ఆదోని, ఆగస్టు 4: రాఘవేంద్రస్వామి ఆదోనికి వచ్చినట్లు తెలుసుకున్న ఆదోని నవాబు సిద్ధిమసూద్‌ఖాన్ దివాన్ వెంకన్నను పిలిచి రాఘవేంద్రస్వామిని సన్మానిస్తామని చెప్పారు. రాఘవేంద్రస్వామి భక్తుడైన వెంకన్న ఎంతో సంతోషించి రాఘవేంద్రస్వామిని సిద్దిమసూద్‌ఖాన్ దగ్గరకు తీసుకొచ్చాడు. అయితే సిద్దిమసూద్‌ఖాన్ రాఘవేంద్రస్వామిని పరీక్ష చేయడానికిగాను ఒక రాగిపాత్రలో మాంసపుముక్కలను ఉంచి మంచి కళాత్మకమైన బట్టకప్పి మూలరాములకు నైవేద్యం పెట్టమని కోరాడు. అయితే సిద్దిమసూద్‌ఖాన్ తుంటరి ఆలోచనను దైవాదృష్టితో చూసిన రాఘవేంద్రస్వామి మాంసపుపళ్లెంను కింద ఉంచి తన మంత్రజలంతో పళ్లెంపై చల్లాడు. బట్ట తెరిచి చూడగా ఆ పళ్లెంలో మాంసపుముక్కలకు బదులు పండ్లు, పూలు సాక్షాత్కరించాయి. ఈమహిమతో కళ్లు తెరుచుకొన్న నవాబు రాఘవేంద్రస్వామి పాదాలపై పడి తన అజ్ఞానాన్ని క్షమించమని కోరాడు. రాఘవేంద్రుడు అతనిని క్షమించాడు. అక్కడే మూలరాముల పూజలు చేశాడు. ఆ తరువాత సిద్దిమసూద్‌ఖాన్ స్వామి యొక్క మహిమలను కొనియాడి బహుమానంగా భక్తీగా ఒక గ్రామం దత్తత ఇస్తానని స్వామివారికి చెప్పాడు. అప్పుడు రాఘవేంద్రస్వామి, వెంకన్న సంతోషించి మాంచాల గ్రామాన్ని దత్తత ఇవ్వాలని కోరాడు. అయితే అప్పటికే మాంచాల గ్రామం ఒక ముస్లీం ఖాజీకి ఇచ్చి ఉండడం జరిగింది. అయినప్పటికీ రాఘవేంద్రుని కోరిక మేరకు మంచాల గ్రామాన్ని రాఘవేంద్రస్వామికి నవాబు దత్తత ఇచ్చాడు. అప్పుడు రాఘవేంద్రుడు మంచాల గ్రామాన్ని తీసుకొని అక్కడ మంచాలమ్మ అనుగ్రహంతో మఠాన్ని ఏర్పాటుచేశారు. ఆ మఠమే ఈరోజు భక్తుల పాలిట కల్పతరువై విరాసిల్లుతున్న మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం. చివరకు మంచాల గ్రామం మంత్రాలయం క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది.
భక్తిపారవశ్యంతో పులకించిన మంత్రాలయం
మంత్రాలయం, ఆగస్టు 4: భక్తీపారవశంతో తుంగాతీరాన వెలసిన మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనంకై వేలాదిమంది భక్తులు తరలిరావడంతో మంత్రాలయమంతా రాఘవుడి నామస్మరణంతో మారుమ్రోగింది. రాఘవేంద్రస్వామి సప్త ఆరాధనోత్సవాల్లో భాగంగా శనివారం మధ్యారాధన వేడుకలను మఠం పీఠాధిపతులు సుయతీంద్రతీర్థుల ఆద్వర్యంలో వైభవంగా నిర్వహించారు. రాఘవేంద్రస్వామి బృందావనానికి వెయ్యి లీటర్లపాలతో అభిషేకాన్ని పీఠాధిపతులు చేశారు. అదేవిధంగా పూర్ణబోద పూజమందిరంలో మూలరాములవారికి స్వర్ణ మంటపంతో అలంకరించి విశేష పూజలను నిర్వహించారు. అదేవిధంగా ప్రహ్లదరాయలవారికి పాదపూజ, కనకాభిషేకం పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి రాఘవరాయుడి బృందావనానికి ప్రత్యేకపూజలు నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో రాఘవేంద్రస్వామి బృందావనాన్ని విశేషంగా ముస్తాబు చేశారు. పెద్దఎత్తున భక్తులు తరలి రావడంతో మఠం ప్రాంగణమంతా భక్తులతో కిక్కరిసిపోయాయి. రాఘవేంద్రస్వామి బృందావనం దర్శనంకై ముఖద్వారం వరకు భారులుతీరి సుమారు 5 గంటల వరకు దర్శనం యథావిధిగా కొనసాగించారు. భక్తులు రాఘవుడిని స్మరిస్తూ ప్రత్యేక పూజలు చేశారు.
టిటిడి పట్టువస్త్రాల సమర్పణ...
రాఘవేంద్రస్వామి ఉత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఇఓ సుబ్రమణ్యం, అర్చకులు పట్టువస్త్రాలను మంత్రాలయం తీసుకొచ్చారు. పట్టువస్త్రాలను ముఖద్వారం వద్దనుంచి భారీగా ఊరేగింపుగా రాఘవేంద్రస్వామి మఠంకు తీసుకొచ్చారు. పీఠాధిపతులు సుయతీంద్రతీర్థులకు ఇఓ సుబ్రమణ్యం పట్టువస్త్రాలను అప్పగించారు. పీఠాధిపతులు మఠం ప్రాంగణంలో పట్టువస్త్రాలను ఊరేగింపుగా తీసుకొచ్చి రాఘవరాయుడి బృందావనంవద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టిటిడి ఇఓ పట్టువస్త్రాలను పీఠాధిపతులకు అలంకరించారు. మఠం పీఠాధిపతులు టిటిడి ఇఓ స్వామివారి శేషవస్త్రం, మెమోంటో, ఫలమంత్రాక్షలు ఇచ్చి ఆశీర్వాదించారు.
పోటెత్తిన భక్తజనం...
స్వామి ఉత్సవాల సందర్భంగా ఆంధ్ర, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాలనుంచి పెద్దఎత్తున భక్తులు తరలి వచ్చారు. అదేవిధంగా భజన మండలి వారు కళాకారులు, ఆలయ ప్రాంగణంలో భక్తీగీతాలు అలపిస్తూ నృత్యాలు చేస్తూ భక్తులను కనువిందు చేశారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా పుష్పాలతో విశేషంగా ముస్తాబు చేశారు. ఆలయ ప్రాంగణంతోపాటు ప్రధాన రహదారిలో కూడ విద్యుత్ అలంకరణతో రాఘవేంద్రస్వామి, శ్రీకృష్ణుడు విద్యుత్ అలంకరణ దీపాలు విశేషంగా అలరించాయి. పీఠాధిపతులు సుయతీంద్రతీర్థులు బృందావనంవద్ద గ్రంథాలను ఆవిష్కరించారు. పెద్దఎత్తున తరలి వచ్చి న భక్తులకు మఠం యజమాన్యం అన్నిసౌకర్యాలు కల్పించారు. అదేవిధంగా మంత్రాలయం గ్రామస్థులకు ఉచిత భోజన వసతులను నిర్వహించారు.
రాఘవుడి సన్నిధిలో సినీసంగీత దర్శకులు...
మంత్రాలయం, ఆగస్టు 4: రాఘవేంద్రస్వామి మఠంలో జరిగే ఆరాధనోత్సవాల సందర్భంగా రాఘవుడి దర్శనంకై ప్రముఖ సినీ సంగీత దర్శకులు, ఎంఎం కీరావాణి, దర్శకులు రాజవౌళి కుటుంబ సభ్యులతో మంత్రాలయం వచ్చారు. వీరు ముందుగా గ్రామదేవత మంచాలమ్మదేవికి ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం రాఘవేంద్రస్వామి పూర్వ పీఠాధిపతులు సుశమీంద్రతీర్థుల బృందావనం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి మఠం పీఠాధిపతులు స్వామివారి శేషవస్త్రం, ఫలమంత్రాక్షలు ఇచ్చి ఆశీర్వాదించారు. ఈకార్యక్రమంలో శ్రీపాదాచారి పాల్గొన్నారు.