ఒంగోలు, ఆగస్టు 12: ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించటంతో జిల్లాలో నామినేటెడ్ పదవులు ప్రక్రియ వేగం పుంజుకుంది. ఈనెలాఖరులోపు జిల్లాలోని నామినేటెడ్ పదవులన్నింటిని భర్తీ చేయనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఈమేరకు ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి కసరత్తు చేసినట్టు సమాచారం. ఈపాటికే నెల్లూరు, ప్రకాశం జిల్లాల స్ర్తి సంక్షేమ శాఖ రీజనల్ ఆర్గనైజర్ పదవిని టంగుటూరుకు చెందిన ప్రభావతికి ఇవ్వనున్నట్టు తెలిసింది. అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవికి జిల్లా ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు ఎస్‌వి శేషయ్య రేసులో ఉన్నారు. జిల్లాలోని మెజార్టీ శాసనసభ్యులందరూ ఆయనకు మద్దతు తెలిపారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నూతనంగా నియమితులైన శైలజానాథ్‌కు శేషయ్య గ్రంథాలయ పదవిని ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన పేరును ఇక అధికారికంగా ప్రకటించటమే తరువాయి. ఒంగోలు మార్కెట్ యార్డు చైర్మన్ రేసులో ఈదర మోహన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవల ఒంగోలు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పార్వతమ్మ తరఫున ఈదర మోహన్ పట్టుదలతో పని చేశారు. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ రేసులో ఐనాబత్తున ఘనశ్యామ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జిల్లాలోని మెజార్టీ శాసనసభ్యుల సంతకాలు కూడా ఘనశ్యామ్ సేకరించినట్టు సమాచారం. అదేవిధంగా జిల్లాలోని ఒంగోలు, పొదిలి, దర్శి, గిద్దలూరు, చీరాల, కందుకూరు, కంభం మార్కెట్‌యార్డు చైర్మన్‌ల ఎంపిక ప్రక్రియపై కూడా ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మాలకొండ దేవస్థానం పాలకవర్గాన్ని కూడా భర్తీ చేయాల్సి ఉంది. ఈపాటికే నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారందరూ శాసనసభ్యులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రధాన భూమిక పోషించనున్నారు. ప్రధానంగా ఒంగోలు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని పటిష్ఠవంతం చేసేందుకు మాగుంట ఈపాటికే చర్యలు చేపట్టారు. ఎక్కడ పోయింది అక్కడే వెతుక్కోవాలని మాగుంట పార్వతమ్మ ఇటీవల ప్రకటించటంతో రానున్న ఎన్నికల్లో మాగుంట కుటుంబం నుండి పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈనేపధ్యంలో ఒంగోలు నియోజకవర్గంపై మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఒంగోలు నగరంలోని పేద, బడుగు బలహీనవర్గాల వారికి పట్టాలు ఇప్పించేందుకు కూడా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తం మీద ఈనెలాఖరులోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తికానుంది.
ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు
english title:
botsa
Date:
Monday, August 13, 2012