ఒంగోలు , ఆగస్టు 12: ఎబిసిడి వర్గీకరణకు కట్టుబడి ఉంటామని, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఉషామెహ్రా కమిటీ సిఫార్సులను ప్రవేశపెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం పట్ల టిడిపి జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు కొమ్మూరి రవిచంద్ర, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో కొమ్మూరి రవిచంద్ర మాట్లాడుతూ అణగారిన కులాల అభ్యున్నతి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్‌లు పొందుపరచారని, అయితే ఆచరణలో రిజర్వేషన్ ఫలాలు రాష్ట్రంలోని 59 కులాల వారికి సమానంగా ఉపయోగ పడలేదన్నారు. కేవలం ఒకటి, రెండు కులాల వారు లబ్ధి పొందుతున్నారని అన్నారు. కృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడి అనతికాలంలోనే రిజర్వేషన్‌లను ఎ,బి,సి,డిలుగా వర్గీకరించాలనే ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రరూపం దాల్చడంతో మాదిగల పోరాటాన్ని సహృదయంతో అర్థం చేసుకున్న ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రామచంద్రరాజు కమిషన్‌ను ఏర్పాటుచేసి ఆ కమిటీ సిఫార్సుల మేరకు రిజర్వేషన్‌లను ఎ,బి,సి,డిలుగా వర్గీకరించడం జరిగిందన్నారు. రిజర్వేషన్‌లను ఎ,బి,సి,డిలుగా వర్గీకరించి సామాజిక న్యాయం ఒక తెలుగుదేశానికే సాధ్యమని చంద్రబాబు నిరూపించారన్నారు. మాదిగల సమస్య న్యాయసమ్మతమైందన్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతోపాటు విప్లవ సంఘాలు, ప్రజా సంఘాలు ప్రకటించినట్లు చెప్పారు. ఎబిసిడి వర్గీకరణ ఉద్యమాన్ని మేధావులైన గద్దర్, కత్తి పద్మారావులు సమర్దించారన్నారు. వర్గీకరణ వల్ల మాల, మాదిగలు విడిపోతారని మాట్లాడటంలో అర్థం లేదన్నారు. ఎబిసిడి వర్గీకరణ అమలు జరిగిన నాలుగు సంవత్సరాలలో రిజర్వేషన్‌లంటే ఏమిటో తెలియని ఉప కులాల వారు కూడా లబ్ధి పొందారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లక్ష్యం నెరవేరాలంటే వర్గీకరణ అమలు జరగాలన్నారు. అట్టడుగున ఉన్న అన్ని కులాలకు రిజర్వేషన్‌లు అందినప్పుడే అంబేద్కర్ ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు. అణగారిన వర్గాల అందరికి రిజర్వేషన్‌లు అందుబాటులోకి తీసుకురావాలనుకునే చంద్రబాబు ఆలోచనలను కొంతమంది వ్యతిరేకించడం బాధాకరమన్నారు. ఎబిసిడి వర్గీకరణను వ్యతిరేకింవమంటే అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని, ఆయన ఆశయాన్ని వ్యతిరేకించడమేనన్నారు. ఈ విలేఖర్ల సమావేశంలో మాజీ జెడ్‌పిటిసి సభ్యులు వరగాని పౌలు, నగర ఎస్సీసెల్ అధ్యక్షులు పసుమర్తి హగ్గయ్యరాజ్, మాజీ కౌన్సిలర్ ఐదుపోగు సామ్యేలు, ఎం ప్రేమ్ కుమార్, సండ్రపాటి నీరజ, కనుమూరి నారాయణ, తేళ్ళ చిన్న, మల్లె అశోక్, తేళ్ళ రవిబాబు, గుండె ఓంకారయ్య, రాయపాటి జాషువా, తేళ్ళ కోటేశ్వరరావు, ఎండ్లూరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి ముందుగా పార్టీ కార్యాలయంలోని దివంగత ఎన్‌టి ఆర్, దామచర్ల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఎబిసిడి వర్గీకరణకు కట్టుబడి ఉంటామని, ప్రస్తుత
english title:
tdp ke sadhyam
Date:
Monday, August 13, 2012