విజయనగరం, ఆగస్టు 16: తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతూ జిల్లా సమీక్షా మండలి తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇన్‌ఛార్జ్ మంత్రి పినిపే విశ్వరూప్ అధ్యక్షతన జెడ్పీ సమావేశ మందిరంలో గురువారం డిఆర్సీ సమావేశాన్ని నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ పూర్తవుతున్న తరుణంలో ఇప్పటికీ జిల్లాలో సాధారణ వర్షపాతం కన్నా తక్కువ స్థాయిలో వర్షపాతం నమోదైందని, ఈపరిస్థితుల దృష్ట్యా రైతాంగం సాగు చేసే అవకాశాలు పూర్తిగా మృగ్యమైపోయాయని, ఇక ప్రజానీకం తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని సమావేశం అభిప్రాయపడింది. ఈ పరిస్థితులు దృష్ట్యా జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించారు. ఈసందర్భంగా ఇన్‌ఛార్జ్ మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ కరవు పరస్థితులను ఎదుర్కొనేందుకు కంటింజెంట్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్ళించాలని, అందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. అలాగే తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, పశుగ్రాసం కొరత రాకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈసందర్భంలో రైతాంగాం పూర్తిగా నిరాశ చెందకుండా తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలను, మెట్ట పంటలను వేసేందుకు వారిని ప్రోత్సహించాలని, అందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, తద్వారా ఎదురైన కరవు దృష్ట్యా జూలై నెలాఖరు నుంచి నిలిపివేసిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం పనులను తక్షణమే చేపట్టాలని అధికారులను మంత్రి విశ్వరూప్ ఆదేశించారు. వ్యవసాయ పనులు లేనందున కూలీలు వలసలు పోకుండా నియంత్రించేందుకు వారు అడిగిన మేర పనులను మంజూరు చేయాలన్నారు. జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించేందుకు అవసరమైన చర్యలను తాను, జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ కలసి ప్రభుత్వంతో చర్చిస్తామని పేర్కొన్నారు.
రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో సాగునీటి వనరులు లేకపోవడం, పూర్తిగా వర్షాధారం మీదే ఆధారపడటం వల్ల కరవు పరిస్థితుల్లో రైతాంగం పూర్తి నిరాశకు గురవుతోందని అభిప్రాయపడ్డారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో 1.21 లక్షల హెక్టార్లలో వరి సాగు చేయాల్సి ఉండగా కేవలం 25 శాతం మాత్రమే పనులు జరగడం కరవు పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. ప్రత్యామ్నాయ పంటల పట్ల రైతాంగాన్ని మళ్ళించాలని, ఇదే సందర్భంలో వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య, ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, పీడిక రాజన్నదొర, సవరపు జయమణి, ఎమ్మెల్సీలు వాసిరెడ్డి వరదరామారావు, జి.శ్రీనివాసులు నాయుడు, డి.సి.ఎం.ఎస్ చైర్మన్ సూర్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతతో విధులు నిర్వహించండి
విజయనగరం, ఆగస్టు 16: పూర్తి సమాచారం లేకుండా కాకిలెక్కలతో సమావేశాలకు హాజరైన అధికారులకు ఇకపై బాధ్యతతో మెలగాలి. మీ శాఖలకు సంబంధించిన సమాచారం మీకు తెలియదంటే ఎలా అంటూ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులపై మండిపడ్డారు. జెడ్పీ సమావేశ మందిరంలో గురువారం జరిగిన జిల్లా సమీక్ష మండలి సమావేశం సందర్భంగా ఎజెండా అంశాలపై చర్చకు ఉపక్రమించారు. ఇదే సందర్భంలో పలు శాఖల అధికారులు చేపట్టిన పనులు, వాటి ప్రస్తుత స్థితి వంటి అంశాలపై పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో మంత్రి బొత్స అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థ ఎక్కడకు వెళ్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.మీమీశాఖలకు సంబంధించిన పనులు, వాటి ప్రగతి నివేదికలకు సంబంధించిన సమాచారం మీవద్ద అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
కరవు దృష్ట్యా తాగునీటికి ఇబ్బందుల్లేకుండా చూడాలి
ప్రస్తుతం నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో ప్రజల తాగునీటి అవసరాలకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని ఇన్‌ఛార్జ్ మంత్రి పినిపే విశ్వరూప్, జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 14,290 మంచినీటి బోర్లు, 783 రక్షిత మంచినీటి పథకాలతో పాటు మిగిలిన వాటికి నిరంతరం విద్యుత్ సరఫరా జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిరంతరం విద్యుత్ సరఫరా జరిగే లైన్లను అవసరమైతే పొడిగించాలని, అందుకు అవసరమైన ప్రతిపాదనలు తమకు పంపితే ప్రభుత్వంలో మంజూరుకు చర్యలు తీసుకుంటామని మంత్రులు స్పష్టం చేశారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో కొన్ని గ్రామాల్లో నీటి సరఫరాకు తీవ్ర విఘాతం ఏర్పడుతోందని సభ దృష్టికి తీసుకువచ్చారు. స్వాతంత్య్రదినోత్సవం నాడు కూడా తమకు విద్యుత్ కోతలు తప్పలేదని ఆరోపించారు. విద్యుత్ అధికారులను అడిగితే ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ అంటూ తప్పించుకుంటున్నారని ఆరోపించారు. ఇదే సందర్భంలో ఎమ్మెల్సీ జి.శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ జిల్లాలోని 124 పాఠశాలల్లో 4.2 కోట్ల రూపాయలతో మరుగుదొడ్లను నిర్మించారని,వాటికి బోర్లను వేసి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వలేదని పేర్కొన్నారు. జిల్లాలోని తాగునీటి పథకాలు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నామని, అయితే ప్రభుత్వం నుంచి రావాల్సిన నిర్వాహణ గ్రాంటు 16.7 కోట్ల రూపాయలు విడుదల కాలేదని సభా ముఖంగా మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ నిధులు విడుదల కాకుంటే రానున్న కాలంలో మంచినీటి పథకాల నిర్వహణ భారంగా మారుతుందని వివరించగా మంత్రి బొత్స స్పందించి నిధులను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
వ్యవసాయానికి ప్రత్యామ్నాయం చూడాలి
ప్రస్తుత కరవు పరిస్థితుల నేపధ్యంలో రైతాంగానికి అవసరమైన ప్రత్యామ్నాయాలను అధికారులు అందుబాటులో ఉంచాలని మంత్రులు ఆదేశించారు. కరవు ఫలితంగా జిల్లాలో చేపట్టే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ఇతర కార్యక్రమాల్లో వ్యవసాయ, రెవెన్యూ, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా జిల్లాలో 2.37 లక్షల హెక్టార్లు ఈసీజన్‌లో సాగు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకూ కేవలం 26,900 హెక్టార్లు మాత్రమే సాగు చేశారని, ఇదేసందర్భంలో మెట్ట, ఆరుతడి పంటల వైపు రైతులను మళ్ళించాలని సూచించారు. తక్కువ కాలంలో పంట చేతికొచ్చే వరి రకాలతో పాటు మొక్కజొన్న వంటి రకాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జిల్లాలో సాగు అవసరాలు తీరుస్తున్న తాటిపూడి, ఆండ్ర, జంఝావతి, తోటపల్లి రిజర్వాయర్ల ద్వారా సాగు చేస్తున్న విస్తీర్ణం స్వల్పంగా ఉన్నప్పటికీ వాటిద్వారా పూర్తిస్థాయిలో నీటి సరఫరా జరగాలని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య జోక్యం చేసుకుని తాటిపూడి జలాశయం నుంచి నీటిని పొందుతున్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జి.వి.ఎం.సి) ఆనీటితో వ్యాపారం చేస్తూ రైతుల నోట్లో మట్టికొడుతోందంటూ విపక్షాలు ఆరోపణలు చేస్తున్న అంశాన్ని సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి బొత్స జి.వి.ఎం.సికి కేటాయించిన నీటిలో కొంతమొత్తాన్ని పారిశ్రామిక అవసరాలకు కేటాయించుకునే వెసులు బాటు ఉందని సర్దిచెప్పారు. అయితే జి.వి.ఎం.సి నీటిని తీసుకుని నిర్వహణ ఖర్చులను చెల్లించట్లేదని వివరించారు. ఈవిషయమై తాను జి.వి.ఎం.సి అధికారులతో చర్చిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
కరవు దృష్ట్యా పశుగ్రాసం కొరత ఎదురుకాకుండా ఇప్పటి నుంచే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి విశ్వరూప్ అధికారులను ఆదేశించారు. దీనిపై పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వివరణ నిస్తూ వచ్చే నెల వరకూ పశుగ్రాసానికి ఎటువంటి కొరత ఉండదని, డిసెంబర్ నాటికి పూర్తి సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు రైతాంగానికి అందుబాటులో ఉంచామని తెలిపారు.
జిల్లాలో మలేరియా, ఇతర వ్యాధులతో మరణాలు సంభవిస్తున్నట్టు నిత్యం వార్తలు వస్తున్న నేపధ్యంలో వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉండాలని మంత్రి విశ్వరూప్ ఆదేశించారు. జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇటీవల పలు మలేరియా, డెంగీ కేసులు వెలుగుచూశాయని వీటిపై వివరణ ఇవ్వాలని కోరారు. గెడ్డ తిరువాడలో భార్యాభర్తలు మలేరియా వ్యాధితో మరణించినట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని జిల్లా వైద్యఆరోగ్య అధికారి యు.స్వరాజ్యలక్ష్మి వెల్లడించారు. పచ్చకామెర్లు ముదరడంతో వీరు మరణించారని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో గిరిజనులు గుడుంబా వంటి మత్తుపానీయాలకు అలవాటుపడి, మరణిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే కురుపాం మండలం టొంపలపాడు ఆశ్రమ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు మరణించడాన్ని కూడా ఆమె సమర్ధించుకున్నారు. వీరంతా సెలవులకు ఇళ్ళకు వెళ్ళిన సందర్భాల్లోనే మరణించినట్టు తెలిపారు. అలాగే కొంతమంది తల్లిదండ్రులు జ్వరంతో బాధపడుతున్న తమ పిల్లలు ఇళ్ళకు తీసుకువెళ్తున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి బొత్స పాఠశాలకు వచ్చిన విద్యార్ధి అనారోగ్యం పాలైతే ఇళ్ళకు పంపవద్దని ఆదేశించారు. విద్యార్థులకు వైద్యం చేయించి పూర్తిగా నయం అయ్యేవరకూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 104 వాహనాలతో పాటు వైద్యుని కూడా గ్రామీణ ప్రాంతాలకు పంపాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఆయా పిహెచ్‌సిలకు చెందిన వైద్యులకే బాధ్యతలు అప్పగించడం వల్ల ఆరోగ్యకేంద్రాల్లో సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని ఆదేశించారు.
ఉన్న ఉద్యోగస్తులను వదిలేస్తే ఎలా
జిల్లా విద్యాశాఖలో ఇప్పటికే పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి, తాజాగా జిల్లా ఉపవిద్యాశాఖ అధికారికి బదిలీ జరిగితే రిలీవ్ చేయడం పట్ల మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకాయుక్త ఆదేశాలతో పాటు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే రిలీవ్ చేసినట్టు డిఇఓ కృష్ణారావు వివరణ ఇచ్చారు. ఇక మోడల్ స్కూళ్ళ నిర్మాణంపై సభ్యులు మండిపడ్డారు. జిల్లా వ్యాప్తంగా 16 మోడల్ స్కూళ్ళను ఒక్కొక్కటి 3.2 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించనున్నారు. అయితే ఈ పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందంటూ పలువురు ఎమ్మెల్యేలు మండిపడ్డారు. అలాగే ఇటీవల జరిగిన బదిలీల్లో పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్యతో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకున్నారని ఎమ్మెల్సీ శ్రీనివాసులు నాయుడు ఆరోపించారు. విద్యావాలంటీర్ల నియామకంపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రానున్నాయని అధికారులు పేర్కొన్నారు. హాస్టళ్లలో సీట్ల సంఖ్యను పెంచాలని పలువురు సభ్యులు కోరారు. విద్యుత్ కోతవల్ల హాస్టల్ విద్యార్థులు స్టడీ అవర్స్‌లో చదువుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.
సమావేశంలో సమావేశంలో ఎమ్మెల్యేలు రాజన్నదొర, జయమణి, అప్పలనర్సయ్య, ఎమ్మెల్సీలు వరదరామారావు, శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
‘మత్స్యకారులను ఆర్థికంగా ఆదుకోవాలి’
విజయనగరం , ఆగస్టు 16: జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకున్నందున మత్స్యకారులను ఆర్థికంగా ఆదుకోవాలని జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం రాష్ట్ర డైరెక్టర్ సింగిడి నరసింగరావు, జిల్లా అధ్యక్షుడు వెంకటరావుకోరారు. ఈ మేరకు గురువారం ఇక్కడ జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద మత్స్య, పశుసంవర్థశాఖామంత్రి పి.విశ్వరూప్‌కు అందజేశారు. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన చెరువుల్లో నీరు నిల్వలేక ఎండిపోయాయని తెలిపారు. ఈ కారణంగా జూన్, జూలై నెలల్లో చేపపిల్లల పెంపకం చేపట్టలేకపోయామన్నారు. దీనివల్ల మత్స్య సంపదను అభివృద్ధి పర్చలేకపోయామని చెప్పారు. వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలో మత్స్యకారులకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. అందువల్ల జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించి ఈ ఏడాది చెరువుల లీజుల కిస్తీ మాఫీ చేయాలని కోరారు.
సహకార సంఘాల ద్వారా మత్స్యకారులకు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. 100 ఎకరాలకు పైబడిన చెరువులకు మత్స్యశాఖ ద్వారా లీజు కిస్తీలను చెల్లిస్తున్న విధంగా చిన్ననీటి చెరువులకు కూడా మత్స్యశాఖ ద్వారా లీజు కిస్తీ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
రోగులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రి
విజయనగరం , ఆగస్టు 16: జిల్లా కేంద్రాసుపత్రికి రోజు రోజుకు రోగుల తాకిడి పెరుగుతోంది. ఆసుపత్రికి గత మూడు రోజులు నుండి రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో ఆసుపత్రి ఒపి విభాగం వద్ద ఉదయం 8 నుండి 12 గంటల వరకూ బారులు తీరుతున్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు, జ్వరాలుతో బాధ పడుతున్నవారేనని ఆసుపత్రి సిబ్బంది తెలుపుతున్నారు. అయితే ఆసుపత్రికి వచ్చిన వారిలో అధికంగా గ్రామీణ ప్రాంతాలు నుండి వచ్చిన వారు కావడంతో తోందరగా వైద్యం చేయించుకోవడానికి లైన్లులో వేచి ఉన్నందున ఖాళీ లేకుండా పోయింది. దింతో అసుపత్రిలో వైద్యం నిమిత్తం చేరిన రోగుల బందువులు, ఇప్పటికే వైద్యం అందుకుని ప్రస్తుతం వచ్చిన రోగులు ఉన్నందున అసుపత్రి కిక్కిరిసిపోయి చాలా సమయం వరకూ అవస్ధలు ఎదుర్కొన్నారు. ఓపి అనంతరం సంబంధిత వైద్యులు వద్దకు వెళ్లగా తనిఖీలు నిర్వహించిన తదుపరి రక్త పరీక్షలు హెచ్‌ఐవి పరీక్షలు చేయించాలని తెలపగా అ విబాగం వద్ద రోగులు ఒక్కసారిగా ఎక్కువయ్యారు. రక్త పరీక్ష కేంద్రం రోగుల రక్త నమూనాను సేకరించి ఫలితానికి అనుగుణంగా పూర్తి స్ధాయిలో వైద్యం అందచేస్తామని రోగులు వారి బంధువులకు తెలియచేస్తున్నారు.
‘సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి’
విజయనగరం , ఆగస్టు 16: ప్రస్తుతం విజృంభిస్తున్న వ్యాధులను దృష్టిలో పెట్టుకుని మెరుగైన వైద్యం అందించాలని ఆయుష్‌శాఖ రిజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కె.మురళీ అన్నారు. జిల్లా కేంద్రాసుపత్రిలో ఆయుష్‌శాఖ విభాగంలో అయుష్ వైద్యాధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య నిమిత్తం వచ్చిన రోగులకు మెరుగైన వెద్యం అందించి వ్యాధులు నివారించే విదానాన్ని వివరించాలన్నారు. మందులు వాడే విధానంపై అవగాహన కల్పించాలని వైద్యాధికారులను ఆయన కోరారు.
ఆయుష్‌శాఖ నిధులుతో నిర్మాణం చేపట్టిన భవనాలను సకాలంలో పూర్తి అయ్యేలా చూడాలన్నారు. ఆయుష్ కేంద్రాల్లో మందులు పూర్తిగా అవ్వకముందే అధికారులు దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో అయుష్‌శాఖ వైద్యాధికారి కె.కామరాజు తదితర వైద్యులు పాల్గోన్నారు.
‘సాగునీటి ప్రాజెక్టుల సత్వర పూర్తికి చర్యలు’
విజయనగరం , ఆగస్టు 16: జిల్లాకు మంజూరైన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో సాగునీటి ప్రాజెక్టులు, చిన్న తరహా చెరువులు స్కీమ్‌లపై గురువారం ఆయన అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణ పనులలో ఎక్కడైనా ఆటంకాలు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలన్నారు. తోటపల్లి, జంఝావతి ప్రాజెక్టులు తదితర వాటికి సంబంధించి రైతులకు సకాలంలో నీరు అందించుటకు నష్ట పరిహారం చెల్లింపు విషయాలపై హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసినందున పూర్తి వివరాలతో అధికారులు హాజరు కావాలన్నారు. తోటపల్లి బ్యారేజికి సంబంధించి గరుగుబిల్లి మండలం మార్కొండపుట్టి గ్రామంలో ఆర్.ఆర్. ప్యాకేజీ, 3 పేజ్ విద్యుత్ సమస్య తదితర సమస్యలపై గ్రామస్థులు రాసుకున్న దరఖాస్తులపై ప్రభసుత్వ పరంగా ఎనిన చేయగలమో వాటిని చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన పార్వతీపురం ఆర్.డి.ఓ.కు సూచించారు. జంఝావతి ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందజేయాలని ఎస్.ఇ.ని ఆదేశించారు. తోటపల్లి బ్యారేజ్‌కి సంబంధించి ప్యాకేజ్-2లో వచ్చిన రైల్వే క్రాసింగ్ గురించి సంబంధిత అధికారులతో మాట్లాడాలన్నారు. జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ జిల్లాలో సర్వేయర్ ఎ.డి. లేరని అలాగే సర్వేయర్లు కూడా కావాలని తెలిజయజేశారు. వెంటనే మంత్రి సర్వేయర్ కమీషనర్‌తో ఫొన్‌లో సంప్రదించి సర్వేయర్ ఎ.డి.ను 10 మంది డిప్యూటీ సర్వేయర్లను వేయవల్సిందిగా చెప్పడమైంది. చీపురుపల్లి మండలంలో నీలకంఠేశ్వర దేవస్థానం దగ్గర రోడ్డు వెడల్పు పనులు చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని దీనికి సంబంధించి ఆర్.అండ్.బి. దేవాదాయశాఖ ఎ.సి. పోలీస్ అధికారి సమావేశమై చర్యలు తీసుకోవాలని మంత్రి చెప్పారు. ఎమ్మెల్యేలు అప్పలనరసయ్య, రాజన్నదొర, ఎమ్మెల్సీలు వరదా రామారావు, శ్రీనివాసులునాయుడు, డి.సి.ఎం. చైర్మన్ సూర్యనారాయణరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ రామారావు, డి.ఆర్.ఓ. హేమసుందర్, వెంకటరావు, నీటి పారుదల శాఖకు సంబంధించిన ఎస్.ఇ.లు, ఇ.ఇ.లు తదితరులు పాల్గొన్నారు.
‘క్వెస్ట్’ సేవలకు గుర్తింపుగా పీవోకు అవార్డు
పార్వతీపురం, ఆగస్టు 16: పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బి ఆర్ అంబేద్కర్ బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (క్వెస్ట్) కార్యక్రమాన్ని సంబంధించిన పుస్తకాల తయారీ చేయించి విజయవంతం చేయడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నుండి ప్రశంసలు పొందారు. ఈమేరకు పీవో అంబేద్కర్‌కు సి ఎం శుక్రవారం అవార్డు, జ్ఞాపికను అందించారు. క్వెస్ట్ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ పర్యవేక్షణలో రంపచోడవరం, సీతంపేట, పార్వతీపురం, పాడేరు తదితర ఐటిడిఎ ప్రాంతాల్లోని 5వ తరగతి చదువుతున్న ఎస్టీ విద్యార్థులకు అవసరమైన సోషల్ స్టడీస్ పుస్తకాలకు డిటిపిని చేయించే కార్యక్రమం పార్వతీపురం ఐటిడిఎలో చేపట్టాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అయితే పార్వతీపురం పీవో అంబేద్కర్ అతి తక్కువ కాలంలో డిటిపి ద్వారా పుస్తకాలు తయారు చేయించి తన సత్తాను చాటుకున్నారు. అంతేకాకుండా గిరిజన సంక్షేమశాఖ ఆశించిన పుస్తకాల లక్ష్యం కంటే మరిన్ని అదనపుపుస్తకాలను తయారుచేయించడంతో పీవో అంబేద్కర్ చూపిన చొరవను గిరిజన సంక్షేమశాఖామంత్రి బాలరాజుతోపాటు కమిషనర్ సోమేష్ కుమార్ తోపాటు ప్రిన్సిపల్ కార్యదర్శి ఎ.విద్యాసాగర్‌లు కూడా పాల్గొని అభినందించారు.
‘్భమసింగి’ కార్మికుల విధల బహిష్కరణ
జామి, ఆగస్టు 16: ప్యాక్టరీ లాభాల్లో ఉన్నప్పటికీ బోనస్ చెల్లించకుండా వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ భీమసింగి సుగర్స్ కార్మికులు గురువారం విధులను బహిష్కరించారు. ఫ్యాక్టరీ గేట్ వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఎ.ఐ.టి.యు.సి. జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణంరాజు మాట్లాడుతూ గతంలో కార్మికులకు బోనస్‌లు చెల్లించేవారన్నారు. ప్రస్తుతం ప్యాక్టరీ లాభాలు ఆర్జిస్తున్న కార్మికులకు యుజమాన్యం బోనస్‌లు చెల్లించక పోవడం దారుణమన్నారు. ఆదివారంలోగా కార్మికులకు బోనస్‌లు చెల్లించకపోతే నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరించారు.
ఏం చేస్తాం.. పరిస్థితులు అనుకూలించట్లేదు!
విజయనగరం, ఆగస్టు 16: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా సమీక్షా మండలి సమావేశం జరుగుతోంది. విద్యుత్ శాఖ తీరు, అమలు చేస్తున్న కోతలపై అధికార పార్టీ సభ్యుల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు కరెంటు ఎప్పుడిస్తారు, గ్రామాల్లో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయంటూ సభ్యులు ఒకరొకరుగా ఆరోపణలు చేస్తున్నారు. దీంతో మంత్రి బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకుని విద్యుత్ సరఫరాపై అధికారులను మనం ఎంతనిందించినా ఫలితం ఉండదు. సమావేశాల్లో వారిని నిలదీస్తే వారు సమాధానం చెప్పలేక తల దించుకుంటారు లేదంటే చేస్తాంలేఅని దాటవేస్తారు. విద్యుత్ సమస్యకు పరిష్కారం వీరి చేతుల్లోనే కాదు ఆశాఖ ఉన్నతాధికారుల చేతుల్లో కూడా లేదు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో విద్యుత్ ఉత్పాదన గణనీయంగా పడిపోయింది. ఇక ప్రత్యామ్నాయం కూడా కనుచూపుమేరలో కన్పించేట్లేదు. రోజుకు 58 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు నెలకొందంటూ లెక్కలు చెప్పుకొచ్చారు. విద్యుత్ కోతలు, సరఫరా వంటి అంశాలు ఇప్పుడు ఎవరి చేతుల్లోను లేదని, మనం ప్రభుత్వంలో భాగం కాబట్టి మనం చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలంటూ స్వపక్ష శాసనసభ్యులను మంత్రి బొత్స అనునయించే పనిలో పడ్డారు. ఎంతైనా అటు ప్రభుత్వంలో మంత్రిగాను, ఇటు పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగాను పనిచేస్తున్నందున ఎదురైన ఇబ్బందిని ఎత్తిచూపినప్పుడు స్వపక్షాలకైనా, విపక్షాలకైనా సర్ధిచెప్పాల్సిన బాధ్యతను బొత్స సమర్ధవంతంగా నిర్వర్తించారు.
విద్యుత్ సిఎండికి ఫోన్
సమీక్షలో చర్చ సందర్భంగా మంచినీటి పథకాలన్నింటికీ నిరంతరం విద్యుత్ సరఫరా జరిగే విధంగా డెడికేటెడ్ పవర్‌లైన్ల ఏర్పాటు అంశం చర్చకు వచ్చింది. ఇప్పటికే పిడబ్ల్యు పథకాలకు ఈలైన్లద్వారా రోజుకు 20 గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో త్రీఫేజ్ విద్యుత్ సరఫరా జరగేప్పుడు మాత్రమే నీటి పథకాలు నిర్వహణ జరుగుతోంది. ఈ కారణంగా వందలాది నీటి పథకాలు పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు. తద్వారా గ్రామాల్లో నీటి సరఫరాకు విఘాతమేర్పడుతోంది. ఇదే అంశాన్ని సభ్యులు సభ దృష్టికి తీసుకురావడంతో ఇపిడిసిఎల్ సిఎండితో మంత్రి బొత్స సత్యనారాయణ ఫోన్‌లో మాట్లాడారు. డెడికేటెడ్ పవర్ అందుబాటులో చోట అదనపు విద్యుత్‌లైన్లను ఏర్పాటు చేసుకుని మిగిలిన వాటికి కూడా విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు అవసరమైన ప్రతిపాదనలు సిబ్బంది ద్వారా పంపుతున్నట్టు పేర్కొన్నారు.
కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె
విజయనగరం , ఆగస్టు 16: జిల్లాలో పంచాయతీ కాంట్రాక్ట్ కార్యదర్శులు గురువారం నుంచి విధులు బహిష్కరించారు. వారంతా నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. గత కొన్నిరోజుల నుంచి వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న కార్యదర్శులు గురువారం ఇక్కడ జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష ప్రారంభించారు. నిరసనదీక్ష ప్రారంభిస్తున్న సమయంలో జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ, ఇన్‌ఛార్జి మంత్రి పినిసె విశ్వరూప్ జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగే జిల్లా సమీక్షా సమావేశానికి వెళుతున్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్యదర్శులను పిలిచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి నుంచి వినతిపత్రం స్వీకరించారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు వై.రమణ మాట్లాడుతూ జిల్లాలో 163మంది కార్యదర్శులు గత తొమ్మిదేళ్ల నుంచి చాలిచాలనీ వేతనాలతో సతమతమవుతున్నారని తెలిపారు. కాంట్రాక్ట్ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని గత తొమ్మిదేళ్ల నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడంలేదన్నారు. కాంట్రాక్ట్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరలేదన్నారు. జి.ఒ.నెంబర్ 9ను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్యదర్శులకు బదిలీ సౌకర్యం కల్పించాలన్నారు. అలాగే ఎఫ్.టి.ఎ.సదుపాయం కల్పించాలన్నారు. మహిళా కార్యదర్శులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సిహెచ్.అప్పలనాయుడు, కోశాధికారి ఎల్.తౌడుతోపాటు పలువురు కార్యదర్శులు పాల్గొన్నారు.
ప్రారంభం కాని ‘ఇందిరమ్మ’ ఇళ్ళు రద్దు
విజయనగరం , ఆగస్టు 16: మంజూరై ఏళ్లు గడుస్తున్నా ప్రారంభం కాని ఇందిరమ్మ ఇళ్లను రద్దు చేసి, వాటిస్థానే అర్హులైన లబ్ధిదారులకు అవకాశం కల్పించనున్నారు. ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యే కోటా కింద మంజూరు చేస్తున్న ఇళ్లలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించిన కోటా భర్తీ కాకపోవడంతో అర్హులైన మిగతా లబ్ధిదారులకు వేరే అవకాశం కల్పించనున్నారు. దీనిపై త్వరలోనే రాష్టస్థ్రాయిలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు రాష్ట్ర రవాణామంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశభవనంలో జరిగిన డి.ఆర్.సి.సమావేశంలో గృహ నిర్మాణశాఖపై సమీక్ష జరుగుతున్న సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల పరిధిలో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు లేని కారణంగా వారి కోటా ఇళ్లు మురిగిపోతున్నాయంటూ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై మంత్రి బొత్స స్పందిస్తూ నియోజకవర్గాల్లో అర్హులైన ఎస్సీ, ఎస్టీయేతర లబ్ధిదారుల కోసం అదనంగా ఇళ్లను కేటాయించే అంశం ప్రభుత్వం పరిశీలిస్తోందని వెల్లడించారు. ఇందిరమ్మ పథకం కింద 3,11,846 ఇళ్లు మంజూరయ్యాయని గృహనిర్మాణశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు. ఇందులో 1,91,402 ఇళ్లు పూర్తయ్యాని, 40,110 ఇళ్లు సగంలో నిలిచిపోయాయని, 80,014 ఇళ్ల నిర్మాణ ప్రారంభం కాలేదని వివరించారు. ఇందులో 40వేల మంది లబ్ధిదారులను అనర్హులుగా గుర్తిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 12వేల దరఖాస్తులు పెండింగ్‌లోఉన్నాయన్నారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు సకాలంలో బిల్లు చెల్లించడంలేదని గజపతినగరం, సాలూరు, పార్వతీపురం ఎమ్మెల్యేలు బొత్స అప్పలనరసయ్య, పీడిక రాజన్నదొర, సవరపు జయమణి ఆరోపించారు. దీనిపై స్పందించిన జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పి.విశ్వరూప్ మాట్లాడుతూ వారంరోజుల్లో పెండింగ్ బిల్లుల చెల్లింపులను పూర్తి చేయాలని ఆదేశించారు. గృహనిర్మాణశాఖ పనితీరుపై సమీక్షించాలని జిల్లా అదనపుజాయింట్‌కలెక్టర్ ఎం.రామారావును జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు.
‘పరిస్థితి ఇలాగే కొనసాగితే
మంచినీటికి ఇబ్బందులు తప్పవు’
విజయనగరం , ఆగస్టు 16: జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఇదేవిధంగా కొనసాగితే మంచినీటికి ఇబ్బందులు తప్పవని పలువురు మున్సిపల్ కమిషనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఇక్కడ జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జరిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశంలో మంచినీటి సరఫరాపై చర్చించారు. విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీల్లో మంచినీటి సరఫరాపై జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ ఆరా తీశారు.ఈ సందర్భంగా విజయనగరం మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామి, పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ బి.వి.రమణ మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులు ఇదేవిధంగా కొనసాగితే మంచినీటికి ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న మూడునెలల్లో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందన్నారు. నదుల్లో నీరు ఇంకిపోవడం వల్ల ఊటబావుల్లో జలమట్టాలు గణనీయంగా పడిపోయాయన్నారు. దీనికితోడు విద్యుత్‌కోత సమస్య ఉత్పన్నం కావడం వల్ల ప్రజలకు పూర్తిస్థాయిలో మంచినీటిని సరఫరా చేయకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సాలూరు మంచినీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉందని ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నారు. పురాతనమైన పైపులైన్ల ఉన్నందున మంచినీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. ఇదే పరిస్థితి పార్వతీపురం మున్సిపాలిటీలో ఉందని ఎమ్మెల్యే సవరపుజయమణి అన్నారు. మంచినీటి కోసం ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి బొత్స ఫోన్ ద్వారా ట్రాన్స్‌కో ఎం.డి.తో మాట్లాడారు. డెలికేటెడ్ విద్యుత్‌లైన్ల ద్వారా నిరంతరం విద్యుత్ సరఫరా జరిగేటట్లు చూడాలని ఆదేశించారు.
వైభవంగా నారాయణ యతీంద్రుల ఆరాధనోత్సవం
విజయనగరం , ఆగస్టు 16: ఫ్రెండ్స్ ఫైన్‌ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నారాయణ యతీంద్రుల ఆరాధనోత్సవం స్థానిక శంకరమఠంలో బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈసందర్భంగా మూడు విభాగాలుగా యతీంధ్రుల తరంగాల గాన పోటీలు నిర్వహించారు. జూనియర్ విభాగంలో ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రణీత, మహేశ్వర రావు, సాయికీర్తి దక్కించుకున్నారు. సీనియర్స్ విభాగంలో రమణి, శ్రీవల్లి, కృష్ణప్రసన్న 35ఏళ్ళు దాటిన వారికి నిర్వహించిన పోటీల్లో భవానీ, పద్మిని, రామారావు వరుసగా బహుమతులు దక్కించుకున్నారు. వీరికి ముఖ్యఅతిధిగా విచ్చేసి న్యాయమూర్తి జి.వి.కృష్ణయ్య నగదులు బహుమతులు అందజేశారు. ఈసందర్భంగా ప్రముఖ సంగీత విద్వాంసుడు వంకాయల నరసింహం మాట్లాడుతూ శ్రీకృష్ణుని జీవితమనే పాలసముద్రాన్ని భక్తి వైరాగ్య సంగీత, సాహిత్య కవ్వంతో మధించి శ్రీకృష్ణలీలా తరంగిణి అనే అమృతాన్ని మనకు యతీంద్రులు అందించారన్నారు. ఆయన తరంగాలను పామరులు, పండితులు విద్వాంసులు పాడుకోవచ్చునన్నారు. సభా అనంతరం జరిగిన సంగీత కచేరిలో నరసింహం బృందం నారాయణ నమో మాధవాయ, కలయ యశోదే, గోవింద ఘటయ తరంగాలను వీనుల విందుగా గానం చేశారు. ఇందులో కనే్నపల్లి సోమయాజులు, అనూరాధ దేశాయ్, పార్వతీ శంకర్, వి.రాజ్యలక్ష్మి, ఎన్.కుమారి, తేజశ్విని పాల్గొన్నారు. సంస్థ కార్యదర్శి మండపాక రవి కార్యక్రమాన్ని నిర్వహించారు.