![](http://www.andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/kavita_2.jpg)
వ్యక్తిలోంచి-
సమూహంలోకి నడిచే క్రమంలో
ఆలోచనల రెక్కలు రాలుతాయి
నీవెక్కడి నుండి
మొదలయ్యావో
నీవెక్కడిదాకా కొనసాగాలో
నిన్ను - నీవు నిర్ధారించలేవూ
నిన్ను శాసించే
యంత్రాంగం - సమూహం లోనిదే!
ఒక్కసారైనా తిరగబడని
నీ ఆలోచనల నీడలు
నిన్ను వెక్కిరిస్తాయి
సంఘం సైన్యంలోంచి
గెలిచే శక్తి
ఒక్క ఆలోచనకే ఉంది...?
అన్న సత్యం వెనుక
సారాంశము - నిరాశపరిచే
మనిషి బలహీనత
ఆలోచనల నిచ్చెనలను
కూలుస్తున్నాయి
ప్రపంచ గమనాన్నీ - మార్చిన మార్గాలను
సిద్ధాంతాల దుర్గాలను కూల్చిన
విలువైన పద్ధతులను వెలికితీసిన
స్కూల్ ఆఫ్ థాట్స్
ఆధునీకరించబడ్డాయి
సమాజాన్నీ ఎదురించబడ్డాయి
ఇక్కడి ఉనికిని
ఊహలోంచి చెప్పే
తలకాయల - మాయాజాలాన్నీ
ప్రయోగాత్మక - విశే్లషణాత్మక
గదుల్లో బంధించి - భద్రపరిచి
ఘనీభవింపజేసే
సంస్కృతికి - సమాధానమే
ఈ ప్రపంచపు నేటి పుటల
అక్షరాల అర్థం!?
నరికిన - విరిచిన- ఆకారంలేని
పలుకుల - మెదళ్లు-
మెదళ్లలోనివే - కానీ
రూపం నిచ్చిన - స్వరూపం నిచ్చిన
ఆలోచన
ఆచరణలో మొదలుపెడ్తే
ప్రాచీనం - విరుచుకుపడిపోతుంది
ఆవిష్కరణ ఆలోచనదే
నీ వెంట జనం ఉన్నా లేకున్నా
మళ్లీమళ్లీ పుడ్తావు
మళ్లీ మళ్లీ జీవిస్తావు-
అందుకే
వ్యక్తిలోంచి సమూహంలోకి
నడిచేది నీవూ
నీ ఆలోచన కాదు
జనం బలం
వలయం లాంటిది
ఆలోచన - అణుశక్తి లాంటిది
.........................................................
ముద్దుటద్దం
-డా.వై.రామకృష్ణారావు
ఆత్మావలోకనం
అంతరంగ శోధనం వంటి
పెద్దపెద్ద విషయాలూ,
వేదాంతాల రాద్ధాంతాలూ వద్దుగానీ,
అసలు
బాహ్య శరీరాన్ని
ఎంతవరకు చూసుకోగలం?
అన్నిటినీ చూసే కళ్లు
తమని తామే చూసుకోలేవు
తమకి నెలవైన తలలో
ఏ భాగాన్నీ చూడలేవు
చర్మాన్ని తప్ప
ఏ జ్ఞానేంద్రియాన్నీ దర్శించలేవు
కనుసోగల కాటుకరేఖల్నీ
మరునివిండ్ల వంటి సుభ్రూ విభ్రమాల్ని
అరుణోదయం వంటి తిలకకాంతుల్నీ
స్నిగ్ధ కపోలాల్నీ
బింబాధరాల్నీ
వేటిని చూడగలవీ కళ్లు?
ఎవరో చెబితేనే గదా తెలిసేది
వాళ్లు
దేవుడి మీద ప్రమాణం చేసి
అంతా నిజమే చెబుతారా?
అబద్ధం చెప్పరా?
ఏమో-
అబద్ధం చెప్పనిది అద్దమే
కళ్లు
తాముగా కదలివెళ్లి చూడలేని
తమ ఆకార వికారాలని
అచ్చంగా చూపించేది అద్దమే
కొండని కొంచెంగా చూపిస్తుంది గదా అని
అద్దాన్ని కొంచెం చూడగలమా!
మా మంచి అద్దం
అందుకే మురిపెంగా
అద్దాని ముద్దుపెట్టుకుంటే
మళ్లీ
నా ముద్దు నాకే తిరిగిచ్చేస్తుంది!
.........................
మళ్లీ చిగురించనీ...
-బి.కళాగోపాల్
ధ్వజస్తంభం లేని ఆలయంలా, పల్లె బోసిపోయింది
మర్రి చిరునామా లేని మా దిగుడుబావి గొంతెండిపోయింది
అణువంత విత్తులో వొదిగిన విరాట్ రూపం
సృష్టి వైచిత్రికి జీవన సాక్ష్యం!
ధ్యానముద్రలో ఉన్న శివుడి రూపంలా అగుపించే
మా ఊరి ఊడలమర్రి
ఓ వసుధైక కుటుంబాన్ని మోసే పూటకూళ్ల పెద్దమ్మ తల్లి
పొలిమేర్లలో కాపలా కాసే మర్రి జవాన్లు
ఒక్కరొక్కరుగా అవశేషాలయ్యేవేళ
వంపులు తిరిగిన రహదారిలో నీడల ఉనికి మాయం
అలుముకొన్న గూడు చెదిరిన నైరాశ్యం
ఊరించి చెప్పే భేతాళ కథల్లోని ఒక మహావృక్షపు
చిరునామా కనుమరుగవుతున్నది
పట్టణపు భూదందా రాహువు పచ్చదనాన్ని మింగుతున్నది
పల్లె గుండె ఎండి ఎడారవుతున్నది
నగరీకరణ ముసుగలో బెత్తెడు జాగా కరువై,
బోన్సాయ్‌గా ప్రకృతికే ప్రతిసృష్టి!
అవయవాలను లోనకు పొదువుకొన్న తాబేలు రూపం!
అద్దాల మేడలో అలంకరణ సామాగ్రి ప్రక్కన దక్కిన చోటు
విఠలాచార్య శాపగ్రస్త, ఒంటరి దీవిలో బందీ!
నానోల యుగంలో మినియేచర్‌ల మేళా!
ఇంతింతై ఎదగలేని మరుగుజ్జును
చూపులతో తడిపే ఆశ్చర్యాలు!
వికృతిగా మార్చే మానవుల వైవిధ్యపు సృజనకు
ప్రకృతేగా ప్రయోగశాల
తల్లి కడుపులో చిచ్చుపెట్టే ఈ అమానుషులను
క్షమించుమా! వృక్షరాజమా!
ఐనా.. నీ అస్థిత్వానికి ఊపిరిలూదుతూ,
మళ్లీ చిగురించవూ..
సహస్ర శాఖలుగా, ఆశగా, అపరిమితంగా...
*