అనంతపురం, ఆగస్టు 16 : జిల్లాలోని పలు ఆర్టీసీ బస్టాండులు, బస్ షెల్టర్లలో సమస్యలు తిష్ట వేశాయి. బస్టాండు ఆవరణలు, బస్ షెల్టర్లు చెత్తాచెదారంతో నిండి పోయి పశువులకు, పందులకు ఆవాసాలుగా మారుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించిన కొన్ని బస్ షెల్టర్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. జిల్లాలోని పలు బస్ షెల్టర్లు దుమ్ము కొట్టుకుపోయి, కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో ఆయా బస్ షెల్టర్లలోకి వెళ్లడానికి ప్రయాణికులు జంకుతున్నారు. ఇక జిల్లాలో 12 బస్ డిపోలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 25 బస్‌స్టాండులు, 20 బస్ షెల్టర్లు ఉన్నాయి. జిల్లా మొత్తం మీద బస్‌స్టాండులు, బస్ షెల్టర్లు 57 ఉన్నాయి. ఉన్న బస్ షెల్టర్లు కూడా ఎన్టీఆర్ హయాంలో తెలుగు గ్రామీణ క్రాంతి పథకం కింద నిర్మించినవి కావడం గమనార్హం. అప్పటి నుంచీ ఇప్పటివరకూ వీటి ఆలనాపాలనా గురించి పట్టించుకోకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించిన పలు బస్ షెల్టర్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక జిల్లాలో 935 ఆర్టీసి బస్సులు ఉన్నాయి. ఇందులో 123 అద్దె బస్సులు కూడా ఉండడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజూ ఆర్టీసి బస్సులు 379 రూట్లలో 4568 ట్రిప్పులు తిరుగుతాయి. జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజూ రెండు లక్షల 39 వేల మంది ప్రయాణీకులు ఆర్టీసి బస్సులలో ప్రయాణిస్తుంటారు. ఇందుకుగానూ ఆయా బస్ స్టాండులలో ప్రయాణీకులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆర్టీసీ అధికారులు విఫలమవుతున్నారు. చాలా బస్ స్టాండులలో ప్రయాణీకుల కోసం ఉచితంగా తాగునీరు సరఫరా చేయకపోవడంతోప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అధిక ధరలకు అమ్మే తాగునీటి పై ఆధారపడుతున్నారు. ఇక ప్రతి ఆర్టీసీ బస్టాండులోనూ సరైన పారిశుద్ధ్యంపై దృష్టి సారించకపోవడంతో ప్రయాణీకులు బహిరంగ మూత్ర విసర్జన చేసే పరిస్థితి చాలా బస్టాండులలో కనిపిస్తోంది. బస్టాండులలోప్రయాణీకులు కూర్చోవడానికి సరైన బెంచీలుకానీ, ప్రయాణీకులు సేద తీరడానికి సరైన సౌకర్యాలు కూడా అందుబాటులో లేవు. రాత్రి సమయాల్లో అడుక్కుతినే వారు, తాగుబోతులు, అసాంఘిక శక్తులు తిష్ట వేసుకు కూర్చుంటున్నారు. రాత్రి సమయాల్లోఅనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండు పరిసర ప్రాంతాలు, ఆర్‌ఎం కార్యాలయం ఉన్న ప్రాంతాలు అసాంఘిక శక్తులకు నిలయాలుగా మారుతున్నాయి. వీటన్నింటినీ అరికట్టాల్సిన ఆర్టీసి అధికారులు, పోలీసులు కానీ ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో పాటు చాలా బస్‌స్టాండులలో దొంగల బెడద కూడా అధికంగానే ఉంది. బస్టాండులలోనూ ఏర్పాటుచేసిన దుకాణదారులు తమ వద్ద ఉన్న వస్తువులను అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క వస్తువునూ అధిక ధరలకు అమ్ముతూ ప్రయాణీకుల నడ్డి విరుస్తున్నారు. ఇక బస్టాండులను శుభ్రం చేయడానికి ఆయా బస్టాండులను కాంట్రాక్టు ప్రాతిపదికన టెండర్లు ఆహ్వానిస్తున్నారు. బస్టాండులలో ఉండాల్సిన శుభ్రత గురించి వీరు ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. బస్టాండుల సమీపాల్లోని ప్రైవేటు వాహనాల దందా ఉండడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించిన బస్ షెల్టర్లల పరిస్థితి గురించి ఏ మాత్రం చెప్పాల్సిన పనిలేదు. చాలా మటుకు బస్ షెల్టర్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇలా జిల్లాలోని పలు బస్‌స్టాండులు, బస్ షెల్టర్లలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి.
బాబు ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు పూర్తి
* పర్యటనలో ముస్లిం, మైనార్టీలకు హామీలు
ఆంధ్రభూమిబ్యూరో
అనంతపురం, ఆగస్టు 16 : టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు జిల్లాలోని ముస్లింలకు నేడు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఇందుకుగానూ స్థానిక లలిత కళా పరిషత్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, పార్టీ అధ్యక్షుడు బికె పార్థసారథి రెండు రోజులుగా ఇదే ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ముస్లిం, మైనార్టీలకు ఇఫ్తార్ విందు ఇవ్వడానికి స్వయానా టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రాయలసీమ జిల్లాల్లోని అనంతపురం జిల్లానే ఇందుకు వేదికగా ఎంచుకోవడం కోవడం గమనించాల్సిన విషయం. ఇక జిల్లాలో టిడిపి ఆవిర్భావం నుంచీ రాయలసీమ జిల్లాల్లోని అన్ని జిల్లాల్లోకి అనంతపురం జిల్లాలోనే పార్టీకి మంచి పట్టు ఉంది. దీంతోపాటు ఇప్పటివరకూ కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లిం, మైనార్టీలను టిడిపి వైపు ఆకర్షించే క్రమంలోనే ఇఫ్తార్ విందు ఇస్తున్నట్లు ఇతర రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఇక రాబోయే ఎన్నికల్లో ముస్లిం, మైనార్టీలకు కేటాయించే సీట్లపై కూడా ఇఫ్తార్ సందర్భంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాల్లోని అన్ని జిల్లాల్లోనూ ముస్లిం, మైనార్టీలకు సీట్లు కేటాయించే విషయంలో ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీటన్నింటితోపాటు టిడిపి అధికారంలోకి వస్తే ముస్లిం, మైనార్టీలకు పార్టీ ఏ రకమైన రిజర్వేషన్లు, సౌకర్యాలు కల్పించనుందో చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇక రాయలసీమ జిల్లాల్లోని అనంతపురం జిల్లాకు ఇఫ్తార్ విందుకు చంద్రబాబు రానుండడంతో జిల్లా వ్యాప్తంగా నలుమూలల నుంచీ పెద్ద ఎత్తున ముస్లిం, మైనార్టీలు, మతపెద్దలు ఇఫ్తార్ విందుకు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రాజీకేనా..!
* బాబు పర్యటనపై సర్వత్రా ఆసక్తి
* చమన్ ఎత్తుగడలు ఫలించేనా..
హిందూపురం, ఆగస్టు 16: గతం లో ఎన్నడూ లేని విధంగా అనంతపురంలో నిర్వహించనున్న ఇఫ్తార్ విందుకు టిడిపి అధినేత చంద్రబాబును ఆ పార్టీ నేతలు ఆహ్వానించడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఇందులో ప్రధానంగా గత కొనే్నళ్లుగా అజ్ఞాత జీవితం గడిపి ఇటీవలే జిల్లాకు వచ్చిన టిడిపి నేత, నూర్‌బాషా సంక్షేమ సంఘం రాష్ట్ర నేత చమన్ కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చమన్‌తో పాటు పోతుల సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి చమన్ జిల్లాకు రాలేకపోయారు. కాగా డిజిపి దినేష్‌రెడ్డి ఎదుట చమన్ లొంగిపోగా న్యాయపరమైన చిక్కులు కూడా తొలగిపోవడంతో కొద్దిరోజుల క్రితం హంగూ ఆర్భాటాల నడుమ రాజధాని నుంచి అనంతపురం నగరానికి వచ్చారు. ఈ నేపథ్యంలో చమన్ రాజకీయ భవితవ్యంపై జోరుగా చర్చలు సాగాయి. ఓ వైపు అధికార కాంగ్రెస్ పార్టీ వైపు చమన్ మొగ్గు చూపుతారని మరో వైపు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారన్న ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అయితే పరిటాల సునీత చమన్‌తో పాటు చంద్రబాబును కలిసి టిడిపిలోనే ఉంటారన్న సంకేతాలను వెల్లడించడంతో ఆయా ఊహాగానాలకు తెరపడింది. దీనికి తోడు శుక్రవారం అనంతపురంలో టిడిపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందుకు చంద్రబాబు హాజరవుతుండటం, ఇందులో చమన్ కీలకంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాల నేపథ్యంలో పెనుకొండ, రాప్తాడు అసెంబ్లీ నియోజక వర్గాల భవిష్యత్తు రాజకీయాలపై చర్చకు తెర లేపినట్లవుతోంది. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత స్వగ్రామం వెంకటాపురం సమీపంలో ఉన్న ఆర్.కొత్తపల్లి చమన్ గ్రామం. రామగిరి మండలంలో చమన్‌కు గట్టి పట్టు ఉంది. అదేవిధంగా గతంలో పరిటాల రవీంద్రకు కుడిభుజంగా వ్యవహరించిన చమన్‌కు పెనుకొండ నియోజకవర్గంలో గట్టి అనుచర వర్గం ఉంది. తాజాగా టిడిపిలో చమన్ చురుగ్గా వ్యవహరించాలని పావులు కదుపుతున్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే సునీతల సూచన మేరకే చమన్ భవిష్యత్తు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అనంతపురంలో పేరుకు మాత్రం టిడిపి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నట్లు నేతలు చెబుతున్నప్పటికీ ఇందులో చమన్ ఎత్తుగడలు ఉన్నట్లు సమాచారం. ఇకపోతే ప్రస్తుతం రాప్తాడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే పరిటాల సునీత భవిష్యత్తులో తన భర్త పరిటాల రవీంద్ర ప్రాతినిధ్యం వహించిన పెనుకొండ నియోజకవర్గం వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా పరిటాల సునీత పెనుకొండ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగించినప్పటికీ అప్పట్లో చోటు చేసుకున్న పరిణామాలు, ఆమె సొంత మండలం రామగిరి రాప్తాడు నియోజకవర్గంలోకి విలీనం కావడంతో ఫలించలేదు. ప్రస్తుతం చమన్ సైతం రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాప్తాడు నుంచి పోటీ చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం పెనుకొండకు ఎమ్మెల్యేగా ఉన్న బికె పార్థసారథి రాజకీయ భవితవ్యంపై చర్చకు దారి తీస్తోంది. చంద్రబాబుకు పరిటాల సునీతపై నమ్మకం ఉండటంతో ఆమె పెనుకొండ అసెంబ్లీని కోరితే కాదనే పరిస్థితి లేదన్న వాదన సాగుతోంది. సునీత సూచన మేరకే చమన్ మనోధైర్యంతో టిడిపిలో చురుగ్గా వ్యవహరించాలన్న నిర్ణయంతో పాటు రాప్తాడు అసెంబ్లీపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఆయా పరిణామాల నేపథ్యంలో పెనుకొండ, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాల భవిష్యత్తు టిడిపి రాజకీయాలు ఎలా ఉంటాయోనన్న చర్చకు దారి తీస్తోంది. కాగా ఎట్టి పరిస్థితుల్లోనూ తాను లోక్‌సభకు పోటీ చేసే ఉద్దేశమే లేదని టిడిపి జిల్లా అధ్యక్షులు, పెనుకొండ ఎమ్మెల్యే బికె పార్థసారథి స్పష్టం చేస్తూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుండే పోటీ చేస్తానన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.
18న సుప్రీం కోర్టు జడ్జి పుట్టపర్తి రాక
పుట్టపర్తి, ఆగస్టు 16: సత్యసాయి మహాసమాధి దర్శనార్థ సుప్రీం కోర్టు జడ్జీ వినాయక కర్పగం కుటుంబ సమేతంగా ఈనెల 18న ప్రశాంతి నిలయానికి విచ్చేస్తున్నట్లు తహశీల్దార్ మోహన్‌దాస్ తెలిపారు. జడ్జీ బెంగుళూరు నుంచి కారులో పుట్టపర్తికి చేరుకుని బాబా సమాధి దర్శించుకొని 19న తిరుగు ప్రయాణ అవుతారని ఆయన తెలిపారు.
అంతర్ రాష్ట్ర దొంగ అరెస్టు
* కదిరి చోరీ కేసు ఛేదించిన పోలీసులు
* 3.25 కిలోల బంగారు అభరణాలు స్వాధీనం
* పరారీలో ఇద్దరు కీలక నిందితులు
ఆంధ్రభూమిబ్యూరో
అనంతపురం, ఆగస్టు 16 : జిల్లాలో సంచలనం రేకెత్తించిన కదిరి చోరీ కేసును జిల్లా పోలీసులు అనతికాలంలోనే ఛేదించారు. జిల్లా చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా 3.25 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు కోటి రూపాయలుగా ఉంది. ఈ చోరీ కేసులోప్రధాన నిందితులంతా మహారాష్టక్రు చెందిన వారు కావడం గమనార్హం. మొత్తం 14 మంది ముఠాగా ఏర్పడి చోరీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. తాజాగా అరెస్టయిన దొంగ సహా ఇప్పటివరకూ మొత్తం ఆరుగురు దొంగలు అరెస్టయ్యారు. ఇంకా ఎనిమిది మంది దొంగలు పట్టుబడాల్సి ఉంది. ప్రస్తుతం వీరందరూ పరారీలో ఉన్నారు. వీరి కోసం ప్రత్యేక పోలీసు బలగాలు గాలింపు చేస్తున్నాయి. వీరు పట్టుబడితే మరిన్ని దొంగతనాల మిష్టరీని చేధించడంతో పాటు మరిన్ని బంగారు ఆభరణాలు దొరికే అవకాశం ఉంది. ఇదే ముఠా కదిరి చోరీతో పాటు మరో రెండు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసు శాఖ నిర్ధారించింది. గురువారం కదిరి చోరీ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ షహనవాజ్ ఖాసీం మీడియాకు వివరించారు. ముంబాయిలో చౌహాన్ అనే వ్యక్తి చౌహాన్ జ్యువెల్లర్స్‌ను నిర్వహిస్తున్నాడు. ఇందులో అదే నగరానికి చెందిన కమలేష్ ధనరాజ్ మెహతా, భావేష్ కాంతిలాల్‌లు గుమాస్తాలుగా పనిచేస్తున్నారు. వీరు ప్రతి నెలా ఒకటి లేదా రెండు మార్లు జిల్లాలోని కదిరి, తాడిపత్రి, అనంతపురం, కడప ప్రాంతాలకు వచ్చి వెళ్తుంటారు. ఇక్కడికి వచ్చి ఇక్కడి బంగారు వ్యాపారులు ఆర్డర్లపై ఇచ్చే బంగారు ఆభరణాలను చౌహాన్ జ్యువెల్లర్స్ వద్ద తయారు చేయిస్తుంటారు. అక్కడ తయారయిన బంగారు ఆభరణాలను ఇక్కడి వ్యాపారులకు ముట్టచెప్పి వెళ్లడం వీరి ప్రధాన విధి. ఇందులో భాగంగానే ఈ ఏడాది మార్చి 21న వీరిద్దరూ జిల్లాకు వచ్చారు. ముందుగా తాడిపత్రి ఆ తర్వాత అనంతపురం, కదిరి పట్టణాల్లో ఆర్డర్లపై తయారయిన నగలను ఇక్కడి వ్యాపారులకు అందచేశారు. ఇంకావారి వద్ద ఉన్న సుమారు 4.5 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఆభరణాలు కలిగిన సూట్‌కేసు సహా వీరిద్దరూ సాయంత్రం ఆరు గంటల సమయంలో అనంతపురం వెళ్లే ఆర్టీసి బస్సులో కూర్చున్నారు. దాహంగా ఉండడంతో నీళ్ల బాటిల్‌ను కొనుక్కునేందుకు ఒకరు కిందకు దిగిపోయారు. ఇంకొకరు బస్సులోనే ఉండిపోయారు. ఆ సమయంలో దుండగులు బస్సు కింద దుండగుడు నిలబడి ఈ బస్సు వివరాలు అడుగుతూ మాటల్లో ఉంచాడు. మరొక దుండగుడు బంగారు ఆభరణాలు ఉన్న సూట్‌కేసును ఎత్తుకెళ్లాడు. విషయం తెలుసుకున్న ఆ ఇద్దరు గుమాస్తాలు బొంబాయికి వెళ్లి అక్కడ తమ యజమానికి విషయం తెలియచేసి తిరిగి కదిరికి వచ్చి దొంగతనంపై ఫిర్యాదు చేశారు. కదిరిలో జరిగిన భారీ చోరీని జిల్లా ఎస్పీ షహనవాజ్ ఖాసీం సీరియస్‌గా పరిగణించారు. పెనుకొండ, ధర్మవరం, డిఎస్పీలైన కోలార్ కృష్ణ, నవాబ్‌జాన్‌లతో పాటు టుటౌన్, సిసియస్, కదిరి అర్బన్, నల్లమాడ ఇన్‌స్పెక్టర్ల ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీరి దర్యాప్తులో భాగంగా గంగారామ్ రాజారాం, శంకర్ రాం శుక్లా, బాపు డెరే డికోలే, సాబాజీ డెరే డికోలే, సురేష్ దిగంబర్ డికోలేలను అరెస్టు చేసి కొంత బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా అరెస్టయిన దొంగతో కలుపుకుని మొత్తం ఈ కేసులో ఇప్పటివరకూ ఆరుగురు దొంగలు అరెస్టయ్యారు. మరో నిందితుడిని అరెస్టు చేసేందుకు డిఎస్పీలు కోలార్ కృష్ణ, షేక్ నవాబ్‌జాన్, కరీముల్లా షరీఫ్, ఇన్‌స్పెక్టర్లు ఎ. శ్రీనివాసులు, రవీంద్రనాథ్‌రెడ్డి, ఖాసీంసాబ్, మన్సూరుద్దీన్‌ల ఆధ్వర్యంలో సిబ్బంది ఎస్‌ఐ రహమాన్, హెడ్ కానిస్టేబుల్ సాదిక్‌వలీ, రాజు, రమేష్, సుధాకర్, జయరామ్‌లు బృందాలుగా ఏర్పడి హైదరాబాదులోని నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న శంకర్‌ను బుధవారం అరెస్టు చేసి శిడిషింగే గ్రామంలోని శంకర్ ఇంట్లో దాచిన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా మొత్తం 14 మంది సభ్యులతో ఏర్పాటయ్యింది. ముఠాలో చరణ్ గుండిబా శుక్లే, సతీష్ దిగంబర్ దగిడిలు ముఖ్యులు. వీరిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ముఠా సోలాపూర్ జిల్లా టింబుద్ది నుంచీ రెండు వాహనాల్లో బయలుదేరి వచ్చింది. మార్చి 21న కదిరి పట్టణంలోని బంగారు దుకాణాల వద్ద మాటు వేసి, పథకం ప్రకారం చోరీ చేసి అనంతరం ముఠా సభ్యులు పరారయ్యారు. తిరిగి వారి స్వగ్రామమైన టింబుద్దికి వెళ్లిపోయారు. కదిరి చోరీతో పాటు జిల్లాలో మరోరెండు దొంగతనాలకు ఈ ముఠా పాల్పడింది. ప్రత్యేక పోలీసు బృందాలను ఎస్పీ షహనవాజ్ ఖాసీం అభినందించారు.
టిబిసి కెనాల్ జల వివాదం
ఆ ఇద్దరికి వినోదం
* పైలా నరసింహయ్య
తాడిపత్రి, ఆగస్టు 16: టిబిసి కెనాల్‌లో సాగు, తాగునీటికై గత కొన్ని సంవత్సరాలుగా తాడిపత్రి, పుట్లూరు మండలాల రైతుల మధ్య జలవివాదం జరుగుతుంటే, మంత్రి శైలజానాథ్, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డిలకు వినోదంగా ఉందని వైకాపా కేంద్ర కార్యవర్గ సభ్యులు పైలా నరసింహయ్య విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పైలా మట్లాడుతు అనంతపురంలో ఈనెల 15న జరిగిన సాగునీటి పారుదల సలహా సంఘం సమావేశానికి ఆ ఇద్ద రూ హాజరుకాకపోవడం సరికాదన్నా రు. సుబ్బరాయ సాగర్ షట్టర్ ధ్వం సమై నీరు వృథాగా పోతున్నా పట్టించుకొలేదన్నారు. మంత్రి శైలజానాథ్ 29వ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ నుండి జాజికొండ వాగుకు నీరు వదులుతామని హామీ ఇచ్చినా, అది నెరవేరలేదన్నారు. టిబిసికి నీరు వచ్చినప్పుడు మొసలి కన్నీరు కారుస్తు, మా ప్రాంత రైతులకు అన్యాయం జరుగుతోందని మీడియా దృష్టిలో పడేందుకు ఇరువురు పోటీ పడుతూ ఆర్భాటాలు చేస్తున్నారన్నారు. జెసి, శైలజానాథ్ ముఖ్యమంత్రి వద్ద ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తాడిపత్రిలో జరిగిన అభివృద్ధి ఆంతా వైయస్సార్ చలువేనని, ఈ అభివృద్ధి ముసుగులో జెసి సోదరులు నాసిరకం నిర్మాణ పనులు చేపట్టారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మణియార్ అబ్దుల్ సలాం, చిరంజీవి, ఎమ్మార్పీయస్ నాయకులు రామ్‌మొహన్, రామాంజినేయిలు పాల్గొన్నారు.
భూపంపిణీలో ఎస్సీ, ఎస్టీలకు
50 శాతం కేటాయించండి
* మంత్రి శైలజానాథ్
అనంతపురం కల్చరల్, ఆగస్టు 16 : 6వ విడత భూపంపిణీలో ఎస్సీ, ఎస్టీలకు ఖచ్చితంగా 50 శాతం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ పేర్కొన్నారు. గురువారం రెవెన్యూభవన్‌లో ఆరవ విడత భూపంపిణీ, రెవెన్యూ సదస్సులు, మీసేవ, ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ తదితర అంశాలపై కలెక్టర్ అధ్యక్షతన జరిగిన రెవెన్యూ అధికారుల సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమిని ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తే వారు ప్రభుత్వం పేరు కాకుండా పలానా తహశీల్దారు హయాంలో ఇచ్చారని మీపేరు చెప్పుకుంటారంటూ తహశీల్దార్లకు సూచించారు. ఆరోవిడత భూపంపిణీలో ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తే, ఈవిషయాన్ని ప్రభుత్వం చెప్పుకునేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. కలెక్టర్ వి.దుర్గాదాస్ మాట్లాడుతూ ఆరోవిడత భూపంపిణీలో ఎస్సీ,ఎస్టీ పేదవర్గాల ప్రజలు ఉండేవిధంగా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఎజెసి చెన్నకేశవరావు, డిఆర్వో సుదర్శనరెడ్డి, ఆర్డీఓలు, తహశీల్దార్లు పాల్గొన్నారు.
నిరుద్యోగులు నైపుణ్యాలు మెరుగుపరచుకోవాలి
* మంత్రి సాకే శైలజానాథ్
ఆంధ్రభూమిబ్యూరో
అనంతపురం, ఆగస్టు 16 : జిల్లాలోని నిరుద్యోగులు నైపుణ్యతలను పెంచుకుని సమయాన్ని వృథా చేయకుండా ఉద్యోగాలను చేస్తూ వారి తల్లితండ్రులకే కాకుండా పుట్టిన గ్రామానికి జిల్లాకు మంచి పేరు తీసుకు రావాలని ప్రాథమిక విద్యా శాఖ మంత్రి సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు. అదే విధంగా వారికి ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా అధికారులను సంప్రదించి వాటిని పరీక్షించుకోవాలని సూచించారు. గురువారం స్థానిక డిటిడిసిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాజీవ్ యువ కిరణాలు డిఆర్‌డిఏ- ఐకెపి- ఈజిఎంఎం ఆధ్వర్యంలో ఇంగ్లీషు, కంప్యూటర్ శిక్షణలో భాగంగా నిర్వహించిన తల్లితండ్రుల మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , ప్రతి ఒక్క నిరుద్యోగి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తద్వారా ప్రతి ఒక్కరూ ధైర్యంగా కష్టపడి పనిచేసి మంచిస్థాయికి ఎదగాలని సూచించారు. జిల్లా కలెక్టర్ వి.దుర్గాదాస్ మాట్లాడుతూ, చాలామంది యువత నిరుద్యోగులై చెడు సహవాసంతో వారి భవిష్యత్తును తప్పుదారి పట్టించుకుంటున్నారన్నారు. రాజీవ్ యువ కిరణాల ద్వారా శిక్షణ పొంది ఉపాధి ఎంచుకుని తమ భవిష్యత్తును మంచిగా నిర్దేశించుకోవాలని సూచిస్తూ ఉద్యోగం పొందిన అభ్యర్థులను అభినందించారు. అనంతరం ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన వారిని మంత్రి కలెక్టర్ అభినందించారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ఓబుళదేవరచెరువు, ఆగస్టు 16: మండల పరిధిలోని మహమ్మదాబాద్ క్రాస్ మిట్టపై కదిరి- హిందూపురం ప్రధాన రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రిటైర్డు ఎస్సై నజీర్ అహమ్మద్ అతని కుమారుడు మజపర్‌వలిలు మృతి చెందగా టాటాఏస్ లగేజి ఆటోడ్రైవర్ ఆలంవలి, ఇండికో డ్రైవర్ మున్నాలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబందించిన వివరాలు ఇలా వున్నాయి. కదిరి పట్టణానికి చెందిన రిటైర్డు ఎస్సై నజీర్ అహమ్మద్, కుమారుడు ముజఫర్‌వలిలు కదిరి నుండి టాటా ఇండిగో కారును తీసుకొని పెనుకొండ బాబాయ్య దర్శంచికొని తిరుప్రయాణంలో వస్తుండగా మహమ్మదాబాద్ మిట్టపై ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి టాటాఏస్ లగేజి ఆటోను ఢీకొంది. లగేజి ఆటో డ్రైవర్ ఆలంవలి పెద్దగుంట్లపల్లి నుండి మొకలచెరువుకు టమోటా తీసుకువెళ్లడానికి వస్తుండగా ఈప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇండిగో డ్రైవర్ మున్నా మిట్టపై నుంచి కిందకు దిగుతుండగా కారు స్టీరింగ్ విరిగిపోయి ఈప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఏఎస్సై వెంకటేశ్వర్లు ప్రమాద స్థలానికి చేరుకొని చతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొన ఊపిరితోవున్న నజీర్ చికిత్స పొందుతూ కదిరి ప్రభుత్వ వైద్యశాల మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన ఆలంవలి మెరుగైన వైద్యం కర్నూల్‌కు తరలించారు. దైవ దర్శణానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో చుట్టుపక్కల గ్రామస్థులు సహాయ చర్యలు చేపట్టారు. ఏఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ కిషోర్‌రెడ్డి పంచనామ నిర్వహించారు. ఎస్సై మధుసూదన్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మంచిగా ఉంటేనే ప్రభుత్వం అండ..
ఆంధ్రభూమిబ్యూరో
అనంతపురం, ఆగస్టు 16 : మావోయిస్టు పార్టీలో పనిచేసి జన జీవన స్రవంతిలోకి కలసి వెళ్లిపోయాక మంచి ప్రవర్తనతో మెలిగితే ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎస్పీ షహనవాజ్ ఖాసీం భరోసా ఇచ్చారు. మావోయిస్టు పార్టీలో కొనే్నళ్లపాటు పనిచేసి లొంగిపోయిన ఓ మావోయిస్టుకు జిల్లా ఎస్పీ రివార్డు మొత్తాన్ని అందచేశారు. స్థానిక పోలీసు కాన్ఫరెన్సు హాలులో గురువారం రూ. 1.8 లక్షల డిడిని అందచేశారు. కనగానపల్లి మండలం మద్దలచెరువు గ్రామానికి చెందిన సంజీవులు అలియాస్ సలీం ఆలియాస్ ప్రతాప్ నల్లమల, అనంతపురం జిల్లా మావోయిస్టు పార్టీలో దళ సభ్యుడిగా పనిచేశారు. సుమారు ఆరు సంవత్సరాలకు పైగా పనిచేసి 2009 సంవత్సరంలో లొంగిపోయారు. జనజీవన స్రవంతిలోకి కలసిపోయాక ఆయనకు ప్రభుత్వం తరపున అందాల్సిన రివార్డు మొత్తం రూ. 1.80 లక్షలను డిడి రూపంలో జిల్లా ఎస్పీ అందచేశారు. ఈ మొత్తంతో మంచి భవిష్యత్తును నిర్మించుకుని సత్ప్రవర్తనతో మెలగాలని ఆ సందర్భంగా ఎస్పీ పిలుపునిచ్చారు.
విద్యుదాఘాతానికి రైతు మృతి
తనకల్లు, ఆగస్టు 16: మండల పరిధిలోని జేనేనాయక్ తాండాకు చెందిన రామాంజినాయక్ (60) గురువారం విద్యుదాఘాతానికి మృతిచెందాడు. మృతిని కుమారులు శ్రీరాముల నాయక్, వెంకటరమణ నాయక్‌లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు...రామాంజినాయక్ పొలం పనుల నిమిత్తం స్థలం వెళ్తుండగా మల్లంవాండ్లపల్లికి చెందిన క్రిష్ణారెడ్డి పొలంకు జంతువులు రాకుండా విద్యుత్ తీగలు ఏర్పాటు చేశారు. విద్యుత్ కనెక్షన్ తొలగించకపోవడంతో అది గమనించని రైతు రామాంజినాయక్‌కు విద్యుత్ తీగలు తగిలి అక్కడిక్కడే మృతి చెందాడు. కుమారుల ఫిర్యాదు మేరకు తనకల్లు ఎస్సై మనోహార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమత్తం శవాన్ని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చేనేత కార్మికుడి ఆత్మహత్య
హిందూపురం, ఆగస్టు 16: స్థానిక మున్సిపల్ పరిధిలోని ముద్దిరెడ్డిపల్లి సుభాష్‌నగర్‌లో నివాసం ఉంటున్న చేనేత కార్మికుడు కొప్పుల రమేష్ (30) గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల సమాచారం మేరకు వివిధ కారణాల వల్ల భార్య ఆరు నెలలుగా దూరంగా ఉండటంతో మనోవేదనకు గురైన రమేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రమేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా ప్రస్తుతం వారు ధర్మవరంలోని పుట్టింట్లో ఉంటున్నారు. ఈ మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బ్యాంకు అధికారి
హత్య కేసు నిందితుల అరెస్టు
కంబదూరు, ఆగస్టు 16: ఈనెల 2వ తేదీ కంబదూరు స్టేట్ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్‌గా పని చేస్తున్న చాంద్‌బాషా హత్య కేసులో ఇద్దరు నిందితులు గురువారం గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో లొంగి పోగా, కళ్యాణదుర్గం డిఎస్పీ శ్రీ్ధర్, సిఐ రామకృష్ణయ్య, ఎస్సై నారాయణయాదవ్‌లు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు వారు తెలిపారు. డిఎస్పీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బ్యాంకు ఉద్యోగి స్థానిక చెక్ పోస్టు వద్ద మంగలి సుధాకర్ ఇంటిలో నివాసం ఉంటున్నారు. ఇరువురు మంచి స్నేహితులు కాగా తన భార్య పై బ్యాంకు ఉద్యోగి వివాహేతర సంబందం నెరుపుతున్నాడన్న నెపంతో పథకం ప్రకారం ఇరువురు అన్నదమ్ములు కలిసి చాంద్‌బాషాను హత్య చేసినట్లు డిఎస్పీ తెలిపారు. నింధితులు మంగలి సుధాకర్, తమ్ముడు మంగలి మధుబాబులు కలిసి పలుమార్లు చాంద్‌బాషాపై హత్యాయత్నానానికి పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. 2వతేదీ సాయంత్రం మృతుని ఇంటికి వెళ్ళి తలుపులు మూసివేసి టవాలుతో గొంతు నులుపి హత్య చేసినట్లు అంగీకరించారు.
రోడ్డు ప్రమాదంలో ఒకని మృతి
బుక్కరాయసముద్రం, ఆగస్టు 16: అనంతపురం తాడిపత్రి రహదారిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పుట్లూరు మండలం యల్లుట్ల గ్రామానికి చెందిన వెంకటనారాయణ(48) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ద్విచక్ర వాహనంలో అనంతపురం నుంచి స్వగ్రామానికి తిరిగి వెళుతుండగా ముసలమ్మ కట్టవద్ద కుక్కలు అడ్డురావడంతో అదుపుతప్పి కిందపడి తలకు తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. చికిత్స నిమిత్తం అనంతపురం ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం బెంగుళూరుకు తరలిస్తుండగా పెనుకొండ సమీపంలో మృతిచెందినట్లు బుక్కరాయసముద్రం ఎస్‌ఐ నారాయణరెడ్డి తెలిపారు. ఈ కేసును బుక్కరాయసముద్రం పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పురుగుల మందు తాగి ఆత్మహత్య
బుక్కరాయసముద్రం, ఆగస్టు16:బుక్కరాయసముద్రం పోలీస్‌స్టేషన్ పరిధిలో ముసలమ్మకట్ట సమీపంలో పురుగుల మందు తాగి ఓవ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం జరిగింది. శింగనమల మండలం ఆకులేడుకు చెందిన కుమ్మెత రామకృష్ణ(40) ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబ సమస్యలతో మనస్థాపం చెంది బుధవారం రాత్రి పురుగల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గుర్తించి ఇతనిని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. ఇతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఈ కేసును బుక్కరాయసముద్రం ఎస్‌ఐ నారాయణరెడ్డి నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రైవేట్ నర్సింగ్ హోంలో బాలింత మృతి
* సిబ్బందితో బాధితుల వాగ్వివాదం
హిందూపురం, ఆగస్టు 16: స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ నర్సింగ్ హోంలో ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బాలింత 3 రోజుల తరువాత మృతి చెందిన సంఘటన గురువారం వివాదానికి దారితీసింది. పట్టణంలోని లక్ష్మీపురంలో నివాసం ఉంటున్న రంగేనాయక్ భార్య శ్రావణిబాయి (26)ని ప్రైవేట్ నర్సింగ్ హోం లో చేర్పించగా సోమవారం సాయం త్రం ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈమె మొదటి కాన్పులో కవల పిల్లలకు, రెండవ సారి మగబిడ్డకు జన్మనివ్వగా మూడవ కాన్పులో ఆడబిడ్డకు జన్మినిచ్చింది. ఇకపోతే గురువారం మధ్యాహ్నం శ్రావణిబాయి నర్సింగ్ హోంలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బందితో వివాదానికి దిగారు. ఆసుపత్రి వర్గాలు సక్రమంగా వైద్య సేవలు అందించకపోవడం వల్లే తన భార్య మృతి చెందిందని రంగేనాయక్ ఆరోపించగా, వన్‌టౌన్ సిఐ బి.శ్రీనివాసులు విచారణలో అలాంటిదేమీ లేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా శ్రావణిబాయికి సకాలంలో అవసరమైన మేరకు వైద్యం చేశామని, ఎలాంటి నిర్లక్ష్యానికి పాల్పడలేదని సిఐతో ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నారు. అనారోగ్య కారణాలతో పాటు తమ సూచనలను సక్రమంగా పాటించకపోవడం వల్లే శ్రావణి మృతి చెంది ఉండవచ్చునని వారు అభిప్రాయపడ్డారు. ఏదేమైనా వివాదానికి దారి తీసిన శ్రావణిబాయి మృతి సంఘటన పోలీసుల రంగ ప్రవేశంతో సద్దుమణిగింది.
మిస్టరీగా మారిన
తండ్రీకూతుళ్ల ఆత్మహత్యలు
ఆత్మకూరు, ఆగస్టు 16:మండల పరిధిలోని తోపుదుర్తి గ్రామంలో బంగారు పోతులయ్య (55) బుధవారం రాత్రి పురుగుల మందు తాగి అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. తండ్రి మరణవార్త తెలుసుకుని అతని కుమార్తె మల్లిక విజయవాడలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. అందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. బంగారు పోతులయ్య తన రెండవ కుమార్తె మల్లికను 8 నెలల క్రితం ధర్మవరంకు చెందిన మురళికి ఇచ్చి పెళ్ళి చేశారు. అత్తింటిలో తమ చెల్లెలిని వేధించారని పోతులయ్య పెద్దకుమార్తె రాజేశ్వరి కన్నీరు మున్నీరుగా విలపించింది. తనకుమార్తె కాపురం వివాదం ధర్మవరం పోలీసుస్టేషనుకు వెళ్లినా న్యాయం జరుగలేదని కూతురి కాపురం చక్కదిద్దలేక పోయానని పోతులయ్య విరక్తితో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని బందువులు తెలిపారు. మల్లిక అత్తవారింటి వేదింపులు భరించలేక రెండు నెలలు పుట్టింట్లో ఉందని కుంటుంబ సభ్యులు నచ్చజెప్పి కాపురానికి పంపారు. అయినా మళ్ళీ వేదింపులు భరించలేక అక్కడ ఉండలేక, పుట్టింటికి రాలేక ఎటోవెళ్ళి ఉంటుందని, అది తెలుసుకుని పోతులయ్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని చెబుతున్నారు. ఆ సమయంలో విజయవాడలో ఉన్న మల్లిక తండ్రి మరణవార్త తెలుసుకుని అక్కడే రైలుకిందపడి ప్రాణాలు తీసుకుంది. అప్పటికే మల్లిక 6నెలల గర్భవతియని గ్రామస్థులు తెలిపారు. పోతులయ్య శవానికి గురువారం పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. మల్లిక ఆత్మహత్య చేసుకొన్న విషయం అక్కడి రైల్వేపోలీసుల ద్వారా తెలుసుకొన్నారు. ఆమె మృతదేహం ఇంకారావాల్సి ఉంది. ఎస్‌హెచ్‌ఓ ప్రసాదు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. తండ్రీ కూతుళ్ళ ఆత్మహత్యకు సంబంధిచిన కారణాలు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసే అవకాశముంది. తోపుదుర్తిలో తండ్రీ కూతుళ్ల ఆత్మహత్యలతో వారి కుంటుంబంలో విషాదచాయలు నెలకొన్నాయి.
జిల్లాలోని పలు ఆర్టీసీ బస్టాండులు, బస్ షెల్టర్లలో సమస్యలు తిష్ట
english title:
rtc bus stands
Date:
Friday, August 17, 2012