శింగరాయకొండ, ఆగస్టు 12: మండలంలోని పాకల పంచాయతీ పరిధిలోని పట్టుపుపాలానికి చెందిన వారు వివాహానికి వెళ్లి విషాదంలో మునిగిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పట్టపుపాలానికి చెందిన వారు శనివారం రాత్రి సుమారు 50మంది లారీలో నెల్లూరు జిల్లా బిట్రగుంట మండలం జువ్వలదినె్న గ్రామానికి వివాహానికి వెళ్లారు. రోడ్డుపక్కనే ఉన్న లారీకి విద్యుత్‌తీగలు తగిలి పట్టపుపాకు చెందిన చెంచంలానికి బ్రహ్మయ్యకుమారుడు రవి (20), వాయల పోలయ్య కుమారుడు కోటేశ్వరరావు (22) ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిని తోటివారు వెంటనే స్వగ్రామానికి తీసుకురావడంతో సమాచారం అందుకున్న బిట్రగుంట ఇన్‌చార్జి ఎస్సై కృష్ణారెడ్డి, శింగరాయకొండ ఏఎస్సై మహబూబ్‌బాషా సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టరానికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా, గ్రామస్థులు వారించడంతో వైద్యుడ్ని అక్కడికే పిలిపించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం దహన సంస్కారాలు నిర్వహించారు. చేతికందొచ్చిన కుమారులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు విషాదంలో ఉన్నారు.
‘ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి చేయాలి’
త్రిపురాంతకం, ఆగస్టు 12: 1987వ సంవత్సరంలో 6పడకల ప్రాథమిక ఆరోగ్యకేంద్రంగా ఉన్న త్రిపురాంతకం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30పడకల వైద్యశాలగా అభివృద్ధి చేయాలని జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి కెవివి ప్రసాద్ అన్నారు. ఆదివారం సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పెరిగిన జనాభా వైధ్యావసరాల కోసం త్రిపురాంతకం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30పడకల వైద్యశాలగా మార్పు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మండల పరిధిలో 65వేలకుపైగా జనాభ ఉండి త్రిపురాంతకం ప్రాథమిక కేంద్రం పరిధిలో 34వేల 500మంది జనాభ ఉన్నారని, మండలంలోని దూపాడు, అన్నసముద్రం ప్రాథమిక కేంద్రాలు ఉన్నాయని, మండల కేంద్రమైన త్రిపురాంతకంలో ప్రతిరోజూ 100 నుంచి 150వరకు రోగులు వైద్యసేవల నిమిత్తం ఆరోగ్యకేంద్రానికి వస్తారని, ప్రతినెలలో 20 నుంచి 25వరకు ప్రసవాలు జరుగుతాయని, 50 వరకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తారని అన్నారు. వచ్చే రోగులకు పరుపులు, మంచాలు లేక ఇబ్బంది పడాల్సి వస్తుందని అన్నారు. వైద్యశాలకు మండల పరిధిలోని ప్రజలే కాకుండా పుల్లల చెరువు, కురిచేడు మండలాలకు చెందిన రోగులు వచ్చి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో సేవలు పొందుతారని, అందువలన ప్రస్తుతం ఉన్న ఆరుపడకలు ఉన్న ఆరోగ్యకేంద్రాన్ని 30పడకలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని మూడుప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో యుడిసి, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్టు, ఎపిఎంఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, మండలానికి ఒక్క వైద్యాధికారి మాత్రమే ఉన్నారని, అన్నసముద్రం దూపాడు, పాలుట్ల ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు ఇన్‌చార్జి డాక్టర్లుగా వ్యవహరిస్తున్నారని, టిబి జబ్బు సోకినవారికి మార్కాపురం వెళ్ళాల్సి వస్తుందని ఆయన అన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌కు వైపాలెం, పెద్దదోర్నాల ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్ళాల్సి వస్తుందని, ఈ పరిస్థితుల్లో త్రిపురాంతకం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని 30పడకల వైద్యశాలగా అభివృద్ధి చేస్తే ఇక్కడి రోగులంతా వైద్యం కోసం అటు వెళ్ళాల్సిన పని ఉండదని అన్నారు. ఈకార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గాలి సుబ్బరాయుడు, సహాయ కార్యదర్శి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.