Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

చిన్నపిల్లల ఆసుపత్రిని శ్మశానవాటికగా మారుస్తున్న పాపం కిరణ్ సర్కార్‌దే

$
0
0

తిరుపతి, ఆగస్టు 16: చిన్నపిల్లల ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా తిరుపతి రుయాసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని శ్మశాన వాటికగా మారుస్తున్న పాపం కిరణ్ సర్కార్‌దేనని తిరుపతి ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. గురువారం రాజంపేటకు చెందిన 3 రోజుల పసికందు మృతి చెందింది. దాడు. మరో ఇద్దరు మరణించారని ప్రచారం జరిగిన నేపధ్యంలో ఎమ్మెల్యే ఆసుపత్రి ముందు బాలుడి మృతదేహంతో గురువారం మరోమారు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పిల్లల మరణాలు ఆగిపోవాలంటే ప్రభుత్వం తక్షణం స్పందించి వందకోట్ల రూపాయల నిధులు కేటాయించి, మరిన్ని అధునాతన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి పేరుతో ఆర్భాటంగా ఆసుపత్రిని ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందుకు తగిన సిబ్బందిని ఏర్పాటు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. 40 మంది వైద్యులు అవసరం ఉన్న ఆసుపత్రిలో కేవలం 12 మంది మాత్రమే ఉన్నారంటే ప్రభుత్వ నిర్లక్ష్యం ఏపాటిదో ఇట్టే అర్థమవుతోందన్నారు. ఈ మరణాలకు పూర్తి స్థాయి బాధ్యత డాక్టర్లదేనని జరుగుతున్న వాదన సరికాదన్నారు. ప్రధానంగా సిబ్బందిని నియమించాల్సిన ప్రభుత్వం మొద్దునిద్రలో ఉండటమే ఇందుకు కారణమన్నారు. అందుకే ఈ మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. జరిగిన మరణాలపై కూడా ఒక కమిటీతో విచారణ జరిపించి వాస్తవాలను నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు. మానవ హక్కుల సంఘానికి కూడా ఈ సంఘటనపై ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పిల్లల ప్రాణాలను కాపాడటంలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దాల్సిన ఆసుపత్రి పిల్లల ప్రాణాలను తీయడంలో ఆదర్శవంతంగా కనపడుతోందన్నారు. చిన్నపిల్లలకు, గర్భిణులకు అవసరమైన ఎంత విలువైన మందులను అయినా ఉచితంగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా చిన్నపిల్లలు ఇక్కడ మరణిస్తే వారిని వారి స్వగ్రానికి పంపేందుకు ఉచిత రవాణా సౌకర్యాలను కూడా ప్రభుత్వమే కల్పించాలని లేని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా రుయాసుపత్రి అభివృద్ధి నిధులు 20 లక్షల రూపాయలను కేటాయిస్తామని టిటిడి ఇఓ చెప్పడం చిన్నపిల్లల ఆసుపత్రి అభివృద్ధికోసం కాదని, ఇప్పటి వరకూ ఆసుపత్రికి వినియోగించిన ఆక్సిజన్ ఫ్లాంట్ బకాయిలకోసమేనని ఆయన తెలిపారు. అయితే అది అభివృద్ధి కోసమేనన్న గొప్పగా అధికారులు చెపుతుండటం బాధాకరమన్నారు. ఇది కేవలం మసిపూసి మారేడు కాయ చేయడమేనని నిప్పులు చెరిగారు. గురువారం నాటికి 680 మంది చిన్నపిల్లలు చనిపోయినట్లు అధికారికంగా రికార్డులు ఉన్నాయంటే ఈ ఆసుపత్రి ఎంత దయనీయ స్థితిలో ఉందో అర్థమవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బిడ్డను కూడా చూడనివ్వలేదు
- మృతుని తల్లిదండ్రుల ఆవేదన
బిడ్డ పుట్టిన మరుక్షణం బరువు తక్కువ ఉందంటూ ప్రసూతి ఆసుపత్రి నుండి చిన్నపిల్లల ఆసుపత్రికి తీసుకువచ్చారని, బిడ్డ ముఖం చూస్తామని కోరినా సిబ్బంది కఠినంగా వ్యవహరించారని మృతి చెందిన చిన్నారి తల్లిదండ్రులు రాజంపేటకు చెందిన వెంకటరమణ, యానాదమ్మ కన్నీరు మున్నీరుగా విలపించారు. లేకలేక తమకు ఒక బిడ్డ జన్మించాడనే సంతోషాన్ని చిన్నపిల్లల ఆసుపత్రి సిబ్బంది క్షణాల్లో మాయం చేశారని వెక్కివెక్కి ఏడ్చారు. తమ బిడ్డ బాగుంది..బాగుంది అని చెపుతూనే చివవరకూ శవాన్ని తీసుకువచ్చి చేతిలో పెట్టారని కన్నీటిపర్యంతమయ్యారు.
వైఎస్‌ఆర్‌సి పార్టీవి శవరాజకీయాలు- మంత్రి గల్లా
చిన్నపిల్లల శవాలతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి గల్లా అరుణకుమారి నిప్పులు చెరిగారు. గురువారం ఉదయం రుయాలో చిన్నపిల్లల ఆసుపత్రిని ఆమె సందర్శించారు. అక్కడ పరిస్థితిని సమీక్షించారు. సాయంత్రం రుయాసుపత్రిలో జిల్లా కలెక్టర్, టిటిడి ఇఓ, మున్సిపల్ కమిషనర్, ఆర్‌డిఓ, రుయా డాక్టర్లతో సమావేశమయ్యారు. రుయాలో జరిగిన సమావేశంలో మీడియాను కూడా అనుమతించలేదు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసుపత్రిలో వాటర్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో నీటి కొరత ఉన్నట్టు గుర్తించామన్నారు. సమస్య పరిష్కారానికి నీటిని ట్యాంకర్లతో సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. త్వరలోనే 20 మందిని పారామెడికల సిబ్బందిని అవుట్ సోర్సింగ్ విధానంతో నియమించనున్నట్లు తెలిపారు. సెక్యూటిరిని పెంచి పిల్లల సత్కరించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డికి అవమానం
తిరుపతి చిన్నపిల్లల ఆసుపత్రిలో జరుగుతున్న మరణాలపై స్పందించి ఆందోళనకు దిగిన ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డిని గురువారం రుయాసుపత్రిలో మంత్రి గల్లా నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశానికి కనీసం ఆహ్వానించకుండా అవమానపరిచిన సంఘటన జరిగింది. ఈ సమావేశంపై ఆయనకు అధికారులు సమాచారం ఇవ్వలేదని తెలిసింది. ఆదే విషయంపై భూమన్ కరుణాకర్‌రెడ్డి కూడా ప్రభుత్వంపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇందుకు సంబందించి ఇరువర్గాల నుండి భిన్నమైన వాదనలు వినిపించాయి. తాము సమాచారం అందించినా ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి హాజరు కాలేదని మంత్రి గల్లా అరుణకుమారి తెలిపారు. రాజకీయ లబ్ధికోసం ఆయన శవ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదిలావుండగా తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 24 గంటల్లో 11 మంది పిల్లలు మరణించడంతో ప్రభుత్వ ప్రతిష్ఠ దిగజారిందని , ఈవిషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి మంత్రి గల్లా అరుణకుమారి తంటాలు పడుతున్నారని ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. తాను ధర్నా చేశానని అదేదో తనకు రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసమేనన్న అసత్యాన్ని ప్రచారం చేయడం కోసం మంత్రి దిగజారుడు ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంత మంది చనిపోయినా ఇక్కడ అంతా బాగుందని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంటే ఇంతకు మించిన దిగజారుడు తనం మరొకటి లేదని ఆయన నిప్పులు చెరిగారు.

సిబ్బంది కొరత వాస్తవమే
* సెలవులో ఆరుగురు వైద్యులు
* ప్రభుత్వానికి కలెక్టర్ నివేదిక
తిరుపతి, ఆగస్టు 16: తిరుపతి చిన్నపిల్లల ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత ఉన్నమాట వాస్తవమేనని, ఐదుగురు పిల్లలు మరణించిన బుధవారం 8 మంది డాక్టర్లు విధుల్లో ఉండాల్సి ఉండగా ఆరుగురు సెలవుల్లో వెళ్లారని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజు ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం. అంతేకాకుండా ఆక్సిజన్ ప్లాంట్‌ను కూడా అభివృద్ధి పరచాలని, మరిన్ని అధునాతమైన పరికరాలను, ప్రధానంగా టెక్నీషియన్లను, నర్స్‌లను, ఎఎన్‌ఎంను, వైద్యులను నియమించాల్సిన అవసరం ఉందని ఆయన తన నివేదికలో తెలిపినట్లు తెలిసింది.

ఇందిరమ్మ ఇళ్ళపై సమగ్ర సర్వే నిర్వహించాలి
కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ ఆదేశం
కలికిరి , ఆగస్టు 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ పథకంలో భాగంగా మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలపై పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ ఆదేశించారు. గురువారం స్థానిక సిఎల్‌ఆర్సీ కార్యాలయంలో జిల్లా, నియోజకవర్గపు స్థాయి అధికారులతో సమీక్షా సమావేశాన్ని డిసిసి ఉపాధ్యక్షుడు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వివిధ దశల్లో నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్ళపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అందుబాటులో ఉండే సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రబలుతున్న జ్వరాలపై సర్వే నిర్వహించి అక్కడే వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అర్హులకు దీపం పథకం కింద వంట గ్యాస్, పెన్షన్ పంపిణీ చేయాలన్నారు. రేషన్‌కార్డులు లేనివారి జాబితాను సిద్ధం చేయాలన్నారు. రాజీవ్ యువకిరణాలు పథకం కింద ప్రతి మండలంలో 20వ తేదీ జాబ్‌మేళా నిర్వహించాలన్నారు. కామధేను పథకంలో అర్హులను గుర్తించి అక్టోబరులోగా జాబితాను పూర్తి చేయాలన్నారు. జురికోన ప్రాజెక్టు తాగునీటి పైపులైను పనులు వేగవంతం చేయాలని అన్నారు. ఉద్యాన శాఖ పథకం కింద మూడు గ్రామాలను ఎంపిక చేయాలన్నారు. ఈ సమావేశలో మదనపల్లె సబ్‌కలెక్టర్ వినయ్‌చంద్, డిఆర్‌డిఏ పిడి అనిల్‌కుమార్‌రెడ్డి, ఆర్వీఎం పిఒ మహేశ్వర్‌రెడ్డి, పడా ప్రత్యేకాధికారి పెంచల్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ శ్రీనివాసులురెడ్డి, ఇఇలు, డిఇలు, ఐకెపి ఎపిఎం, సిసిలు, ఎస్పీ హెచ్‌ఒలు, ఎంపిడిఒలు, తహశీల్దార్‌లు, ఎస్సై సోమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

వాహనం సహా ఎర్రచందనం పట్టివేత
పుత్తూరు, ఆగస్టు 16: పుత్తూరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలో గురువారం చేసిన దాడుల్లో వాహనంతో సహా ఎర్రచందనం పట్టుకున్నట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి నాగరాజు తెలిపారు. ఈసందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తమకు అందిన రహస్య సమాచారం మేరకు పిచ్చాటూరు ఫారెస్ట్ సెక్షన్ అధికారి బాలసుబ్రమణ్యంరాజు, సెక్షన్ సిబ్బందితో కలసి వెగళత్తూరు ఆరె చెరవు సమీపంలో తనిఖీ చేయగా వాహనంలో ఉన్న ముగ్గురు పారిపోయినట్లు చెప్పారు. అందులో ఇద్దరిని తమ సిబ్బంది గుర్తు పట్టారని, వారిలో మారప్పరెడ్డికండ్రిగ గ్రామంలోని రామకృష్ణ (చిన్నబ్బ), బాలయ్యగా గుర్తించినట్లు వివరించారు. వారు పరారీలో ఉన్నందున కేసు నమోదు చేసి త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. వాహనంలో 514 కేజీల బరువుగల 19 ఎర్రచందనం దుంగలు ఉన్నాయని, వాహనంతో కలిపి సుమారు 3లక్షల రూపాయల విలువ ఉంటుందన్నారు. ఈమేరకు కేసు నమోదు చేశామని, ఇందుకు సహకరించిన వారికి ఆయన అభినందనలు తెలిపారు.

తూతూ మంత్రంగా అసైన్‌మెంట్ కమిటీ సమావేశం
* సమాచారం లేదంటున్న సభ్యులు
* అధికారులే మమ అనిపించారు
తిరుపతి, ఆగస్టు 16: చంద్రగిరి నియోజకవర్గం అసైన్‌మెంట్ కమిటీ సమావేశం తూతూ మంత్రంగా సాగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఆరవ విడత భూ పంపిణీ నేపధ్యంలో చంద్రగిరి నియోజకవర్గ అసైన్‌మెంట్ కమిటీ సమావేశం తూతూ మంత్రంగా గురువారం ఆర్‌డిఓ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి హాజరు కావాల్సిన అసైన్‌మెంట్ కమిటీ సభ్యులు, సిపిఐ నేత రామానాయుడు, సిపిఎం నేత పురుషోత్తంరెడ్డి, పాకాలకు చెందిన రామాంజనేయులు డుమ్మా కొట్టారు. వీరిని ప్రశ్నించగా తమకు సమాచారం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కమిటీ చైర్మన్‌గా వున్న మంత్రి గల్లా అరుణకుమారి, మదనపల్లి సబ్ కలెక్టర్ హరికిరణ్, ఆర్‌డిఓ రామచంద్రారెడ్డిలు ఆయా మండలాల తహసీల్దార్లతో తూతూ మంత్రంగా సమావేశం నిర్వహించి మమ అనిపించారు. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, రామచంద్రారపురం, చంద్రగిరి మండలాల్లో భూ పంపిణీ కార్యక్రమాన్ని పట్టణ ప్రాంతాలు, పట్టణ పరిసర ప్రాంతాలుగా నిర్ణయించి భూపంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేశారు. కాగా చిన్నగొట్టిగల్లు, పాకాల, ఎర్రావారిపాళెం మండలాల్లో మాత్రమే ఈ భూ పంపిణీని చేపట్టనున్నారు. ఇందులో చిన్నగొట్టిగల్లు మండలంలో ఎస్సీలకు 7 మందికి 11.97 ఎకరాలు, ఎస్‌టిలకు 5 మందికి 6.71 ఎకరాలు, బీసిలకు 13 మందికి 20.15 ఎకరాలు, మైనార్టీలు 10 మందికి 14.78 ఎకరాలు, ఒసిలు 8 మంది లబ్ధిదారులకు 14.19 ఎకరాలు కేటాయించినట్లు తహసీల్దార్ రాగోపాల్ మంత్రి గల్లాకు వివరించారు. అలాగే పాకాలలో 26 మంది లబ్ధిదారులకు 47.7 ఎరాలను కేటాయించారు. అయితే ఎవ్వరు నిజమైన లబ్ధిదారులో తమకు ముందుగా సమాచారం ఇచ్చి, వివరాలు ఇస్తే తాము సమావేశంలో ప్రశించే అవకాశం వుంటుందన్నారు. కనీసం సమాచారం కూడా తమకు లేదని సభ్యులు రామానాయుడు ఆరోపించారు. ఇది భూ పంపిణీ కాదని అధికార కాంగ్రెస్ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చే పంపిణీ కార్యక్రమమని విమర్శించారు.

ముక్కంటి సేవలో రాయలసీమ డిఐజి
ఏర్పేడు, ఆగస్టు 16: పవిత్ర పుణ్యక్షేత్రం, దక్షిణ కాశీగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రమంటే ఎంతో ఇష్టమని రాయలసీమ డిఐజి ఠాగూర్ అన్నారు. కుటుంబ సభ్యులతో కలసి గురువారం ఆయన శ్రీకాళహస్తీశ్వరుని దర్శానార్థం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక శైలిలో మార్పులు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ అభిషేకం, పోలీసు సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆలయ ఇన్‌చార్జి ఇఓ కస్తూరి, ఎసి కోదండరామిరెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల తీర్థప్రసాదాలను, స్వామిఅమ్మవార్ల జ్ఞాపికను అందించారు. ఈకార్యక్రమంలో ఆలయ అధికారులు సుదర్శన్, లక్ష్మయ్య, హరియాదవ్ తదితరులు పాల్గొన్నారు.

డిఎస్సీకి 18,955 మంది: డిఆర్‌ఓ
చిత్తూరు, ఆగస్టు 16: జిల్లాలో ఈనెల 26, 27వ తేదీల్లో జరుగు టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(డిఎస్సీ) పరీక్షకు 18,955 మంది హాజరవుతున్నట్లు జిల్లా రెవిన్యూ అధికారి ఒంగోలు శేషయ్య తెలిపారు. గురువారం ఆయన వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. ఈసందర్భంగా డిఆర్‌ఓ మాట్లాడుతూ 18,955 మంది అభ్యర్థుల కోసం తిరుపతిలో 45 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. డిఎస్సీ సజావుగా నిర్వహించేందుకు పలు సూచనలు అందించారు. ఇందులో 26వ తేదీన స్కూల్ అసిస్టెంట్ ల్యాంగ్‌వేజ్ పరీక్షలు ఉదయం 10నుంచి 12.30గంటల వరకు జరుగుతుందన్నారు. ఇందుకోసం 14సెంటర్లను ఎంపిక చేశామని 3,658 మంది పరీక్షకు హాజరవుతారని తెలిపారు. అలాగే స్కూల్ అసిస్టెంట్ నాన్ ల్యాంగ్‌వేజ్ పరీక్షలు మధ్యాహ్నం 2నుండి 4.30గంటల వరకు జరుగుతుందన్నారు. ఈపరీక్షలు 45కేంద్రాల్లో జరుగుతాయని, 11,733 మంది హాజరవుతారని చెప్పారు. 27వ తేది ఉదయం 10నుంచి 12.30గంటల వరకు జరిగే ఎస్‌జిటి పరీక్షలకు 8పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని ఇందులో 2,036మంది హాజరవుతారన్నారు. అలాగే మధ్యాహ్నం 2నుంచి 4.30గంటల వరకు జరిగే ల్యాంగ్‌వేజ్ పండిట్ పరీక్షలకు ఆరు కేంద్రాల్లో 1,525మంది హాజరవుతున్నారన్నారు. పరీక్షా కేంద్రాల్లో 15మంది ఎస్సైలు, 15మంది ఆర్మ్‌డ్‌గార్డ్‌లను నియమించినట్లు చెప్పారు. పరీక్ష జరిగే రెండు రోజులు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి తిరుపతికి అభ్యర్థులు చేరుకొనేటట్లు బస్సు సౌకర్యం ఉదయం ఐదు గంటల నుంచి కల్పించాలని ఆర్టీసీ అధికారులను సూచించారు. పరీక్షలు జరుగు రోజుల్లో సెంటర్ల ప్రాంతాల్లో 144సెక్షన్ అమలులో వుంటుందని, అన్ని జిరాక్స్‌సెంటర్లు మూసివేస్తామని చెప్పారు. 26, 27తేదీల్లో ఉదయం ఆరు నుంచి రాత్రి 9వరకు తిరుపతిలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీటి సరఫరా కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ను కోరారు. ఈసమావేశానికి విద్యాశాఖ, వైద్య ఆరోగ్యశాఖ, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు హాజరయ్యారు.

చంద్రబాబు పర్యటనతో కార్యకర్తల్లో మనోధైర్యం నిండేనా?
* పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం
కుప్పం, ఆగస్టు 16: రాష్ట్రంలో ఏర్పడ్డ రాజకీయ పరిస్థితుల కారణంగా కుప్పంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితిని మెరుగుపర్చి కార్యకర్తల్లో మనోధైర్యం నింపేలా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన జరగబోతుందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా కుప్పంలో మాత్రం పార్టీకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్న రీతిలో క్యాడర్‌ను ఉత్సాహ పరిచేలా నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గ పరిధిలోని శాంతీపురం, రామకుప్పం మండలాల్లో వైఎస్సార్‌సిపి శరవేగంగా పుంజుకుంటోంది. తెలుగుదేశంపార్టీకి కంచుకోటగా వున్న గుడుపల్లె, కుప్పం మండలాల్లో సైతం ఇప్పుడిప్పుడే చాపకిందనీరులా వైఎస్సార్‌సిపి పుంజుకుంటోంది. ఇదే సమయంలో వైఎస్సార్‌సిపి తరపున బలమైన నాయకులు లేని కారణంగా పలువురు కార్యకర్తలు అటు వైపు వెళ్లేందుకు కాస్త వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చేపట్టిన పలు ప్రజాఅభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులైన కుప్పం ప్రజలు ఇప్పటికే ఆపార్టీ వైపు పరుగులు తీస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు నియోజకవర్గ పరిధిలోని మారుమూల ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు చంద్రబాబునాయుడు ఫొటో ఉండడం ఆనవాయితీగా ఉండేది. అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా ప్రతి ఇంటిలోనూ దివంగత నేత వైఎస్సార్ ఫొటో కనబడడం ఆపార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్‌సిపిలోకి వలసలు జరుగుతున్నప్పటికీ పైపైన మాత్రం తమ పార్టీకి ఎలాంటి ఢోకా లేదని టిడిపి నాయకులు అంటున్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా నియోజకవర్గ పరిధిలో ఏర్పడ్డ పరిణామాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటున్న కుప్పం ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎట్టకేలకు కుప్పం ప్రజలతో మమేకమై వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. సమస్యలు, ఇతర కార్యక్రమాలను పక్కన పెట్టి కేవలం నియోజకవర్గ పరిధిలో పార్టీని బలోపేతం చేసేందుకే గ్రామీణ స్థాయి నుంచి ప్రతి ఒక్కరితోనూ ఆయన ముఖాముఖి మాట్లాడే అవకాశం లేకపోలేదు. మొత్తం మీద ఈసారి చంద్రబాబునాయుడు పర్యటన సక్సెస్ చేసేందుకు స్థానిక నేతలు రేయింబవళ్లు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.

వైద్యం వికటించి వివాహిత మృతి
* కేసు నమోదు
తవణంపల్లె, ఆగస్టు 16: జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లిన వివాహిత వైద్యం వికటించి మృతి చెందిన సంఘటన మండలంలోని జొన్నగురకల గ్రామంలో చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబీకుల కథనం ప్రకారం జొన్నగురకుల గ్రామానికి చెందిన మొగిలమ్మ(45) ఈనెల 13న ఉదయం చలి, జ్వరంతో చికిత్స నిమిత్తం అరగొండలోని ఒక ఆసుపత్రిలో డాక్టరును సంప్రదించగా ఇంజక్షన్ చేసి మాత్రలు ఇచ్చాడు. అనంతరం ఆమె ఇంటికి వెళ్లగా తిరిగి అస్వస్థతకు గురి కావడంతో మళ్లీ అదే క్లీనిక్‌కు తీసుకొచ్చారు. ఆమెను పరీక్షించిన డాక్టరు మరో ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అక్కడ డాక్టర్లు ప్రాథమిక చికిత్సలు చేయించి వేలూరుకు తరలించారు. అక్కడ చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమంగా మారడంతో వైద్యుల సూచన మేరకు చెన్నైకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. దీంతో మొదట వైద్యం చేసిన డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే తమ తల్లి మృతి చెందిందని మృతురాలి కుమారుడు మురళి తవణంపల్లె పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లిన మొగిలమ్మ మృతదేహానికి పంచనామా నిర్వహించి అనంతరం పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టరు ప్రస్తుతం పరారీలో వున్నాడు.

* ఎమ్మెల్యే భూమన్ నిప్పులు * వంద కోట్లు నిధులు కేటాయించాలని డిమాండ్ * 24 గంటల తరువాత శవాన్ని అప్పగించారని ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఆరోపణ
english title: 
childrens hospital

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>