మార్కాపురం, ఆగస్టు 12: నాలుగైదు రోజులుగా మార్కాపురం ప్రాంతంలో కురిసిన వర్షాలకు పంటభూములు పదునెక్కాయి. దీంతో రైతులు వివిధ పంటలు సాగు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. సాధారణంగా జూన్ 1 నుంచి రుతుపవనాలు ప్రారంభమై వర్షాలు కురవడం ఆనవాయితీ అయితే ఈఏడాది ఆగస్టు మొదటి వారం వరకు వర్షాలు కురవలేదు. ప్రస్తుతం కురిసిన వర్షాలకు పొలాలు పదునెక్కడంతో రైతులు కంది, పెసర, సజ్జ, పిల్లిపెసర లాంటి పంటలను సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. మార్కాపురం మండలంలోని మిట్టమీదిపల్లి, కొండేపల్లి, మాల్యవంతునిపాడు, బొందలపాడు, శివరాంపురం తదితర ప్రాంతాల్లో రైతులు విత్తనాలు కొనుగోలు చేసేందుకు శుక్రవారం మార్కాపురం వ్యవసాయ శాఖ కార్యాలయానికి వచ్చారు. 50శాతం సబ్సీడిపై రైతులకు కంది, పెసర, సజ్జ, జీలుగ, పిల్లిపెసర, జనుము విత్తనాలను శనివారం నుంచి అందిస్తామని మార్కాపురం మండల వ్యవసాయ అధికారి డి బాలాజీనాయక్ తెలిపారు. విత్తనాల కొరత లేదని ఆయన తెలిపారు. గతఏడాది జూలై నాటికి 1500 హెక్టార్లలో వివిధ పంటలు సాగు కాగా ఈఏడాది 500హెక్టార్లలో మాత్రమే వివధ పంటలను సాగు చేశారు. ఖరీఫ్‌లో మొత్తం 6వేల హెక్టార్లలో వివిధ పంటలు సాగు కావాల్సి ఉంది. డివిజన్ మొత్తంమీద 23వేల హెక్టార్లకు గాను 2వేల హెక్టార్ల వరకు మాత్రమే సాగైంది. సజ్జ 370 హెక్టార్లు, కంది 232, పత్తి 732, ఆముదం 50హెక్టార్లలో మాత్రమే సాగైనట్లు తెలుస్తుంది. కంది, ఆముదం, పత్తి, వరి ప్రస్తుత వర్షాలకు సాగు చేసుకోవచ్చునని తెలిపారు. సబ్సీడి విత్తనాలను సిద్ధంగా ఉంచామని తెలిపారు. కాగా రెండురోజులుగా కురిసిన వర్షాలతో రైతులు పలుగ్రామాల్లో సజ్జ, కంది అంతర్‌పంటలుగా సాగు చేస్తున్నారు. బోర్లకింద ఇప్పటికే పత్తిసాగు చేపట్టారు. చెరువులకు నీళ్ళు వచ్చినట్లైతే బోర్లకింద వరి, మిర్చి పంటలను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటివరకు కురిసిన వర్షాలకు వేములకోట, మార్కాపురం, తిప్పాయపాలెం, నాగులవరం, రాయవరం, గజ్జలకొండ చెరువులకు నీళ్ళురాకపోయినప్పటికీ పొలాలు పదునెక్కడంతో రైతులు దేవుడిపై భారం వేసి పంటల సాగు చేపట్టారు. గతఏడాది జూట్ సాగు చేసిన రైతుల దిగుబడులు ఇంకా ఇళ్ళ దగ్గరే ఉన్నాయి. క్వింటా 1200 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నట్లు రైతులు తెలిపారు. దీనితో అధిక పెట్టుబడులు పెట్టి ఆశించినస్థాయిలో గిట్టుబాటు ధర లేకపోవడంతో తమ ఇళ్ళదగ్గరే రైతులు ఉత్పత్తులను నిల్వ చేస్తున్నారు.ఈఏడాది రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేదని ఎఓ తెలిపారు.
‘కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేయాలి’
ఒంగోలు , ఆగస్టు 12: కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోయి కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా ప్రభుత్వ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం, నూతన షాపుల ప్రారంభోత్సవ కార్యక్రమం జిల్లా అధ్యక్షుటు మట్టిగుంట రామానుజుల అధ్యక్షతన ఆదివారం స్థానిక సంఘ భవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన కోటేశ్వరరావు మాట్లాడుతూ 2004 సెప్టెంబర్ 1వ తేదిన రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందన్నారు. దీనివల్ల లక్షల మంది ఉద్యోగులు రిటైర్డ్ తరువాత చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. తక్షణమే ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత పిఆర్‌సిలో నాల్గవ తరగతి ఉద్యోగులందరికీ బడ్జెట్‌తో సంబంధం లేకుండా యూనిఫాం మంజూరు చేయాలని, పిఆర్‌సి నివేదికలో ప్రభుత్వానికి సమర్పించామన్నారు. ఈసారైన పదవ పిఆర్‌సిలో తప్పకుండా అమలుపరచాలని డిమాండ్ చేశారు. హెల్త్‌కార్డులు తక్షణమే పంపిణీ చేయాలన్నారు. జిల్లా అధ్యక్షుడు రామానుజులు మాట్లాడుతూ 2013 జూలై నాటికి పదవ పిఆర్‌సిని అమలు చేయాలన్నారు. ఈనెల 17వ తేదీన చలో ఒంగోలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని తాలూకాల నుండి ఎక్కువ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. జిల్లా కార్యదర్శి పి చెంచయ్య మాట్లాడుతూ సోషల్ వెల్ఫేర్ కార్యాలయంలో ఆవుట్ సోర్సింగ్‌తో వంద మందికి పైగా పని చేస్తున్నారని, వారికి ప్రతినెల జీతాలు అందడం లేదన్నారు. తక్షణమే వారి ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కోయి కోటేశ్వరరావు, జిల్లా మాజీ అధ్యక్షుడు గాండ్ల వెంకటేశ్వర్లు, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఇంకొల్లు ఆంజనేయులు, జిల్లా మాజీ కార్యదర్శి పి చింతయ్యలను ఘనంగా సన్మానించారు. అనంతరం వారు నూతన షాపులను ప్రారంభించారు. ఈ సమావేశంలో జిల్లా సంఘ ఆఫీస్ బేరర్స్ నగర అధ్యక్ష, కార్యదర్శులు, జిల్లాలోని 13 తాలూకా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.