గూడెం తాల్కు, యెల్లవరం తాల్కు, రంపచోడవరం తాల్కులో ముఠాదార్లు, విలేజి మేజిస్ట్రేటులు, విలేజి మునసబులు, యిజారాదార్లు, భూ ఖామందులు, రయితులు, గ్రామస్తులు అందర్కి మ.రా.రా. యెజన్సి డివిజన్ యెజన్సి కమిషనరు దొరవారు ప్రచురించే ప్రకటన యేమనగా:-
రుూ సంవత్సరం ఆగస్టు నెలలో దిగువ నుంచి అల్లూరి శ్రీరామరాజు అనేవాడు పయిని చెప్పబడిన తాలూకాలలో నుంచి 200 మంది మనుష్యులు సహాయముతో గవర్నమెంటు వారి మీద పితూరి చేసినాడన్న సంగతి మీకు అందరికి తెలిసేయున్నది. సదరు పితూరిదార్లు 3 స్టేషనులు కొట్టి తుపాకులు మందుగుండు సామానులు దోచుకొని గవర్నమెంటు వారి మీద దండెత్తినారు. వాళ్లు అనేక పర్యాయములు పోలీసువారి మీద ఫయిరు చేయడమెగాక ఒకమారు యిద్దరు యింగ్లీషు పెద్ద ధొరలను చంపివేసినారు. యంకా యతరమయన అక్రమములు కూడా చేసినారు.
రుూ పితూరి మొనగాడు అయిన శ్రీరామరాజు గవర్నమెంటు పటాలములను అతి సుళువుగా వోడించి పయి తాలూకాలకు రాజును అవుతానని బహిరంగముగా చాటినాడు. యింతవర్కు కొంచెము మంది తప్ప యావన్‌మంది ముఠాదార్లు, గ్రామ మేజిస్ట్రేటులు, విలేజి మున్సబులు, యిజారాదార్లు, భూఖామందులు, రయితులు, గ్రామస్తులు పోలీసువార్కి యేమి సహాయం చేయడం లేదు. సరిగదా, అనేక మంది ముఠాదార్లు, గ్రామ మునసబులు, యిజారాదార్లు, భూఖామందులు యేకమయి పితూరిదార్లకు బియ్యం వగయిరాల సప్లయిలు యివ్వడం, వాండ్ల సామానులు మోయడము, వాండ్ల జాడలు తెలియకుండా దాచిపెట్టడము, వాండ్లు దాంగుందికి వీలయిన స్థలములు చూపించడము వగయిరా పనులు చేసినారు. ... పోలీసు వార్కి అందరు పితూరుదార్లని అప్పగించితేనె తప్ప పోలీసువారు రుూ దేశము విడిచిపెట్టి వెళ్లుటకు వీలులేదు.
పితూరిదార్లు వేగరము పట్టుబడుటకుగాను గవర్నమెంటువారు రుూ దిగువ బహుమతులు అనగా యినాములు యిచ్చుటకుగాను హుకుము చేసినారు.
1.అల్లూరి శ్రీరామరాజుని పట్టుకుంటె రూ.1500- 0-0 యినాము
2.గనర్లపాలెం కాపరస్తుడు గాం గంటం ధొరను పట్టుకుంటెను రూ.1000-0-0 యినాము
3.గనర్లపాలెము గ్రామం కాపరస్తుడు గాంమల్లుధొరను పట్టుకుంటె రూ.1000-0-0 యినాము
4.ముఖ్యమయిన యే పితూరిదారునయినా పట్టుకోవడముగాని లేదా వాడి విషయమయి తగిన బాతిని యిచ్చి పట్టించడముగాని చేస్తే రూ.50-0-0 యినాము
రుూ మీద చెప్పిన బహుమానాలు యిస్తామన్నప్పటికి రుూదేశపు ప్రజలు తగిన సహాయం చేయకపోయినా పితూరిదార్లను పట్టి అప్పజెప్పకపోయినా వాండ్లందరు పయిని కఠిణమైన చర్య జరిగించబడుతుందని అందరు నమ్మవలసింది. యేలాగంటె.. రుూపయిని చెప్పిన తాలూకాలలోయున్న అందరు ప్రజలు మీద మలబారు స్పెషలు పోలీసువార్కి, కంచెర గాడిదలకు, ఏనుగులకు వగయిరా అయ్యేటటువంటి ఖర్చులు అన్ని కట్టి పుచ్చుకోబడును. యిదిగాక యింకా హుకుములు మన్నించనటువంటిన్ని, సాయము చేయనటువంటిన్ని ముఠాదార్లు తాల్కు ముఠాలు గవర్నమెంటు వారిచే తీసుకోబడును. గ్రామ మున్సబులను యేజన్సి వారంట్ల పయిని యేజన్సి నుంచి పయికి పంపివేయుటకున్నూ, మున్సబులను భూఖామందులనున్నూ రయితులును అరస్టు చేసి కేసులు చేయబడును. ప్రతి గ్రామ మున్సబు తమ గ్రామంలో పితూరిదార్లు పేర్లు తక్షణం రిపోర్టు చేయవలసినదని యిందుమూలముగా ఉత్తరువు చేయడమయినది.
(డజూ.) చ.్గ.్హశ్రీదిదినిడ
ళశషక ళ్యౄౄజఒఒజ్యశళూ
29.12.22
ఉత్తర్వు ఛేయడమే కాదు. విచ్చలవిడిగా అరెస్టులు చేశారు. కేసులు పెట్టి జైల్లోకి నెట్టారు.
ముఠాదారు ప్రజాదళాలకు సహాయం చేశాడనే నేరం మోపి మాకారంముఠాను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆ ముఠాదారుపైన కేసు పెట్టి జైల్లో వేసింది. దళాల ఆచూకీ తెలపలేదని చిట్టింపాడు గ్రామ మునసబును, గంగరాజు మాడుగుల ముఠాదారును, దామనపల్లి మునసబును అలాగే శిక్షించారు. కొమ్మంది మునసబు గంగన్న దొరను, గాంమల్లుదొర వూళ్లోకి వచ్చినట్టు అధికార్లకు తెలియజేయని నేరానికి ఇంకో నలుగురు గ్రామమునసబులకు జైలుశిక్షలు, జరిమానాలు విధించారు.
మరి ఇంత కర్కశంగా ప్రభుత్వం దమననీతికి దిగితే ముఠాదారులు, మునసబులు బెదిరారా? రాజుపట్ల విధేయతను వదిలి సర్కారుకు గులాములయ్యారా? తమ ఒళ్లు కాచుకోవడం కోసం విప్లవకారులను పట్టిచ్చారా? లేదు. అంతటి భయోత్పాతంలో కూడా తాము నమ్మిన రాజు పట్ల వారి విశ్వాసం సడలలేదు. అందుకు ఒక్క ఉదాహరణ చాలు:
అది వరకు గూడెం డిప్యూటీ తహశీల్దారుగా ఉన్న బాస్టియన్ మీద దర్యాప్తు జరుపుతూ కృష్ణదేవిపేటలో మకాం చేసిన రంప డిప్యూటీ తహసీల్దారు (1923 సెప్టెంబరులో) మాకవరం ముఠాలోని గ్రామ మునసబులందరినీ పిలిపించాడు. ఆ సాయంత్రం గ్రామ మునసబులందరూ కలిసి తిరిగి వెళుతూ ఉండగా మలగలమట్ట దగ్గర గాము మల్లుదొర వారిని కలిసి దగ్గర్లోనే రాజుగారు ఉన్నట్టు చెప్పాడు. మునసబులందరూ వెళ్లి రాజుకు సాష్టాంగ నమస్కారం చేశారు. మాకవరం సమీపంలోని పొలాలకు వారిని తీసుకువెళ్లి రాజు అక్కడ దర్బారు నడిపించాడు. మరుసటి ఉదయం వారంతా తమకు కొండ దళం ఆచూకీ ఏ మాత్రం తెలియదంటూ పోలీసులకు నివేదికలు పంపారు. అసలు సంగతి సర్కారుకు ఆలస్యంగా తెలిసి రాజును కలిసిన మునసబులందరినీ అక్టోబరులో అరెస్టు చేసి ఆరేసి నెలల కఠిన కారాగారశిక్ష విధించారు.
ఒక రాజు కోటను శత్రువులు ముట్టడించారనుకోండి. రాజును లొంగతీయటానికి సాధారణంగా
ఏమి చేస్తారు? కోటలోనికి ఆహార సామగ్రిని పోనీయరు. కొన్నాళ్లకు ఆహార నిల్వలు అడుగంటి, తిండిలేక సైన్యం మలమల మాడుతుంది.
మన్యం కోటలో రామరాజును లొంగదీయటానికి తెల్లవార్లు ఈ పద్ధతిని కూడా అనుసరించారు. గోదావరి నదిలో పడవలు నిలిచే ముఖ్యమైన రేవులలోను, మన్యానికి దగ్గర్లో ఉండే రైల్వేలైనుపై కొవ్వూరు, పెద్దాపురం, నర్సీపట్నం వగైరా స్టేషన్ల దగ్గర నిఘా పెట్టారు. మన్యంలో అమ్మకానికి ఉద్దేశించిన ఆహార పదార్థాలను స్వాధీనపరచుకుని, వాటిని తీసుకువెళ్లే చిల్లర వర్తకులను నిర్బంధించసాగారు. మన్యంలో జనానికి తిండి దొరక్కుండా చేస్తే త్వరలోనే లొంగి, రామరాజును పట్టి ఇస్తారని బ్రిటిష్ ప్రభుత్వ పన్నాగం.
రామరాజు తెలివితేటల్లో వారిని మించినవాడు. మీ పని ఇలా ఉందా అని. అతడు ఎత్తుకు పైఎత్తు వేశాడు. మన్యం జనానికి ఆహారం అందకుండా బిగదీసినా, అక్కడున్న పోలీసులకు, సైనికులకు, సర్కారీ మందీ మార్బలానికైతే ప్రభుత్వం ఆహార సరఫరాలు పంపించక తప్పదు. వాటిని కొల్లగొడితే సమస్య తీరుతుంది కదా?!
ఇంకేం? భద్రతా బలగాల కోసం బండ్ల మీద పోతూండే ఆహార సామగ్రిని విప్లవకారులు దోచుకుని వర్తకుల ద్వారా ప్రజల కందించేవారు. బండ్ల మీదే పోయే సామగ్రిని బండ్లతోనే మాయం చేసేవారు. ముందు, వెనక ఆయుధాలు పట్టి ఎంత మంది కాపలా కాస్తున్నా సరే అగ్గిరాజు ఎక్కడినుంచో వారి మీద పడి తుపాకులతో పోలీసులను చెల్లాచెదురుచేసి బండ్లను తోలుకుపోయేవాడు; తరవాత అధికారులు వచ్చి దోచబడిన తావుల నుంచి బండి చక్రాల జాడలు చూస్తూ ఆహార పదార్థాలను విప్లవకారులు దాచిన చోటు కనుక్కోవటానికి పోయేవారు. కాని కొంత దూరం వరకు కనిపించిన జాడలు తరవాత అగుపించేవికావు. చెట్ల మీదినుంచి బండ్లు నడిపించారా, ఆకాశానికి ఎత్తుకుపోయారా అని అధికారులు విస్తుపోయేవారట.
పైన ప్రకటనతో హెచ్చరించిన ప్రకారం మలబారు స్పెషల్ పోలీసులు, ఏనుగులు, కంచర గాడిదలు వగైరాలకు అయ్యే ఖర్చును ప్రజలే భరించాలని సర్కారు నిర్బంధించింది. ప్రభుత్వ అధికారాన్ని రక్షించుకోవటానికి దింపిన బలగాల ఖర్చును జనం నెత్తిన మోపడం అన్యాయమని ఎవరు ఎంత మొత్తుకున్నా ఆలకించినవారు లేరు. దీనికితోడు పితూరిదారులు, వారికి సానుభూతి చూపించేవారు ఉన్నారని అనుమానం తోచిన గ్రామాల మీద శిక్షా సుంకం విధించేవాళ్లు. ఉద్యమకారులను పట్టిచ్చిన వారికి బహుమతుల పథకం విఫలం కావడంతో ఊళ్లకు ఊళ్లనే శిక్షించాలని ప్రభుత్వం తలపెట్టింది. ఒక ఊరిలో కొండ దళం సంచరించినప్పుడు పట్టివ్వకపోయినా, సమీపంలో ఉన్న పోలీసు స్థావరానికి సమాచారం ఇవ్వకపోయినా అలాంటి ఊళ్లలో అదనపు బలగాలను దించుతారు. ఆ ఖర్చు ఆ గ్రామం భరించాలి. ఇవ్వమని నిరాకరిస్తే ఊరుకోరు. శక్తి లేదని ప్రాధేయపడ్డా కనికరించరు. శిక్షా సుంకాలను అధికారులు ఇళ్ల మీద పడి గోళ్లూడగొట్టి వసూలు చేయసాగారు. రొక్కం కట్టలేకపోతే కనపడ్డ వస్తువునల్లా ఎత్తుకుపోసాగారు.
దాంతో మన్యమంతా హాహాకారాలు లేచాయి. రాజును, వందలోపు ఉండే అతడి దళాన్ని పట్టిస్తే ఏ బాధా ఉండదు. పైగా ప్రభుత్వం నుంచి భూరి బహుమానాలు కూడా దక్కుతాయి. అయినా మన్యంలో జనానికి కలలోనైనా అలాంటి చెడు తలంపు రాలేదు. ఇన్నిన్ని బాధలు పెడుతున్నారు; ఊళ్లలో ఉండేట్టు లేదు; ఏమి చేయాలి అని తాము నమ్ముకున్న రాజునే వారు అడిగారు.
ఇంచుమించుగా అలాంటి అవస్థే రెండు సంవత్సరాల కింద గుంటూరు జిల్లా చీరాల-పేరాల ప్రజలకూ వచ్చింది. ఎవరూ అడగాపెట్టకుండానే పంచాయతీని కాస్తా మున్సిపాలిటీని చేసి ఎడాపెడా పన్నులను పెంచి, నిలువుదోపిడీ చేస్తుంటే బాధిత జనం ఏమి చేయాలని గాంధీగారిని ‘ఆంధ్రరత్న’ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అడిగారు. మున్సిపాలిటీ ఇష్టం లేకపోతే ఊళ్లో ఉండాలని ఏముంది? మున్సిపల్ సరిహద్దుల అవతలికి పోయి నివసించవచ్చు గదా అని మహాత్ముడు ప్రశస్తమైన సలహా ఇచ్చాడు. అదే వేదవాక్కుగా తలిచి చీరాల పేరాల వాసులు 1921 ఏప్రిల్ 26 రాత్రి సామూహికంగా ఇళ్లు ఖాళీ చేసి ఊరి బయట ఇసుక దిబ్బలపై తాటాకు పాకలు వేసుకుని అష్టకష్టాలు పడుతూ పదకొండు నెలలపాటు నివసించారు.
సరిగ్గా చీరాల వాసులకు గాంధీగారు ఇచ్చిన సలహానే సీతారామరాజు మన్యం వారికి ఇచ్చాడు. అదనపు పోలీసు పన్ను, ప్యూనిటివ్ టాక్సులు ఏ ఊళ్ల మీద వేస్తే ఆ ఊళ్ల వారు ఇళ్లూ వాకిళ్లూ వదిలి కొండల మీద నివసించాలని రాజు సూచించాడు. రాజస్తాన్‌లో రాణాప్రతాప్‌లాగే గ్రామాలకు గ్రామాలను పాడుబెట్టించాడు. ప్రజలు రాజు మాటను జవదాటలేదు. పల్లెలు వదిలిపోయేవారు పోయారు. పోలేనివారు అధికారులు పన్ను వసూలుకు వస్తున్నారని తెలియగానే కొండలపైకి పారిపోయేవారు. స్ర్తిలు పసిపిల్లల్ని చంకలో ఎత్తుకుని, పురుషులు సామాగ్రిని తలపై మోసుకుని.. పిల్లల్ని, వృద్ధుల్ని నెమ్మదిగా నడిపించుకుంటూ కొండలకెక్కేవాళ్లు. అక్కడ ఎండా వానకు రక్షణ లేక, హఠాత్తుగా కుంభవృష్టి కురిస్తే నిలువెల్లా తడిసి నానాయాతన పడేవారు. అయినా ఆ తిప్పలన్నీ రామరాజువల్లే తమకు వచ్చాయని ఎవరూ చిరాకు పడేవారు కారు. పైగా రాజును, అతడి అనుచరులను కడుపులో పెట్టుకుని కాపాడి సర్వవిధాల సహాయపడేవారు.
వందల మంది రిజర్వు పోలీసులను వెంటపెట్టుకుని రోజూ కొండలు, అడవులు ఎంత గాలించినా ప్రభుత్వం రాజు దళాల ఉనికిని తెలుసుకోలేక పోయింది. సీతారామరాజు ఎంచుకున్న రహస్య రక్షణ స్థావరాలు అలాంటివి. మంప వద్ద, దారుకొండ, గాముకొండ లోయలలోని ‘గుహలు’ విప్లవకారులకు మంచి రక్షణ కల్పించాయి. ఆయా పరిసర ప్రాంతాలలోని ప్రజలు వారికి సకల సదుపాయాలు కలగజేశారు. ఆహార పదార్థాలు సరఫరా చేశారు. తీవ్రంగా పోలీసు దాడులు, పెట్రోలింగు జరుగుతున్నా, ప్రజల అండతో విప్లవకారులు పటిష్ఠమైన స్థావరాలు ఏర్పరచుకోగలిగారు.
విప్లవకారుల రహస్య స్థావరాలుగా సింగవరంలొడ్డి, కొండలయ్యగొండి ప్రాంతం కొన్నాళ్లు బాగా ఉపయోగపడింది. కొండలయ్యగొండి లోయలో 6 తాటాకుల షెడ్లు నిర్మించారు. అక్కడకు దగ్గరలో రాజుకు ‘పూజ బస’ ఏర్పాటు చేశారు. అక్కడ నీటి వనరు కూడా ఉంది. మధ్య షెడ్డులో ఒక యజ్ఞవాటిక ఉంది. రెండు ఫర్లాంగుల దూరంలో సెంట్రీ పికెట్లకు అనువుగా ఉంది.
పోలీసుల చేజిక్కిన పితూరీదార్లు చెప్పిన ఆచూకీనిబట్టి సిపాయిలు 1923 నవంబర్ 5వ తేదీన ఈ కొండలయ్యగొండి రహస్య స్థావరంపైన దాడి చేశారు. ఈ గుడిసెలలో ఒక చిన్న మంచం, సామాన్లు పెట్టుకునేందుకు ఒక బెంచి కనుగొన్నారు. నరిశీపట్నం పోలీసు అధికారులు జారీ చేసిన ఉత్తర్వుల కట్టలు రెండు, భారత శిక్షాస్మృతి పత్రాల కాపీలు, ఒక చేలాంతరు దొరికాయి. సీతారామరాజు న్యాయశాస్త్ర సంబంధమైన పత్రాలను, ప్రభుత్వ ఉత్తర్వులను కూడా ప్రభుత్వ కార్యాలయాల నుంచి రహస్యంగా తెప్పించి చదివేవాడని దీనిని బట్టి స్పష్టమవుతున్నది. షెడ్ల మధ్య వున్న హోమగుండంలో ఆయన హోమం, పూజలు చేస్తూండేవారని తేటతెల్లమవుతున్నది. దాడి తర్వాత ఈ తాటియాకుల గుడిసెల నన్నిటినీ పోలీసులు తగులపెట్టారు.
ఎండుపడాల్ చిన్న కుమారుడు తుపాకులకు కావలసిన మందుగుండు పౌడరును తయారుచేసేవాడట. ఒకరు ఆయుధాలను మరమ్మతు చేసేవారట. సీతారామరాజు స్వయంగా ఆయుధాలను తనిఖీ చేసేవారని, దళ సభ్యుల చేత క్రమానుసారంగా డ్రిల్లు చేయించేవారని తెలియవచ్చింది. సీతారామరాజు రహస్య స్థావరాల నిర్మాణం ఎంత పకడ్బందీగా వుండేదో, ఎన్ని జాగ్రత్తలు తీసుకునేవారో దీనివల్ల స్పష్టపడుతున్నది. నవంబరులో సైనిక దాడి జరిగే సూచనను పసిగట్టి ముందుగానే విప్లవకారులు ఈ స్థావరాన్ని వదిలిపెట్టి, హడావుడిగా అక్కడి నుంచి వెళ్లిపోయి వుంటారు.
అల్లూరి సీతారామరాజు,
మాదల వీరభద్రరావు, పే.48-49
*