Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఆర్టీసీ బస్టాండ్లు...సమస్యల పుట్టలు!

$
0
0

కడప, ఆగస్టు 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నినాదమే తప్ప ఆచరణ అంతంత మాత్రంగానే జిల్లాలో ఆర్టీసీ సేవలు కొనసాగుతున్నాయి. జిల్లాలో 8 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. జిల్లా కేంద్రం నుంచి కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర బిందువుగా బస్‌స్టేషన్ ఉంది. ఇక్కడి నుంచి ప్రతి నిత్యం 500 పైబడి బస్సులు రాకపోకలు ఉంటాయి. ప్రయాణికులకు సరిపడే కుర్చీలుగానీ, తాగునీటి సౌకర్యం గానీ చివరకు విశ్రాంతి గదులు గానీ లేవు. ఎండాకాలంలో ఎండకు ఎండుతూ, వర్షాకాలంలో వర్షాలకు తడుస్తూ ప్రయాణికుల పరిస్థితి వర్ణణాతీతం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రాజంపేట, రైల్వేకోడూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, పులివెందుల, మైదుకూరు, రాయచోటి, బద్వేలు డిపోలు ఉన్నాయి. సిద్దవటం, కమలాపురం, లక్కిరెడ్డిపల్లె, ముద్దనూరు, మైలవరం, నందలూరు ప్రాంతాల్లో బస్టాండ్ ఊరికి దూరంగా ఉండడంతో ప్రజలు అక్కడికి పోయేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆర్టీసీ ప్రైవేటు పరంపర తరహాలో హైయ్యర్ (అద్దెబస్సులు) బస్సులను ప్రతి డిపోలో 10 నుంచి 20 బస్సుల వరకు అద్దెకు తీసుకున్నాయి. ఆ బస్సులకు సంబంధించిన డ్రైవర్లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రయాణికుల పట్ల అగౌరవంగా ప్రవర్తించడం, చివరకు ఆర్టీసీకి చెందిన బస్సుల్లో ఉన్న కండక్టర్లను సైతం ఖాతరు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే అన్ని బస్‌స్టేషన్లలో తినుబండారాలు, చల్లని పానియాలు, వాటర్‌బాటళ్లు, చివరకు వాటర్ ప్యాకెట్లు సైతం నాసిరకం ఏర్పాటు చేసుకుని ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ యాజమాన్యం గ్యారేజీలో బస్సులను కండీషన్‌లో ఉంచడం, కాలం చెల్లిన బస్సులను నిలిపివేయడం, బస్సులను పరిశుభ్రంగా ఉంచడం, బస్టాండులో సౌకర్యాలు మెరుగుపరిచి కార్మికులలో అన్ని సంఘాలను కలుపుకొని సకాలంలో బస్సులు నడిపి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించి నష్టాల బాటలో నడుస్తున్న ఆర్టీసీని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఏ బస్టాండ్లలో చూసినా మరుగుదొడ్లు ఉన్నా వాటి పర్యవేక్షణను ప్రైవేట్ వారికి అప్పగించడంతో పే అండ్ యూజ్ విధానాన్ని అవలంభిస్తున్నారు. దీంతో ప్రజలు మూత్ర విసర్జనకు పోవాలంటే కూడా రూపాయ నుండి 2 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. గతిలేక కొంతమంది ప్రయాణికులు బస్టాండ్లలోని ఖాళీ స్థలాల్లో మాలమూత్రాలను విసర్జిస్తుండడంతో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది. ఇకపోతే కడపలో బస్టాండ్ నిర్మించి దాదాపు 40 సంవత్సరాలు కావస్తుండడంతో బస్టాండు శ్లాబ్ పెచ్చులు ఊడాయి. వీటికి మరమ్మతు చేయకపోవడంతో ఏటేటా బస్టాండ్ శ్లాబ్ శిథిలావస్థకు చేరుకుంది. అక్కడ స్టాల్స్‌లో ఏవైనా తినుబండరాలు కొనుగోలు చేయాలంటే ధరలు భగ్గుమంటున్నాయి. కడప మినహా ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాయచోటి, రాజంపేట, బద్వేల్, పులివెందుల, మైదుకూరు బస్టాండ్లలో తాగేందుకు మంచినీరు దొరకదు. ఇక బస్టాండ్లలో చూస్తామంటే కూడా ఫ్యాన్లులు కనిపించవు. దీంతో ప్రయాణికులు చెమటతో ఉక్కిపోతుంటారు.

కెసికి తుంగభద్ర నీరివ్వాలి
* 233 జీఓ రద్దు చేయాలి
* రాజోలిని తక్షణం నిర్మించాలి
* సిఎం, నీటిపారుదల శాఖ మంత్రికి రెడ్యం లేఖ
కడప, ఆగస్టు 16 : జూరాల జలాశయం నుండి శ్రీశైలం జలాశయంలోకి చేరే నీటి ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టినందున కెసి కాలువ కింద కర్నూలు-కడప జిల్లాల్లో నారుమళ్లు పోసుకునేందుకు వీలుగా తుంగభద్ర నీటిని సుంకేసుల జలాశయం ద్వారా తక్షణం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, రైతు ఉద్యమనేత రెడ్యం వెంకటసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ దీనిపై ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డికి లేఖ రాసినట్లు తెలిపారు. అల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జలాశయాల పై భాగాన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో జూరాల నుండి వచ్చే ఇన్‌ఫ్లో తగ్గడంతో శ్రీశైలం జలాశయం నీటిమట్టం పెరగడం లేదన్నారు. కనుక తక్షణం కెసి కింద కర్నూలు-కడప జిల్లాల్లో నారుమళ్లు పోసుకునేందుకు వీలుగా 3500 క్యూసెక్కుల నీటిని తక్షణం విడుదల చేయాలని పేర్కొన్నారు. పైభాగాన వర్షాలు పడిన వెంటనే జూరాల నుండి శ్రీశైలం జలాశయంలోకి నీరు చేరడమేకాక నిండే పరిస్థితి ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో నారుమళ్లు పోసుకోవడం ఆలస్యమైతే పంటల దిగుబడి భారీగా తగ్గే ఘోర ప్రమాదం ఉందన్నారు. శ్రీశైలం జలాశయంలో జీవో 69 ప్రకారం 834 అడుగులకు నీరు చేరే వరకు కృష్ణాడెల్టాకు సాగు నీరు ఇవ్వదని హై కోర్టు తీర్పు ఇచ్చినందున ఆ మేరకు నీరు చేరగానే దిగువన సాగునీటిని విడుదల చేయకుండా 107 జీవో ప్రకారం 854 అడుగులకు నీరు చేరేవరకు వదలొద్డని లేఖలో విజ్ఞప్తి చేశామన్నారు. జీవో 107లోని నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఎండిడిఎల్‌కు సంబంధం లేకుండా శ్రీశైలం నీటిని ఏ సమయలోనైన విడుదల చేసే హక్కును కల్పిస్తూ జారీ చేసిన జీవో 233ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాయలసీమ ప్రాజెక్టులైన కెసి కాలువ, తెలుగుగంగ, ఎస్సార్‌బిసి, హంద్రీనీవా సుజల స్రవంతి, గాలేరు-నగరి లాంటి ప్రాజెక్టుల కింద లక్షలాది ఎకరాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకమేనన్నారు. జిల్లాలో కెసి ఆయకట్టు స్థిరీకరణ కోసం 2.95 టిఎంసిల సామర్థ్యంతో రాజోలి జలాశయం నిర్మించేందుకు 2008 సంవత్సరం డిసెంబర్ 23న జీవో ఎస్‌నెం.244ను జారీ చేసిన ప్రభుత్వం మరుసటి రోజే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పెద్దముడియంలో రాజోలి జలాశయానికి శంకుస్థాపన చేశారన్నారు. అయితే శంకుస్థాపన చేసి కూడా దాదాపు 4 సంవత్సరాలుగా కావస్తున్నా జలాశయానికి టెండర్లు పిలువక పోవడం విడ్డూరమన్నారు. తక్షణం జీవో 233ను రద్దు చేసి శ్రీశైలం జలాశయంలో 854 అడుగులకు నీరు చేరేవరకు నీటిని వదలకుండా రాయలసీమ రైతాంగం గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారో? జీవోను రద్దు చేయకుండా సీమ రైతాంగం హృదయాల నుండి శాశ్వతంగా తొలగిపోతారో? నిర్ణయించుకోవాలని ముఖ్యమంత్రికి, భారీ నీటిపారుదలశాఖ మంత్రిని లేఖలో కోరినట్లు తెలిపారు. ఈ సమావేశంలో బాలకృష్ణ అభిమానుల సంఘం అధ్యక్షులు పోతుగంటి పీరయ్య, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి జింకల శ్రీనివాసులు, తెదేపా మైనార్టీ సెల్ నగర ప్రధాన కార్యదర్శి బుగ్గేగారి షామీర్‌బాషా, తెలుగు యువత నగర ప్రధాన కార్యదర్శి మల్లూరి యేలియా పాల్గొన్నారు.

తాగునీటి పథకాల పనులకు
అనుమతులు మంజూరు చేయండి
* కలెక్టర్ అనిల్‌కుమార్
కడప, ఆగస్టు 16: గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న తాగునీటి పథకాలకు సంబంధించిన అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కలెక్టర్ వి.అనిల్‌కుమార్ సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో తాగునీటి పథకాల ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 133.72 కోట్లతో 20 బహుళ గ్రామాల ప్రయోజిత తాగునీటి పథకాలు చేపట్టినట్లు తెలిపారు. 2.42 కోట్లతో 18 ఏకగ్రామ మంచినీటి పథకాల పనులు జరుగుతున్నాయన్నారు. ఈ పనులకు సంబంధించి నీటిపారుదల, రైల్వే, రోడ్లు, భవనాలు, అటవీశాఖ, విద్యుత్, రెవెన్యూశాఖల నుండి అనుమతులు రావాల్సి ఉందన్నారు. బహుళ గ్రామాల ప్రయోజన మంచినీటి పథకాలు మైలవరం, పుల్లంపేట, గాలివీడు, రాజుపాళెం, ఒంటిమిట్ట, కమలాపురం, యర్రగుంట్ల, పులివెందుల, వేంపల్లె, కె.ఎర్రగుడి, బి.మఠం, కొండాపురం, చిలంకూరు, లక్కిరెడ్డిపల్లె, మాధవరం, వల్లూరు, పెండ్లిమర్రి, సిద్దవటం, ఆకేపాడు ప్రాంతాల్లో పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రాంతాల్లోని గ్రామాలకు తాగునీటి సౌకర్యం లభిస్తుందన్నారు. ఏకగ్రామ మంచినీటి పథకాలు పులివెందుల నియోజకవర్గంలోని 18 గ్రామాల్లో పనులు జరుగుతున్నాయన్నారు. నీటిపారుదల శాఖ నుండి నీటిని తీసుకునేందుకు 5 పథకాలకు అనుమతి ఇవ్వాల్సి ఉందన్నారు. ట్రాన్స్‌కో నుండి 11 పథకాలకు విద్యుత్ సరఫరా అనుమతి ఇవ్వాల్సి ఉందన్నారు. ఆర్ అండ్ బి నుండి 15 పనులకు సంబంధించి పైప్‌లైన్ వేసేందుకు అనుమతులు మంజూరు చేయాల్సి ఉందన్నారు. రైల్వేశాఖ నుండి 4 పనులకు అనుమతి ఇవ్వాల్సి ఉందన్నారు. రెవెన్యూశాఖ నుండి 5 పథకాలను భూములు కావాల్సి ఉందన్నారు. అటవీశాఖకు సంబంధించి వనిపెంట పథకానికి అనుమతి లభించాల్సి ఉందన్నారు. ఆర్‌అండ్‌బి అనుమతులకు సంబంధించి ముందస్తు అడ్వాన్సులు చెల్లించాలని ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ కలెక్టర్‌కు వివరించారు. ఆ మేరకు జిఓ ఉంటే అలాగే చెల్లించాలని లేకుంటే ఉన్నతాధికారులకు అడ్వాన్స్ కోసం లేఖలు రాయాలని కలెక్టర్ ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇకి ఆదేశించారు. విద్యుత్‌కు సంబంధించి పెద్ద పథకాలకు 33 కెవి నుండి విద్యుత్ తీసుకోవాలని ఆ మేరకు ఎస్టిమేట్లు రూపొందించాలన్నారు. రైల్వే ఫారెస్టు అధికారులు కూడా త్వరగా అనుమతులు ఇవ్వాల్సిందిగా కోరడం జరుగుతుందన్నారు. ఈ పథకాలు ఏ దశలో ఎప్పటికి పూర్తవుతాయో ఒక రోడ్‌మ్యాప్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. అనుమతుల మంజూరులో జాప్యం చేయరాదని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జెడ్పీ సిఇఓ సుధాకర్‌రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి సరస్వతి, ట్రాన్స్‌కో డిఇ శోభ, డిపిఓ మున్వర్‌అలి, భూగర్భజలశాఖ డిడి మురళీధర్, ఆర్‌డబ్ల్యుఎస్ ఇఇలు పాల్గొన్నారు.

మహిళల ఉపాధికి ఉత్పత్తి విక్రయ కేంద్రాలు
* కలెక్టర్ అనిల్‌కుమార్
కడప, ఆగస్టు 16: స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి కల్పన ఆదాయాన్ని పెంపొందించేందుకు గ్రామీణ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ వి.అనిల్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం జెఎంజె కళాశాల సమీపంలోని డిఆర్‌డిఎ భవనాలలో జిల్లా సమైఖ్య ఆధ్వర్యంలో నిర్వహించనున్న గ్రామీణ ఉత్పత్తుల విక్రయ కేంద్రం ఆహార్ శాఖాహార ఫ్యామిలీ డాబాను ఆయన సతీమణి పద్మఅనిల్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు ఉత్పత్తి చేసే వస్తువులు ఈ కేంద్రాల ద్వారా మార్కెటింగ్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఈ భవనాలను ఇతరులకు లీజుకు ఇవ్వనున్నట్లు తెలిపారు. దీన్ని రద్దు చేసి భవనాలకు సార్థకత చేసేందుకు డాబా ఉత్పత్తుల కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. తద్వారా మహిళా సంఘాలకు ప్రోత్సాహంతో పాటు ఆదాయాభివృద్ధి లభిస్తుందన్నారు. త్వరలో రిమ్స్ ఆసుపత్రిలో జిల్లా సమాఖ్య ద్వారా జనరిక్ మందుల షాపును కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. పర్యాటక కేంద్రంగా పేరుపొందిన 20 ప్రాంతాల్లో కూడా గ్రామీణ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ప్రారంభించేందుకు ఆలోచిస్తున్నట్లు తెలిపారు. పర్యాటకులకు, సందర్శకులకు టిఫిన్, భోజన సౌకర్యం కల్పించేందుకు డాబాను ప్రారంభించినట్లు తెలిపారు. డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ జి.గోపాల్ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లా సమాఖ్య ద్వారా సంఘాల మహిళలకు ఆర్థికంగా లబ్దిచేకూర్చే కార్యకలాపాల శిక్షణ మాత్రమే జరిగిందని, ప్రస్తుతం వారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించే దిశలో పయనిస్తుందన్నారు. ఆమ్ ఆద్మీ యోజన, అభయహస్తం, జనశ్రీ భీమాయోజన పథకాలకు సంబంధించిన ఇన్సురెన్స్ పరిహారాలను త్వరగా అందించినందుకు జిల్లా సమాఖ్యకు రాష్ట్ర స్థాయి అవార్డు కూడా దక్కిందని పిడి వివరించారు. ఈ కార్యక్రమంలో శిల్పారామం పరిపాలనాధికారి కృష్ణమూర్తి, డిపిఎంలు వెంకటయ్య, వేణుమాదవ్, ఏరియా కోఆర్డినేటర్ వసంతకుమారి, మాదవి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు చంద్రిక, కార్యదర్శి సరస్వతి, ఎపిఎం నిరంజన్ పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ పంటల సాగుపై
దృష్టి పెట్టండి
* వ్యవసాయ శాఖ జెడి జోనాథన్
పోరుమామిళ్ళ, ఆగస్టు 16: ప్రత్యామ్నాయ పంటలపై నియోజకవర్గంలోని ఐదు మండలాల రైతులకు గురువారం స్థానిక వ్యవసాయ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసదస్సుకు వ్యవసాయ శాఖ జెడి జోనాథన్ హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో నీటి ఎద్దడి ప్రాంతాలకు వరి, పత్తి వంటి పంటలు మానుకోవాలని అనువైన పంటలు జొన్న, ప్రొద్దుతిరుగుడు, వేరుశెనగపై దృష్టి సారించాలని కోరారు. ఎక్కువ పెట్టుబడి పెట్టి రైతులు నష్టపోకూడదన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సంపాదించాలని అందుకు సీజన్‌లో అనువైన పంటలు ఎన్నుకోవాలని అన్నారు. వరి పంట పెట్టాలనుకున్న రైతులు డ్రమ్‌సీడర్‌లను తప్పనిసరిగా వాడుకోవాలని సూచించారు. ఆగస్టు కల్లా ప్రొద్దుతిరుగుడు విత్తనాలను అందిస్తామని పేర్కొన్నారు. ఎరువుల సబ్సిడీ వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడిందని పేర్కొన్నారు. యంత్రలక్ష్మి పథకానికి 20లక్షలు విలువ చేసే పరికరాలను పదిలక్షల సబ్సిడీతో 11 లక్షలకే రైతులకు అందిస్తామని వ్యవసాయ సంఘాలు, ఐదుమంది సంఘంగా ఏర్పడి ఈ సబ్సీడిని పొందవచ్చునన్నారు.
రైతులు ఏవైనా సమస్యలు వచ్చినా పూర్తి సమాచారం కోసం అందుబాటులో ఉన్న సంబంధిత వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో ఎడి నాగభూషణం, ఐదు మండలాల ఎ ఓలు చంద్రశేఖర్, శివరామకృష్ణారెడ్డి, విజయరావు, ఐదుమండలాల ఆదర్శ రైతులు ,రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సామాజిక తనిఖీ రసాభాస
పుల్లంపేట, ఆగస్టు 16:స్థానిక మండల పరిషత్‌లో గురువారం 6వ విడత ఉపాధిహామీ సామాజిక తనిఖీ సభ రసాభాసగా సాగింది. ఇందులో అధికారులు విచారణ జరపగా అక్రమాలు రూ. 50 వేలు వెలుగులోకి రాగా, రూ. 42 వేలు రికవరీ చేశారు. ఎంపిడిఓ కృష్ణయ్య ఆధ్వర్యంలో సభను నిర్వహించారు. ఈ సందర్భం గా ఎపిడి శ్రీనివాసులు మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో కన్నా అవినీతి తగ్గుముఖం పట్టిందని, కొలతలు నిర్ణయించడంలో తప్పుల వల్లే కొంతమేర అవినీతి జరిగిందన్నారు. స్వల్ఫంగా జరిగిన ఈ అవినీతిని వెంటనే రికవరీ చేశామన్నారు. జాబ్‌కార్డులు పూర్తి చేయడంలో పుల్లంపే ముందంజలో ఉందన్నారు. అక్రమాలు జరగలేదని కొలతలు నిర్ణయించే కమిటీ భూతద్దంలో చూపుతోందని మాజీ మండల ఉపాధ్యక్షులు ముద్దా వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు. దేవసముద్రంలో కోడూరు చిన్నసుబ్బయ్య, సుబ్బమ్మలు గతంలో తమకు పింఛన్లు వచ్చేవని తాము చనిపోయినట్లు రికార్డుల్లో చూపి పింఛన్లు రద్దు చేశారని ఆరోపించారు. ఇందుకు సంబంధిత అధికారి స్వరూప్ మాట్లాడుతూ విచారణ జరిపి న్యాయం చేస్తామన్నారు. ఎమ్మార్పీఎస్ నాయకులు సుబ్బన్న, సుబ్రమణ్యం, మద్దెల సుబ్బరాయుడు మాట్లాడుతూ అనంతసముద్రంలో ఉపాధి పనులన్ని బోగస్ అని ఆరోపించారు. చేయని పనులను చేసిన పనులుగా బిల్లులు పెట్టారన్నారు. పాపక్కగారిపల్లెలో 3 కుంటల భూమిని జెసిబితో పనిచేసి ఉపాధి సొమ్ము స్వాహా చేశారన్నారు. అదే విధంగా చెక్‌డ్యాంలు, మట్టితోలే పనులలో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇందుకు అధికారులు స్పందించి గతంతో పనిలేదని, ప్రస్తుతం ఉపాధి పనులు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఆర్‌బి భాస్కర్, సీనియర్ క్వాలిటీ కంట్రోలర్ అధికారి రామకృష్ణారెడ్డి, వెంకటస్వామి, ఎపిఓ సుజాత, ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

డ్వాక్రా మహిళలకు 283 కోట్ల రుణాలు లక్ష్యం
వేంపల్లె, ఆగస్టు 16: జిల్లా వ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక గ్రూపుల మహిళలకు రూ. 283 కోట్లు రుణాలుగా ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకునట్లు డిఆర్‌డిఎ పీడి పేర్కొన్నారు. గురువారం వేంపల్లెలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. 283 కోట్లలో ఇప్పటికీ 86 కోట్లు ఇచ్చామన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 32 వేల గ్రూపులు ఉన్నాయన్నారు. అర్హులైన ప్రతి గ్రూపుకు దీపం కనెక్షన్‌ను ఇస్తున్నామన్నారు. అదే విధంగా అభయ హస్తం, ఆమ్ ఆద్మీ పథకాలు కూడా సక్రమంగా నడుస్తున్నాయన్నారు. పావలా వడ్డీకి సంబంధించి ప్రతి గ్రూపుకు అందిందన్నారు. స్ర్తి శక్తి భవన్‌లు జిల్లాలో అసంపూర్తిగా ఉన్నాయని, వాటికి సంబంధించి కలెక్టర్ పూర్తి దిశగా ఉన్నారన్నారు. డ్వాక్రా మహిళలు తీసుకొన్న రుణాలను సకాలంలో చెల్లించి ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను పొందాలన్నారు. ఆయన వెంట ఏరియా కోఆర్డినేటర్ నాగలక్ష్మి, గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు ఉమాదేవి, ఎపిఎం వేణుగోపాల్ పాల్గొన్నారు.

వైవియూ ప్రొఫెసర్‌కు యంగ్ సైంటిస్ట్ అవార్డు
కడప (కల్చరల్), ఆగస్టు 16 : యోగి వేమన విశ్వవిద్యాలయంలో మైక్రో బయాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సుభాష్‌చంద్ర యంగ్ సైంటిస్టు అవార్డుకు ఎంపికైనట్లు వైవియూ ఉపకులపతి ఆచార్య అర్జుల రామచంద్రారెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలోనే ముఖ్యమైన యురేనియం ఖనిజాలు జిల్లాలోని పులివెందుల ప్రాంతంలో ఉన్నందున యురేనియం శుద్ధిపై పరిశోధనను వైవియూలో చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా డాక్టర్ సుభాష్ చంద్రను సూక్ష్మజీవుల ద్వారా యురేనియం శుద్ధి అనే అంశంపై చేయబోవు పరిశోధనకు అవార్డు లభించిందన్నారు. ఈ పరిశోధన ద్వారా కాలుష్యాన్ని తగ్గించి మానవాళికి ఉపయోగపడే విధంగా దోహదపడుతుందన్నారు. విశ్వ విద్యాలయంలో యురేనియంపై ఇప్పటికే బయోటెక్నాలజీ, బాటనీ, కెమిస్ట్రి విభాగాల్లో పని చేస్తున్న డాక్టర్ పి చంద్ర ఓబుళరెడ్డి, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ ఎన్‌సి గంగిరెడ్డి, డాక్టర్ క్రిష్ణవేణి ప్రత్యేక ప్రాజెక్టులో పరిశోధనలు చేస్తున్నారన్నారు. అయితే మైక్రో బయోలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుబాష్‌చంద్రకు యంగ్ సైంటిస్ట్ అవార్డు లభించిందన్నారు. ఈ అవార్డు రావడం పట్ల ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

బిఎస్సీ ప్రథమ సంవత్సరం
ఫలితాలు విడుదల
కడప (అర్బన్), ఆగస్టు 16 : వైవియు ప్రథమ బి. ఎస్సీ సంవత్సరం డిగ్రీ ఫలితాల్లో 29 శాతం మాత్రమే ఉత్తీర్ణతం సాధించినట్లు వైవియు ఉపకులపతి ఆచార్య అర్జుల రామచంద్రారెడ్డి తెలిపారు. గురువారం బి. ఎస్సీ ప్రథమ పరీక్ష ఫలితాలను వైవియులో ఉపకులపతి ఆచార్య అర్జుల రామచంద్రారెడ్డి,రిజిస్ట్రార్ ఆచార్య ఎం రామకృష్ణారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ రాబోవు రోజుల్లో పరీక్షల్లో పరీక్షల విభాగాన్ని అధునీకరించి అత్యంత త్వరగా పరీక్ష ఫలితాలను ప్రకటిస్తామని తెలిపారు. పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఎంవి శంకర్ మాట్లాడుతూ రీటోటలింగ్, రీవాల్యూయేషన్ కోసం అపరాద రుసుం లేకుండా రూ.400లతో సెప్టెంబర్ 4వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రూ.200 అపరాద రుసుంతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కెవి సుబ్బరాం, సంచాలకులు డాక్టర్ జి సాంబశివారెడ్డి, డాక్టర్ గులాం తారీఖ్, సహాయ పరీక్ష నియంత్రణాధికారులు డాక్టర్ అమృతప్రసాద్‌రెడ్డి, డాక్టర్ టి లక్ష్మీప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.

క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించండి
* రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశం
కడప (అర్బన్), ఆగస్టు 16: 2007 సంవత్సరానికి ముందుకు రెవెన్యూ అధికారుల వద్ద ఉన్న రీసెటిల్‌మెంట్ రిజిస్టర్‌లో చుక్కలున్న వాటిపై క్షేత్రస్థాయిలో సమస్యలు లేకుండా సర్వే నిర్వహించి 19వ తేదీ నాటికి నోట్ అందజేయాలని కలెక్టర్ అనిల్‌కుమార్ రెవె న్యూ అధికారులను ఆదేశించారు. గు రువారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్‌లో రీసెటిల్‌మెంట్ రిజిస్టర్‌లో చుక్కలున్న భూముల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2007 సంవత్స రం ఆర్‌ఎస్‌ఆర్ రిజిస్టర్‌లో చుక్కలున్న భూములు పేదలకు పంపిణీ చేశారని, వారికి పట్టాదారు పాసు పుస్తకాలు అందజేశారని వాటి ద్వారా బ్యాంకుల్లో రుణాలు పొందారని ఆ భూములను అమ్ముకోవడానికి 2007 తర్వాత సబ్ రిజిస్ట్రర్ చేయడం లేదని వీటి వివ రాలు క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్య లు లేకుండా సర్వే నిర్వహించి నివేదికను సియల్ ఆర్‌కు పంపించాల న్నారు. సర్వేలో భూములు పొందిన లబ్దిదారులకు 10 (1) అడంగల్ ద్వారా పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చి ఉంటారని లబ్దిదారుడు మరొక వ్యక్తికి అమ్మినప్పుడు రిజిష్టరు సమయంలో సిసియల్‌ఆర్ నిబంధనల ప్రకారం రిజిష్టరు చేయడం లేదన్నారు. భూ యాజమానికి తన భూమిని అమ్ముడానికి వీలు లేనందున నష్టపరిహారం కోసం కోర్టుకు వెళ్లి యుంటారని అటువంటి కేసులుంటే సర్వేలో సమగ్రంగా పరిశీలించి నివేదిక సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో కడప, జమ్మలమడుగు ఆర్డీవోలు వీరబ్రహ్మం, వెంకటరమణారెడ్డి, తహశీల్దార్లు పాల్గొన్నారు.

ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి
* కలెక్టర్ అనిల్‌కుమార్
కడప (అర్బన్), ఆగస్టు 16 : జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రతి నెల మూడు పర్యాయాలు ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని కలెక్టర్ వి అనిల్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్‌లో ఆరోగ్యశ్రీ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఏంత మందికి చికిత్స వేశారని కలెక్టర్ వైద్యాధికారులను ప్రశ్నించగా ఇప్పటి వరకు 46వేల 311 మంది శస్త్ర చికిత్సలు చేసినట్లు తెలిపారు. 246 మందికి పరీక్షలు చేసి వేరు ఆస్పత్రులకు పంపించడం జరిగిందని ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ శంకర్‌రెడ్డి, కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెలలో మూడు ఆరోగ్య శిబిరాలు ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారని ప్రశ్నించగా 17న మైదుకూరు, 24 రాజంపేట, 31న కడప నకాష్‌లో ప్రభుత్వ ప్రభుత్వేతర ఆస్పత్రుల ఆద్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు.
ఈ సమీక్షాలో జిల్లా వైద్యాధఝికారి డాక్టర్ ప్రభుదాస్ పాల్గొన్నారు.

సక్రమంగా విద్యుత్ సరఫరా చేయాలి
* సబ్‌స్టేషన్ల ఎదుట రైతుల ధర్నా
చెన్నూరు, ఆగస్టు 16 : చెన్నూరు సబ్‌స్టేషన్ పరిధిలో కనపర్తి ఫ్లీడర్ కింద రామనపల్లె పరిసర ప్రాంతాల వ్యవసాయ బోర్లకు విద్యుత్ సరఫరాను సక్రమంగా ఇవ్వకపోవడంతో ఆకుతోటలు, పసుపు, వేరుశెనగ, వరి తదితర పంటలు నీరందక ఎండిపోతున్నాయంటూ గురువారం ఉదయం రామనపల్లె, చెన్నూరుకు చెందిన 60 మంది రైతులు చెన్నూరు సబ్‌స్టేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరాను వ్యవసాయ పొలాలకు సక్రమంగా సరఫరా చేయడం లేదని రామనపల్లెకు చెందిన రైతులు బాలనారాయణరెడ్డి, నరసింహారెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, పిచ్చయ్య, సుబ్బారెడ్డి, గోసుల రమణారెడ్డి, వెంకటరమణయ్య అనేకమంది రైతులు ఆవేదన వెలిబుచ్చారు. కనీసం రెండు గంటలు కూడా పంటలకు నీటి తడి ఇవ్వడం లేదని, దీని కారణంగా ఎండిపోతున్నాయన్నారు. తమకు పాత పద్ధతిలోనే ఉదయం 11.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు నిరంతరంగా సాగునీరు ఇచ్చేందుకు విద్యుత్‌ను అందివ్వాలన్నారు. ఈ విషయంపై అనేక సార్లు విద్యుత్ అధికారులకు తెలియజేసినప్పటికీ పట్టించుకోలేదన్నారు. రైతులకు విద్యుత్ సమస్యపై విద్యుత్ ఎడి సురేంద్రబాబు దృష్టికి కూడా వినతిపత్రం ద్వారా తెలియజేశామన్నారు. సబ్‌స్టేషన్ ఎదుట రైతులు ధర్నా నిర్వహించి ఎఇ లేకపోవడంతో సబ్‌ఇంజినీర్ శివప్రసాద్‌కు రైతులు వినతిపత్రం అందజేశారు. తమకు విద్యుత్ అందివ్వని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని రైతులు విద్యుత్ అధికారులను హెచ్చరించారు.
సిద్దవటంలో...
సిద్దవటం : విద్యుత్ కోతపై మండలంలోని నాలుగు గ్రామ పంచాయతీల రైతులు గురువారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మొదట సిబ్బందిని సబ్ స్టేషన్ నుంచి బయటకు పంపి కార్యాల గేటుకు తాళాలు వేసి బైఠాయించారు. రైతులు పనుల నినాదాలు పలుకుతూ నిరంతరంగా 3 గంటల పాటు ధర్నా కొనసాగింది. గతంలో రైతులకు 7 గంటలు విద్యుత్ సరఫరాను అందిస్తామని, ప్రస్తుతం 2 గంటల నుంచి 3 గంటల వరకు కూడా సరఫరా ఇవ్వడం లేదన్నారు.
దీంతో పొలాల వద్ద రైతులు పగలు, రాత్రి పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు విద్యుత్ సరఫరా ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తమకే తెలియదంటున్నారు. మళ్లీ కోత విధిస్తుండడం వల్ల వరి పంట, వేరుశెనగ పంటకు సక్రమంగా నీరు అందించలేకపోతున్నామన్నారు. సమాచారం తెలుసుకున్న ఒంటిమిట్ట ఎడిఎ రవి చంద్రశేఖర్ లింగంపల్లె సబ్‌స్టేషన్ వద్దకు చేరుకుని రైతులతో చర్చించారు. తమకు అందిస్తున్న సరఫరాను ఎ,బి,డి, సి గ్రూపులుగా ఫీడర్లు తయారు చేసి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందించాలని రైతులు కోరారు. రాజంపేట ఎడిఎతో ఏడి ఎ ఫోన్‌లో మాట్లాడి ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు రైతులకు విద్యుత్‌ను అందిస్తామని, పగలు అంతరాయం వస్తే రాత్రివేళ ఆ సమయాన్ని పూర్తి చేస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.

* అన్ని చోట్లా అరకొర సౌకర్యాలే.. * ఎక్కడ చూసినా తాగునీటి సమస్య * నిరుపయోగంగా ఆరు బస్టాండ్లు * చోద్యం చూస్తున్న అధికారులు
english title: 
bus stands

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>