టీల మద్దతు కోరడం కోసం తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు. అంతకు ముందు సంగ్మా బిజెపి పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. బిజెపి సీనియర్ నాయకులు రవిశంకర్ ప్రసాద్, విజయ్ కుమార్ గోయల్, షా నవాజ్ హుస్సేన్, నందకిశోర్ యాదవ్, సిపి ఠాకూర్ తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. (చిత్రం) పాట్నాలో శనివారం గిరిజన మహిళలకు అభివాదం చేస్తున్న ఎన్‌డిఎ రాష్టప్రతి అభ్యర్థి సంగ్మా
ఎన్నికల ప్రచారంలో రాష్టప్రతి అభ్యర్థి సంగ్మా
english title:
sangma
Date:
Sunday, July 15, 2012