బెంగళూరు, జూలై 14: ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ నేతృత్వంలో కొలువుదీరిన కర్నాటక మంత్రివర్గ కూర్పుపై అధికార బిజెపిలో నిరసన జ్వాలలు రోజురోజుకూ ఉద్ధృతమవుతున్నాయి. కొత్త మంత్రి వర్గంలో పదవులు ఆశించి భంగపడిన ఎమ్మెల్యేలు అందుకు నిరసనగా శాసనసభ్యత్వాలకు రాజీనామా చేయాలని నిశ్చయించుకుంటున్నారు. షెట్టర్ మంత్రి వర్గంలో బెర్తు లభించకపోవడంతో శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నట్టు కుందాపూర్ ఎమ్మెల్యే హలాది శ్రీనివాసశెట్టి శుక్రవారం నాడు ప్రకటించిన విషయం విదితమే. ఇది జరిగి 24 గంటలు పూర్తికాకుండానే సలియా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న మరో ఎమ్మెల్యే ఎస్.అంగారా కూడా తన పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అంగారా రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు లభించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తాను ఇప్పటివరకూ వౌనంగా ఉన్నానని, అయితే తన నిజాయితీని, చిత్తశుద్ధిని బలహీనతగా చూస్తున్నారని అంగారా వాపోయారు. మంత్రి వర్గంలో తనకు చోటు కల్పించకపోవడాన్ని నిరసిస్తూ నియోజకవర్గంలో తనను అభిమానించే ప్రజాప్రతినిధులు, పార్టీ ఆఫీస్ బేరర్లు పెద్ద సంఖ్యలో రాజీనామా చేశారని, పదవుల నుంచి వారే వైదొలిగిన తర్వాత తాను ఎమ్మెల్యేగా కొనసాగలేనని, అందుకే శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నానన్నారు. ప్రస్తుతం సలియాలో ఉన్న తాను బెంగళూరుకు తిరిగి వచ్చాక రాజీనామా లేఖను సమర్పించనున్నట్టు అంగారా పిటిఐ వార్తా సంస్థకు తెలియజేశారు.
ఇదిలావుంటే, జగదీష్ షెట్టర్ మంత్రి వర్గంలో బెర్తు పొందలేకపోయిన రెవెన్యూ శాఖ మాజీ మంత్రి జి.కరుణాకర రెడ్డి కూడా తన భవిష్యత్ కార్యాచరణను నిశ్చయించుకునేందుకు బెంగళూరులో ఇతర అసమ్మతి ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.
తమ శిబిరంలోని 21 మంది ఎమ్మెల్యేలు ఈ నెల 18 లేదా 19 తేదీల్లో సమావేశమై తదుపరి కార్యాచరణను ఖరారు చేయనున్నట్టు ఆయన చెప్పారు. బిజెపిలో అంతా సవ్యంగా ఏమీ లేదని, రాష్ట్ర మంత్రి వర్గంలో సమతూకం లోపించిందని, దీనిని తక్షణమే సరిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కాగా, నిరసన సెగలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ మంత్రివర్గ విస్తరణపై సలహాలు, సూచనలు స్వీకరించందుకు బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీతోనూ, ఇతర సీనియర్ నాయకులతోనూ శనివారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు.
మంత్రివర్గం కూర్పుపై అసంతృప్తి.. రాజీనామాకు తాజాగా మరో ఎమ్మెల్యే నిర్ణయం
english title:
nirasana
Date:
Sunday, July 15, 2012