గుంటూరు, ఆగస్టు 16: గుంటూరు నగర పరిధిలో ఇళ్లస్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పరిష్కారం చూపేలా అధికారులు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. గురువారం ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో వివిధ అంశాలపై అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఇప్పటివరకూ ఇళ్లస్థలాల కోసం 29,800 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం లబ్ధిదారులకు స్థలం కేటాయింపు కుదరదని, అయితే వారికి జిప్లస్ 3 గృహాలు నిర్మించేందుకు అవకాశముందన్నారు. ఇందుకుగాను 120 ఎకరాల భూమి అవసరం కాగా ప్రస్తుతం 75 ఎకరాల భూమిని గుర్తించినట్లు చెప్పారు. ఈ 75 ఎకరాల్లో జిప్లస్ 3 నిర్మాణాలు చేపట్టినట్లయితే దాదాపు 15 వేల మంది దరఖాస్తు దారులకు జిప్లస్ 3లో గృహ సదుపాయం కల్పించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయమై అప్పటికప్పుడు మంత్రి గృహనిర్మాణశాఖ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశంతో సంప్రదింపులు జరిపారు. అనంతరం మంత్రి కన్నా మాట్లాడుతూ గుర్తించిన 75 ఎకరాలలో జిప్లస్ 3 నిర్మాణాలు ఏ పథకం కింద నిర్మించాలనే విషయాన్ని ముఖ్య ఇంజనీర్‌తో చర్చించి, ఆ విషయాన్ని రెండు రోజుల్లోగా తెలియజేస్తామని ఎండి తెలిపినట్లు మంత్రి వివరించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి ఇళ్ల నిర్మాణాల గురించి సమాచారాన్ని అందజేయాలన్నారు. ఇందుకు గాను దరఖాస్తుతో పాటు ఒక కరపత్రాన్ని కూడా పంపించాలని సూచించారు. సంబంధిత కరపత్రంలో జి ప్లస్ 3 గృహ నిర్మాణంలో బ్యాంకుల వాటా, ప్రభుత్వ సబ్సిడీ, లబ్ధిదారుడి వాటాపై పూర్తి వివరాలు ఉండేలా చూడాలని కోరారు. దరఖాస్తు దారులు ఇళ్లనిర్మాణానికి అంగీకారం తెలియజేసినట్లయితే ఐరీష్ విధానంలో క్రమపద్ధతిలో సంబంధిత దరఖాస్తులు ఉన్నాయో లేదో చూడాలని సూచించారు. లబ్ధిదారుల్లో ఎవరైతే ముందు వస్తారో వారికి ప్రాధాన్యతనివ్వాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో మిర్చి రీసెర్జ్ సెంటర్ ఎక్స్‌టెన్షన్‌కు 13వ ప్రణాళికలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర, వ్యవసాయ పరిశోధనా కేంద్రం అంగీకరించినట్లు తెలిపారు. నిజామాబాద్‌లో పసుపు పరిశోధనా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినట్లు సంస్థ డైరెక్టర్ అంగీకరించినట్లు మంత్రి కన్నా పేర్కొన్నారు. గుంటూరు మండలాన్ని అర్బన్, రూరల్ మండలాలుగా విభజించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గుంటూరు మండలం కార్పొరేషన్‌లో కలిసి ఉండటంవల్ల తహశీల్దార్లకు పనిఒత్తిడి ఎక్కువగా ఉండటమే కాకుండా వివిధ సర్ట్ఫికెట్లను జారీ చేసే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. గుంటూరు మండలాన్ని రెండుగా విభజించడం వల్ల పరిపాలనా సౌలభ్యంతో పాటు ప్రజలకు సత్వర సేవలు అందుతాయని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎన్ యువరాజ్, గృహనిర్మాణ శాఖ పిడి, కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఓవర్ బ్రిడ్జి నిర్మాణ స్థలం మార్చాలని
జాతీయ రహదారిపై రాస్తారోకో
మంగళగిరి, ఆగస్టు 16: మంగళగిరి బైపాస్ రోడ్డు కూడలిలో జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా మంగళగిరి - తెనాలి రోడ్డు మార్గంలో నిర్మించ తలపెట్టిన ఫ్లై ఓవర్ బ్రిడ్జిని మార్చి గుంటూరు - విజయవాడ మార్గంలో నిర్మించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, బిజెపి, టిడిపి, సిపిఐ, లోక్‌సత్తా పార్టీల ఆధ్వర్యాన గురువారం జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. తహశీల్దార్ సాయిబాబు, సిఐ మురళీకృష్ణ, ఎస్సై రవిబాబు సంఘటనా స్థలికి చేరుకుని రాస్తారోకో నిర్వాహకులను పక్కకు తప్పుకోవాలని, వాహనాలు నిలపటం తగదని కోరారు. దీంతో కొద్దిసేపు అధికారులకు, నిర్వాహకులకు వాగ్వివాదం జరిగింది. జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ సమస్యను తీససకు వెళ్ళారని, కొన్ని రోజులపాటు పనులు కూడా నిలిపి వేస్తారని తహశీల్దార్ పేర్కొన్నారు. సుమారు 2 గంటల పాటు రహదారిని దిగ్బంధించాలని వచ్చిన ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు కేసులు నమోదు చేస్తామని, అరెస్ట్‌లు తప్పవని పోలీసులు హెచ్చరించడంతో కేవలం 15 నిమిషాల్లోనే రాస్తారోకో విరమించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు రావుల శివారెడ్డి, కూరపాటి మురళీరాజు, బిజెపి నాయకుడు మునగపాటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు జంజనం భిక్షారావు, రామనాధం పూర్ణచంద్రరావు, హేమసుందరరావు, టిడిపి నాయకులు నందం అబద్దయ్య, గుత్తికొండ ధనుంజయరావు, వెలగపాటి విలియం, లోక్‌సత్తా నాయకుడు బుల్లా వేణు తదితరులు మాట్లాడుతూ తెనాలి - మంగళగిరి మార్గంలో బ్రిడ్జి నిర్మించడం వలన ప్రజలు ఇబ్బంది పడతారని, తక్షణం డిజైన్ మార్చాలని లేకుంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యే కాండ్రు కమల ఆయా పార్టీల నేతలతో సమావేశమయ్యారు.
ఈ బ్రిడ్జి నిర్మించడం వలన ప్రజలు ఇబ్బంది పడతారని, ఇప్పటికే మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ద్వారా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళామని, ఫలితం లేకపోవడంతో ఆందోళన జరపాల్సి వచ్చిందని ఎమ్మెల్యే అన్నారు.
బాలికపై అత్యాచారయత్నం, హత్య
* ప్రేమోన్మాది ఘాతుకం
దాచేపల్లి, ఆగస్టు 16: దాచేపల్లి మండలం శ్రీనగర్ గ్రామంలో బండి త్రివేణి (12) అనే బాలికపై 20 సంవత్సరాల పాలిటెక్నిక్ విద్యార్థి అత్యాచారయత్నం చేసి హత్య చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీనగర్ గ్రామానికి చెందిన బండి త్రివేణిని అదే గ్రామానికి చెందిన 20 సంవత్సరాల యువకుడు కొంత కాలంగా ప్రేమిస్తున్నాని వెంట పడుతున్నాడు. అయితే అతని ప్రేమను బాలిక నిరాకరించడంతో గురువారం రాత్రి బాలికపై అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. అయితే బాలిక ప్రతిఘటించడంతో బాలికను గోడకేసి కొట్టి హత్య చేశాడు. సంఘటనా ప్రాంతానికి గురజాల డిఎస్‌పి గిరిధరరావు సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వృద్ధుల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం
గుంటూరు , ఆగస్టు 16: దేశ జనాభాలో 18 శాతంకు పైగా ఉన్న వృద్ధుల సంక్షేమంపై సాచివేత ధోరణులు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ కాన్ఫడరేషన్ గౌరవ అధ్యక్షుడు జెపి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఆప్ స్కాన్, రాష్టశ్రాఖ పిలుపుమేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 70 శాతం వృద్ధుల సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో స్థానిక పెన్షనర్స్ హోమ్ నుండి ఊరేగింపుగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం అరండల్‌పేట మెయిన్‌రోడ్డు, శంకర్‌విలాస్ బ్రాడీపేట మీదుగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జెపి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 2002లో మాడ్రిడ్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో వృద్ధుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, కేంద్రప్రభుత్వం తెలిపి అనంతరం 5 సంవత్సరాల తర్వాత వృద్ధుల సంక్షేమ చట్టం చేసిందన్నారు. చట్టం చేసి ఐదేళ్లు అవుతున్నా అమలులో చిత్తశుద్ధి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కాన్ఫడరేషన్ ఉపాధ్యక్షుడు కల్లూరి మురళీధర్‌రావు మాట్లాడుతూ పేద వృద్ధులకు పెన్షన్ 2 వేల రూపాయలు ఇవ్వాలని, ఆర్‌టిసిలో 50 శాతం ప్రయాణ రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పెన్షనర్స్ సంఘ అధ్యక్షుడు కె సోమేశ్వరరావు, జిల్లా సీనియర్ సిటిజన్స్ సర్వీసు ఆర్గనైజేషన్ అధ్యక్షుడు ఎన్ తిరుపతయ్య, కాన్ఫడరేషన్ జిల్లా కార్యదర్శి బి కోటేశ్వరరావు, కోశాధికారి నారపరెడ్డి, రాయన్న, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి టివి మోహనరావు, మహిళా సంఘం నాయకులు గద్దె రామతులసమ్మ, జయశ్రీ, విజయలక్ష్మి, ఎం అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌ఆర్‌హెచ్ పాఠశాలలో
60 లక్షల నిధులు గోల్‌మాల్
* యాజమాన్యంపై డిఇఓ ఆగ్రహం
విజయపురిసౌత్, ఆగస్టు 16: నాగార్జునసాగర్‌లోని నాగార్జున రెసిడెన్షియల్ హైస్కూల్‌లో గురువారం జిల్లా విద్యా శాఖ అధికారి డి ఆంజనేయులు అకస్మికంగా తనిఖీలు చేశారు. 60 లక్షల నిధులు గోల్‌మాల్ జరిగినట్లు అధికారులకు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు దాడులు నిర్వహించారు. ఈ పాఠశాలకు ప్రభుత్వం నుండి ఒక్కో విద్యార్థికి 20 వేలు చొప్పున 300 మంది విద్యార్థులు ఉన్నట్లు నిధులు డ్రా చేస్తున్నట్లు తనిఖీలలో వెల్లడైనట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పినె్నల్లి రామకృష్ణారెడ్డి హుటాహుటిన పాఠశాలకు చేరుకున్నారు. వసతుల సరిగా లేకపోవడం పట్ల ఆయన యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది రూపాయలు దుర్వినియోగం అవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని ఎమ్మెల్యే పిఆర్కే అన్నారు. పాఠశాలలో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయి విచారణ జరిపి అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిఇఓ ఆంజనేయులను ఎమ్మెల్యే కోరారు. పాఠశాలకు అనుమతి లేని విషయాన్ని డిఇఒ గుర్తించారు. 2002 నుండి ఆ పాఠశాలలో ప్రధానోపాద్యాయులు లేకపోయినా ఆ పేరుతో నిధులు డ్రా చేస్తున్నా ఎందుకు పట్టించుకోలేదని ఎంఇఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల పరిసరాలను కలియతిరిగిన ఆయన కనీస సౌకర్యాలు లేకపోవడం, బాతురూంలు లేకపోవడంతో యాజమాన్యంపై మండిపడ్డారు. విద్యార్థులను బోజన వసతి గురించి డిఇఒ ఆరా తీయగా తమకు కోడి గుడ్లు పెట్టడం లేదని డిఇఒ దృష్టికి తీసుకువెళ్లారు. ఈయన వెంట ఎంఇఒ కమలాకరరావు తదితరులు ఉన్నారు.
రమణీయ హాస్యలాస్య విన్యాస శోభితం
నర్తకీమణుల అభినయ విన్యాసం
గుంటూరు , ఆగస్టు 16: భారతీయ లలిత కళా ప్రక్రియలన్నింటిలో కూచిపూడి సంప్రదాయ నృత్యశైలికి ఉన్న ప్రాముఖ్యత అక్షరాల్లో అభివర్ణించలేనిది, మాటలలో అభివ్యక్తీకరించలేనిదన్న సత్యం వాస్తవమని కళాప్రపంచం ఏనాడో గుర్తించింది. కూచిపూడి నృత్యానికి అంతర్జాతీయ కీర్తిని, అదేరీతిలో ఖ్యాతిని సముపార్జించిపెట్టిన మహామహులలో అపరసిద్ధేంద్రయోగిగా ప్రసిద్ధిచెందిన పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యంకు స్మృత్యంజలిగా ఈనెల 9వ తేదీ నుంచి బృందావన వెంకన్న సన్నిధిలో శ్రీ సాయిమంజీర కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న మహా మంజీరనాదం, ప్రేక్షక జనావళిని అమితంగా ఆకట్టుకుంటోంది. ఇన్ని రోజులుగా రోజుకు 10 గంటల పాటు నిర్వహిస్తున్న మంజీరనాద వేదికపై విన్యాసాలను కళాప్రియుల ముంగిట ఆవిష్కరించడానికి రాష్ట్రంలోని నలుమూలల నుండి బాల కళాకారుల నుండి కూచిపూడి నాట్యరీతులను తమ జీవితానికి ఆలంబనగా చేసుకున్న నాట్యాచార్యుల వరకు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన శ్రావణమాసం పరిసమాప్తమవుతున్న తరుణంలో చతుర్దశి పుష్యమి నక్షత్ర శుభవేళ వేంకటేశ్వరస్వామివారి పాదాల చెంత 40 మందికి పైగా వర్ధమాన నర్తకీమణులు చేసిన నృత్య విన్యాసాలు నాట్య కళాభిమానులను అబ్బురపర్చాయి. సిద్ధేంద్రయోగి స్వయంగా తాను రూపకల్పన చేసిన భామాకలాపాన్ని పలువురు యువ నర్తకీమణులు అభినయించిన తీరు ఈ అంశంలో వారు చూపిన దరువు, విన్యాసాలు సీనియర్ కళాకారులను ఆశ్చర్యచకితులను గావించాయి. ప్రముఖ నాట్యాచారిణి నిర్మలా విశే్వశ్వరరావు తన శిష్యబృందంతో మహామంజీరనాద వేదికకు తరలివచ్చి నటరాజుకు నృత్యాభిషేకం చేశారు. పుష్పాంజలితో ప్రప్రథమంగా నృత్యార్చనను ప్రారంభించి వరుసగా పదకవితా పితామహుడు రచించిన సంకీర్తనలో శ్రేష్టమైన భావములోనా, భాగ్యమునందున అనే కీర్తనకు, గీతం రామాయణశబ్దం, సకల దేవతాస్తుతి, వినాయకకౌతం, పలుకే బంగారమాయేనా తదితర అంశాలకు నిర్మలా విశే్వశ్వరరావు శిష్యబృందం చూడచక్కనైన రూపలావణ్యాలతో లయాత్మక పదఘట్టనలు మేళవించి బాలాజీ కల్యాణ మండప వేదికపై నయన మనోహర నేత్రాంచల విహారం చేశారు. ఇదిగో భద్రాద్రి, అదిగో చూడండి అంటూ భద్రాద్రిలో కొలువైయున్న సీతారామచంద్రమూర్తుల సన్నిధికి తన అభినయంతో ప్రేక్షక జనావళిని తీసుకెళ్లారు. ముద్దుగారే యశోద, బ్రహ్మమురారీ, వీడేనయ్యా కృష్ణయ్య అనే గీతాలకు జనరంజకమైన నాట్యాభినయం చేసి కళాభిమానుల హర్షధ్వానాలు అందుకున్నారు. దివ్యశ్రీత, వెనె్నల, స్లేహల్, రుచిత, గాయత్రి, బిందు, సన్నిధి, నవ్య, ధరణి, భువన, శ్రీనిజా, హైమావతి, మధుప్రియ తదితరులు పద్మభూషణ్ వెంపటి చినసత్యంకు నృత్యాంజలి సమర్పించారు. ఈ మహామంజీరనాదం కార్యక్రమం ఈనెల 18వ తేదీ రాత్రితో ముగుస్తుందని కార్యక్రమ ప్రధాన సమన్వయకర్త నాట్యాచార్య కాజా వెంకట సుబ్రహ్మణ్యం తెలిపారు. వెంకటేశ్వరస్వామి దేవాలయ పాలకవర్గ సభ్యులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు మహామంజీరనాద ప్రదర్శనావేదికకు విచ్చేసి కళాకారులందరినీ అభినందించారు.
పంట నష్టపరిహారం కోసం రైతుల ఆందోళన
మాచర్ల, ఆగస్టు 16: గత సంవత్సరం పంట నష్టపోయిన బాధిత రైతులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపరిహారం విడుదల చేసింది. దీనికోసం రైతులు పది, పదిహేను రోజుల నుండి బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. పట్టణంలోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ద్వారా మాచర్ల మండల పరిథిలోని 5, 6 గ్రామాలకు చెందిన రైతులకు నష్టపరిహారం అందింది. సుమారు 3 వేల మంది రైతులు లబ్ధిదారులుగా ఉన్నట్లు సమాచారం. వీరందరికీ ఈ రోజు, రేపు అంటూ వాయిదాలు వేస్తూ బ్యాంకు అధికారులు వారిని బ్యాంకు చుట్టూ తిప్పుకుంటున్నారు. గురువారం సుమారు వెయ్యి మంది రైతులు ఒక్కసారిగా బ్యాంకు వద్దకు పాస్ పుస్తకాలు తీసుకుని రావడంతో గేట్లు వేయడం బ్యాంకు సిబ్బంది వంతైంది. రాత్రి వరకు బ్యాంకు సిబ్బంది రైతులకు నష్టపరిహారానికి సంబంధించిన నగదును అందజేస్తూనే ఉన్నారు. దీనిపై అసిస్టెంట్ మేనేజర్ శివారెడ్డి మాట్లాడుతూ ఇటీవల బ్యాంకు మేనేజర్‌తోపాటు సిబ్బంది బదిలీ కావటంతో సాంకేతికంగా కొన్ని పొరపాట్లు జరిగాయని రైతులందరూ ఒక్కసారిగా నగదు కోసం రావడంతో గందరగోళం ఏర్పడిందని తెలిపారు.
ఉరుసు మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
పెదకాకాని, ఆగస్టు 16: మండల కేంద్రమైన పెదకాకానిలోని హజరత్ సయ్యద్ బాజీషాహిద్ అవులియా బాబావారి 524వ ఉరుసు మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దర్గా ముతవల్లిలు తెలిపారు. గురువారం దర్గా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు ఉరుసు మహోత్సవాల ఏర్పాట్లను వివరించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు చాందిని అలంకరణ, రాత్రి 10 గంటలకు బాబావారి గంధాన్ని గుర్రంపై ఊరేగింపుగా బయలుదేరుతుందని తెలిపారు. శనివారం గంధం పంచటం, సలామీ ప్రార్థన, ఆదివారం ప్రసాద వితరణతో పాటు, గొప్ప మిలాద్ జరుగుతుందని చెప్పారు. ఉరుసు మహోత్సవానికి భక్తులు రాష్ట్రం నలుమూలల నుండి పెద్దసంఖ్యలో విచ్చేస్తారని, మహోత్సవానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు.
ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక కమిటీ
* సిసి కెమేరాలతో నిఘా
గుంటూరు , ఆగస్టు 16: నగరంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు నగరపాలక సంస్థ కమిషనర్ కె సుధాకర్ కన్వీనర్‌గా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సురేష్‌కుమార్ తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కమిటీలో నగరపాలక సంస్థ కమిషనర్ సుధాకర్ కన్వీనర్‌గా, నగర ట్రాఫిక్ డిఎస్‌పి, ఆర్టీవో, నగరపాలక సంస్థ ఎస్‌ఇ, ఇన్‌చార్జి సిటీప్లానర్, ఆర్‌అండ్‌బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, విజిటిఎం ఉడా గుంటూరు బ్రాంచ్ పిఒ, ఆర్‌డిఒ సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఈ కమిటీలో జిల్లా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్ సభ్యులు, చిరు వ్యాపారులు ప్రతినిధులుగా ఉంటారని తెలిపారు. నగరంలోని గుజ్జనగుండ్ల, లక్ష్మీపురంలోని మదర్‌థెరిస్సా విగ్రహం, చుట్టుగుంట జంక్షన్, శనక్కాయల ఫ్యాక్టరీ, జిన్నాటవర్, హిమని జంక్షన్, ఏటుకూరు, ట్రావెలర్స్ బంగ్లా, లాడ్జిసెంటర్, ఓల్డ్‌క్లబ్ రోడ్డు, ఆర్టీసీ సబ్‌స్టాండ్ జంక్షన్, బిఆర్ స్టేడియం వంటి 11 ప్రధాన కూడళ్లను అభివృద్ధి చేయాల్సిన అవసరముందన్నారు. వన్ వే ట్రాఫిక్, సిసి కెమేరాల నిఘా ఉంచి ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా అర్బన్ ఎస్‌పి రవికృష్ణ మాట్లాడుతూ నగరంలో 50 కమర్షియల్ కాంప్లెక్స్ సెల్లార్లలో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తుండటాన్ని గుర్తించినట్లు, వాటిని ఖాళీ చేయించి పార్కింగ్ సౌకర్యానికి కృషి చేస్తామన్నారు.
నగరపాలక సంస్థ వారి సౌజన్యంతో కొనుగోలు చేసిన ఐదు బ్రీత్ ఎనలైజర్ల ద్వారా గత నెలలో 400 వాహనాలను సీజ్ చేశామని తెలియజేశారు. ట్రాఫిక్ ఆంక్షలను అధిగమించిన వారి నుండి 2 కోట్ల రూపాయల అపరాధ రుసుం కింద వసూలు చేశామని తెలిపారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు అవసరమైన పరికరాలను కొనుగోలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. దీనికి ప్రజలు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ డిఎస్‌పి విజయభాస్కరరెడ్డి, ఆర్‌డిఒ రఘునాధ్, జిఎంసి ఎస్‌ఇ ఆదిశేషు, డిప్యూటీ సిటీప్లానర్ విజయ్‌కుమార్, అసిస్టెంట్ సిటీప్లానర్, రవీందర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బి ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్ సతీష్, విజిటిఎం ఉడా గుంటూరు బ్రాంచ్ పిఒ రామయ్య, ఆర్‌డిఒ వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.
31న గుంటూరు బార్ ఎన్నికలు
* నోటిఫికేషన్ విడుదల
గుంటూరు (లీగల్), ఆగస్టు 16: రాష్ట్రంలో నాంపల్లి క్రిమినల్ కోర్టుల తరువాత అతిపెద్ద బార్ అసోసియేషన్‌గా పేరొందిన ప్రతిష్ఠాత్మకమైన గుంటూరు బార్ అసోసియేషన్‌కు 2012-13 సంవత్సరానికి గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. గుంటూరు బార్‌కు అధ్యక్ష, ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి, గ్రంథాలయ కార్యదర్శి, కోశాధికారి, మహిళా ప్రతినిధి పదవులు ఒక్కొక్కటి ఉండగా, సీనియర్ కార్యవర్గ సభ్యులుగా ఇద్దరిని, జూనియర్ కార్యవర్గ సభ్యులుగా ముగ్గురికి అవకాశముంది. ఈ పదవులన్నింటికీ ఈ నెల 22వ తేదీ ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు బార్ అధ్యక్షుడు కొల్లి శంకరరావు తెలిపారు. ఆ మరుసటి రోజు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటలలోపు నామినేషన్ల ఉప సంహరణ, 3 నుండి 5 గంటల వరకు దరఖాస్తుల పరిశీలన పూర్తిచేసి పోటీలో ఉండే అభ్యర్థులను ఖరారు చేస్తామన్నారు. 31వ తేదీన ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఇలా ఉండగా రాష్ట్ర బార్ కౌన్సిల్ విధి విధానాల మేరకు ప్రస్తుతం ఎన్నికయ్యే కార్యవర్గం సెప్టెంబర్ 1వ తేదీ నుండి 2013 ఏప్రిల్ 30వ తేదీ వరకూ మాత్రమే కొనసాగే అవకాశముందని ఆయన తెలిపారు.
ప్రచార పర్వం ప్రారంభం
బార్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకముందే బరిలో నిలవాలనుకుంటున్న ఆశావహుల ప్రచారపర్వం ఉద్ధృతమైంది. ప్రస్తుత బార్ అధ్యక్షుడు కొల్లి శంకరరావుగురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా ఇప్పటికే భారీ ఫ్లెక్సీలు, హోర్డింగులు, కరపత్రాలతో ఆశావహులు ప్రచారం కొనసాగిస్తున్నారు. జిల్లా కోర్టు పరిసర ప్రాంతాల్లో సాధారణ ఎన్నికల స్థాయిలో అభ్యర్థులు న్యాయవాదులను తమకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. కుల, వర్గ సమీకరణలు ఇప్పటికే జోరందుకున్నట్లు చెబుతున్నారు. ఈ ఏడాది అధ్యక్ష పదవికి నలుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. గత ఏడాది బార్ ఎన్నికల్లో పరాజయం చవిచూసిన లావు అంకమ్మ చౌదరి, విష్ణు మొలకల శివనాగేశ్వరరావుతో పాటు, గతంలో ఉపాధ్యక్షుడుగా పనిచేసిన అబ్బరాజు రఘురామ్, డాక్టర్ మద్దు అంకయ్య పోటీలో ఉన్నారు. ఉపాధ్యక్ష పదవికి గత ఎన్నికల్లో కొద్ది తేడాతో ఓడిపోయిన వాసం సూరిబాబు, బివి రమణ పోటీ పడుతుండగా రెండు కార్యదర్శి పదవులకు వజ్రాల రాజశేఖరరెడ్డి, యిండ్ల మధుబాబు, పావులూరి శ్రీనివాసరావు, ఎం దేవ, బండ్లమూడి చంద్రశేఖర్, మహిళా కార్యదర్శి పదవికి కె శ్యామల, ఎపి లాలి పోటీపడుతున్నారు. ఈ సారి 1594 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇలా ఉండగా ఈ ఏడాది కొత్తగా కోశాధికారి పదవికి కూడా పోటీ జరగనుంది.
వసతిగృహ నిర్మాణానికి పాత భవనం పరిశీలన
ఫిరంగిపురం, ఆగస్టు 16: ఫిరంగిపురం తహశీల్దార్ కార్యాలయ సమీపంలో బిసి వసతిగృహాన్ని నిర్మించటానికి అక్కడే ఉన్న నెహ్రూ యువకేంద్రానికి సంబంధించి వినియోగంలో లేకుండా ఉన్న పాత బిల్డింగ్‌ను ఎపి బిసి వెల్ఫేర్ డిప్యూటీ జిఎం సామియేలు గురువారం సందర్శించారు. ఈపాత బిల్డింగ్‌కు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలా? లేక పూర్తిగా బిల్డింగ్‌ను తొలగించి ఆ స్థానంలో నూతన బిసి వసతి గృహ నిర్మాణం చేపట్ట వచ్చా అనే విషయంపై పరిశీలించారు. ఈ సందర్భంగా సామియేలు మాట్లాడుతూ ప్రస్తుతం ఫిరంగిపురంలో బిసి వసతిగృహం అద్దె భవనంలో నడుస్తుందన్నారు. చాలీచాలని వసతులతో అక్కడ ఉంటున్న విద్యార్థులు తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నారన్నారు. వాస్తవానికి బిసి వసతిగృహ నిర్మాణానికి గతంలోనే నిధులు విడుదలయ్యాయి. గృహానికి ఉచితంగా స్థలం ఇచ్చేందుకు దాతలు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో నిధులు వెనక్కు వెళ్లిపోయాయన్నారు. దీంతో కలెక్టర్ సురేష్‌కుమార్ ఇటీవల ఎస్సీ ప్రత్యేక వసతిగృహాన్ని ఆకస్మికంగా తనిఖీచేసిన సమయంలో నెహ్రూ యువకేంద్ర పాత భవనాన్ని రెవెన్యూ అధికారులతో పరిశీలించి, ఈ పాత బిల్డింగ్ పూర్తి వివరాలను సేకరించి, తగిన నివేదిక అందించమని తనను ఆదేశించిన మీదట ఇక్కడకు వచ్చానని, నివేదికను రూపొందించి కలెక్టర్‌కు త్వరలోనే అందజేస్తానని చెప్పారు. ఆయన వెంట డిప్యూటీ ఆర్‌ఎల్ ప్రసన్న, బిసి వెల్ఫేర్ అధికారి ఆవులయ్య, ఎఇ హరిబాబు, స్థానిక బిసి వసతిగృహ వార్డెన్ జిజె ఎడ్వర్లు పాల్గొన్నారు.
ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్ల పట్టివేత
పెదకూరపాడు, ఆగస్టు 16: పెదకూరపాడు మండలంలోని పొడపాడు గ్రామం వద్ద అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న 15 ట్రాక్టర్లను మైనింగ్‌శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. పట్టుకున్న ట్రాక్టర్లను సీజ్ చేసి, పెదకూరపాడు పోలీసుస్టేషన్‌కు తరలించారు.
అచ్చంపేటలో...
అచ్చంపేట: నిషేధిత ఇసుక రీచ్‌ల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వాహనాలతో పాటు జెసిబిని అచ్చంపేట తహశీల్దార్ జగన్మోహనరావు బుధవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని సీజ్ చేశారు. తాడువాయి రేవు నుండి జెసిబిని కస్తలలో లారీ, రుద్రవరం, వేల్పూరు గ్రామాల వద్ద మరో మూడు ట్రాక్టర్లను ఆయన అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అంతేకాక వాహన డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయించారు.
‘బీసీ వ్యతిరేక విధానాలు నష్టదాయకం’
అమరావతి, ఆగస్టు 16: పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు అవలంబిస్తున్న బిసి వ్యతిరేకవిధానాల మూలంగా బిసిలంతా టిడిపికి దూరమయ్యే ప్రమాదముందని, అందువల్ల ఆయనపై పార్టీపరంగా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ మండల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ మేకల హనుమంతరావుయాదవ్‌కు పెరుగుతున్న జనాదరణను చూసి ఓర్వలేకపోతున్నారని, హనుమంతరావుపై మూడు పోలీసు కేసులు, రౌడీషీటు కూడా తెరిపించారని ఆరోపించారు. దీనిపై జిల్లా, రాష్ట్ర పార్టీ అధ్యక్షులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో బిసి సంఘ నాయకులు మేకల శ్రీనివాసరావుయాదవ్, మేకల శివశంకరరావుయాదవ్, వెంకటేశ్వర్లు, బైనబోయిన సురేష్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
హెల్త్‌కార్డులు ఇవ్వాలని ఉపాధ్యాయుల ర్యాలీ
మంగళగిరి, ఆగస్టు 16: హెల్త్‌కార్డులు వర్తింపుపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం సాయంత్రం మంగళగిరి పట్టణంలో యుటిఎఫ్ ఆధ్వర్యాన ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. యుటిఎఫ్ నాయకులు యు రాజశేఖర్, ఎన్ కుమారరాజా, డి మాలకొండయ్య, ఏడుకొండలు, కె నిర్మల, అంకారావు, మున్సిపల్ ఎయిడెడ్ ఉపాధ్యాయులు ర్యాలీలో పాల్గొన్నారు.
వైఎస్‌ఆర్ విగ్రహానికి అవమానంపై పోలీసులకు ఫిర్యాదు
చేబ్రోలు, ఆగస్టు 16: మండల కేంద్రమైన చేబ్రోలు గ్రామంలో పాత పోలీసుస్టేషన్ సెంటర్ వద్ద గల దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఆగంతకులు కొందరు కళ్లకు గంతలు కట్టారు. అంతేకాక చేతిలోనూ, తలపైనా ఇటుకరాళ్లను పెట్టారు. ఈ విగ్రహాన్ని ఓదార్పుయాత్ర సందర్భంగా చేబ్రోలు వచ్చిన వైఎస్‌ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ఆవిష్కరించారు. భారత స్వాతంత్య్రదినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో వైఎస్‌ఆర్ విగ్రహానికి జరిగిన ఈ అవమానం పట్ల ఆ పార్టీ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గురువారం వైఎస్‌ఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. విగ్రహం కళ్లకు గంతలు కట్టిన అగంతకులను వెంటనే పట్టుకుని శిక్షించాలని వైఎస్‌ఆర్ సిపి నేతలు చేబ్రోలు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో వైఎస్‌ఆర్ సిపి మండల నాయకులు కుర్రా పాములుయాదవ్, నరిశెట్టి మర్రయ్య, తలకాల మస్తాన్, జూటూరి రాంబాబు, వెంకట సుబ్బయ్య తదితరులున్నారు.
అది నీచ సంస్కృతి...
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి కళ్లగంతలు కట్టి, చేతిలో ఇటుకరాయి పెట్టడం నీచ సంస్కృతికి నిదర్శనమని జిల్లా వైఎస్‌ఆర్ సిపి కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఘాటుగా విమర్శించారు. కళ్లగంతలు కట్టి వైఎస్‌ఆర్‌ను అవమానపర్చడం అమానుషమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్‌ఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేశారు. ఈయన వెంట మాజీ ఎమ్మెల్యే రావి వెంకట రమణ, వైఎస్‌ఆర్ సిపి యువజన నాయకుడు కావటి మనోహర్‌నాయుడు, మండల వైఎస్‌ఆర్ సిపి నాయకులు కంకణాల వెంకట నరసింహారావు ఉన్నారు.
మంగళగిరిలో గౌతు లచ్చన్నకు ఘననివాళి
మంగళగిరి, ఆగస్టు 16: బడుగు వర్గాల సంక్షేమానికి జీవితాంతం పోరాడిన సర్దార్ గౌతు లచ్చన్న చిరస్మరణీయుడని వివిధ పార్టీల నేతలు నివాళులర్పించారు. దివంగత గౌతు లచ్చన్న 104వ జయంతిని పురస్కరించుకుని స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద గల లచ్చన్న విగ్రహం వద్ద గౌడసంఘం ఆధ్వర్యాన గురువారం జరిగిన కార్యక్రమంలో పలువురు పాల్గొని లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ పి శ్రీనివాసరావు మాట్లాడుతూ పేద, బడుగు జీవుల కోసం పనిచేసిన లచ్చన్న మంచి మనిషి అని కొనియాడా రు. రజకసంఘం రాష్ట్ర నాయకులు బొం తల వెంకటేశ్వర్లు, పట్టణ టిడిపి అధ్యక్ష కార్యదర్శులు నందం అబద్దయ్య, వెలగపాటి సత్యం, బిజెపి నేత మునగపాటి వెంకటేశ్వరరావు, సిపిఐ నాయకుడు పరుచూరి వెంకటేశ్వరరావు, గౌడసంఘం నాయకులు చిట్టిబొమ్మ శ్రీనివాసరావు, రేకా సుధాకర్, పరసా రంగనాధ్, పలగాని కోటేశ్వరరావు, కోసూరి చంద్రశేఖర్, వాకా మాధవరావు, తాతా కోటయ్య, జో గి రాంబాబు, వాకా ముత్యాలు, మంగారావు తదితరులు పాల్గొని లచ్చన్నకు ఘనంగా నివాళు లర్పించారు.
తహశీల్దార్ సూచనతో దీక్ష విరమణ
అమరావతి, ఆగస్టు 16: గత తొమ్మిది రోజులుగా మండల కేంద్రమైన అమరావతిలో స్థల వివాదమై నిరాహారదీక్ష చేస్తున్న నేరెళ్ల హనుమంతరావును గురువారం తహశీల్దార్ జి సుజాత కలిసి నిరాహారదీక్ష చేయడానికి గల కారణాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా నిరాహారదీక్ష చేయడం నేరమని, స్థల వివాదం ఉంటే పెద్దల ద్వారా గానీ, అధికారుల ద్వారా గానీ చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. సదరు స్థలం గురించి రిజిస్టర్ చేయని వ్యక్తులపై చీటింగ్ కేసు పెట్టుకోవాలని తెలిపారు. అమరావతి ఎస్‌ఐ ఎస్ జగదీష్ నిరాహారదీక్ష చేస్తున్న హనుమంతరావును ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దీక్ష విరమించాలని కోరారు. తహశీల్దార్ సూచన మేరకు నేరెళ్ల హనుమంతరావుచే గురువారం మధ్యాహ్నం ఆర్యవైశ్య సంఘ నాయకులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ మండలాధ్యక్షుడు మద్ది ధాత్రినారాయణ, నందిగామ వెంకటేశ్వరరావు, పులికొండ పుల్లారావు, సిఐటియు నాయకులు ఎన్ వెం కట్రావ్, బి సూరిబాబు పాల్గొన్నారు.
నిరుపేదలకు బియ్యం పంపిణీ
మంగళగిరి, ఆగస్టు 16: నిరుపేదల రక్షణ సేవాసంఘం కన్వీనర్ వెలగపాటి విలియం ఆధ్వర్యాన స్థానిక పెన్షనర్స్ హోంలో గురువారం సాయంత్రం నిరుపేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. సుమారు 200 మంది పేదలకు బియ్యం పంపిణీ జరిగింది. ఎంపిడిఓ బి శ్యామలాదేవి, పట్టణ ఎస్సై రవిబాబు, ధార్మిక మండలి సభ్యుడు వడ్లమూడి వెంకయ్య చౌదరి చేతుల మీదుగా పేదలకు బియ్యం పంపిణీ జరిగింది. వెలగపాటి విలియం మాట్లాడుతూ దాతల సహకారంతో తమ సంఘం ఆధ్వర్యాన ప్రతినెలా పేదలకు బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. తగరం మోషే, మిట్టా నాగేశ్వరరావు, కంచర్ల ఆంజనేయులు, ధూళిపాళ రామచంద్రరావు, కూరపాటి కన్నా, పరసా రంగనాధ్, మంచికలపూడి నాగేశ్వరరావు, పుల్లా కృష్ణ, రేకా సుధాకర్, వై నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
ఉండవల్లి విద్యారత్నాల ఎంపికకు
20 లోపు దరఖాస్తు చేసుకోవాలి
తాడేపల్లి, ఆగస్టు 16: తాడేపల్లి మండల ఉండవల్లి గ్రామంలో ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఉండవల్లి విద్యారత్నాల ఎంపికకు గ్రామంలో 10వ తరగతి నుండి పిజి వరకు చదివిన విద్యార్థులు ఈ నెల 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఉండవల్లి పూర్వ విద్యార్థుల సంఘం చైర్మన్ విబిహెచ్ భాస్కర్ బుధవారం ఉండవల్లిలోని రామాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక విలేఖర్ల సమావేశంలో ఆయన కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఉండవల్లి గ్రామంలో విద్యార్థినీ విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో గత నాలుగు సంవత్సరాలుగా విద్యారత్నాలను ఎంపిక చేసి సన్మానం చేస్తున్నామన్నారు. ఎంపిక అయిన విద్యార్థులకు సెప్టెంబర్ 1వ తేదీ వారి తల్లిదండ్రులతో సహా గ్రామ ప్రజల మధ్య సన్మానం చేసి విద్యకు గల ప్రాధాన్యత, విద్య ద్వారా లభించే గౌరవాన్ని ప్రజలకు తెలియజేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఫోటో ఇండియా స్టూడియో అధినేత టి శ్రీనివాసరెడ్డి, గోపాలం, వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.