కావలసినవి
సోయా కీమా - 1 కప్పు
ఉల్లిపాయ - 1 చిన్నది
అల్లం వెల్లుల్లి ముద్ద - 1 టీ.స్పూ.
పసుపు - చిటికెడు
కారం పొడి - 1 టీ.స్పూ.
గరం మసాలా పొడి - 1/4 టీ.స్పూ.
ఉప్పు - తగినంత
గోధుమ పిండి - 1 కప్పు
మైదా - 1 కప్పు
నూనె - 1/4 కప్పు
వండండి ఇలా
రెండు కప్పుల నీరు మరిగించి సోయా కీమా వేసి ఉంచాలి. చల్లారిన తర్వాత నీరంతా పిండేసి ఒక గినె్నలో వేసి ఉంచుకోవాలి. గోధుమ పిండి, మైదా, చిటికెడు ఉప్పు కలిపి జల్లించి, తగినన్ని నీళ్లు కలుపుకుంటూ చపాతీ పిండిలా తడిపి మూత పెట్టి ఉంచాలి. పాన్‌లో రెండు చెంచాల నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేపి సోయా కీమా, కారం పొడి, తగినంత ఉప్పు వేసి తడి ఆరిపోయేవరకు వేయించాలి. చివరగా గరం మసాలా పొడి కలిపి దింపేయాలి. పిండిని కొద్దిగా నూనె వేసి బాగా పిసికి పెద్ద సైజు నిమ్మకాయలంత ఉండలు చేసుకోవాలి. ఈ ఉండలను కొద్దిగా వెడల్పు చేసి మధ్యలో కొంచెం కీమా మిశ్రమం పెట్టి అంచులన్నీ మధ్యలోకి తెచ్చి మూసేసి ఉండలా చేసుకోవాలి. పొడి పిండి సాయంతో వెడల్పుగా వత్తుకోవాలి. పెనం వేడి చేసి ఈ పరాఠాలను కొద్దిగా నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. వేడి వేడిగా పెరుగు పచ్చడితో లేదా ఆవకాయతో సర్వ్ చేయాలి.