గూడూరు, ఆగస్టు 4: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు విద్యారంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 3500 కోట్ల రూపాయలను కేటాయించిందని రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. శనివారం గూడూరులో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన పలు చోట్ల జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఈ నిధులతో మోడరన్ స్కూళ్ల ఏర్పాటు, బాలికల కోసం ప్రత్యేకంగా సోనియాగాంధీ రెండు కోట్ల రూపాయలను కస్తూర్బాగాంధీ విద్యాలయాలకు కేటాయింపు, అలాగే బాలుర విద్యాభ్యాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు. జిల్లాల వారీగా అధిక మొత్తంలో విద్య కోసం నిధులు కేటాయించినట్లు, ఇందులో 31.5 కోట్ల రూపాయలను వివిధ పాఠశాలల నిర్మాణం, విద్యార్థులకు అవసరమైన తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. మండలంలోని చవటపాలెం ప్రాధమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలలగా అప్‌గ్రేడ్ చేసేందుకు ఇక్కడి ఉపాధ్యాయులు, పనబాక కృష్ణయ్య కృషిచేశారని, వారిని తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు. అలాగే ఈ పాఠశాల ఆవరణం 5 ఎకరాల విస్తీర్ణంలో ఉండటం వలన విద్యార్థులను విద్యతో పాటు క్రీడల పట్ల కూడా ప్రోత్సహించి వారిని అన్ని రంగాలలో తీర్చిదిద్దాలన్నారు. ఈ ఐదెకరాల విస్తీర్ణంలో ప్రహరీ గోడ లేనందున ఈ ప్రాంతంలో విష పురుగులు సంచరించే ప్రమాదం ఉన్నందున, ప్రహరీగోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఇంత పెద్ద స్థలం కబ్జాకు గురికాకుండా చూసిన ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు.
ఆపద్బంధు చెక్కులు పంపిణీ
అనంతరం ప్రమాదంలో మృతిచెందిన వారి రెండు కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 వేల రూపాయల వంతున ఆపద్బంధు పథకం కింద చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అలాగే 130 మంది పొదుపు సంఘాలకు 2.19 కోట్ల రూపాయలను ఆయన ఈ సందర్భంగా అందచేశారు. రైతుల ఆధునీకరణ యంత్రాల కొనుగోలుకు సంబంధించి 19.50 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. రైతులు, పొదుపు సంఘాలకు ప్రస్తుతం ఇస్తున్న పావలా వడ్డీని వచ్చే జనవరి నుండి తీసుకున్న రుణాలకు లేకుండా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని ఆయన ఈ ఔసందర్భంగా రుణాలు తీసుకున్న వారిని కోరారు. సంగం బ్యారేజి నిర్మాణ పనులు కూడా త్వరలో పూర్తిచేయనున్నట్లు, కోవూరు చక్కెర కర్మాగారం ఇప్పటి వరకు 1.15 లక్షల టన్నుల చెరకును క్రషింగ్ చేసినందుకు రైతులకు 11.50 కోట్ల రూపాయల బకాయి ఉందని, దానిని కూడా త్వరలో చెల్లించనున్నట్లు తెలిపారు.
ఎస్టీ బాలికల వసతిగృహం అదనపు భవనాలు ప్రారంభం
అంతకుముందు మంత్రి చెన్నూరు ఎస్టీ బాలికల వసతి గృహంలో 30 లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు భవనాలను ప్రారంభించారు. చెన్నూరు జడ్పీ హైస్కూల్‌లో ఆర్‌ఎంఎస్‌ఎ ద్వారా 30 లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు. మంగళపూరులో కోటి రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్డు, పారిచెర్ల రాజుపాలెంలో 1.60 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రోడ్డుకు శంకుస్థాపన, దివిపాలెంలో ఆర్‌విఎం ద్వారా నిర్మించిన 2 అదనపు తరగతి గదులు, గూడూరులో నిర్మించిన అగ్నిమాపక కేంద్రాన్ని, సంగం సినిమా హాలు వద్ద సంగం సినిమా హాలు నుండి రైల్వేస్టేషన్ వరకు 2 కోట్ల రూపాయలతో నిర్మించిన రహదారిని ప్రారంభించగా, గూడూరు-దుగరాజపట్నం, రాజంపేట-గూడూరు రోడ్డు నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈయన వెంట ఎన్‌డిసిబి చైర్మన్ వేమారెడ్డి శ్యాం సుందర రెడ్డి, పనబాక కృష్ణయ్య, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.