ఒంగోలు, ఆగస్టు 12: ఒంగోలు నగరంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీనితో లోతట్టు ప్రాంతాలైన శివారు కాలనీలు జలమయంగా మారాయి. ప్రధానంగా కర్నూలు రోడ్డు ప్రాంతంలో ఇప్పటికే మురికికాలువలు సక్రమంగా పారకపోవడం వల్ల ఆదివారం కురిసిన వర్షంతో కర్నూలురోడ్డు ప్రధాన రహదారి జలమయంగా మారింది. చుట్టుపక్కల కాలనీలైన శ్రీరామ్‌కాలనీ, రెవిన్యూ కాలనీ తదితర ప్రాంతాలలో ఇళ్ళ ఆవరణలో భారీగా నీరు చేరడంతో ప్రజల రాక పోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ వర్షంతో ఒంగోలు నగరం పూర్తిగా చల్లబడింది. భారీ వర్షంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ముగిసిన గ్రూప్-4 పరీక్షలు
ఒంగోలు , ఆగస్టు 12: ఎపిపిఎస్‌సి గ్రూప్ - 4 పరీక్షలు ఆదివారంతో జిల్లాలో ముగిశాయి. గ్రూప్ 4 పరీక్షలకు సంబంధించి 5,832 మంది అభ్యర్థులకు హాల్‌టికెట్లు పంపిణీ చేయగా ఆదివారం ఉదయం జరిగిన పరీక్షలకు 4,451 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 4,342 మంది హాజరయ్యారు.