Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ముదిరిన వివాదం

$
0
0

విశాఖపట్నం, ఆగస్టు 16: కలెక్టర్ లవ్ అగర్వాల్, కమిషనర్ రామాంజనేయులు మధ్య ఏర్పడిన వివాదం మరింత ముదిరింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున జివిఎంసి కార్యాలయంలో పతకావిష్కరణ కార్యక్రమానికి కలెక్టర్ లవ్ అగర్వాల్ స్పెషల్ ఆఫీసర్ హోదాలో వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన వస్తున్న సంగతి తెలిసి రామాంజనేయులు ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. అంతేకాకుండా జివిఎంసి కార్యాలయంలో అడుగడుగునా లవ్ అగర్వాల్‌కు అవమానాలే ఎదురయ్యాయి. చాలా కాలంగా వీరి మధ్య కొనసాగుతున్న విభేదాలు పతాక స్థాయికి చేరుకున్నాయి.
జరిగిన సంఘటనపై లవ్ అగర్వాల్ చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. కమిషనర్ రామాంజనేయులు గురువారం హైదరాబాద్ వెళ్లారు. అక్కడ ఓ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లినప్పటికీ ఆయన పురపాలక శాఖ ఉన్నతాధికారులను కలిసి పంద్రాగస్ట్ రోజున జరిగిన తంతుపై వివరణ ఇచ్చినట్టు తెలిసింది. తనకన్నా పై అధికారిని జివిఎంసికి స్పెషల్ ఆఫీసర్‌గా నియమించాలని ప్రభుత్వానికి తాను అర్జీ పెట్టుకున్నానని, దానిపై ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పుకొచ్చినట్టు తెలిసింది. జివిఎంసికి వచ్చిన కలెక్టర్‌ను తానేమీ అవమానించలేదని సమర్థించుకున్నట్టు భోగట్టా.
ఇదిలా ఉండగా జిల్లాకు చెందిన మంత్రులు ఇద్దరూ ఈ ఇద్దరు ఐఎఎస్ అధికారులకు కొమ్ము కాస్తున్నారన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. కలెక్టర్ గంటా విధేయుడని, రామాంజనేయులంటే మంత్రి బాలరాజుకు మక్కువ ఎక్కువ అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే మంత్రులు ఈ విషయంలో అంటీ ముట్టనట్టే వ్యవహరిస్తున్నా, ఇటువంటి ప్రచారం వలన ఒక్కో మంత్రి ఒక్కో అధికారిని వెనకేసుకు వస్తున్నారన్నది జనం నమ్మే పరిస్థితి ఏర్పడింది. గతంలో లవ్ అగర్వాల్, రామాంజనేయులు మధ్య సయోధ్య కుదర్చి, ఒకే వేదిక మీదకు తీసుకు వచ్చేందుకు మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రయత్నించారు. ఆ సయోధ్య కుదిరనట్టే కుదిరి, ఆగస్ట్ 15న అడ్డం తిరిగింది. ఇద్దరు ఐఎఎస్ అధికారులు ఇలా ఆధిపత్య పోరుకు దిగడాన్ని జనంలో చర్చనీయాంశంగా మారింది. కింది స్థాయి అధికారులకు ఆదర్శంగా నిలవాల్సిన ఐఎఎస్‌లు, ఇలా ఒకరిపై మరొకరు ఆధిపత్యపోరుకు దిగడం వలన ప్రజల్లో చులకన భావం ఏర్పడింది.
ఇద్దరిని బదిలీ చేస్తారా?
కొద్ది రోజుల కిందట రాష్టవ్య్రాప్తంగా ఐఎఎస్‌లు బదిలీ అయినప్పుడు లవ్ అగర్వాల్, రామాంజనేయులు బదిలీ అవుతారని భావించారు. రామాంజనేయులు ఒక్కరినే బదిలీ చేయడానికి ఆయన అంగీకరించలేదని, తనతోపాటు లవ్ అగర్వాల్‌ను కూడా బదిలీ చేయాలని పట్టుపట్టినట్టు తెలిసింది. అప్పటికి మంత్రి గంటా వీరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయడంతో వీరిద్దరూ ఇక్కడే ఉండిపోయారు. పంద్రాగస్ట్ రోజున జరిగిన తంతుపై మంత్రి గంటా సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి, ఇద్దరు అధికారులను ఇక్కడి నుంచి బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ముస్లిం దీవెనలతోనే మంత్రినయ్యా!
* ఇఫ్తార్ విందులో గంటా వెల్లడి
విశాఖపట్నం, ఆగస్టు 16: ముస్లిం దీవెనలతో మంత్రినయ్యానని గంటా శ్రీనివాసరావు అన్నారు. స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో గురువారం ఆయన ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకుడు ఎస్.ఎ.రెహమాన్ అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ గత ఏడాది తను ఇఫ్తార్ విందుకు హాజరైనప్పుడు మంత్రినవుతానని ముస్లిం మత పెద్దలు దీవించారని, ఈ ఏడాది మంత్రిగా మీ ముందుకు వచ్చానని అన్నారు. ముస్లింలకు ప్రభుత్వం నాలుగు శాతం రిజర్వేషన్, ఫీజ్ రీఅంబర్స్‌మెంట్ అందచేస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో రెహమాన్ మాట్లాడుతూ వన్‌టౌన్‌లోని కొబ్బరితోట ప్రాంతంలో ముస్లింలు ఎక్కువ మంది ఉన్నారని, వారు తీవ్రమైన కాలుష్యంతో బాధపడుతున్నారని అన్నారు. చాలా స్కూళ్ళలో ఉర్దూ టీచర్లు లేకపోవడం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అలాగే మరిప్రాలెం ఈద్గా సమస్యను పరిష్కరించాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి గంటా మాట్లాడుతూ ముస్లిం సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, తైనాల విజయకుమార్, మళ్ళ విజయప్రసాద్, చింతలపూడి వెంకటరామయ్య, ఎల్లంపల్లి శ్రీనివాస్, నగర పోలీస్ కమిషనర్ పూర్ణచంద్రరావు, పోలీస్ అధికారులు సురేష్ బాబు, అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ ఇఫ్తార్ విందుకు కలెక్టర్ లవ్ అగర్వాల్ హాజరు కాకపోవడం గమనార్హం.

తీరని సమస్యలు
* మళ్ళీ ఆన్‌రాక్ నిర్వాసితుల రైతుల ఆందోళన
* కలెక్టరేట్ వద్ద నిరసన
విశాఖపట్నం, ఆగస్టు 16: ఆన్‌రాక్ కంపెనీ నిర్మాణం జరిగిపోతున్నా, ఇందులో భూమలు కోల్పోయిన రైతుల సమస్యలు తీరడంలేదు. కనీసం వీరి గురించి ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. దీంతో రైతులంతా మరోసారి రోడ్డెక్కారు. దీనిలోభాగంగా గురువారం విశాఖ నగరంలో కలెక్టరేట్ వద్ద రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. విశాఖ జిల్లా మాకవరపాలెం మండలంలో జి.కోడూరు, రాచపల్లి, కొత్తపాలెం, వెంకటాపురం గ్రామాలకు సంబంధించి రెండు వెల ఎకరాల భూములను ఆన్‌రాక్ అల్యూమినియం కంపెనీ కోసం ప్రభుత్వం సేకరించింది. ఈ విధంగా సేకరించిన సమయంలో వీరందరికీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన ప్రభుత్వం, యాజమాన్యం ఇంతవరకు నిర్వాసిత రైతులకిచ్చిన హామీలను నెరవేర్చనేలేదు. దీంతో అనేకసార్లు ఆందోళనను నిర్వహించిన రైతులు యాజమాన్యంపై తీవ్ర వత్తిడి తీసుకువచ్చినా ఫలితంలేకపోయింది. గురువారం మరోసారి రైతులంతా పెద్దఎత్తున తరలివచ్చి నిరసన కార్యక్రమాన్ని చేపట్టి, ఆ తరువాత జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌ను కలిసి తమ సమస్యల గురించి వివరించారు. ముఖ్యంగా భూములు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాల్లో 18 ఏళ్ళు దాటిన యువకులకు ఉపాధి, నష్టపరిహారం చెల్లించాలని, జి.కోడూరు గ్రామాన్ని తరలించి పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని నివేదించారు. కొత్తపాలెంలో పునాదులు వేసుకున్న 10 మందికి, 40 మంది యువకులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదన్నారు. వీటితోపాటు నిర్వాసిత గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కల్పించాలని, భూములు కోల్పోయిన ప్రతి కుటుంబంలో ఒక్కరికి పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలని, పశుక్రాంతి పథకం కింద గేదెలకు రుణాలివ్వాలని, నిర్వాసిత కుటుంబంలో యువకులకు శిక్షణ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. అన్‌రాక్ నిర్వాసితుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెంటకోట వెంకటరమణ, సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు సంయుక్త ఆధ్వర్యంలో గురువారం జెసి ప్రవీణ్‌కుమార్‌ను కలిసి సమస్యలపై చర్చించారు.

కాంట్రాక్ట్ కార్యదర్శుల నిరాహారదీక్ష
విశాఖపట్నం, ఆగస్టు 16: కొత్తగా భర్తీ చేయనున్న పంచాయితీ కార్యదర్శుల నోటిఫికేషన్ వెలువడక ముందే ప్రస్తుతం పనిచేసే కాంట్రాక్ట్ పంచాయితీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని కోరుతూ గ్రామ పంచాయితీ కార్యదర్శుల అసోసియేషన్ (కాంట్రాక్ట్) ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద నిరాహారదీక్ష చేపట్టారు. దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలని, అటువంటి వాటి అభివృద్ధికి కృషి చేస్తున్న కాంట్రాక్ట్ పంచాయితీ కార్యదర్శుల పరిస్థితి ఆందోళనకరంగా తయారైందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పి.మధుసూధన్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు ఆరోగ్యవంతంగా జీవించడానికి ప్రత్యక్షంగా పారిశుద్ధ్యం, రక్షిత మంచినీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు, సామాజిక ఫించన్లు, అర్హుల ఎంపిక, ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారుల ఎంపిక, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు బాధ్యతులను సమర్థవంతగా నిర్వహించి గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్న కాంట్రాక్ట్ కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవడంలేదన్నారు. 2008లో పంచాయితీరాజ్ సర్వీస్ అసోసియేషన్ సమ్మె చేయడంలో భాగంగా ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని లిఖిత పూర్వకమైన హామీనిచ్చిందన్నారు. రాష్ట్ర మంత్రులు జెసి దివాకర్‌రెడ్డి, బొత్సా సత్యనారాయణ, జానారెడ్డి వీరి సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించారన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కటకం శ్రీనివాస్, ఎమ్‌ఎస్‌ఎస్ వాణి, జిల్లాలో పలు పంచాయితీల నుంచి తరలివచ్చిన కాంట్రాక్ట్ గ్రామ కార్యదర్శులు ఈ దీక్షలో పాల్గొన్నారు.
సిఐటియు మద్ధతు
కాంట్రాక్ట్ గ్రామ పంచాయితీ కార్యదర్శులందర్ని తక్షణం రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ చేపట్టిన పోరాటానికి సిఐటియు నగర ఉపాధ్యక్షుడు జిఎస్ రాజేశ్వరరావు మద్దతు తెలిపారు. రాష్ట్రంలో సుమారు 2600 మంది కాంట్రాక్ట్ గ్రామ పంచాయితీ కార్యదర్శులు గత పదేళ్ళుగా పనిచేస్తున్నారన్నారు. వీరంతా మెరిట్, డిఎస్సీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించడం ద్వారా నియామకమయ్యారన్నారు. ఒక పర్మినెంట్ పంచాయితీ కార్యదర్శిని రిక్రూట్ చేయడానికి ప్రభుత్వం ఏ పద్ధతినైతే పాటిస్తుందో అదే పద్ధతిని కాంట్రాక్ట్ గ్రామ పంచాయితీ కార్యదర్శుల విషయంలో కూడా పాటించిందన్నారు. కాబట్టి రెగ్యులరైజ్ అవడానికి కావాల్సిన అన్ని అర్హతలూ వీరికున్నాయన్నారు.

పెరుగుతున్న మలేరియా, డెంగూ కేసులు
* వృద్ధులు, మహిళలే బాధితులు
* విష జ్వరంతో చికిత్సపొందిన మంత్రి శత్రుచర్ల
విశాఖపట్నం, ఆగస్టు 16: విశాఖ నగరంలో మలేరియా, డెంగూ కేసులు పెరుగుతున్నాయి. మరోపక్క జిల్లా నలుమూలల నుంచి వీటి లక్షణాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య విపరీతంగా ఉంటోంది. విష జ్వరం బారినపడిన రాష్ట్ర అటవీశాఖామంత్రి శత్రుచర్ల విజయరామరాజు గురువారం నగరంలో ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన నగరానికి వచ్చి ఇక్కడి ఆసుపత్రిలో చేరారు. దీంతో ప్రాథమిక చికిత్స నిర్వహించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. అలాగే జిల్లాలో పలు మండల కేంద్రాలు, ఏజేన్సీ ప్రాంతాల నుంచి మలేరియా, డెంగ్యూ లక్షణాలు కలిగి ఉన్న రోగులు ఇక్కడి కెజిహెచ్‌కు వస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో సాధ్యంకాని మరికొన్ని కేసులు నమోదవుతున్నాయి. ఈ విధంగా గత నాలుగు రోజుల్లో ఆరు డెంగూ కేసులు నమోదయ్యాయి. మలేరియా, డెంగూ కేసులకు సంబందించి ప్రత్యేకించిన వార్డుల్లో పదేసి వంతున పడకలను ఏర్పాటు చేసి వైద్యులు ప్రత్యేక వైద్యాన్ని అందిస్తున్నారు. మలేరియా కలిగి ఉన్న రోగులకు రక్త పరీక్షలు నిర్వహించి అదే రోజున చికిత్సనందిస్తుండగా, డెంగూ లక్షణాలు కలిగి ఉన్న వారికి ప్లేట్‌లెట్లు తగ్గినా, రక్తనమూనాలు పంపిస్తుండటంతో దీని నిర్ధారణకు కాస్త ఆలస్యమవుతుందని వైద్యులు చెబుతున్నారు.

భార్యను కడతేర్చిన భర్త
డుంబ్రిగుడ, ఆగస్టు 16: మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో కట్టుకున్న ఇల్లాలిని గునపంతో పొడిచి హతమార్చిన భర్తను స్ధానికులు తాళ్లతో కట్టి బందించి పోలీసులకు అప్పగించారు. బంధువులు అందించిన వివరాల ప్రకారం మండలంలోని కించుమండ సంతబయలు గ్రామానికి చెందిన పాంగి లచ్చన్న బుధవారం రాత్రి మద్యం సేవించేందుకు భార్య పాంగి పార్వతీని డబ్బులు అడిగాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన ఆమెతో నిందితుడు వాగ్వివాదానికి దిగినట్టు బంధువులు చెప్పారు. వీరిద్దవురి మధ్య గొడవ పెరగడంతో మద్యం మత్తులో ఉన్న లచ్చన్న పార్వతీని తీవ్రంగా కొట్టడమే కాకుండా గునపంతో తల భాగంపై పొడవగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తాగుడుకు బానిసైన లచ్చన్న నిత్యం ఇలానే ప్రవర్తించేవాడని, పంట భూములను అమ్మి మద్యం సేవించేందుకే వినియోగించే వాడని వారు చెప్పారు. హతురాలు పార్వతీ కూలి పనులు, వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబ బాధ్యతలు చూసుకునేదని వారన్నారు. ఈ మధ్యకాలంలో ఇందిరమ్మ గృహానికి సొమ్ము పార్వతీ చేతికి అందడంతో ఆమె ఇంటి పైకప్పు నిమిత్తం రేకులను కొనుగోలు చేసి మిగిలిన సొమ్ము నిర్మాణ పనులు చేపట్టేందుకు ఇంటిలో ఉంచగా, వాటిని మద్యం నిమిత్తం ఇవ్వాలని ఆమెను వేధిస్తుండేవాడని వారు తెలిపారు. పార్వతీ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో లచ్చన్న విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి పార్వతీని హతమార్చాడని వారు పేర్కొన్నారు. భార్యను హత్య చేసిన లచ్చన్న తప్పించుకు పోకుండా పార్వతీ మృతదేహం పక్కనే తాళ్లతో కట్టి బందించి పోలీసులకు అప్పగించారు. భార్యను హత్య చేసిన లచ్చన్నను అరెస్ట్ చేసి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రైవేట్ వ్యాన్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
* వ్యాన్ డ్రైవర్ మృతి
* తొమ్మిది మందికి గాయాలు
* తప్పిన ఘోర ప్రమాదం
గూడెంకొత్తవీధి, ఆగస్టు 16: నిత్యావసర వస్తువులను తీసుకువెళ్తున్న ప్రైవేట్ వ్యాన్‌ను సీలేరు నుండి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈసంఘటనలో ప్రైవేట్ వ్యాన్ డ్రైవర్ మృతి చెందగా, వ్యాన్, బస్సులో ఉన్న తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గరువారం మధ్యాహ్నం జరిగిన ఈసంఘటన కలకలం రేపింది. ఈసంఘటనపై సి.ఐ. రామకృష్ణ అందించిన వివరాలిలా ఉన్నాయి. భద్రాచలం నుండి విశాఖపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు చింతపల్లి వైపు నుండి గిరిజన సహకార సంస్థ నిత్యావసర సరుకులు తీసుకువస్తున్న ప్రైవేట్ వ్యాన్‌ను మండలం ఆర్.వి.నగర్ మార్గమధ్యలో ఢీకొట్టింది. ఈసంఘటనలో దేవరాపల్లి కి చెందిన జీపు డ్రైవర్ వంతల సురేంద్ర(30) అక్కడికక్కడే మృతి చెందగా, వ్యాన్, బస్సులో ఉన్న నర్సీపట్నం కొత్తవీధికి చెందిన ఉమ్మి అప్పలకొండ(25), మఠం సంపూర్ణ(23), సీలేరుకి చెందిన మఠం వేణుకృష్ణారావు(24). దారకొండకి చెందిన కొండ్రు హరి(45), గుమ్మిరేవులకి చెందిన నాయిని నర్సింహారావు, ఏబులం గ్రామానికి చెందిన వెంకటేష్, నర్సింగ్, సుబ్బులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సంఘటన తెలుసుకున్న సి.ఐ. రామకృష్ణ క్షతగాత్రులను చింతపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అలాగే వంతల సురేంద్ర మృతదేహాన్ని చింతపల్లి ఆసుపత్రికి తరలించారు. ఇటీవల గిరిజన సహకార సంస్థలో ప్రైవేట్ డ్రైవర్‌గా చేరిన సురేంద్ర మృతి చెందడంతో సంస్థ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘటన జరిగిన సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని బోరున విలపించారు. మృతుడు సురేంద్రకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిని పోషించుకునేదెలా అని భార్య బోరున విలపించడం అక్కడి వారిని కలిచివేసింది. కాగా ఈ సంఘటన జరిగిన దృశ్యం పలువురిని ఆందోళన కలిగించింది. ఈ ప్రదేశంలో గతంలో ఎప్పుడూ ఇటువంటి ప్రమాదాల జరుగలేదు. వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు చెట్టును తప్పించబోయి అటుగా వస్తున్న వ్యాన్‌ను ఢీకొంది.

అరకోటి విలువచేసే గంజాయి స్వాధీనం
* ఐదుగురు నిందితుల అరెస్ట్
గూడెంకొత్తవీధి, సీలేరు, ఆగస్టు 16: ఒడిషా నుండి ఢిల్లీకి అక్రమంగా తరలిస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను జి.కె.వీధి పోలీసులు పట్టుకున్నారు. ముందుస్తు సమాచారం మేరకు సప్పర్ల ప్రాంతం నుండి ఢీల్లీకి ఓ.ఆర్.09ఇ8166 నెంబరు గల లారీలో తరలిస్తున్న సుమారు 550 కేజీల గంజాయిని జి.కె.వీధి సి.ఐ. రామకృష్ణ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. 220 బ్యాగుల్లో 550 కేజీలను సీలేరు ప్రాంతానికి చెందిన కిముడురాజు, ఒడిషా ప్రాంతానికి చెందిన వంతల రామస్వా మి, పింటు మజ్జి,దారకొండ గ్రామానికి చెందిన కిల్లో ప్రసాద్, రెడ్డి ఉదయ్‌కుమార్‌లను గంజాయి తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత వారంరోజులుగా ఒడిషా ప్రాంతంలో పైఐదుగురు గంజాయిని సేకరించి పాలథిన్ కవర్లలో ప్యాక్ చేశారు. దీనిని కాలినడకన ఒడిషా నుండి సప్పర్ల ప్రాంతానికి తీసుకువచ్చారు. అక్కడి నుండి ఒడిషా నెంబర్‌తో కూడిన లారీలో 220 బ్యాగుల్లో నింపి ప్యాకింగ్ చేసి లోడ్ చేశారు. దీనిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోగా, ఈవిషయం తెలుసుకున్న కొందరు అజ్ఞాత వ్యక్తులు గూడెంకొత్తవీధి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో జి.కె.వీధి సి.ఐ. రామకృష్ణ తన సిబ్బందితో గూడెంకొత్తవీధిలో మాటు వేశారు. బుధవారం అర్ధరాత్రి నర్సీపట్నం వైపునుండి ఢిల్లీకి వెళ్ళేందుకు లారీ బయలు దేరడంతో గూడెంకొత్తవీధిలో పోలీసులు పట్టుకుని ఐదుగురు నిందితులతోపాటు 550 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపిస్తున్నామని సి.ఐ. రామకృష్ణ తెలిపారు. ఈ గంజాయి విలువ సుమారు అరకోటికిపైగా ఉంటుందని పోలీసు అధికారులు చెబుతున్నారు.

* చీఫ్ సెక్రటరీకి కలెక్టర్ ఫిర్యాదు? * రాజధాని చేరిన రామాంజనేయులు * పంద్రాగస్ట్ వ్యవహారంపై మంత్రి గంటా సీరియస్
english title: 
controversy

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>