నెల్లూరు , ఆగస్టు 4: తమిళనాడు ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనకు గల కారణాలను ఫోరెన్సిక్ అధికారులు పూర్తి నివేదిక ఇచ్చిన తరువాతే ప్రకటిస్తామని రైల్వే సేఫ్టీ కమిషనర్ డికె సింగ్, ఎడిఆర్‌ం సుబ్బారావు తెలిపారు. ప్రమాదం జరిగిన బోగీలోలభించిన ప్రతి వస్తువును, అవశేషాలను ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించామన్నారు. ఇదిలావుండగా ప్రమాదానికి గల కారణాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఢిల్లీ, చెన్నై, విజయవాడ నుంచి మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు కూడా వచ్చారన్నారు. అయితే బోగీలో మెకానికల్, ఎలక్ట్రికల్‌కు సంబంధించిన ప్రతి వస్తువును ఇంజనీర్లు అణవణువూ పరిశీలించారన్నారు. ఈ ఘటనపై వివిధ రకాలుగా అనుమానాలు ఉండటంతో అధికారులు క్షేత్ర స్థాయిలో లోతుగా విచారణ జరుపుతున్నారు. గత రెండు రోజులుగా రైల్వే అధికారులు జరిపిన బహిరంగ విచారణలో ఎవరు కూడా ప్రమాదానికి గల కారణాలను పూర్తిగా చెప్పలేక పోయారు. ప్రమాదం జరిగిన బోగీలో బెర్త్ నెంబర్ 11, 14లో ప్రయాణించిన వారిని కూడా విచారించారిస్తున్నారు. వీరితో పాటు చెన్నైలో ఉన్న మరో 22మంది ప్రయాణికులు విచారణ ముందుకు వచ్చారని వారిని చెన్నైలోనే విచారణ చేస్తామన్నారు. ఈమెయిల్ ద్వారా కూడా వివరాలు ఇచ్చేందుకు కొందరు ముందుకు వచ్చారన్నారు. ఈ ప్రమాదంపై బోగీలోలభించిన ప్రతి వస్తువును ఆధారంగా తీసుకుని అన్ని కోణాలలో విచారిస్తున్నారు. బోగీలో లభించిన ఒక ఖాళీ చిన్న సిలిండర్, ఎస్ 11 బోగీలో బెర్త్ నెంబర్ 7, 8 మధ్య బాణాసంచాకు సంబంధించిన రసాయన అవశేషాలు లభ్యమైనట్లు సమాచారం. అంతేకాకుండా అగ్ని ప్రమాదానికి మందుగుండు సామగ్రి కారణమని అనుమానాలు ఉన్నప్పటికీ దీనిపై అధికారులు పూర్తిగా చెప్పలేక పోతున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటే బోగీలలో ఉన్న బ్యాటరీలు లోఓల్టేజి చూపించాల్సి ఉంది. అయితే బ్యాటరీలు మాత్రం ఓల్టేజి స్థిరంగా చూపించడంతో ఎలక్ట్రికల్ నిపుణులు షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండదని ఒక నిర్థారణకు వచ్చినట్లు తెలిసింది. ప్రమాదానికి గల కారణాలను అధికారులు పూర్తిగా వెల్లడించాలంటే ఇక కొన్ని రోజులు వేచి ఉండక తప్పదని తెలుస్తోంది.
- బోగీలలో దొరికిన ప్రతి వస్తువూ తనిఖీ - రైల్వే సేఫ్టీ కమిషనర్ వెల్లడి
english title:
vicharana
Date:
Sunday, August 5, 2012