శ్రీకాకుళం, ఆగస్టు 16: మంత్రి ధర్మాన రాజీనామా కాంగ్రెస్ హైకమాండ్‌ను..కిరణ్‌సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాన్‌పిక్ భూకేటాయింపుల్లో అప్పటి రెవెన్యూ మంత్రిగా ఉన్న ధర్మాన జీవోలు జారీ చేశారని సిబిఐ అధికారులు చార్జిషీటులో నమోదు చేశారు. ఈ అభియోగానికి నిరసిస్తూ మంత్రి ధర్మాన రాజీనామా చేయగా, దానిని ఉపసంహరించుకోవాలని మంత్రులు, కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఒత్తిడికి ధర్మాన పట్టువీడటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఎసిబి, నిన్న సిబిఐ విచారణతో ఇరుకున పడింది. అంతేకాకుండా వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణ ఇప్పటికే వాన్‌పిక్ పుణ్యమా అని జైలు జీవితం గడుపుతున్నారు. దీనికి తోడు ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రభుత్వాన్ని ఓ కుదుపు కుదిపేస్తోంది. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో మంత్రి ధర్మాన తన రాజీనామా లేఖను సి.ఎం.కు అందించడంతో సొంత పార్టీ నేతలు, విపక్షాలు, రాజకీయ విశే్లషకులు మరింత విస్మయానికి లోనయ్యారు. కిరణ్ కేబినెట్ కూడా గందరగోళంలో పడింది. వీరంతా గురువారం రాజధానిలో మంత్రి ధర్మాన నివాసానికి చేరుకుని రాజీనామాను ఉపసంహరించుకోవాలని కోరినప్పటికీ తన నిర్ణయంలో మార్పులేదని సుస్పష్టం చేసినట్లు తెలిసింది. డిప్యూటీ సి.ఎం రాజనర్సింహ, కేబినెట్ మంత్రులు కోండ్రు మురళీమోహన్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, పార్ధసారధిలతో పాటు జిల్లాకు చెందిన ఎం.పి. కిల్లి కృపారాణి, శాసన సభ్యులంతా ధర్మానకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ససేమిరా అంటున్నట్లు తెలిసింది. మంత్రి క్వార్టర్స్‌ను కూడా ఖాళీ చేసేందుకు మరోపక్క ధర్మాన సన్నాహాలు చేస్తుండడంతో పార్టీ హైకమాండ్ మరింత ఆలోచనలో పడింది. జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలంతా ఇప్పటికే రాజధానిలో మకాం వేసి ధర్మానను బుజ్జగించేందుకు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడే మీడియా సమావేశాలు నిర్వహించి ధర్మాన రాజీనామా ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. అయితే మంత్రి ధర్మాన మాత్రం నోరుమెదపకుండా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తేల్చిచెప్పడంతో వారు కలవరం చెందుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర రాజధానిలో ఉన్న జిల్లాకు చెందిన కాంగ్రెస్ కేడర్‌ను తిరిగి వెనక్కి వెళ్లాలని మంత్రి ధర్మాన కోరినట్లు సమాచారం. ముఖ్యమంత్రి బుజ్జగించినప్పటికీ ధర్మాన తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేది లేదని చెప్పడంతో ఢిల్లీ పెద్దలకు ఈ సమాచారం చేరవేసినట్లు తెలిసింది. రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో ధర్మాన రాజీనామా నిర్ణయంపై ఎ.ఐ.సి.సి పెద్దలు ఆరా తీసి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మరికొంత మంది ధర్మాన నిర్ణయాన్ని సమర్ధిస్తూ సి.బి.ఐపై స్వరం పెంచడంతో కాంగ్రెస్ పార్టీని మరింత ఇరకాటంలో పెడుతున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో సమీకరణాలు మరింత ఊపందుకుంటున్నాయి. కేబినెట్‌తో పాటు రాష్ట్ర పార్టీలో కీలకపాత్ర పోషించే మంత్రి ధర్మాన రాజీనామా షాక్ ఆ పార్టీ వర్గాలను మరింత నిరుత్సాహానికి గురిచేసింది. నామినేటెడ్ పోస్టులపై ఆశావహుల ఎదురుచూపులు...త్వరలో స్థానిక ఎన్నికల సంగ్రామం వంటి సవాళ్లు ముందున్న తరుణంలో ఆత్మప్రబోధం పేరిట ధర్మాన రాజీనామా లేఖాస్త్రాన్ని సంధించడం వెనుక వ్యూహం ఏంటో అంతుచిక్కడం లేదు. హైకమాండ్ మాత్రం ధర్మాన రాజీనామాను ఉపసంహరించుకునేలా శతవిధాలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. సిక్కోలు వాసులతో పాటు రాజకీయ వాదులంతా ధర్మాన రాజీనామా నిర్ణయంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
మడ్డువలస నీటి కోసం ఆందోళన
రాజాం, ఆగస్టు 16: రాజాం నియోజకవర్గంలో మడ్డువలస ఆయకట్టు పంట పొలాలకు తక్షణం సాగు నీరు విడిచిపెట్టాలని మాజీ మంత్రి కావలి ప్రతిభా భారతి డిమాండ్ చేశారు. గురువారం ఆమె ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని రైతులు మడ్డువలస కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ముందు బైఠాయించడంతో మడ్డువలస ప్రాజెక్టు డిఇ జగదీష్ స్పందించి ప్రతిభా భారతితో చర్చించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 500 క్యూసెక్కుల నీరు మాత్రమే ఉందని, ఉన్న నీరు 20 రోజుల వరకే సరిపోతుంద తమకు అందిన ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో నీటి సామర్థ్యం పెరిగితే తప్ప నీరు విడిచిపెట్టలేమని చెప్పడంతో రైతులు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బొబ్బిలి సర్కిల్ ఎస్‌ఇ సమాధానం చెప్పేంత వరకు ఉద్యమాన్ని ఆపదలచుకోలేదని ప్రతిభా భారతి స్పష్టం చేశారు. అంతే కాకుండా ఆమె స్వయంగా ఫోన్‌లో ఎస్‌ఇతో మాట్లాడారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల రైతులు నారు మళ్లు వేసుకుని దమ్ములు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, తగినంత నీరు లేదనే సాకుతో సాగు నీరు విడిచిపెట్టకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. తక్షణమే నీరు విడిచిపెడితే రైతులు వ్యవసాయ పనులు చేసుకుంటారని ఎస్‌ఇ శ్రీనివాసరావుకు ఫోన్‌లో వివరించారు. అయినా ఎస్‌ఇ ససేమిరా అనడంతో రైతులలో ఆగ్ర హం పెల్లుబికింది. రైతుల నుండి అదపాక రాంబాబు, జ్యోతీశ్వరరావు, పైల వెంకటరమణ, సమతం సోంబాబు తదితరులు మాట్లాడుతూ రాజకీయ నాయకులు, అధికారులు కుమ్మక్కై రిజర్వాయర్‌లోని చేపలను దోచుకు తిన్నారన్నారు. రిజర్వాయర్‌లో చేపల మీద ఉన్న ప్రేమ పంట చేల మీద లేదని ఎవరు ఎంత తిన్నారో లెక్కలు చెప్పాలని నినాదాలు చేశారు. ఒక దశలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రేగిడి మాజీ జెడ్పీటిసి రామకృష్ణ నాయుడు కూడా ఎస్‌ఇతో మాట్లాడుతూ గతంలో జవహర్ రెడ్డి కలెక్టర్‌గా ఉన్న సమయంలో రైతుల అభ్యర్థన మేరకు నీటిని విడిచిపెట్టారని, ప్రస్తుతం నీటిని విడిచిపెట్టేందుకు కలెక్టర్ కృషి చేయాలని కోరారు. పాలకొండ సమీక్ష సమావేశంలో ఉన్న జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్‌ను ఈ సమస్యపై స్పందించాలని కోరేందుకు ప్రయత్నించగా కలెక్టర్ సమావేశంలో ఉన్నందున అవకాశం లభించలేదు. మడ్డువలస అధికారులు తమ పై అధికారుల తో సంప్రదింపులు జరిపారు. తుదకు సహనం కోల్పోయిన రైతు లు కార్యాలయాలకు తాళాలు వేసేందుకు సిద్ధపడగా వారిని నాయకులు వారించారు. రైతులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చేపల అవినీతిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ముట్టడి కార్యక్రమం కాస్తా ధర్నా కార్యక్రమంగా మారింది. అనంతరం ధర్నా చేస్తున్న ప్రతిభా భారతితో మడ్డువలస అధికారులు మాట్లాడుతూ ఈనెల 18 నుండి నీరు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. ఈ కార్యక్రమంలో సంతకవిటి, వంగర మాజీ ఎంపిపిలు కొల్ల అప్పలనాయుడు, పైల వెంకటరమణ, నాయకులు గురవాన నారాయణరావు, కరణం శ్రీనివాసరావు, బి. త్రినాథ, టి. కన్నంనాయుడు, నాలుగు మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. రాజాం సిఐ శ్రీనివాస చక్రవర్తి, ఎస్‌ఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. సుమారు మూడు గంటల కాలం ఈ ఆందోళన కార్యక్రమం జరిగింది.
పనుల్లో వేగం పెంచండి
పాలకొండ , ఆగస్టు 16: ప్రభుత్వ పథకాలు అమలులో అధికారులు పనులు వేగవంతం చేస్తూ ముందుకు సాగాలని అలసత్వం వహిస్తే సహించేది లేదని జిల్లాకలెక్టర్ సౌరభ్‌గౌర్, జెసి భాస్కర్‌లు స్పష్టం చేశారు. డివిజన్‌లోని 13 మండలాల్లో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల అమలు తీరుపై అధికారులతో ప్రైవేటు కల్యాణమండపంలో గురువారం సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, నిర్మల్ భారతి, సాక్షర భారతి, రాజీవ్ యువకిరణాలుతో పాటు హౌసింగ్‌తో పాటు పలు పథకాలపై ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నిర్మల్ భారత్ కార్యక్రమం కింద రెండు లక్షల మరుగుదొడ్లు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే సాక్షర భారతి ద్వారా మూడు లక్షల మంది నిరక్షరాస్యులకు విద్యనందించడం లక్ష్యంగా పేర్కొన్నారు. తహశీల్దార్లు మీ సేవా కేంద్రాల ద్వారా విద్యార్థులకు, రైతులకు పూర్తి స్థాయిలో ధ్రువపత్రాలు, అడంగళ్ అందించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. గత ఏడాది నష్టపరిహారం కింద రైతులకు రూ. 23 కోట్లు మంజూరైనప్పటికీ ఇప్పటి వరకు పంపిణీ చేయకపోవడంపై ఆ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ మండలంలోను పంట నష్టపరిహారం పొందిన రైతుల్లో మరణించిన వారు పది శాతం వరకు ఉండడంతో ఆశ్ఛర్యం వ్యక్తం చేశారు. మరణించిన వారి పేరుతో పంట నష్టపరిహారం జాబితాను తయారు చేశారా, లేక తరువాత వారు మరణించారా అని ప్రశ్నించారు. ఇక ముందు పంట నష్టపరిహారంతో పాటు ప్రభుత్వ పథకాలు అమలు చేసేటప్పుడు లబ్ధిదారులకు ముందుగా రేషన్ కార్డు జిరాక్స్‌లు, బ్యాంకు ఖాతాలతో పాటు దరఖాస్తులు సేకరించాలన్నారు. వీఆర్‌వోలతోపాటు ఆదర్శ రైతులు గ్రామాల్లో పర్యటించి ఇప్పటి వరకు పంట నష్టపరిహారం పొందని రైతుల నుండి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలన్నారు. జిల్లాలో రూ. 1000 కోట్లు క్రాఫ్ లోన్ ఇచ్చేందుకు, అలాగే సబ్సిడీతో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని పేర్కొన్నారు. రైతులు పొందిన రుణాలు సక్రమంగా వినియోగిస్తున్నారా, లేదా అనే దానిపై కూడా ఆరా తీయాలన్నారు.
ఎం ఆర్‌పి ధరలకే ఎరువులు అమ్మకాలు జరపాలి :
డివిజన్‌లోని అన్ని మండలాల్లో ఎం ఆర్‌పి ధరలకు మాత్రమే ఎరువులు అమ్మకాలు జరపాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రైతుల నుండి ఫిర్యాదులు వస్తే వ్యవసాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఫిర్యాదులు వస్తే డీలర్ షిప్పును రద్దు చేయాలని చెప్పారు.
హౌసింగ్ పనితీరు మెరుగుపర్చండి :
మండలం వ్యాప్తంగా హౌసింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌరభ్, జాయింట్ కలెక్టర్ భాస్కర్ సమీక్ష నిర్వహించారు. డివిజన్‌లోని రచ్చబండ 2లో వచ్చిన దరఖాస్తులు ఇప్పటి వరకు ఆన్‌లైన్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో ఎందుకు లబ్దిదారుల సమాచారాన్ని ఆన్‌లైన్ చేయలేదని ప్రశ్నించారు. దీనిపై అధికారులు సమాధానమిస్తూ గ్రామాలలో సరిహద్దులు గుర్తించి వివరాలు పూర్తి స్థాయిలో ఇప్పటికే సేకరించామని, వీటిని హౌసింగ్ అధికారులకు అందిస్తామని సమాధానం చెప్పినప్పటికీ వారు సంతృప్తి చెందలేదు. మాటలు చెప్పకుండా పనులు చేయండని ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్న సమీక్షలో పెండింగ్ లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. ప్రతీ గ్రామంలోను ఇళ్లల్లో మరుగుదొడ్లు ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు సూచించారు. ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణానికి నిర్మల్ భారత్ అభియాన్ పథకం కింద సుమారు రూ. 10 వేలు చెల్లింపులు చేస్తుందని వీటిలో లబ్దిదారుల వాటా రూ. 900 ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా హౌసింగ్ శాఖ పిడి శ్రీరాములు, సి ఇ వో సుధాకర్, డుమా పిడి కళ్యాణ చక్రవర్తి, వ్యవసాయ శాఖ జెడి మురళీ కృష్ణ, డివిజన్‌లోని ఎంపిడివోలు, తహశీల్దార్లు, హౌసింగ్ అధికారులు, ఆర్ డబ్ల్యు ఎస్ అధికారులతోపాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
రాజ్యాంగానికి మంత్రుల తూట్లు
శ్రీకాకుళం, ఆగస్టు 16: రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రులు చేసిన ప్రమాణాలను ఉల్లంఘిస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు తీవ్ర స్థాయిలో విమర్శించారు. థర్మల్ కేసులో జైలులో ఉన్న ఇచ్ఛాపురం ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌కు సంఘీభావం తెలియజేసేందుకు గురువారం ఆయన జిల్లా కారాగారానికి విచ్చేశారు.ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసిన మంత్రులు ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల కోసం పోరాటాలు చేసి జైలుకు వెళ్లేవారు అరుదుగా ఉంటే స్వలాభం కోసం ప్రజలను లూఠీ చేసి జైలుకు వెళ్లేవారి జాబితాలో కాంగ్రెస్ మంత్రులకు అగ్రస్థానం దక్కుతోందని విమర్శించారు. రాజ్యాంగంపై చేసిన ప్రమాణాలను ఉల్లంఘిస్తూ రాజీనామాల పేరిట నాటకాలు ఆడుతున్నారని, మంత్రి ధర్మాన రాజీనామా అంతా డ్రామా అని వ్యాఖ్యానించారు. నాడు ప్రమాణ స్వీకారంలో రాజ్యాంగానికి బద్ధుడై మసలుకుంటానని చెప్పిన ధర్మాన నేడు చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలోను, కేంద్రంలోను కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. అవినీతి రహిత పాలన సాగించే దిశగా కృషి చేస్తున్నామని జాతీయ స్థాయి నాయకులు పేర్కొంటుండగా ప్రదేశ్‌కాంగ్రెస్ కమిటీ మాత్రం ఎవరూ రాజీనామాలు చేయకూడదంటుండడం ఆ పార్టీ రెండునాలుకల ధోరణికి నిదర్శనమన్నారు. నాయకుల ద్వంద్వ వైఖరిపై ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్తారన్నారు. ఈయనతోపాటు కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జీ, కొర్ను ప్రతాప్, చల్లా రవికుమార్ తదితరులు ఉన్నారు.
తీరు మార్చుకోకపోతే వేటే
పాలకొండ, ఆగస్టు 16: విధులకు డుమ్మాకొట్టి నిద్రపోతున్న అధికారులు ఇప్పటికైనా పనితీరును మార్చుకోకపోతే వేటు తప్పదని జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కర్ హెచ్చరించారు. గురువారం స్థానిక ప్రైవేటు కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన డివిజన్ స్థాయి రెవెన్యూ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెవెన్యూ యంత్రాంగ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కారం చేయాలన్నారు. లేని పక్షంలో అవి పెరిగి పరిష్కారానికి కష్టతరంగా మారుతాయని నూతన సమస్యలను సృష్టిస్తాయని వెల్లడించారు. ప్రభుత్వం టెక్నాలజీ ద్వారా సులువుగా ఉండే విధంగా కంప్యూటర్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. 2009 నుండి ఈ విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క మండలంలో కూడా భూ వివరాలను నమోదు కాలేదని అన్నారు. రెవెన్యూ యంత్రాంగం నిద్రిస్తుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు అమలు చేస్తున్న విధానాలను అమలు చేయలేని అధికారులను గుర్తించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను ప్రజలకు అందించాల్సి బాధ్యత ప్రతీ ప్రభుత్వ అధికారి, సిబ్బంది పై ఉందన్నారు.
ధ్రువపత్రాల జారీ పై అలసత్వం వద్దు
విద్యార్థులకు మీసేవ ద్వారా ధ్రువపత్రాలు అందించడంలో రెవెన్యూ అధికారులు అలసత్వం చేస్తే సహించేది లేదని వెల్లడించారు. సర్ట్ఫికేట్లు కోసం దరఖాస్తులు చేసుకున్న విద్యార్థుల వివరాల పై పూర్తి దర్యాప్తు జరిపి డిజిటల్ సంతకాలను పెట్టాలని తహశీల్దార్లకు సూచించారు. మీ సేవ పై పూర్తిగా భారం మోపి చేతులు దులుపుకోవద్దని రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశించారు. ఎప్పటికప్పుడు ఈ కేంద్రాల పనితీరుపై ఆరా తీయాలని చెప్పారు. ధ్రువపత్రాలు కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల వివరాలను కంప్యూటరీకరణ చేయటపోవడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే రైతులకు సంబంధించిన భూ వివరాలు కూడా పూర్తి స్థాయిలో నమోదు చేయకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మైండ్‌సెట్ మార్చుకోవాలని అధికారులకు సూచించారు. మారని అధికారుల ఇంటికి వెళ్లిపోవాలని సూచించారు. అనంతరం మండలాల వారీగా సమీక్ష నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు కంప్యూటర్‌లో నమోదైన ధ్రువపత్రాలు, అడంగళ్ వివరాలను ఆయా మండలాల రెవెన్యూ అధికారులు జెసికి వివరించారు. ఆర్డీఒ బి దయానిధి మాట్లాడుతూ డివిజన్‌లోని అన్ని మండలాల్లో రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయి పర్యవేక్షణ జరిపి అడంగళ్ వివరాలను నమోదు చేయాలన్నారు. రైతుల నుండి వివరాలు సేకరించి సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని చెప్పారు. రెవెన్యూ నిబంధనలు ప్రకారం మాత్రమే పట్టాలు, పాస్‌పుస్తకాలు రైతులకు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి మార్కెండేయులు, డిప్యూటి స్పెషల్ కలెక్టర్ ఆర్ గున్నయ్య, డిఎస్‌ఒ నిర్మలాబాయి, డివిజన్‌లోని మండలాలకు చెందిన రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
సిఎంది ఇందిరమ్మ బాట...మంత్రులది జైలుబాట
* కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎద్దేవా
గార, ఆగస్టు 16: అవినీతి రహిత పాలన, జవాబుదారీతనం, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పాలన సాగిస్తానంటూ నాడు చేసిన ప్రమాణ స్వీకారం పదవులు కాపాడుకోవడానికేనని తేటతెల్లమవుతోందని కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు ఎద్దేవా చేశారు. గురువారం జిల్లా జైలు ప్రాంగణంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ చట్టబద్ధమైన పరిపాలన రాష్ట్రంలో ఎక్కడా కానరావడం లేదన్నారు. ఇందిరమ్మబాట పేరిట ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నెలలో మూడు రోజులు పాటు విహార యాత్రలు చేస్తుంటే, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు జైలుబాట పడుతున్నారని విమర్శించారు. మద్యం మాఫియాలో బొత్స సత్యనారాయణను కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన నిబద్ధతను పక్కకు నెట్టేశారన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ వాన్‌పిక్ భూముల దోపిడీకి పాల్పడిన తీరు హాస్యాస్పదమన్నారు. పార్టీని, నాయకులను రక్షించే దిశలోనే రాజీనామా అంటూ మంత్రి ధర్మాన చెబుతున్న కళ్లబొల్లి మాటలను ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై పూర్తిస్థాయిలో సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. మద్యం మాఫియాతో ఎవరికీ సంబంధం లేదన్న ధర్మాన ప్రసాదరావు తన కుమారుడు విశాఖపట్నం ఎసిబి కార్యాలయానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. ఉపాధి నిధులతో స్వప్రయోజనాలకు రోడ్లు, కనె్నధార, 2.14 ఎకరాల విలువైన భూమి, ఇళ్ల కోసం 27 ఎకరాల పేదల భూములు, గ్రానైట్ క్వారీ తదితర అంశాలపై తాము చేసిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలోనే దర్యాప్తు జరిపించి ఎసిబిని ఏమార్చారన్నారు. ప్రజల పక్షాన సమస్యలపై పోరాడిన వారిపై కేసులు పెట్టడం కక్షసాధింపు చర్యలేనని, అందుకు నిదర్శనం ఇచ్ఛాపురం ఎమ్మెల్యే పిరియా సాయిరాజేనని చెప్పారు.
విజృంభిస్తున్న విష జ్వరాలు
రేగిడి, ఆగస్టు 16: మండలంలోని సంకిలి గ్రామంలో గత ఐదు రోజులుగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామంలో 150 మందికి పైగా జ్వర పీడితులు మంచాన పడ్డారు. 40 మంది వరకు జ్వర పీడితులకు కాళ్లు, చేతులు, శరీర కీళ్ల నొప్పులతో చికున్ గున్యా లక్షణాలతో అవస్థలుపడుతున్నారు. గురువారం నాటికి అడారి జనకమ్మ, ధర్మాన రాములమ్మ, ధర్మాన సత్యవతి, గంటేడ సూర్యనారాయణ, గాడిళ్ల లక్ష్మి, బలసా కామేష్, వాన సూర్యనారాయణలతో పాటు పలువురికి చికున్ గున్యా లక్షణాలు కనిపించాయి. అలాగే బట్న లక్ష్మణ, మక్కా ఉమా, కర్రోతు భూషణ తదితరులతో పాటు మరికొందరు తీవ్ర జ్వరంతో మంచానపట్టారు. గ్రామంలో మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలతో మరికొందరు బాధపడుతున్నారు. వైద్య సిబ్బంది గ్రామంలో లేకపోవడంతో రోగులు ఆర్ ఎంపిలను ఆశ్రయిస్తున్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవారు పాలకొండ, రాజాం ప్రాంతాలలోని ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో వైద్యాధికారులు సబ్ సెంటర్ ఏర్పాటు చేసినప్పటికీ సంబంధిత సిబ్బంది జాడ కనిపించక నిత్యం తాళాలు వేసి ఉంటున్నాయి. గ్రామంలో జ్వరాలు ఒక కుటుంబం నుండి వేరొక కుటుంబానికి వ్యాపిస్తున్నాయి.
రేగిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇద్దరు వైద్యాధికారులు ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఐదు రోజులుగా జ్వరాలు ఉన్నట్లు సమాచారం అందించినప్పటికీ ఇంత వరకు వైద్య శిబిరం ఏర్పాటు చేయలేదని తెలిపారు. అలాగే గ్రామంలో కాలువల నిండా అపారిశుద్ధ్యం తాండవిస్తుంది. రక్షిత మంచినీటి పథకాలలో క్లోరినేషన్ చేయకపోవడంతో కలుషితమైన నీటినే ప్రజలు తాగాల్సి వస్తుంది. దోమలు కూడా అధిక మవుతున్నాయి. పంచాయతీ ప్రత్యేకాధికారి పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా గ్రామంలో జ్వరాలు వ్యాప్తి చెందకుండా సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
రూ.85 వేల కోట్లతో నాబార్డు రుణప్రణాళిక
* చీఫ్ జనరల్ మేనేజర్ మోహనయ్య
లావేరు, ఆగస్టు 16: గడచిన 30 ఏళ్లుగా దేశ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధికి జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు నిరంతరం కృషి చేస్తోందని నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ పి.మోహనయ్య తెలిపారు. మండలంలో తాళ్లవలస గ్రామంలో ఉమ్మడి వనరుల కేంద్రాన్ని ఆయన ప్రారంభించేందుకు విచ్చేసిన సందర్భంగా స్థానిక విలేఖరులతో మాట్లాడారు. పంట రుణాలు, పెట్టుబడులు, గ్రామీణ వౌలిక రంగం అభివృద్ధి కోసం నాబార్డు ఆర్థిక ప్రణాళికలు తయారు చేసిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 85,326.27 కోట్ల రూపాయలను నాబార్డు రుణ ప్రణాళికగా అమలు చేస్తోందని చెప్పారు. వీటిలో పంట రుణాలుగా 40,330.45 కోట్లు కేటాయించామన్నారు. ఇతర ప్రాధాన్యతా రంగాలకు 24,042.27 కోట్లు, మహిళా సంస్థలకు బ్యాంకులు అనుసంధానం చేసేందుకు 10,316.33 కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ఔత్సాహిక అభివృద్ధి పథకాల పేరిట హస్తకళాకారులు, వృత్తిపనివార్లకు శిక్షణ ఇచ్చి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. 16 జిల్లాలో 4,83,00 హెక్టార్లలో 439 వాటర్‌షెడ్ ప్రాజెక్టులను నాబార్డు అమలు చేస్తోందన్నారు. అంతేకాకుండా రైతు టెక్నాలజీ బదలాయింపు నిధి, వినూత్న వ్యవసాయ పద్ధతుల ప్రోత్సాహక నిధిని చేపట్టామన్నారు. రైతుక్లబ్‌ల ఏర్పాటు సభ్యులకు విజ్ఞాన యాత్ర కార్యక్రమాలను నాబార్డు కొనసాగిస్తోందన్నారు. జిల్లాలో ఐదు రైతుక్లబ్‌లలో 200 ఎకరాలలో గ్రీన్ బేసిక్స్ సంస్థ ద్వారా కార్యక్రమం ప్రారంభించామన్నారు. నాబార్డు సౌజన్యంతో బెజ్జిపురం యూత్‌క్లబ్ ఆధ్వర్యంలో నాలుగు లక్షల రూపాయలతో తాళ్లవలసలో నిర్మించిన ఉమ్మడి వనరుల కేంద్రాన్ని ఆయన తొలుత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాబార్డు ఎజిఎం కె.సుబ్రహ్మణ్యం, బెజ్జిపురం క్లబ్ డైరెక్టర్ ఎం.ప్రసాదరావు, ఆర్ట్స్ సంస్థ ప్రతినిధి సన్యాసిరావు, తాళ్లవలస మాజీ ఎంపిటిసి ముప్పిడి సురేష్, మాజీ సర్పంచు ముప్పిడి మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.
బలహీన వర్గాల ఆశాజ్యోతి ‘లచ్చన్న’
శ్రీకాకుళం , ఆగస్టు 16: పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న అని కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు అన్నారు. గౌతు లచ్చన్న 103వ జయంతి సందర్భంగా గురువారం స్థానిక డే అండ్ నైట్ కూడలి వద్ద నున్న లచ్చన్న విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి లచ్చన్న ఎనలేని కృషి చేశారని కొనియాడారు. లచ్చన్న జిల్లాకు మాత్రమే చెందిన నాయకుడుకాదని, రాష్ట్రానికి, దేశానికి చెందిన నాయకుడని పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని స్వాతంత్య్ర సమరయోధునిగా సముచిత స్థానం సంపాదించారన్నారు. స్వాతంత్య్రం అనంతరం పేదల కోసం, వృత్తి కార్మికుల అభ్యున్నతికోసం పాటుపడ్డారని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, టిడిపి జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి (బాబ్జి), పార్టీ పట్టణ అధ్యక్షుడు పి.వి.రమణ, జిల్లా ప్రచార కార్యదర్శి ఎస్.వి.రమణమాదిగ పాల్గొన్నారు.
లచ్చన్నకు నివాళి
స్వాతంత్య్ర సమరయోధుడు గౌతు లచ్చన్నకు జిల్లాకు చెందిన రాజకీయ, శ్రీ శయన సంఘ నాయకులు నివాళులర్పించారు. స్థానిక డే అండ్ నైట్ కూడలి వద్దనున్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. 1919వ సంవత్సరంలో సోంపేట మండలం బారువ గ్రామంలో జన్మించిన స్వాతంత్య్ర సమర యోధుడు లచ్చన్న మంత్రిగా, జీవిత కాలప్రతిపక్షనేతగా కొనసాగి రాష్ట్ర, దేశ రాజకీయాల్లో మకుటం లేని మహరాజుగా వెలుగొందారన్నారు.
పేద ప్రజల సంక్షేమం కోసం, రైతుకూలీల బాగుకు, గీత కార్మికుల సంక్షేమంపై అనేక పోరాటాలు చేసిన పోరాటయోధునిగా పేర్కొన్నారు. నివాళులర్పించిన వారిలో పట్టణ మున్సిపల్ మాజీ చైర్‌పర్శన్ ఎం.వి.పద్మావతి, డి.వి. ఎస్.ప్రకాశరావు, డి.పి.దేవ్, పూతి తవుడు, కె.రామారావు తదితరులున్నారు.
ప్రజాభిప్రాయాన్ని విస్మరిస్తే మరో ‘సోంపేట’
ఎచ్చెర్ల, ఆగస్టు 16: ప్రజాభిప్రాయానికి భిన్నంగా యాజమాన్యం వ్యవహరించి కవ్వింపు చర్యలకు పాల్పడితే మరో సోంపేట ఘటన చోటుచేసుకుంటుందని అగ్రికెమ్ పోరాట కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. గురువారం చిలకపాలెం శివాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వీరు మాట్లాడారు. హైదరాబాద్ పర్యటన ఎంతో స్పూర్తినిచ్చిందన్నారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ సానుకూలంగా స్పందించి అన్ని విషయాలను పరిశ్రమల, కాలుష్య నియంత్రణ మండలి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిసర గ్రామాల ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అగ్రికెమ్ సమస్యను అసెంబ్లీలో ప్రస్థావిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. వామపక్ష నేతలు బి.వి.రాఘవులు, కె.నారాయణలు దీనిపై సానుకూలంగా స్పందించారని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మైసూరరెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులు, కర్మాగార తనిఖీ అధికారులు, పోరాట కమిటీ ప్రతినిధులు వినతులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని స్పష్టం చేశారు. హైదరాబాద్ రెండు రోజుల పర్యటన విజయవంతమైందన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం పరిసర గ్రామాల ప్రజలు మనోభావాలకు అనుగుణంగా పరిశ్రమను శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా యాజమాన్యం ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా ప్రజల భాగస్వామ్యంతో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో భారత స్వాభిమాన్ జిల్లా అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతీ, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కలిశెట్టి అప్పలనాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బల్లాడ జనార్ధనరెడ్డి, మాజీ సర్పంచ్లు ఎం.మురళీధర్‌బాబా, గట్టెం రాములు, సంజీవిని పర్యావరణ పరిరక్షణ సమితి ప్రతినిధి పి.గోపాలం, మాజీ ఎంపిటిసిలు డొంక అప్పలరాజు, బగ్గు రాజారావు, చిలక గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
నిరసనకు దిగిన వర్సిటీ సిబ్బంది
ఎచ్చెర్ల, ఆగస్టు 16: సమస్యలను పరిష్కరించాలని గురువారం వర్సిటీ అధికారులు నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఆరవ వేతన సంఘ సిఫార్సులు అమలు చేయాలని, వర్శిటీలో పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలకు పొడిగించాలని రెగ్యులర్ సిబ్బంది కోరారు. గుజరాత్ రాష్ట్రంలో పదవీకాలం 65 సంవత్సరాలు ఉండగా తమిళనాడు, కర్ణాటకలలో 62 సంవత్సరాలు ఉందని, మన రాష్ట్రంలో మాత్రం 60 సంవత్సరాలే పదవీ కాలం ఉండడం వల్ల వర్శిటీ రెగ్యులర్ సిబ్బంది ఎంతో నష్టపోతున్నారన్నారు. 2006, 2010 వేతనబకాయిలు చెల్లించాలని, వైద్యసహాయం కల్పించాలని వారంతా నిరసనగళం వినిపించారు. పోరాట కమిటీ కన్వీనర్‌గా ప్రొఫెసర్ తమ్మినేని కామరాజును సిబ్బంది ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నిరసన కార్యక్రమంలో ఆచార్యులు ఎం.చంద్రయ్య, జి.తులసీరావు, పి.చిరంజీవులు, డాక్టర్ అడ్డయ్య, సంజీవయ్య, ఉదయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.