Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కరో... యా మరో ---- కథ

$
0
0

కరో... యా మరో ---- కథ

ఎండి ఆఖిల్
ఎస్‌కె అమీర్ సొహైల్
పదో తరగతి, అభ్యాస విద్యాలయం,
విజయవాడ.
ఫోన్స్: 8125994262, 8885783617

అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో శేఖర్ అనే పదేళ్ల ఓ బాలుడు. పేద కుటుంబం నుంచి వచ్చినవాడు. తనకి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో..!? రోజూ తన స్నేహితులతో క్రికెట్ ఆడేవాడు. చాలా బాగా ఆడుతూ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. గొప్ప క్రికెటర్‌గా పేరు సంపాయించాలనుకున్నాడు. దానికోసం తగిన కృషి కూడా చేస్తున్నాడు. తనకి 18 ఏళ్లు నిండాయి. అదే సమయంలో వారి ఊరికి ఒక కోచ్ వచ్చి అక్కడ క్రికెట్ అకాడమీ ప్రారంభించాడు. ఆయన పేరు దివాకర్. ఆ అకాడమీలో ఐదుగురు పిల్లలు క్రికెట్‌లో మెళకువలు నేర్చుకుంటున్నారు. శేఖర్ ఒకరోజు దివాకర్ దగ్గరకెళ్లి తనను అకాడమీలో చేర్చుకోమని కోరాడు. ‘‘నేను బాగా ఆడతాను. కష్టపడి మరింత బాగా మెళకువలు నేర్చుకుంటాను. నేను పేద కుటుంబం నుంచి వచ్చాను. దయచేసి నన్ను మీ అకాడమీలో చేర్చుకోండి’’ అని వేడుకున్నాడు. కోచ్ మనసు కరగలేదు. ‘‘డబ్బు ఉంటే రా. లేకపోతే ఇక్కడి నుంచి వెళ్లిపో’’ అని కసురుకున్నాడు. శేఖర్ ఎంతగా బతిమాలుకున్నా ప్రయోజనం లేకపోయింది. అప్పుడు ‘‘డబ్బు లేకుండా ఏమీ చెయ్యలేం’’ అని తనకు అనిపించింది. ‘‘డబ్బు లేకుండా ఏ పనీ అవ్వదు. ఇలా ఎంతమంది డబ్బు లేకుండా బతుకుతున్నారో కదా?’’ అనుకుంటూ దీర్ఘాలోచనల్లోకి వెళ్లాడు. శేఖర్‌కి ఏదో చేయాలనే కసి పెరిగింది. ఎంతోకంత డబ్బు సంపాదించాలి. అందుకు మార్గాలేవో చూడాలి- ఇవే ఆలోచనలు వెంటాడాయి. ఎలాగైనా క్రికెట్ ఆడాలని ఉక్కు సంకల్పం చేసుకున్నాడు. తొలుత పేపర్ బాయ్‌గా పనిచేయాలనుకున్నాడు. ఆ పనిలో ప్రవేశించి కొంత డబ్బు సంపాదించాడు. శ్రమ విలువ ఏమిటో తెలిసింది. తరువాత రాళ్ళు మోశాడు. కూరగాయలు అమ్మాడు. ఇలా రకరకాల పనులు చేస్తూ కొంత డబ్బు జమ చేశాడు. కొన్నాళ్ల తరువాత ఆ డబ్బు తీసుకెళ్లి కోచ్ దివాకర్ చేతిలో పెట్టాడు. తను కోరుకున్నట్లు క్రికెట్ నేర్చుకున్నాడు. తల్లిదండ్రులు వద్దన్నా సరే పట్టుదలగా శ్రమించాడు. ఫలితం కళ్లముందు కానవచ్చింది. గ్రామస్థాయి నుంచి అంచలంచెలుగా జిల్లా స్థాయికి ఎదిగాడు. ఒక్కోమెట్టే ఎక్కుతూ జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం వచ్చింది శేఖర్‌కి. ఆ తొలి మ్యాచ్‌లోనే భయానక బౌలర్లను ఎదుర్కొని 56 పరుగులు చేసి నాటవుట్‌గా నిలిచాడు. అలాఅలా ఆడుతూ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. మంచి పేరుతో పాటు చాలా డబ్బు సంపాదించాడు.
***
ఒకరోజు శేఖర్ ఒక పార్కులో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అనుకోకుండా తన చిన్ననాటి కోచ్ దివాకర్ కనిపించాడు. పలకరించగానే ఆయన షాకయ్యాడు. తను చాలా బాధల్లో ఉన్నానంటూ కథ మొదలెట్టాడు. శేఖర్ వెంటనే మీ అసలు సమస్య ఏమిటని అడిగాడు. దివాకర్ చెప్పుకొచ్చాడు. ‘‘నా అకాడమీలో క్రికెట్ నేర్చుకోటానికి ఎవరూ ముందుకు రావటం లేదు. నేను చాలా నష్టపోయాను. ఇప్పుడు ఏమిచేయాలో నాకు అర్థం కావటం లేదు’’ అంటూ తన గోడు వెళ్లబోసుకున్నాడు. అదంతా విని శేఖర్ చలించాడు. దివాకర్‌ని తన ఇంటికి తీసుకెళ్ళాడు. చిన్నప్పటి సంగతి గుర్తొచ్చింది. డబ్బుపై అత్యాశ, వ్యామోహం వల్లే దివాకర్ ఈ స్థితికి వచ్చాడని అనిపించింది. నేనున్నానని దివాకర్‌కి ధైర్యం చెప్పాడు. ముంబైలో ‘శేఖర్ క్రికెట్ అకాడమీ’ని స్థాపించాడు. తను చిన్నప్పుడు పడిన కష్టాలు మరెవరికీ రాకూడదని మనసులోనే అనుకున్నాడు. పేద పిల్లలకు ఫీజులు తీసుకోకుండా క్రికెట్ పాఠాలు నేర్పాడు. దివాకర్‌ను సీనియర్ కోచ్‌గా నియమించుకున్నాడు. పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా వుండిపోయిన శేఖర్ తన తల్లిదండ్రులతో పాటు కోచ్ దివాకర్‌ని కూడా తనతో పాటు ఇంట్లో ఉండమన్నాడు. తన అకాడమీ నుంచి ఎందరినో స్టార్ క్రికెటర్లుగా మలిచి అంతర్జాతీయ క్రికెట్‌లో గొప్ప పేరుప్రఖ్యాతులు సంపాదించాడు.

=====

సామాజిక కోణం

అమ్మతో చిన్ని ప్రయాణం

-- కె.శరచ్చంద్రజ్యోతిశ్రీ

పెదకూరపాడు
ఫోన్: 9491128554

అమ్మ ఎప్పుడూ ‘నా కొడుకు పిచ్చోడు!’ అనేది పగలబడి నవ్వుతూ.. గంభీరంగా విచారంగా. ఎలా అన్నా ఆ అనటంలో ఓ విచిత్ర ధ్వని. అంటున్నప్పుడు ఆ కళ్ళలో నీళ్ళ తళతళలు.
అప్పుడు నేననుకునేవాడిని
‘మా అమ్మ పిచ్చిది!’ అని.
దేశం తిరిగా. రకరకాల ఉద్యోగాలు చేశా. కొన్ని వృత్తుల్లో అనుభవమో, ప్రవేశమో ఉంది. ఎన్నోరకాల మనుషులను చూశా. వాళ్ళలో కొందరితో కలసిమెలసి పనిచేశా. ఎంతో నిక్కచ్చిగా వ్యవహరించా. చెల్లుమాటేగాని ఎక్కడా పొల్లుమాట లేదు. ఎవరికీ తలవంచలేదు. అయినా అమ్మ అలా అనటం నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది.
సమాజాన్ని ఉద్ధరిస్తానని నడుంకట్టి ఊరి నడిబొడ్డున నిలబడిన నూనూగు మీసాల కొడుకును చూసి అమ్మ అందికదా...
‘అయ్యా! సమాజం నువ్వనుకున్నంత అమాయకపుది కాదు. దాంతో జాగర్త. నీ ఎనకున్నాళ్ళందరూ నీతో రారయ్యా. ముందుకు తోసి ఎనకే ఆగిపోతారు. నీకు ఆవేశం ఎక్కువ. ముందుచూపేగాని ఎనక్కి చూడవు.. భద్రం!’
బతుకుతెరువుకి ఊరొదిలి పట్టణం బయలెల్లిన కొడుకుని సాగనంపుతూ బరువెక్కిన గుండెతో అంది అమ్మ...
‘అయ్యా! మనూళ్ళో ఎట్లా మాట్లాడినా చెల్లుద్ది. పట్టణంలో అట్టాకుదర్దు. నీకు కోపం జాస్తి. ఆవేశమూ అంతే. జాలెక్కువ. అందర్నీ నమ్ముతావు. జాగ్రత్త!’
ఓ ఇరవై ఏళ్లు గడిచాక చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఇంటికొచ్చిన కొడుకును చూసినప్పుడూ ఒకే మాట...
‘నా కొడుకు ఒట్టి పిచ్చోడు!’
పదిమంది కోసం రొమ్ము విరుచుకు నిలబడ్డ కొడుకు కూలబడినప్పుడు అమ్మ కొండంత అండగా కాచుకుంది.
‘నా కొడుకు పిచ్చోడు’ అనలేదు. కానీ ఆమె చూపులో భావం మాత్రం మారలేదు.
అమ్మది పెద్దబాలశిక్ష చదువే. అయినా రెండో ప్రపంచ యుద్ధకాలం నుండి సమాజాన్ని, రాజకీయాలను, జీవితాన్ని కాచి వడబోసింది. చిన్నప్పుడెప్పుడో తను నేర్చుకున్న పాట...
జైజైజై!
అరుణపతాకకు జై!
కత్తులు దూసుకుపోయినా
నెత్తుటి ఏరులు పారినా
ఎత్తిన జెండా దించకోయ్!
- అంటూ ఒళ్ళు పులకించేట్టు పాడి వినిపించేది అప్పుడప్పుడూ.
మరి అమ్మ పిచ్చిదెట్టా అవుద్దీ?
పదిమందికి పెట్టడంలో ఆనందం అనుభవించింది. తనవాళ్ళకు దానినే వారసత్వంగా అందించింది. ‘నలుగురికి పెట్టడానికి ఏమీ మిగలలేదే!’ అని బాధపడింది. కాయకష్టం చేసిందేకాని చేయి చాచలేదు. సేవ చేయడంలో తన్మయత్వం పొందింది. మూఢత్వంతో ఏనాడూ రాజీపడలేదు.
అలా అని ఆమె కమ్యూనిస్టు కథానాయిక కాదు.
సాధారణ ఇల్లాలు.
ఓ అసాధారణ అమ్మ.
గోర్కీ నవల్లో ‘పెలగేయా నీలోవ్నా’ అయినా, తెలుగు నేలన పుట్టిన ఏ అమ్మ అయినా
అమ్మ అమ్మే!
అమ్మ జీవితం అంతా అలజడి.
కానీ,
రాత్రి సుఖనిద్రలోంచి అనంత ప్రశాంత వనాంతర
సీమలలోకి ఆమె నిష్క్రమణ.
అప్పుడు నాకు అనిపించింది.
‘ఇప్పుడు అమ్మకు నామీద నమ్మకం కుదిరినట్టుంది. అందుకే మాటమాత్రం చెప్పాచెయ్యకుండా అలా అలమీద నావలా వెళ్ళిపోయింది.’
వేదనలేని మోముమీద అప్పుడే పొడిచిన పొద్దులాటి కుంకుమరేఖ. ఆ పొద్దుపొడుపులో విచ్చుకుంటూ ఆగిపోయిన చిరునవ్వు.
‘అయ్యా! నే ఎల్తన్నా. నువ్వు లేవు. అయినా నా ఈ ప్రయాణం ఆగేదికాదు. జాగర్త!’
ఆ చిరునవ్వులోంచి కొడుక్కి చేరిన సందేశం అది.
ఇప్పుడు మనసుకు తప్ప మరిదేనికీ అందే దూరంలో లేదు అమ్మ
ఇక ఎప్పటికీ అందుబాటులోకి రాదు.
అమ్మతో పెనవేసుకున్న జీవితంలోకి అందుకే ఇదో చిన్ని ప్రయాణం.

====

మనోగీతికలు

నే ప్రయోజకుడనౌతా!

ఏది సరి, ఏది కాదు
పెద్దవారి ఆశయాలు
తీర్చవలెనన్న తపనా?
సొంత ఊహల ప్రతిఘటనా?
మనసు నలిగే సంశయాన

చదువుల్లో గొప్పవాణ్ణవ్వాలనే
జాబిల్లి సాక్షిగా మురిపెంగా
గోరుముద్దలు పెట్టిన అమ్మ

తామెచ్చిన వృత్తి చేపట్టి
తన కల పండించమనె
అన్నిటా శిక్షణా క్రమశిక్షణల్లో
సాకి పెద్దచేసిన నాన్న

పోనుపోను ఊహలొచ్చి
ఆలోచనా సాలోచనలై
సొంత పోకడల పోరై
కళ్ళు వాటి కలలుకంటూ
మనసు దాని దారిపడుతూ
చిందులేస్తూ పరుగులెట్టెయవ్వనం

అమ్మ మాట కాస్త సాగినట్టుగా
నాన్న ఆశ మరి జారినట్టుగా
ఓసారి జాలి, మరోసారి విసుగు
నా మది తూర్పుకి పోతే
వారి వైఖరి పడమరకేగె

నాదైన చింతన నన్ను నడిపించే
నా వారికి నా చింత ఎక్కువయ్యే
వయస్సు పెరిగి, వారి ఓపిక తరిగే
నా గురించి అమ్మకి అశాంతి
నాన్నకి లేదసలు ప్రశాంతి

ఎలుగెత్తి చెప్పాలనే
నా దారి వేరైనా
నా మనుసు మీదే
మీరన్న నాకు ప్రేమే
కాని నా బతుకు నాదే
నా ఇష్టాలు మీకు కష్టమయ్యే

మీ కలల బిడ్డగానేకాక
నన్నో మనిషిగా చూడరాదా
ననె్నదగనిచ్చి మీరొకింత ఒదగచ్చుగా
నా ఆశల గౌరవించి అనుమతిస్తే
నావైన కలల నేనననుసరిస్తా

గొప్పవాణ్ణే కాదమ్మా..
ప్రయోజకుడనౌతా
నేనెంచుకున్న వృత్తిలో
ప్రావీణ్యుడనౌతా
మీరు మెచ్చిన మనువుకన్నా
నాకు నచ్చిన వధువైతే మిన్న
నే చెడ్డోణ్ని కానమ్మా!
నీలా మనసున్నవాణ్ణి నాన్నా!!...

- కోసూరి ఉమాభారతి
యుఎస్‌ఎ
ఖర్యీఒఖూజబ్ద్యఆ్ఘౄజ.ష్యౄ

రెక్కలు
‘మని’ + ‘షి’
వ్యామోహంలో పడి
మైండ్ బ్లైండ్ చేసుకుంటే
జీవితం
అనారోగ్యాల అంగడి..
సూకరం పొర్లునా
పన్నీట
***
దుఃఖంలోనే
ఆనంద సాంద్రం
ఆనందంలోనే
దుఃఖ సంద్రం..
వడ్లగింజలో
బియ్యపు గింజ
***
ప్రతి నిమిషం
ఒక ఆశాస్వప్నమే
ప్రతి అడుగూ
ఒక ఛిద్ర దృశ్యమే..
యజ్ఞం చేసినవాడే
సోమయాజి
***
పునాది స్థాయిలోనే
సాకల్య క్షాళనం
అవిభాజ్యం
సహజీవనం..
జోడెద్దుల
బండి ప్రయాణం
***
కొన్ని మాటలకు
అర్థాలుండవ్
కొన్ని మాటలకు
సందర్భాలుండవ్..
గడ్డిపూలు
పరిమళించవ్
***
ఏవి అలనాటి
సౌభాగ్య సిరులు
వైభోగ ఝరులు
అవునా? జీర్ణ హేతువులు..
పురా
చిహ్నం
***
చరిత్ర చిహ్నం
వనె్నపోని కళా సౌందర్యం
పవిత్ర ప్రేమ స్వప్నం
‘తాజ్’ ఆంతర్యం..
కాలగతిలో
శిఖరాయమానం
అంతా తెలిసినట్టే ఉన్నా
ఎంతకీ బోధపడదు
అన్నీ అర్థమైనట్టే ఉన్నా
ఎంతయినా అంతుపట్టదు..
అల్లసాని అల్లికలా
జీవితం గజిబిజి
***
అందరి జీవితమూ
సమాంతరం కాదు
ప్రయాణగతిలో
వెనుకా ముందూ..
మృత్యు విమానంలో
ఎపుడూ ఒకరికి చోటు
***
మనిషి నిలబడ్డానికి
భూమ్యాకర్షణే ఆధారం
బతుకు నిలకడకి
ధనమే మూలాధారం..
అన్ని అర్థాలకు నిఘంటువే
సర్వాధారం!!

-- అవనిగడ్డ సూర్యప్రకాష్
విజయవాడ
ఫోన్: 9908731648

అక్షరం
అక్షరం అక్షరం పరమ పూజ్యము
అక్షరాలు రాని నరుని బతుకు శూన్యము //అక్ష//

అక్షరాలతోనే భాష - లుద్భవించెను
అక్షరాల సద్భావన - పల్లవించును
అక్షరాల సంప్రదాయ - మంకురించెను
అక్షరాల మదిని గల్గు - శంక తీరును //అక్ష//

అక్షరాల సకల విద్య - లవతరించెను
అక్షరాలె జీవితాల - శోభనింపును
అక్షరాలె కలకాలం - అవనివెలుగును
అక్షరాలె జీవులకు - వెతలు బాపును //అక్ష//

అక్షరాలు నేర్చుకున్న - జన్మధన్యము
అక్షరాలె జగతిలోన - పొందుమాన్యము
అక్షరాలుకుక్షినింప - ఆనందము
అక్షరాలె మంచిచెడుల - దెలుపు మార్గము //అక్ష//

-- పివి సీతారామమూర్తి
గేయకవి, తెలుగు విశారద
రిటైర్డ్ హెచ్‌ఎమ్
ఫోన్: 9490386015

నా దేశ పౌరుడు
మతాల వ్ఢ్యౌంలో
కులాల కాష్టంలో
దోపిడీ, దౌర్జన్యాల నీడన
పెరిగిన ధరలతో
తరుగుతున్న వనరులతో
కాలిన కడుపులతో
అవినీతి సముద్రంలో చిక్కుకున్న
విలవిలలాడే సామాన్యుడు..

ఓట్లు కోరుతున్న నేతల తలరాతలను పరికిస్తూ
తెల్లటోపీ కింద ఉన్న నల్లనీతిని దునుమాడుతూ
ముకుళిత హస్తాల మాటున దాగిన
కాసుల కోసం అర్రులు చాస్తూ
ఇదిగో నా భవితను బాగుపరిచేదతనే అనుకుంటూ
తన శక్తియుక్తులు తనవి కాదని
తమను పాలిస్తున్న నేతలకే అవి సొంతమని
తన యుక్తి, శక్తి కొరగానివని తలపోస్తూ
కుంటి నడతన ఉన్న ధర్మానే్న నమ్ముకుని
సత్యానికి చావులేదనే ప్రగాఢ విశ్వాసంతో
బతుకు వెళ్ళదీస్తున్న సగటుజీవా
ఈ నా దేశ పౌరుడు! ఔరా!!..

-- కాకుమాను శ్రీనివాస్
మంగళగిరి
గుంటూరు జిల్లా

===
మెరుపు‍‍‍.....
ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి.మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. vijmerupu@gmail.com

కరో... యా మరో ---- కథ
english title: 
merupu vijayawada

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>