న్యూఢిల్లీ, జూలై 14: బ్రిటిష్ పాలకుల నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్న చారిత్రాత్మక సంఘటనకు వేదికగా, గత అరవై సంవత్సరాల పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో చోటుచేసుకున్న అనేక సంఘటనలకు సాక్షిగా నిలుస్తున్న పార్లమెంట్ భవనం భావి తరాలకు పురావస్తున్న సంపదగా మారబోతోంది. ఆరు ఎకరాల విస్తీర్ణంలో అత్యంత ఆకర్షణీయమైన కళాఖండంగా ప్రతి ఒక్కరి దృష్టిని కట్టిపడేసే ఈ భవనం 85 సంవత్సరాల క్రితం నిర్మితమైంది. ఎడ్విన్ లూటెన్స్, సర్ హెర్బెట్ బాత్ ఈ భవనం నమూనాను రూపొందించారు. 1921 ఫిబ్రవరి 12న దీని నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 1927 జనవరి 18న అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ దీనిని ప్రారంభించారు. పెరిగిపోతున్న రద్దీ, వయోభారం ఈ భవంతి నిలకడపై విపరీతమైన ప్రభావం చూపడంతో పార్లమెంట్ ఉభయ సభలకు సరికొత్త ప్రాంగణాన్ని నిర్మంచాలని స్పీకర్ మీరాకుమార్ నిర్ణయించారు. రానున్న కాలంలో పార్లమెంట్ ఉభయ సభల సభ్యుల సంఖ్య పెరిగే అవకాశాలున్నందున కొత్త ప్రాంగణం నిర్మాణానికి కావలసిన జాగాను ఎంపిక చేయటంతోపాటు ఇతర విషయాలను అధ్యయనం చేయటానికి ఉన్నత స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొత్త ప్రాంగణం తుది రూపును సంతరించుకునేందుకు కనీసం పదేళ్లు పట్టే అవకాశాలున్నాయి. ఈలోపు ప్రస్తుత పార్లమెంట్ భవంతికి ఏవిధమైన ముప్పు వాటిల్లకుండా నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఛేదించుకుని తీవ్రవాదులు పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన విషయం విదితమే. ముంబాయి మంత్రాలయం (సచివాలయం)లో జరిగిన అగ్నిప్రమాదం పార్లమెంట్ అధికారులకు, అధిపతులకు కనువిప్పు కలిగించింది. మూడు అంతస్తులతో ఉన్న పార్లమెంట్ భవనం అగ్నిప్రమాదాలను తట్టుకునేందుకు ఏమాత్రం అనువుగా లేదని ఢిల్లీ అగ్నిమాపక విభాగం నిర్ధారించింది. దీంతో పార్లమెంట్ భవనంలో అగ్నిప్రమాదాల నివారణకు గట్టి చర్యలు చేపట్టాలని, ప్రస్తుతం వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే లోగా ఈ పనులు పూర్తిచేయాలని స్పీకర్ మీరాకుమార్ ఆదేశించారు. పార్లమెంట్ భవనంలోని అన్ని వంటశాలల్లో సిలిండర్ల వినియోగానికి స్వస్థిపలికి పైప్‌లైన్ ద్వారా గ్యాస్‌ను సరఫరా చేయటానికి చర్యలు తీసుకుంటున్నారు. భవనంపై కదలికలను అదుపు చేయాలని, సందర్శకుల సంఖ్యను నెమ్మదిగా కుదించి భవనంపై ఒత్తిడి తగ్గించాలని యోచిస్తున్నారు.
బ్రిటిష్ పాలకుల నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్న
english title:
heritage building
Date:
Sunday, July 15, 2012