విడవలూరు, ఆగస్టు 4: పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో తిరోగమనంలో పయనిస్తున్న రాష్ట్రం అవినీతిలో మాత్రమే ముందంజలో ఉందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం మండలకేంద్రం విడవలూరులోని ఆ పార్టీ జిల్లా నేత చెముకుల శ్రీనివాసులు ఇంట్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ ఎనిమిదేళ్ళ కాంగ్రెస్ పాలనలో మరో పిల్ల కాంగ్రెస్ పుట్టడం తప్ప మరేమీ సాధించలేదన్నారు. ఆ రెండూ ఎప్పటికైనా ఒక్కటి కాక తప్పదని ప్రజల సాధక బాధలు పట్టించుకునే నాధుడు లేనందున అన్ని వర్గాలూ అల్లాడ్తున్నాయన్నారు. కోవూరు చక్కెర కర్మాగారానికి చెరకు సరఫరా చేసిన రైతులకు 10కోట్ల రూపాయలు, ఉద్యోగులకు 2 కోట్ల రూపాయల వరకు బకాయిలు చెల్లించాల్సి వుండగా, వాటిని వెంటనే చెల్లించేందుకు ఆర్థిక మంత్రి హామీ నిలబెట్టుకోవాలన్నారు. లేకుంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇతర రైతు సంఘాలతో కలిసి ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయానికి ఖర్చులు విపరీతంగా పెరిగినందున రైతుల సహనాన్ని పరీక్షించేలా ప్రభుత్వం వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. గ్యాస్ ఆధారిత విద్యుత్ కోసం ముఖ్యమంత్రి కేంద్రాన్ని ఆశ్రయించగా, ఇటీవల 400 మెగావాట్ల విద్యుత్‌ను మహరాష్టక్రు తరలించడం కేంద్ర పాలకులకు ఆంధ్రప్రదేశ్ పట్ల సవతిప్రేమ ఉందనేందుకు నిదర్శనంగా కనిపిస్తోందన్నారు. విద్యుత్ వ్యవస్థను నియంత్రించడంలో ప్రభుత్వ వైఫల్యాల కారణంగా అన్ని రంగాలూ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. ఈ దుస్థితి నుంచి కోలుకునేందుకు ఎనే్నళ్ళు పడ్తుందో అర్థంకావడం లేదని, ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలే బాధ్యత వహించాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి చేజెర్ల వెంకటేశ్వర్లు, కోవూరు నియోజకవర్గ ఇన్‌చార్జి గోవర్ధన్‌రెడ్డి, మండల కన్వీనర్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి, స్థానిక నాయకులు సత్యంరెడ్డి, సుధాకర్, రసూల్ పాల్గొన్నారు.
అదిగో.. దెయ్యం..!
కావలి, ఆగస్టు 4: నిత్యం సాగరంపై సయ్యాట లాడ్తూ పడిలేచే కడలి తరంగాలతో పోటీపడ్తూ హుషారుగా ఆనందోత్సాహాలతో కనిపించే ఆ గ్రామాన్ని పదిహేను రోజులుగా నిస్తేజం ఆవరించింది. ఏదో తెలియని ఆందోళనతో ఏ చిన్న సంఘటన జరిగినా ఉలిక్కిపడ్తూ జన జీవనం స్తబ్ధుగా మారిపోగా, తుదకు గ్రామ పెద్దల తీర్మానంతో ఒక తాంత్రికుడికి చేతినిండా పని దొరికినట్లయ్యింది. కావలి మండలంలోని తీరప్రాంత గ్రామం కొత్తసత్రం గత కొంతకాలంగా దెయ్యం భయం గుప్పెట్లోకి జారుకుంది. పట్టణంలోని ఒక డిగ్రీ కళాశాలలో చదివే 20 ఏళ్ళ యువతి మృతి సంఘటన ఈ మొత్తం పరిణామాలకు కేంద్రంగా మారింది.!
ఇష్టం లేని పెళ్ళిని ఎదిరించిన యువతి అనూహ్యంగా అశువులు కోల్పోగా, ఆ యువతి మరణంపై భిన్న కథనాలు వినిపించాయి. అయితే తమ కుమార్తె అకాల మృతి పట్ల తమకు ఎలాంటి సందేహాలు లేవంటూ తలితండ్రులు బింకంతో గ్రామస్తుల పుకార్లకు స్వస్తి పలికారు. అయినా మూఢ నమ్మకాలకు, దురాచారాలకు నెలవైన తీరంలో ఈ యువతి మృతి పెద్ద కలకలమే సృష్టించింది. ఆ సంఘటన జరిగిన వారం రోజులకు అందరితో పాటు ఆడుతూ పాడుతూ సముద్రంలో చేపల వేటకు వెళ్ళిన ఒక వ్యక్తి సముద్రంలో పడి ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీరని మనస్తాపంతో మృతిచెందిన ఆ యువతే దెయ్యమై ఊర్లో తిరుగుతోందంటూ పుకార్లు వ్యాపించాయి. ఇలాంటివి సహజంగానే గట్టిగా నమ్మే మనస్తత్వం గల మత్స్యకారులు ఆ సంఘటన అనంతరం సముద్రం వైపు వెళ్ళాలంటే సంకోచించే పరిస్థితి ఏర్పడింది. ఇలా గాలి లాంటి ఆకారం కొందరికి కనిపిస్తోందంటూ రోజుకోరకంగా వదంతులు వ్యాపించడంతో మత్స్యకారులు చివరకు సముద్రం వైపు వెళ్ళేందుకు సాహసించలేక వేటకు గుడ్‌బై చెప్పారు. చివరకు తమ ఊరికి అరిష్టాలు తొలగిపోవాలంటూ రంగంలోకి దిగిన కాపులు వారి సాంప్రదాయం మేరకు దురాయి వేయడంతో జిల్లాలోని తడ ప్రాంతానికి చెందిన ఒక మాంత్రికుడికి పిలుపు వెళ్ళింది. మత్స్యకారుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని భారీ ఎత్తున సొమ్ము డిమాండ్ చేసి తనకు అలవాటైన రీతిలో పూజలు సాగించినట్లు సమాచారం. గత ఆది, మంగళ, శుక్రవారాల్లో తాంత్రిక పూజలు చేసి గ్రామ నలుదిశల్లో దిగ్బంధన తోరణాలు కట్టడంతో ఇక తమను గాలి ధూళీ ఏమీ చేయలేవంటూ మత్స్యకారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ భయాలు, పూజల గురించి కొందరు గ్రామస్థులను కదపగా, కట్టుబాటు మేరకు తాము నోరువిప్పి చెప్పేందుకు ఏమీ లేదంటూ ససేమిరా అన్నారు. అయితే తాము దెయ్యాలను నమ్మడం లేదని, అనాదిగా ఇలాంటి ఆచారాలను కొనసాగిస్తున్న పెద్దలను కాదనడం సాధ్యం కాదంటూ కొందరు యువకులు చెప్పారు. చేపల వేటకు విరామం గురించి ప్రశ్నించగా, ఆవుల తాతయ్య అనే వ్యక్తి ఆకస్మిక మృతితో భయపడి కొంతకాలం సముద్రం వైపు వెళ్ళని మాట వాస్తవమేనని చెప్తూ ప్రస్తుతం వర్షాల కారణంగా గత రెండురోజులుగా వేట నిలిపివేశామన్నారు.
స్వాతంత్రదినోత్సవ వేడుకలు
ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలి:కలెక్టర్
నెల్లూరు కలెక్టరేట్, ఆగస్టు 4: జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్ అన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను చేయడంతో పాటు ప్రభుత్వ అమలు తీరును వివిధ శకటాల ద్వారా ప్రదర్శింపజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టర్ ఛాంబర్‌లో ఆగస్టు 15న పోలీస్ పెరెడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న స్వాతంత్య్రదినోత్సవ వేడుకపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోలీస్‌శాఖ ద్వారా పెరెడ్ గ్రౌండ్‌ను సిద్ధం చేయాలన్నారు. జాతీయపతాక ఆవిష్కరణ, కవాతు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రెవిన్యూశాఖ ఆధ్వర్యంలో వేడుకకు విచ్చేసే వారిని దృష్టిలో ఉంచుకొని షామియానాలు, కుర్చీలు తదితర ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, స్వాతంత్య్ర సమరయోధులు, న్యాయశాఖ అధికారులతో పాటు ఇతర ముఖ్యులకు ఆహ్వానాలు పంపాలన్నారు. విద్యాశాఖ పర్యవేక్షణలో వివిధ పాఠశాలల పిల్లలను తీసుకువచ్చి వేడుకలను తిలకించే విధంగా చూడాలన్నారు. జాతీయ సమైక్యత, అక్షరాస్యత, సామాజిక ధ్రుక్పథానికి అంశాలపై సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించారు. సంగీత నృత్యకళాశాల ఆధ్వర్యంలో 15వ తేది సాయంత్రం కస్తూర్భా కళాక్షేత్రంలో వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు క్రమ పద్ధతిలో నిర్వహించాలని తెలిపారు. నగరపాలక సంస్థ ద్వారా పెరెడ్‌గ్రౌండ్‌ను శుభ్రంగా ఉంచి తాగునీటి వసతి కల్పించాలన్నారు. ఈ వేడుకలకు అన్ని శాఖల అధికారులతో పాటు ఆయా శాఖల సిబ్బంది తప్పనిసరిగా హాజరవ్వాలని ఆయన జిల్లా అధికారులను ఆదేశించారు. వేడుకల సందర్భంగా వివిధ శాఖల ద్వారా లబ్ధిదారులకు ఆస్తుల పంపిణి చేయాలని సంక్షేమశాఖ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బి.రామిరెడ్డి, నెల్లూరు, కావలి ఆర్‌డిఓలు కె.మాధవీలత, సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి వీరభద్రయ్య, సిపిఓ పిబికె మూర్తి, డ్వామా పిడి గౌతమి, నగర అదనపు కమిషనర్ భాగ్యలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మాశిలామణి, ట్రాన్స్‌కో ఎస్‌ఇ నందకుమార్, డిఆర్‌డిఎ పిడి వెంకట సుబ్బయ్య, ఎస్‌సి కార్పొరేషన్ పిడి సోమయ్య తదితర వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.