Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మిస్టర్ ప్రెసిడెంట్!

$
0
0

ప్రధాన మంత్రి కావాలనుకున్న వ్యక్తి రాష్టప్రతి అయ్యారు. భారత దేశ పదమూడో రాజ్యాంగ పీఠంపై రాజకీయాలను ఆమూలాగ్రం ఔపోసన పట్టిన ప్రణబ్ ముఖర్జీ ఆశీనులయ్యారు. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితం నేపథ్యంలో..దక్కిన ఈ రాజ్యాంగ పదవి ప్రణబ్‌పై గురుతర బాధ్యతలనే ఉంచింది. రాజకీయ, ఆర్థిక పరమైన సమస్యలతో పాటు అనేక సవాళ్లు కూడా పొంచి ఉన్న నేపథ్యంలో రాష్టప్రతి పదవి కత్తిమీద సాము లాంటిదే! అర్థశాస్త్ర అంచుల్ని, రాజకీయ లోతుల్ని చూసిన అధినేతకు రాజ్యాంగ పరిరక్షణ సునాయాసమే..కానీ ప్రణబ్ ఏ రకమైన రాష్టప్రతిగా ముద్ర వేసుకుంటారన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఓ ఆర్వీ, శంకర్‌దయాళ్ శర్మ, కెఆర్‌లు రాష్టప్రతి పదవి సత్తా చూపించారు! ఇప్పుడా గురుతర బాధ్యత చేపట్టిన ప్రణబ్ అన్ని విధాలుగా రాజ్యాంగానికి వనె్న తేవాలని, ఈ పదవి ఔన్నత్యాన్ని మరింత ఇనుమడింపజేయాలని ఆశిద్దాం...
.............
కల ఫలించింది..రైసీనా తోటల్లో విహరించాలన్న చిరకాల వాంఛ నెరవేరింది. సుదీర్ఘ రాజకీయ జీవితానికి తలమానికంగా..సమున్నతంగా రాష్టప్రతి పీఠాన్ని రాజకీయ దురంధరుడు, అపర కౌటిల్యుడు, రాజ్యాంగాన్ని ఔపోసన పట్టిన అనుభవజ్ఞుడు అధిష్టించాడు.
ప్రణబ్ ముఖర్జీ రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. అందులోని ప్రతి పేజీ, ప్రతి పుట పుంఖానుపుంఖాలుగా ఆయన ప్రజ్ఞకు, రాజనీతిజ్ఞతకు అద్దం పట్టేదే. బెంగాల్ నుంచి ఢిల్లీ దర్బార్ వరకూ సాగిన ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి దర్పణంగా నిలిచేదే..అరవైయవ దశకంలో పార్లమెంట్‌లో అడుగు పెట్టినప్పుడే రాజకీయ వైకుంఠ పాళిలో ఎవరికీ చిక్కకుండా ఎలా గమ్యాన్ని చేరుకోవాలో నేర్చుకున్నారు. తన ఇంటి నుంచి కనిపించే రాష్టప్రతి భవన్‌లో అడుగిడాలన్న కోరిక ఆయనకు అప్పటి నుంచే ఉండేది. ఆ భవన వైభవం, అందులోని తోటల్లోని వివిధ రకాల పుష్పాల సౌరభాలు ఆయన్ని ‘ఆకర్షించాయి’..అందుకేనేమో..రాష్టప్రతి అభ్యర్థిగా యుపిఏ తన పేరు ఖరారు చేయకముందే ఆయన మదిలో ‘రాష్టప్రతి’ ఆశలు చిగురించాయి. ఆ తోటల్లో విహరించడంలో ఉండే ఆనందం మరెక్కడా ఉండదని చమత్కారపూర్వకంగానైనా ఆయన తన మనసులోని మాటను, తన మదిలో గూడుకట్టుకున్న బలమైన ఆకాంక్షను చాటి చెప్పారు. కాంగ్రెస్ తలలో నాలుకలా, ఎలాంటి సమస్య వచ్చినా ఆగమేఘాల మీద వాలిపోయి పరిష్కరించే వ్యక్తిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ మనసును గ్రహించారో ఏమిటో..యుపిఏ అధినేత్రి సోనియా గాంధీ ఆయన ఆకాంక్షను నెరవేర్చారు. మిత్రులు అడ్డువచ్చినా, కొత్త పేర్లు తెరపైకి వచ్చినా పట్టిందే పట్టుగా ప్రణబ్‌దాదానే యుపిఏ అభ్యర్థిగా ఖరారు చేశారు. ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉన్న మిత్ర పక్షపక్షమైన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఎన్ని అభ్యంతరాలు చెప్పినా, ఆమెను కాదంటే సర్కారుకే ముప్పు వాటిల్లే పరిస్థితులు పొంచి ఉన్నా.. ప్రణబ్‌దా విషయంలో రాజీలేదని సోనియా ప్రకటించడం ఆయన పట్ల ఆమెకు ఉన్న నమ్మకానికే కాదు, దశాబ్దాలుగా కాంగ్రెస్‌తో పెనవేసుకున్న ఆయన అనుబంధానికీ అద్దం పట్టేదే. నలభై మూడు సంవత్సరాల క్రితం ఎంపీగా ఎన్నికైన ముఖర్జీ 39సంవత్సరాలు దాటకుండానే మంత్రి పదవిని చేపట్టి తన ప్రజ్ఞాపాఠవాలను క్రమంగా చాటుకుంటూ వచ్చారు. నాటి నేటి కాంగ్రెస్ అధినేతల ఆదరణను అడుగడుగునా చూరగొంటూనే ఉన్నారు. మూడు దశాబ్దాల క్రితం అత్యంత కీలకమైన ఆర్థిక శాఖను భుజాన వేసుకున్న ముఖర్జీ గత నాలుగు దశాబ్దాలుగా కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన ప్రతి ప్రధాన మంత్రి మంత్రి మండలిలో పని చేశారు. కేవలం తనను ఆదరించిన పార్టీకి విధేయంగా ఉండటంతో సరిపెట్టకుండా అన్ని పార్టీలకు తాను ఆప్తుడ్నన్న అభిప్రాయాన్ని ప్రణబ్ అడుగడుగునా కలిగించడం ఇప్పుడు కలిసొచ్చింది. రాష్టప్రతి పదవికి జరిగిన ఎన్నికల్లో బిజెపి సారధ్యంలోని ప్రతిపక్ష ఎన్డీయేతో పాటు కాంగ్రెస్‌ను వ్యతిరేకించే అనేక పార్టీలు కూడా ఆయనకు వంత పాడాయి. ప్రతిపక్షాల అభ్యర్ధిగా లోక్‌సభ మాజీ స్పీకర్ పిఎ సంగ్మా నిలబడినా ప్రణబ్‌కే వంతపాడాయి. ఈ రకమైన రాజకీయ సమన్వయం, సహకారం అన్నవి ఆది నుంచీ ప్రణబ్ పెంపొందించుకుంటూనే వచ్చారు. తాను మంత్రి పదవిలో ఉన్నా లేకపోయినా..అందరివాడ్నన్న అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరికీ కలిగించి..ప్రత్యర్థుల్ని సైతం మిత్రులుగా మార్చుకోగలిగిన నిరుపమాన వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నారు. అందుకే గత నాలుగు దశాబ్దాలుగా పార్లమెంట్‌లో అడుగిడిన వ్యక్తులందరిలోనూ తాను భిన్నమని, తన అభిమతం విభిన్నమని రుజువు చేసుకున్నారు.అత్యుత్తమ పార్లమెంటేరియన్‌గా అందరి ఆదరణ, అభిమానం, ఆత్మీయతలను చూరగొన్నారు. ప్రణబ్ ముఖర్జీ లేని పార్లమెంట్‌ను తాము చూడలేదని కొన్ని తరాల పార్లమెంట్ సభ్యులు చెప్పుకుంటున్నారంటే..ఆయన వాగ్దాటికి, విషయపరిజ్ఞానానికి అబ్బుర పడని వ్యక్తులు లేరంటే అతిశయోక్తి ఏమీ కాదు. ప్రణబ్ తండ్రి కాంగ్రెస్ వాది కావడం వల్ల ఆయన కూడా అదే రాజకీయ బాటను అనుసరించారు. కేవలం మొక్కుబడి స్థానంతో, పదవులతో సరిపెట్టుకోకుండా అనేక విధాలుగా తన విధేయతను చాటుకున్నారు. ఆదే క్రమంలో తన ప్రతిభ ఏమిటో రుజువు చేసుకున్నారు కూడా. అందుకే ఎందరో మంత్రులున్నా, ప్రణబ్ కంటే అప్పట్లో సీనియర్లూ ఉన్నా..కీలక బాధ్యతలన్నీ ఆయనకే అప్పగించేవారు. కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా విస్తరించి ఏక కాలంలో కేంద్రంలోనూ, అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి సమస్యలు, అంతర్గత కుమ్ములాటలు, అధికార పోరాటాలూ అన్ని చోట్లా అనివార్యంగానే కనిపించేవి. వాటన్నింటినీ క్షణాల్లో పరిష్కరించి కాంగ్రెస్ పార్టీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఘనత ఆయనది. గత కొన్ని సంవత్సరాలుగా, ముఖ్యంగా సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీపరంగా, ప్రభుత్వ పరంగా తీసుకున్న అన్ని కీలక నిర్ణయాల వెనుక ప్రణబ్ ముఖర్జీ ప్రమేయం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతిభ ఉన్న చోట అహంకారం ఉంటుంది. గుర్తింపు పొందాలన్న తపన, ఆరాటమూ ఉంటుంది. ఏళ్ల తరబడి కాంగ్రెస్ తెర వెనుక ‘ముఖ’ర్జీగా ఉన్న ఆయన అలిగిన సందర్భాలూ ఉన్నాయి. ఇరవై ఎనిమిదేళ్ల క్రితం కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన ఆయన సొంతంగా పార్టీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే..మళ్లీ కాలం కలిసి రావడం, కాంగ్రెస్ నుంచే పిలుపురావడంతో సొంత పార్టీని అటకెక్కించి మళ్లీ కాంగ్రెస్ రధాన్ని ఎక్కారు. రాష్టప్రతి పదవికి నామినేషన్ వేసే వరకూ..మన్మోహన్ సర్కార్‌లో ప్రణబ్ ముఖర్జీని తిరుగులేని స్థానం. కాంగ్రెస్ పరంగా అధినేత్రి సోనియా గాంధీకి ‘మిస్టర్ డిపెండబుల్’..దేశ రాజకీయాలను ఆమూలాగ్రం ఔపోసన పట్టడంతో పాటు ఆర్థిక అంశాలపైనా అపారమైన పట్టు ఉండటం వల్లే పలు మార్లు ఆయన్ని ఆర్థిక మంత్రి పదవి వరించింది. మరో ప్రత్యామ్నాయమే లేదన్నట్టుగా రాజకీయాలనే కాదు ఆర్థిక విధానాలను, వ్యూహాత్మక అంశాలను ప్రణబ్ వొంటబట్టించుకున్నారు. ఏ సమస్యకు ఆ పరిష్కారం అన్నట్టుగా వ్యవహరించే ఆయనకు కీలెరిగి వాత పెట్టడమూ తెలుసు. అందుకే ముఖర్జీతో ఎంత వరకూ ఉండాలో అంత వరకూ ఉంటే మంచిదన్న అభిప్రాయం కూడా ఆయనతోటి మంత్రి వర్గ సహచరుల్లోనూ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజకీయ విన్యాసాలు ఎంతగా సాగించారో..ఆర్థిక విధానాలను అంతే కటువుగా అమలు చేశారు. భారత దేశ వౌలిక సమస్యలన్నింటిపైనా పరిపూర్ణమైన అవగాహన ఉండటమే కాదు..అనేక అంశాలను, జటిలమైన వ్యవహారాలను ఉభయతారకంగా కొలిక్కి తెచ్చిన ఘనత ప్రణబ్‌నని చెప్పడం అతిశయోక్తి ఏమీ కాదు. దేశీయ వ్యవహారాలను ఎంత నేర్పుగా చక్కబెట్టారో..విదేశీ వ్యవహారాలను కూడా అంతే నేర్పుగా చక్కబెట్టారు.విదేశాంగ మంత్రి హోదాలో ఆయన జరిపిన పర్యటనలు వివిధ దేశాలతో భారత సంబంధాలను రాజకీయంగా, వ్యాపార, వాణిజ్యపరంగానూ కొత్త పుంతలు తొక్కించాయంటే అందుకు కారణం..ఆయన విజ్ఞతాయుతమైన ప్రతిభా సంపత్తులే. ఏ సమస్యకైనా పరిష్కారాస్త్రాన్ని గురి తప్పకుండా ప్రయోగించగలిగే సవ్యసాచి కాబట్టే.. మిత్ర పక్షాలు ఎన్ని ఆరళ్లు పెట్టినా..అలకపాన్పునెక్కి భీష్మించినా ముఖర్జీ వ్యవహారాన్ని సునాయాసంగా కొలిక్కి తేగలిగేవారు. పార్లమెంటరీ వ్యవహారాలకు సంబంధించి స్వపక్షీయుల కంటే విపక్షాలనే ఆయన తేలిగ్గా దారికి తేగలిగేవారు. రాజకీయం వేరు.. ప్రభుత్వ బాధ్యతలు వేరన్న ఇంగితాన్ని గ్రహించడం వల్లే ప్రతి వ్యవహారానికి ఎంత ప్రాధాన్యతనివ్వాలో అంతే ప్రాధాన్యతనిచ్చేవారు. ప్రభుత్వ వ్యవహారాల్లో రాత్రి పొద్దుపోయే వరకూ తలమునకలైన ఆయన రాత్రి పది గంటల తర్వాతే రాజకీయ సమావేశాలు నిర్వహించేవారంటే.. ఒకదాని ఛాయ మరో దానిపై పడకూడదన్న నియమాన్ని ఎంత నిష్ఠగా పాటించేవారో స్పష్టమవుతుంది.
ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ పట్ల విధేయత, ఆ పార్టీ అన్ని ప్రభుత్వాల్లో కీలక పదవులతోనే గడిచిన ప్రణబ్ జీవితం ఇప్పుడు సరికొత్త మలుపు తిరగడం.. రానున్న రోజుల్లో ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుందన్న ఆసక్తిని కలిగిస్తోంది. రాజ్యాంగమే తనకు శిరోధార్యమని స్పష్టం చేసిన ఆయన దానికి త్రికరణ శుద్ధిగా కట్టుబడాల్సి ఉంటుందని, కట్టుబడక తప్పదని చెప్పక తప్పదు. రాష్టప్రతిగా రాజ్యాంగ పరిరక్షణే పరమార్ధం కావాలే తప్ప ఈ పదవిని నిర్వహించే వ్యక్తికి రాజకీయ విధేయతలతో, సంబంధాలతో నిమిత్తమే ఉండదు. అంటే..కాంగ్రెస్ గవర్నర్ల మాదిరిగా రాష్టప్రతి పదవిని చేపట్టిన వ్యక్తి ఆ పార్టీకి ఎంత సన్సిహితుడైనా దేశ గౌరవాన్ని, రాజ్యాంగ ధర్యాన్ని అహరహం పరిరక్షించేందుకే ప్రయత్నించాలి. ఆ విషయంలో ప్రణబ్ ముఖర్జీ ఎంతగా రాటుదేలతారన్నది రానున్న రోజులే చెబుతాయి. బాబూ రాజేంద్ర ప్రసాద్ నుంచి ప్రతిభా పాటిల్ వరకూ ఇప్పటి వరకూ వచ్చిన రాష్టప్రతులెవరికీ లేని అరుదైన, విశిష్టమైన అనుభవం ప్రణబ్ ముఖర్జీకి ఉంది. అంటే ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ ప్రణబ్ అంత క్రియాశీలకంగా ఎవరూ పని చేయలేదన్నది వాస్తవం. పాలనా పరమైన అనుభవం మెండుగా ఉన్న ప్రణబ్ రాష్టప్రతి హోదాలో ఈ రకమైన అంశాలను ఏ విధంగా పరిష్కరిస్తారన్నది ఆసక్తిని కలిగించేదే. ఇప్పటి వరకూ అనేక మంది రాష్టప్రతులకు వారసత్వంగా వస్తున్న సమస్యలు ప్రణబ్‌కు కూడా అందాయి. ముఖ్యంగా క్షమాభిక్షలకు సంబంధించిన పిటిషన్లు ఇబ్బడిముబ్బడిగానే దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని ముట్టుకుంటే దేశ వ్యాప్తంగా ఏదో రకమైన అలజడి చెలరేగే అవకాశం ఉండటంతో ఎవరూ ఇంత వరకూ వాటి జోలికి పోలేదు. ముఖ్యంగా అఫ్జల్ గురు సహా మరణశిక్షలు ఎదుర్కొంటున్న పది మంది ఖైదీలు రాష్టప్రతి క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో వీటిపై నిర్ణయం అన్నది ఆయనకు ఓ పెద్ద సవాలే! ఈ తరహా సమస్యలు ఎలా ఉన్నా..ప్రణబ్ ముఖర్జీ ఏ రకమైన రాష్టప్రతిగా తనకంటూ దేశ చరిత్రలో ప్రత్యేకతను సంతరించుకుంటారన్నది కూడా ఆసక్తిని కలిగించే అంశమే. ముఖ్యంగా మరో రెండేళ్లలో జరిగే సాధారణ ఎన్నికల్ని ఈ సందర్భంగా ప్రధానంగా పేర్కొనాలి. వరుసగా రెండు సార్లు కేంద్రంలో అధికారాన్ని సంపాదించుకున్న కాంగ్రెస్ పార్టీకి 2914 ఎన్నికల్లోనూ నెగ్గితే హ్యాట్రిక్ విజయం అవుతుంది. అలాగే ప్రధాన ప్రతిపక్షమైన బిజెపికి నెగ్గకపోతే దానికి హ్యాట్రిక్ పరాజయమే అవుతుంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి చూస్తే అటు కాంగ్రెస్‌కు గానీ ఇటు బిజెపికి గానీ పూర్తి స్థాయి మెజార్టీ లభించే అవకాశాలు ఏ కోశానా కనిపించడం లేదు. దీని దృష్ట్యా బలాబలాల సమస్యలు తలెత్తడం, మెజార్టీని సమీకరించుకోవడం వంటి అంశాలు అనివార్యంగానే చోటు చేసుకుంటాయి. అక్కడే ప్రణబ్ ముఖర్జీ రాజ్యాంగ బాధ్యత స్పష్టమవుతుంది. ఇది రెండేళ్ల తర్వాత జరిగే పరిణామమే అయినా ఇప్పటి నుంచీ దానిపై ఆసక్తి కలగడానికి కారణం..రాష్టప్రతి హోదాలో కాకలు తీరని కాంగ్రెస్ వాది ఉండటమే! రాష్టప్రతి అయిన తర్వాత రాజకీయాలకు అతీతంగా, రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించడం విద్యుక్త ధర్మమే అయినా..అనిశ్చిత, అగమ్య పరిస్థితుల్లో ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తిని కలిగించేదే అవుతుంది. భారత రాజ్యాంగం రాష్టప్రతిని రాజ్యాధినేతగానే గుర్తించింది. అందుకు సంబంధించిన పూర్తి స్థాయి అధికారాలను ధారాదత్తం చేసింది. అయితే నిజమైన కార్యనిర్వాహక అధికారాలు మాత్రం ప్రభుత్వాధినేత అయిన ప్రధానికే కట్టబెట్టింది. రాష్టప్రతికి ఉండే అధికారం ప్రధానిగా ఎవరు ఉండాలన్న అంశంపైనే.. అంటే మెజార్టీ ఎంపీల మద్దతు కలిగిన వ్యక్తిని..ఆయన లెక్కల్ని ధృవీకరించుకున్న తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంలోనే..! ప్రస్తుత పరిస్థితుల్లో అనూహ్యమైన మార్పులు రాని పక్షంలో రెండేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల ఫలితాలు హంగ్ పార్లమెంట్‌నే ఆవిష్కరిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే.. కాంగ్రెస్ సారధ్యంలోని యుపిఎ సర్కార్ అనేక కుంభకోణాల్లో ఇరుక్కుని దేశవ్యాప్తంగా ప్రజాదరణకు దూరమైంది. ఏకంగా మంత్రులపైనే అవినీతి ఆరోపణలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. ఇక ప్రధాన ప్రతిపక్షపైన బిజెపి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఎంత మాత్రం లేదు. ఎవర్ని ప్రధాన మంత్రి అభ్యర్థిగా నిలబెట్టాలన్న విషయంలో తర్జనభర్జనలు పడుతోంది. ఒక రకంగా చెప్పాలంటే నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్న మాట! ఇలాంటి పరిస్థితుల్లో రెండు పార్టీలు అధికారం కోసం పట్టుబట్టడం సహజంగానే జరుగుతుంది. ఆ తరహా సంక్లిష్ట పరిస్థితుల్లోనే రాష్టప్రతిగా ప్రణబ్ ముఖర్జీ తీసుకోబోయే నిర్ణయం దేశ భవితవ్యాన్ని నిర్దేశిస్తుంది. భారత రాజ్యాంగంలోని 53వ అధికరణ ప్రకారం రాష్టప్రతికి అనేక అంశాలపై కార్యనిర్వాహక అధికారం ఉంటుంది. దేశంలో ఎక్కడ ఏమి జరుగుతోందో తెలుసుకునే అధికారం, ఉన్నత రాజ్యాంగ పదవులకు సంబంధించి నియామకాలు చేయడం లేదా తొలగించడం, సుప్రీం కోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్ని నియమించడం మొదలైనవి కార్యనిర్వాహక అధికారాల పరిధిలోకి వస్తాయి. ప్రధాన మంత్రి ఇతర మంత్రుల నియామకం కూడా ఈ అధికార పరిధి కిందికే వస్తుంది.
శాసన సంబంధమైన అధికారాల పరిధిలోకి వచ్చే వాటిలో అత్యవసర పరిస్థితుల్లో పార్లమెంట్ ఉభయ సభల్ని సమావేశ పరచడం మొదలైనవి ఉన్నాయి. పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు మొదలైనా ఉభయ సభల్ని ఉద్దేశించి రాష్టప్రతి ప్రసంగంతోనే అవి ప్రారంభం కావడం ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. వీటితో పాటు సైనిక పరమైన, దౌత్యపరమైన, న్యాయపరమైన అధికారాలను కూడా రాష్టప్రతి కలిగి ఉంటారు. అయితే వాటిని ఎప్పుడు ఎక్కడ, ఎలా ఉపయోగిస్తారన్నది ఆయా పరిస్థితుల్ని బట్టి, ఈ పదవిని నిర్వహించే వ్యక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది.
వెస్ట్‌మినిస్టర్ తరహాలో భారత రాజ్యాంగ నిర్మాణం జరిగినా.. బ్రిటన్ రాణి తరహాలో భారత రాష్టప్రతి పదవిని కూడా నామమాత్ర చందంగా మార్చినా కొంత సందిగ్ధత ఇప్పటికీ నెలకొని ఉంది. అదేమిటంటే..బ్రిటన్ తరహా విధానాన్ని త్రికరణ శుద్ధిగా అనుసరించి తీరాలా లేదా అన్నది..ఈ నేపథ్యంలో రాష్టప్రతి పదవికి, దానికి కట్టబెట్టిన అధికారాలకు సంశయాలు అలాగే మిగిలిపోయాయి. కొన్ని సందర్భాల్లో రాష్టప్రతులు ప్రభుత్వ నిర్ణయంతో విభేదించిన ఉదంతాలు ఉన్నాయి. ప్రభుత్వం సూచించిన విధానాలను త్రికరణశుద్ధిగా పాటించిన రాష్టప్రతులు ఉన్నట్టే వాటిని తిరస్కరించి ఏకంగా రాజ్యాంగ పరిరక్షకుడిగా తన అధికారాలను చాటుకున్న ధీమంతులూ ఉన్నారు. ’80 దశకంలో రక్షణ కుంభకోణాల్లో ఇరుక్కున్న అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని అప్పటి రాష్టప్రతి డిస్మిస్ చేయాలని కూడా భావించినట్టు కథనాలు వెలువడ్డాయి. అలాగే పోస్టల్ బిల్లును వెనక్కి పంపడం ద్వారా జైల్‌సింగ్ మరో రకంగా సర్కార్‌ను ఇరకాటంలో పడేశారు. అలాగే 1999 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన మద్దతు లెక్కల్ని విశ్వసించని అప్పటి రాష్టప్రతి కెఆర్ నారాయణన్ బిజెపినే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి రాజ్యాంగాధినేతగా తన ధర్మాన్ని నిర్వర్తించారు. శంకర్‌దయాళ్ శర్మ కూడా రాష్టప్రతిగా తన విశిష్ట బాధ్యతల్ని త్రికరణశుద్ధిగానే నిర్వర్తించి ఆ పదవికి మరింత వనె్న తెచ్చారు. ఈ తరహా పరిస్థితులు, సవాళ్లు ఎదురైనప్పుడే భారత రాష్టప్రతి పదవికి ఉన్న పదును వెలుగులోకి వస్తుంది. ప్రభుత్వం మాట జవదాటకుండా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ..అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే మాత్రం కలకలానికే ఆస్కారం ఏర్పడుతుంది. రాష్టప్రతిగా తాను గెలుపొందిన రోజున ప్రణబ్ ముఖర్జీ చేసిన తొలి ప్రకటన రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని, దాని ప్రకారమే నడుచుకుంటానన్నది..! రాజకీయాల లోతుల్ని చూసిన ఆయన కేవలం రాష్టప్రతి పదవి నిర్వహణలో అవసరమైనప్పుడు తన ‘పదును’ ప్రదర్శించకుండా ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా కూడా సవాళ్లమయం లాంటి పరిస్థితులు నేడు నెలకొన్నాయి. ప్రభుత్వాలు తమ అవసరాలు, అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం అనేక రకాలుగా ‘సంకీర్ణ’రాజకీయాలు సాగిస్తున్న నేపథ్యంలో రాజ్యాంగాధినేతగా రాష్టప్రతి పదవి ప్రాధాన్యత గతంలో ఎన్నడూ లేని విధంగా మరింత పెరిగింది. *
........................
టీచర్, జర్నలిస్టు,లాయర్!
ఒకే వ్యక్తిలో విభిన్నమైన ప్రతిభాపాటవాలు చాలా అరుదుగానే ఉంటాయి. ఒక రంగంలో నైపుణ్యాన్ని సంతరించుకున్న వారున్నారు. రెండు రంగాల్లోనూ రాణించిన వారూ ఉన్నారు. కానీ ప్రణబ్‌దాది అరుదైన ప్రజ్ఞ..అఖండమైన పాటవం. టీచర్‌గా పని చేశారు. లాయర్‌గా రాణించారు. జర్నలిస్టుగానూ కలం పట్టారు. 1935 డిసెంబర్ 11న పశ్చిమ బెంగాల్‌లోని బిర్‌భుం జిల్లా మిరాటీ గ్రామంలో స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబంలో జన్మించిన ముఖర్జీ అసలు మేరు కమాడ కిన్‌కర్ ముఖర్జీ. కోల్‌కతా వర్శిటీలోనే రాజకీయ, న్యాయ శాస్త్రాలనే కాదు చరిత్రను కూడా ఆయన ఔపోసన పట్టారు. 1969లో రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి రాజకీయాల్లో అడుగు పెట్టడానికి ముందు ఏ మాత్రం పొంతన లేని టీచర్, లాయర్, జర్నలిస్టు విధుల్ని నిర్వహించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన చేపట్టిన పదవులు కూడా అంతే భిన్నమైనవి. రక్షణ మంత్రిగా రాణించారు. ఆర్ధిక మంత్రిగా ఔరా అనిపించుకున్నారు. విదేశాంగ బాధ్యతలనూ అంతే నేర్పుతో నిర్వహించి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారు.
.........................
ముఖర్జీ అలిగిన వేళ!
కాంగ్రెస్ పార్టీ అంటేనే..ఎత్తుకు పైఎత్తువేస్తే గానీ ఎంత ఘనాపాఠి అయినా నిలదొక్కుకోలేని పార్టీ..! అంతగా ఒకరిని మించిన ఒకరితో ఆ పార్టీ ఆది నుంచీ రాణిస్తూనే వచ్చింది. ఆ పార్టీలో విలువ అన్నది ఆయా సందర్భాలను బట్టి, ఆ వ్యక్తికి ఉన్న ‘సాన్నిహిత్యా’న్ని బట్టే ఆధారపడి ఉంటుంది. చాలా సందర్భాల్లో అర్హతల కంటే విధేయతలే రాణిస్తాయనడానికి ఇందిర హత్యానంతరం కాంగ్రెస్ పార్టీకి ప్రణబ్ కొద్దికాలం పాటు దూరం కావడమే నిదర్శనం. ఇందిర హత్య నేపథ్యంలో కాంగ్రెస్‌లో ఆధిపత్యపోరు రగిలింది. రాజీవ్ గాంధీ పార్టీ పగ్గాల్ని, ఇటు ప్రభుత్వ సారధ్యాన్ని చేపట్టారు. అంతకు ముందు వరకూ ఇందిరకు ఎంతో ఆప్తుడిగా, సన్నిహితుడిగా మసలిన ముఖర్జీకి రాజీవ్ మంత్రివర్గంలో స్థానం లభించలేదు! ఆత్మాభిమానం ఉన్న ఎవరూ అలాంటి పరిస్థితిని భరించి ఎక్కడా ఉండలేరన్నది నిజం. ముఖర్జీ కూడా ఆ అవమానభరాన్ని భరించలేకపోయారు. తన అక్కసును చాటి చెబుతూ క్షణాల్లో కాంగ్రెస్‌కు స్వస్తి పలికి రాష్ట్రీయ సమాజ్‌వాది పార్టీని ఏర్పాటు చేశారు. రాజీవ్ హత్యానంతరం పీవీ నరసింహారావు ప్రధాని పదవిని చేపట్టడంతో ముఖర్జీకి మళ్లీ కాంగ్రెస్‌లో పూర్వవైభవం దక్కింది. ఆయన ప్రతిభను, ఆర్థిక వ్యవహారాలపై సామర్థ్యాన్ని గమనించిన పీవీ ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ పదవిని అప్పగించారు. ఒకసారి పార్టీ నుంచి బయటికి వెళ్లిపోయిన వ్యక్తులకు మళ్లీ అంతటి సమున్నత హోదా లభించడం అన్నది ఒక్క ముఖర్జీ విషయంలోనే జరిగింది. ఇక్కడ విధేయత కంటే ఆయన దక్షతకే ప్రాధాన్యత లభించిందన్నది వాస్తవం.
................
సంచార లైబ్రరీతో చైతన్యం
స్వతహాగా అందరికీ విద్య అందాలని, విద్యతోనే వికాసమని భావించే ప్రణబ్ ముఖర్జీ కోల్‌కతాలోని ఓ కాలేజీలో లెక్చరర్‌గా పని చేసే సమయంలో క్షణం వృధా చేసేవారు కాదు. పిల్లలకు పాఠాలు చెప్పిన తర్వాత మిగిలిన సమయాన్ని సంచార గ్రంధాలయంతో గడిపేవారు! అంటే రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకు వెళ్లి చదువు పట్ల ప్రజలకు అవగాహన కలిగించడమన్న మాట. కేవలం చదువే కాదు..చదివే అలవాటును పెంపొందించాలని కూడా ఆయన భావించారు. ఆ సంచార గ్రంధాలయంతో తానూ వెళ్లి స్వయంగా పుస్తకాలు ఇచ్చెవారు. అంతే కాదు తానే స్వయంగా ఆ వివరాలు నమోదు చేసుకునే వారు. అదే వ్యాపకం ఆయనలో అనేక విషయాల పట్ల ఆసక్తిని పెంచింది. కాలేజీ క్లాసుల్లో కూడా విద్యార్ధులతో మమేకం అయ్యేవారు. తాను చెప్పే విషయాలు, పాఠ్యాంశాలు విద్యార్ధులకు అర్ధం కావాలంటే వారితో స్నేహంగా ఉండటమే మార్గమని భావించిన ప్రణబ్ తన అధ్యాపక వృత్తిని అదే స్ఫూర్తితో కొనసాగించారు.
................................
రాష్టప్రతిగా తాను గెలుపొందిన రోజున
ప్రణబ్ ముఖర్జీ చేసిన తొలి ప్రకటన
రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని, దాని ప్రకారమే నడుచుకుంటానన్నది..!రాజకీయాల లోతుల్ని చూసిన ఆయన కేవలం రాష్టప్రతి పదవి నిర్వహణలో అవసరమైనప్పుడు తన ‘పదును’ ప్రదర్శించకుండా ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు.

కవర్ స్టోరీ
english title: 
mr president
author: 
బి.రాజేశ్వరప్రసాద్

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>