నిన్నమొన్నటిదాకా హైస్కూల్ విద్యార్థిని ఆమె. స్విమ్మింగ్‌లో విశేష ప్రతిభ కనబరుస్తూ కేవలం 17 ఏళ్ల వయసులోనే ఒలింపిక్స్‌కు ఎంపికైంది. స్వదేశంలో, తన కుటుంబం నివాసం ఉంటున్న ప్రాంతంలో ఓ ఉన్మాది సృష్టించిన మారణకాండ ఆమెను కలచివేసింది. అయినా ఒత్తిడిని జయించింది. పతకాల వేట కొనసాగిస్తున్నది. ఆ సంచలనం టీనేజరే మిస్సీ ఫ్రాంక్లిన్.
కొలొరాడోలోని సెంటెనియల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆమెను అదే ప్రాంతంలోని ఓ సినిమా హాలులో జరిగిన కాల్పుల సంఘటన ఆందోళనకు గురి చేసింది. ‘బ్యాట్‌మన్’ సినిమా చేస్తున్న వారిపై జేమ్స్ హోమ్స్ అనే ఉన్మాది తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాల్పుల్లో 12 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ప్రస్తుతం కేసు విచారణ సెంటెనియల్‌లోనే జరుగుతున్నది. సహజంగానే ఈ వార్త మిస్సీని ఆందోళనకు గురిచేసింది. అయితే, తీవ్రమైన మానసిక ఒత్తిడి నుంచి ఆమె తక్కువ సమయంలోనే బైటపడింది. పోటీలపై దృష్టి కేంద్రీకరించింది. 200 మీటర్ల ఫ్రీస్టయిల్ క్వాలిఫయింగ్ పోరు ముగిసిన 15 నిమిషాల్లోనే జరిగిన 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. 200 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో కాంస్య పతకాన్ని అందుకుంది. ఆతర్వాత 200 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించడంతోపాటు 2:04.81 నిమిషాల్లోనే లక్ష్యాన్ని చేరుకొని కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కొలొరాడో మారణ హోమం తనను బాధించిందని అంటున్న మిస్సీ తాను పాల్గొనే ప్రతి రేస్‌లోనూ ఈ సంఘటన తనకు గుర్తుకొస్తునే ఉంటుందని చెప్పింది. అయితే, ఒత్తిడికిలోనై ప్రతికూల ఫలితాలను అనుభవించడం కంటే, దృష్టిని పోటీపై కేంద్రీకరించడమే ఉత్తమమని వ్యాఖ్యానించింది. ఒలింపిక్స్ ముగిసే వరకూ తాను పోరాటానికే అంకితమవుతానని ప్రకటించింది. ఫ్రాంక్లిన్ ఈ ఒలింపిక్స్‌లో మొత్తం నాలుగు స్వర్ణ పతకాలను సాధించి 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో అమీ వాన్ డికెన్ అమెరికా తరఫున సృష్టించిన అత్యధిక స్వర్ణ పతకాల రికార్డును సమం చేసింది. ఫ్రాంక్లిన్ నాలుగు స్వర్ణాలతోపాటు ఒక కాంస్య పతకాన్ని కూడా కైవసం చేసుకోవడం విశేషం. మొత్తం ఏడు ఈవెంట్స్‌లో పోటీపడిన ఫ్రాంక్లిన్ ఐదు పతకాలు సంపాదించి మైఖేల్ ఫెల్ప్స్ తర్వాత ఈత కొలనులో రికార్డుల మోత మోగించే సత్తావున్న స్విమ్మర్‌గా ఇప్పటికే పేరు సంపాదించింది. తీవ్రమైన ఒత్తిళ్లను పక్కకుపెట్టి లక్ష్య సాధనకు ఆమె చేసిన ప్రయత్నం యువతకు స్ఫూర్తిదాయకం.
అంతులేని ఆత్మవిశ్వాసం..
ఆత్మవిశ్వాసం ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని అంటారు. అనడమేకాదు.. నిజమేనని నిరూపిస్తున్నాడు అమెరికాకు చెందిన మాజీ స్కైడైవర్ డానా బౌమన్. 1994లో జరిగిన ప్రమాదంలో బౌమన్ తీవ్రంగా గాయపడ్డాడు. వైద్యులు అతని రెండు కాళ్లకు శస్తచ్రికిత్స జరిపి, కొంత భాగాన్ని తొలగించారు. దీనితో అవిటితనం అతనిని వెక్కిరించింది. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామం నుంచి బౌమన్ త్వరగానే కోలుకున్నాడు. మళ్లీ పారాషూట్ జంపింగ్ చేశాడు. ఇటీవలే అమెరికా సైన్యంలో ఉద్యోగం సంపాదించాడు. అక్కడి పారాషూట్ జట్టు బృందానికి సూచనలివ్వడం, వారికి మార్గదర్శకం చేయడం అతని విధులు. ఈ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్న బౌమన్ ఇటీవలే టెక్సాస్‌లోని ఒడెస్సా రోటరీ క్లబ్‌లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించాడు. ఎంచుకున్న రంగంలో లక్ష్యాలను చేరడానికి పట్టుదలతో కృషి చేయాలని వారికి పిలుపునిచ్చాడు. ఎంతో ఉత్సాహంగా విద్యార్థులతో మమేకమైన బౌమన్‌ను చూసిన వారంతా ఆత్మవిశ్వాసం అంటే ఇదే నంటూ అతనికి జేజేలు పలికారు.
దుమ్ము దుమారం!
భారీ వర్షాలు తుపానుగా మారడం మనకు తెలుసు. మంచు తుపానులు, ఇసుక తుపానుల గురించి విన్నాం. కానీ దుమ్మూధూళితో తుపానుగా మారి ఒక ప్రాంతాన్ని కబళించడం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఇది అక్షరాలా నిజం. ఆరిజోనా ప్రాంతంలో ఇటీవల సుంభవించిన దుమ్ముదుమారం సుమారు 2000 అడుగుల ఎత్తున ఎగసిపడింది. ‘హబూబ్’ అని పిలిచే ఈ దుమ్ము తుపాను గంటకు 35 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఆ ప్రాంతాన్ని ముంచెత్తింది. సుమారు 9000 ఇళ్లను కుప్పకూల్చింది. ఒక్కోసారి దుమ్ముతో కూడిన తుపాను వంద కిలోమీటర్ల వెడల్పు, 3,000 అడుగుల ఎత్తు వరకూ వస్తుందని, దీని నుంచి తప్పించుకోవడం అసాధ్యమని నిపుణులు అంటున్నారు.
సొగసైన జుట్టు
చైనా మహిళలకు జుట్టు పెంచుకోవడం ఇప్పుడు ఓ సరదా. జుట్టును ప్రదర్శించడం ఒకప్పుడు నిషేధం. ఇప్పుడది వినోదం, వేడుక. చైనా మహిళలు జీవితకాలంలో ఒకే ఒకసారి జట్టు కత్తిరించుకుంటారు. పొడవాటి జట్టు ఉన్న మహిళలను నేడు అక్కడ గౌరవంగా చూస్తున్నారు గానీ, ఒకప్పుడు జట్టు బయటకు కనిపించకుండా తలపై ముసుగు ధరించాలన్న నిబంధన ఉండేది. 1987 వరకూ ఇది కొనసాగింది. తర్వాత మార్పులు చోటు చేసుకున్నాయి. మహిళల తమ పొడవాటి జుట్టును ప్రదర్శించడాన్ని వినోదంగా మార్చుకున్నారు. ఇందుకోసం ప్రత్యేక పోటీలను కూడా నిర్వహిస్తున్నారు. హువాన్‌గ్లుయో యావో గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘రెడ్ యావో’ తెగకు చెందిన మహిళలు సుమారు ఐదున్నర అడుగుల పొడవైన కురులతో అందరినీ అలరించారు.