ఒంగోలు, ఆగస్టు 16: జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనటంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. భారీవర్షాలు కురిసి వాగులు, వంకలు పొంగి ప్రవహించాల్సిన రోజుల్లో ఎండలు మండుతున్నాయి. జిల్లాలో గత కొంతకాలం నుండి ఎండతో కూడిన ఈదురుగాలులు వీస్తుండటంతో అన్నివర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఈపాటికే ఖరీఫ్ సీజన్‌లో రెండు లక్షల 19వేల 167 హెక్టార్లలో వివిధ పంటలు వేయాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 98 వేల హెక్టార్లలో మాత్రమే సాగుచేశారు. రానున్న రోజుల్లో ఇవే పరిస్థితులు కొనసాగితే రైతులు మరింతగా నష్టపోయే ప్రమాదం ఉంది. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్ధితులు నెలకొనటంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళికను కూడా రూపొందించింది. జిల్లాలో సజ్జ, మినుము, ఆముదం, పెసర, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న, కంది, సోయాబీన్, పొద్దుతిరుగుడు, అలసంద పంటలు రైతులు ప్రత్యామ్నాయంగా సాగు చేసుకునేందుకు వ్యవసాయ శాఖ కసరత్తులు చేసే పనిలో నిమగ్నమైంది. జిల్లాలో ఈసంవత్సరం జూన్ నెలలో సాధారణ వర్షపాతం 58 మిల్లిమీటర్లు నమోదు కావల్సి ఉండగా 40.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఇటీవల రైతులు ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదైనప్పటికీ ఆ తరువాత వర్షాలు లేకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలాఉండగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కూడా సక్రమంగా సరఫరా కాకపోవటంతో రైతులు పొలాల్లోనే జాగరణ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులకు ఏడుగంటల పాటు రెండు విడతలుగా విద్యుత్ సరఫరా చేయాల్సి ఉండగా మూడు నుండి నాలుగు దఫాలుగా విద్యుత్‌ను ట్రాన్స్‌కో అధికారులు సరఫరా చేస్తున్నారు. దీంతో పశ్చిమ ప్రాంతంలోని ఉద్యానవన పండ్లతోటల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా రైతులకు సకాలంలో ఉచిత విద్యుత్ సరఫరా చేసి పంటలను కాపాడాల్సిన అవసరం ఉంది. ఇదిలాఉండగా ఈసంవత్సరం ఖరీఫ్ సీజన్‌లో రైతులకు 2008 కోట్ల 27 లక్షల రూపాయలను పంట రుణాలుగా పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు కేవలం 58వేల 360 మంది రైతులకు 340 కోట్ల రూపాయలను మాత్రమే రుణంగా బ్యాంకులు అందచేశాయి. దీన్నిబట్టి చూస్తే రైతులు ఏమేరకు ఖరీఫ్ పంటలను సాగుచేశారో అర్ధవౌతోంది. జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్ సీజన్‌లో పంటలు సాగు చేసేందుకు రైతులు వెనకంజ వేసే పరిస్థితి నెలకొంది. ఈసంవత్సరం 30వేల మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులను రెవిన్యూ శాఖ ద్వారా మంజూరుచేసి వారికి ఎనిమిది కోట్ల 63 లక్షల రూపాయలను అందచేసేందుకు వ్యవసాయ శాఖ లక్ష్యాన్ని నిర్ధేశించినప్పటికి ఏమేరకు ఆ లక్ష్యం నెరవేరుతుందో చూడాల్సి ఉంది. ఇదిలాఉండగా ఆగస్టు నెలలో సైతం కొంతమంది రైతులు ఉప్పు సాగుచేసే పనిలో నిమగ్నమయ్యారు. సాధారణంగా జూలై నెలలోనే ఉప్పు ఉత్పత్తి నిలిచిపోతుంది, కాని జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్ధితుల కారణంగా ఉప్పు ఉత్పత్తి జరుగుతుండటంతో ధరలు పతానావస్ధకు చేరే అవకాశాలు ఉన్నాయి. మొత్తంమీద జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనటంతో అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కొనసాగుతున్న విద్యుత్ కోతలు
ఇబ్బందుల్లో ప్రజలు
మార్కాపురంరూరల్, ఆగస్టు 16: వర్షాకాలంలో కూడా రోజుకు ఆరుగంటల పాటు విద్యుత్ కోత అమలు చేస్తుండటం పట్ల ప్రభుత్వంపై ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురం మున్సిపాలిటీలో ప్రతిరోజూ ఉదయం 7గంటల నుంచి 10గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు విద్యుత్ కోతను అధికారికంగా అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో సాయంత్రంపూట ఏదొక సమయంలో కాసేపు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఆగస్టు రెండవ వారంలో కూడా కోతలు విధిస్తుండటంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ కోతలు ఇంకా ఎక్కువగా ఉంటున్నాయి. రాత్రిపూట కోతలను అనధికారికంగా విధిస్తుండటంతో దోమల ధాటికి తట్టుకోలేక నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ప్రభుత్వం రాత్రి సమయంలో విద్యుత్ కోతలు విధించరాదని ఉత్తర్వులు జారీచేసినప్పటికీ సిబ్బంది రాత్రి సమయంలో విద్యుత్ కోత విధిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. వర్షాకాలం కావడంతో సాయంత్రం పూట వీచే గాలులకు తీగలు తగులుకొని విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. రాత్రి 8గంటల తరువాత గాలి వాన వస్తే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. పట్టణంలో మధ్యాహ్నం 12గంటల నుంచి 3గంటల వరకు కోతను అమలు చేయడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సాగడం లేదు. కంప్యూటర్లు ఆగిపోవడం, ఫ్యాన్లు తిరగకపోవడంతో కరెంటు పోగానే ప్రభుత్వ సిబ్బంది బయటకు వస్తున్నారు. కోతలను ఎత్తివేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైనా వర్షాలు ఇప్పుడిప్పుడే కురుస్తుండటంతో రైతులు పెద్దగా కరెంటుపై ఆధారపడి పంటల సాగు చేపట్టలేదు. ఈనేపధ్యంలో రోజు ఆరుగంటలపాటు కోతను అమలు చేయడం శోచనీయమని వైఎస్‌ఆర్ సిపి, టిడిపి, సిపిఐ, సిపిఎం పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. పట్టణంలో విద్యుత్ కోతలను నిరసిస్తూ ఇటీవల వైఎస్‌ఆర్ సిపి నాయకులు మార్కాపురం విద్యుత్ కార్యాలయం దగ్గర ధర్నా కూడా నిర్వహించారు. ఇప్పటికైనా అధికారులు కోతలను ఎత్తివేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రభుత్వ వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలి
ఎమ్మెల్యే ఆమంచి సూచన
చీరాల, ఆగస్టు 16: చీరాల ఏరియా వైద్యశాలలో లభించే సేవలను చీరాల పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కోరారు. గురువారం స్థానిక వైద్యశాలలో నిర్వహించిన అసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి చైర్మన్‌గా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంతో పోలిస్తే వైద్యశాలలో మెరుగైన వసతులు ఉన్నాయన్నారు. అధునాతన వైద్య పరికరాలతో పాటు వైద్యులు ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉన్నారని తెలిపారు. అవసరమైన అన్ని మందులు కూడా లభిస్తున్నాయన్నారు. దీనికితోడు విద్యుత్ కోత వల్ల ఏర్పడే అసౌకర్యానికి ప్రత్యామ్నాయంగా అవసరమైన అత్యవసర విభాగాలలో ఇన్వర్టర్ వసతి కల్పించటానికి తీర్మానం చేశామన్నారు. వైద్యశాలలో నూతనంగా కీళ్ళ, ఎముకల వైద్యనిపుణులు డాక్టర్ నాయక్, జనరల్ సర్జన్ డాక్టర్ పెంచలయ్య, రెండవ గైనకాలజిస్టుగా డాక్టర్ ఆంజనేయులు నియమితులయ్యారని తెలిపారు. పేద ప్రజలు అస్వస్ధతకు లోనైనపుడు ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి చికిత్సలు చేయించుకోవాలని కోరారు. దిగువ స్థాయి సిబ్బంది రోగులపట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చీరాల వైద్యశాలను జిల్లా వైద్యశాలగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలోని అంబులెన్స్‌ను మరమ్మతులు చేయించి అందుబాటులో ఉంచాలని సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసన్నకుమార్‌కు సూచించారు. ఆసుపత్రిలోని పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. డాక్టర్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ వైద్యశాలలో ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్‌లు చేయించుకున్న రోగులకు రోజుకు వంద రూపాయల చొప్పున మెరుగైన భోజనం పెట్టాలని తీర్మానించినట్లు తెలిపారు. ఆసుపత్రికి అదనపు ఎలక్ట్రీషియన్, ప్లంబర్ పోస్టులు మంజూరు చేయాలని, నూతనంగా నియమితులైన వైద్యనిపుణుల కోసం అవసరమైన పరికరాలు కొనుగోలు చేయాలని తీర్మానించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్ ప్రత్యేక అధికారి, జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ గంగాధర్, వైద్య విధాన పరిషత్ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ సిహెచ్ దుర్గాప్రసాద్, ఆర్‌ఎంవో సురేష్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
‘ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించాలి’
ఒంగోలు, ఆగస్టు 16: ఒంగోలు నగరంలో ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారానికి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి విధి విధానాలు రూపొందించాలని సిపిఎం ఒంగోలు నగర పార్టీ డిమాండ్ చేసింది. గురువారం స్థానిక సుందరయ్య భవన్‌లో ఎన్ వీరాస్వామి అధ్యక్షతన జరిగిన సిపిఎం నగర కమిటీ సమావేశం పలు తీర్మానాలను చేసింది. ఈ సందర్భంగా సిపిఎం ఒంగోలు నగర కార్యదర్శి జివి కొండారెడ్డి మాట్లాడుతూ ఒంగోలు నగరంలో ఇండ్ల స్థలాల సమస్య జఠిలంగా ఉందని, దీనిని పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. రెవిన్యూ అధికారులు లాభాపేక్షకై దళారులను ప్రోత్సహిస్తున్న కారణంగా మరింత జఠిలమవుతోందన్నారు. వాస్తవ లబ్ధిదారులకు ఇండ్ల స్థలాలు దక్కటం లేదన్నారు. నగరంలో ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి 2008 సంవత్సరంలో సర్వే ద్వారా గుర్తించిన లబ్ధిదారుల జాబితా, 2010 - 11 రచ్చబండ, సభల్లో వచ్చిన అర్జీలు ఇటీవల మండల తహశీల్దార్‌కి ఇచ్చిన అర్జీలు, 2, 3 ఇందిరమ్మ పథకం జాబితాలో ఇచ్చిన అర్జీలను కూడా పరిగణలోకి తీసుకోలేదన్నారు. ప్రజాప్రతినిధులు అవగాహనకు వచ్చి జాబితాను ఆధారం చేసుకొని వాస్తవ లబ్ధిదారులను గుర్తించి వారికి ఇళ్ళ స్థలాలు పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే వివిధ రకాల ప్రభుత్వ భూముల్లో కాపురం ఉంటున్న గుడిసెవాసులకు తక్షణమే పట్టాలు ఇవ్వాలని సమావేశం తీర్మానించిదని తెలిపారు. సమస్య పరిష్కారానికి రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో సమావేశం జరపాలని కోరారు. లేనిపక్షంలో ఇండ్ల స్థలాల సమస్యలపై సిపిఎం పోరాటం ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. సమావేశంలో సిపిఎం నగర నాయకులు, జి రమేష్, బి వెంకట్రావు, దామా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
మార్కాపురంలో మీకోసం కార్యాలయం ప్రారంభం
* పశ్చిమప్రాంతప్రజలకు అందుబాటులో ఎస్పీ
మార్కాపురంరూరల్, ఆగస్టు 16: పశ్చిమప్రాంత ప్రజలకు పోలీసు సేవలను దగ్గర చేసేందుకు ఎస్పీ డాక్టర్ రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో మీ కోసం కార్యక్రమాన్ని స్థానిక డివైఎస్పీ కార్యాలయంలో గురువారం డివైఎస్పీ డి మురళీధర్ ప్రారంభించారు. ఈసందర్భంగా వెబ్‌కెమెరాల ద్వారా ఎస్పీ ఒంగోలు నుంచి స్థానిక పాత్రికేయులతో మాట్లాడుతూ గిద్దలూరు నుంచి పుల్లలచెరువు వరకు న్యాయం కోసం ప్రజలు ఒంగోలుకు రావాల్సిన పనిలేదని, మార్కాపురం డివైఎస్పీ కార్యాలయంలో ప్రత్యేకంగా మీకోసం కార్యాలయాన్ని గురువారం నుంచి ప్రజలకు అందుబాటులోనికి తెచ్చామని, ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయడంతోపాటు తనతో నేరుగా ఆ కేంద్రం నుంచి మాట్లాడవచ్చునని, ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఎస్పీ కోరారు. ప్రతిరోజూ ఉదయం 11 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈకేంద్రానికి వచ్చి తనతో మాట్లాడవచ్చునని తెలిపారు. ఈకార్యక్రమంలో డివైఎస్పీ మురళీధర్‌తోపాటు పోలీసుసిబ్బంది పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో పెద్దల రాత్రి
* ప్రత్యేక ప్రార్ధనలు చేసిన ముస్లింలు
మార్కాపురంరూరల్, ఆగస్టు 16: రంజాన్ పర్వదినంలో అతిముఖ్యమైన పెద్దలరాత్రిని బుధవారం మార్కాపురం పట్టణంలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మసీదులో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. వెలుగోడు మదారస నుంచి వచ్చిన ముక్తిషేక్ దావుద్ మాట్లాడుతూ పవిత్రఖురాన్ అవతరించిన రోజును షబేఖదర్ అని, పెద్దలరాత్రిగా జరుపుకుంటారని అన్నారు. సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలని అన్నారు. శాంతి, సామరస్యంతో పరమతసహనాన్ని పాటించాలని అన్నారు. సర్వమానవాళి సుఖంగా ఉండాలని ఆకాంక్షించారు. వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ప్రార్ధనలు చేశారు. ధార్మిక ఉపన్యాసంలో పలు సందేశాలు ఇచ్చారు. ఈసందర్భంగా మసీదులను రంగురంగుల విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ముస్లింలు జాగారం చేసి జాగారంలో పాల్గొన్నారు.
గౌడ్‌ల అభివృద్ధి కోసం కృషి చేసిన మహానీయులు గౌత్‌లచ్చన్న
యర్రగొండపాలెంరూరల్, ఆగస్టు 16: స్వాతంత్య్ర సమరయోధులు, వెనుకబడిన కులాల కోసం అనేక ఉద్యమాలు చేసిన మహానాయకులు జీవితాంతం గౌడ్‌ల అభివృద్ధి కోసం కృషి చేసిన మహానీయులు గౌత్‌లచ్చన్న అని గౌడ ఉద్యోగుల సంఘం నాయకులు కె హనుమంతరావు అన్నారు. వైపాలెంలో గురువారం లచ్చన్న 104వ జయంతిని పురస్కరించుకొని గౌడసంఘ కార్యాలయంలో జరిగిన సమావేశానికి గౌడసంఘం వైపాలెం అధ్యక్షులు వెంకటేశ్వర్లుగౌడ్ అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ లచ్చన్న జీవితచరిత్ర గురించి వివరించారు. చిన్నతనం నుంచే రాజకీయజీవితం ప్రారంభించి చనిపోయేవరకు మచ్చలేని మహానాయకులుగా ఎదిగారని కొనియాడారు. ఈకార్యక్రమంలో రంగనాయకులుగౌడ్ మాట్లాడుతూ గౌడసంఘంలో అందరూ ఇలాంటి జయంతికార్యక్రమాన్ని ప్రతిగ్రామంలో నిర్వహించి చైతన్యపరచాలని కోరారు. చెన్నకేశవులుగౌడ్ మాట్లాడుతూ వెనుకబడిన బిసికులాలను అగ్రగన్యులుగా చేయడానికి లచ్చన్న నిరంతరం పోరాడారని అన్నారు. గౌడసంఘం ప్రతిగ్రామంలో లచ్చన్న విగ్రహానికి ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని కోరారు. కార్యదర్శి పోలయ్యగౌడ్ మాట్లాడుతూ తమ పిల్లలను బాగా చదివించాలని కోరారు. ఈకార్యక్రమంలో యువజనసంఘం అధ్యక్షులు కోటేశ్వరరావు, కె వెంకటయ్యగౌడ్, ప్రసాద్‌గౌడ్, హనుమంతరావుగౌడ్, నాగేశ్వరరావుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అయ్యగానిపల్లి, కొలుకుల, వైపాలెం గౌడసభ్యులు, గీతకార్మికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
శర్మా కాలేజీలో పరిసరాల పరిశుభ్రత
ఒంగోలు, ఆగస్టు 16: ఒంగోలులోని సిఎస్‌ఆర్ శర్మా కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు నిర్వహించారు. కళాశాల తెలుగు లెక్చరర్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రొగ్రామ్ ఆఫీసర్ మాజేటి వెంకట సుబ్బయ్య శాస్ర్తీ ఆధ్వర్యలో వాలంటరీలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాలలలోని తుమ్మచెట్లు, పిచ్చి మొక్కలు తొలగించి వ్యర్ధపదార్ధాలను దగ్ధం చేశారు. పరిసరాల పరిశుభ్రతకు, పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను ప్రోగ్రామ్ ఆఫీసర్ శాస్ర్తీ వాలంటీర్లకు తెలియజెప్పారు. కళాశాలలో పరిసరరాల పరిశుభ్రత కార్యక్రమం చేపట్టిన శాస్ర్తీని, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లను కళాశాల ప్రిన్సిపాల్ పివి రావు, కళాశాల పాలకవర్గ అధ్యక్షులు దేవతు ముసలారావు, కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కరవది వెంకటేశ్వర్లు, కోశాధికారి తాతా వెంకటేశ్వర్లు, పాలకవర్గ సభ్యులు కరవది రాఘవరావు, బచ్చల శివప్రసాద్ తదితరులు అభినందించారు.
‘ఒంగోలులో కళాక్షేత్రం నిర్మించాలి’
ఒంగోలు, ఆగస్టు 16: ఒంగోలులో కళాక్షేత్రం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ వివిధ కళాకారుల ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ అనితా రాజేంద్రను జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేసిన వారిలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర గౌరవాధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు, రంగస్థల పౌరాణిక జానపద కళాకారుల సమాఖ్య నాయకులు మిడసల మల్లికార్జునరావు, స్పందన థియేటర్‌కు చెందిన ఆల్‌ఫ్రెడ్, కళాకారులు పివిఆర్ చౌదరి, నల్లూరి మురళి, రాయపాటి ఆశీర్వాదం, అంగలకుర్తి ప్రసాద్‌లు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2005 సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజేశేఖరరెడ్డి ఒంగోలులోని ఊరచెరువులో సుమారు 2 ఎకరాల స్థలంలో కళాక్షేత్రం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారని కలెక్టర్‌కు తెలిపారు. ప్రకాశం కళాకారులకు పుట్టినిల్లని, అటువంటి జిల్లా కేంద్రమైన ఒంగోలులో కళాక్షేత్రం నిర్మాణం ఇంతవరకు జరగకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కళాక్షేత్రం ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నందున కళాక్షేత్రం నిలిచి పోయిందన్నారు. వెంటనే ఒంగోలులో కళాక్షేత్రాన్ని, ఆడిటోరియం నిర్మించి కళాకారులు ప్రదర్శనలు ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని వారు కోరారు.
‘చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి’
ఒంగోలు, ఆగస్టు 16: లక్ష్మీపేట దళితులకు న్యాయం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ఆధ్వర్యంలో ఈనెల 22న జరిగే ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పాలడుగు విజేంద్ర బహుజన్ కోరారు. శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేట దళితులకు న్యాయం చేయాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీ నిర్లక్ష్యనికి నిరసనగా దళిత మహాసభ ఆధ్వర్యంలో దళిత బహుజన మైనార్టీ స్ర్తివాద ఉద్యమాల సాహకారంతో 22వ తేదీన జరిగే చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార కరపత్రాన్ని గురువారం స్థానిక ఈమనిపాలెంలోని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ కార్యాలయంలో పాలడుగు విజేంద్ర బహుజన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజేంద్ర బహుజన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధానంగా జరిగిన ఆత్మగౌరవ పోరాటాలైన కారంచేడు, చుండూరు ఉద్యమాలు ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ నాయకత్వంలో జరిగి విజయవంతమయ్యాయని తెలిపారు. లక్ష్మీపేట ఉద్యమం కూడా బాధితులకు న్యాయం జరిగే వరకు మహాసభ పోరాటం నిర్వహిస్తుందన్నారు. రాష్ట్రంలో దళితుల ఓట్లతో అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ దళితులపై జరిగిన దాడుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండటమే కాకుండా దోషుల కొమ్ముకాస్తున్న పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు వత్తాసు పలకడం సిగ్గు చేటన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆగస్టు 22వ తేదిన ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద జరుగు ధర్నాకు మహాసభ వ్యవస్థాపకులు డాక్టర్ కత్తి పద్మారావు, ప్రజాయుద్ధ నేత గద్దర్, దళిత ఎంపిలు రామ్‌విలాస్ పాశ్వాన్, ప్రకాష్, అంబేద్కర్ హర్షకుమార్, జి వివేక్, ఎం రాజయ్య, స్వామి ఆగ్నివేశ్, జోగేంద్ర కవాడే పాల్గొంటారని తెలిపారు. ఛలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో డిసిసి బ్యాంకు మాజీ డైరెక్టర్ బత్తుల గోపాలకృష్ణ, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర నాయకులు కలతోటి బాబు, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొప్పోలు రాజు, బత్తుల రమణ, అంబేద్కర్ ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తానికొండ విద్యాసాగర్, రావులకొల్లు మాలకొండయ్య, ఆంబేద్కర్ యువజన సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షులు ఐనంపూడి నాగరాజు, బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు కందుకూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీపేట దళితులు ఆత్మగౌరవ పోరాటానికి జరిగే చలో ఢిల్లీ కార్యక్రమంలో దళిత బహుజనులు అందరు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
‘కాలేజీలకు శాశ్విత గుర్తింపు తప్పనిసరి’
ఒంగోలు, ఆగస్టు 16: ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలు విశ్వవిద్యాలయం నుండి 12-బి పేరుతో ఉన్న శాశ్విత గుర్తింపు తప్పనిసరిగా తీసుకోవాలని నాగార్జున యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వియన్నారావ్ తెలిపారు. ఒంగోలులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పిజి కాలేజీలో గురువారం జిల్లాలోని కాలేజీల ప్రిన్సిపాళ్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పిజి సెంటర్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ రాజమోహన్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన వియన్నారావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం అనుబంధ కాలేజీలన్ని విద్యార్థులకు అందిస్తున్న కోర్సుల వివరాలను, అధ్యాపకుల వివరాలను తెలియజేయాలని కోరారు. ప్రస్తుతం డిగ్రీ కోర్సుల్లో అనుసరిస్తున్న కాంబినేషన్ సబ్జెక్టుల విషయమై త్వరలో యూనివర్సీటీలో వర్క్‌షాపు నిర్వహిస్తామని తెలిపారు. ఆయా కోర్సుల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రిన్సిపాల్, ఆధ్యాపకులు పాల్గొని సూచనలు సలహాలు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్‌ను త్వరలో కాలేజీలను పరిశీలించనున్నట్లు తెలిపారు. మీసేవలో డిగ్రీ సర్ట్ఫికేట్లను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పాత రికార్డులను కంప్యూటరైజ్డ్ చేసి అవసరమైన వారికి వారి వారి సర్ట్ఫికెట్లను అందజేస్తామని తెలిపారు. ఎంసెట్ కౌన్సిలింగ్ ఆలస్యం అవటం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సెప్టెంబర్ 15వ తేదీ వరకు కాలేజీలో అడ్మిషన్స్ పొడిగించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జిల్లాకు యూనివర్సిటీ వచ్చేందుకు ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ ఆర్‌ఆర్‌ఎల్ కాంతం, కాలేజీ డెవలప్‌మెంట్ డీన్ డివి చలం, ఓఎస్‌డి విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
పొదుపు గ్రూపులకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలి
ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిమాండ్
ఒంగోలు, ఆగస్టు 16: పొదుపు గ్రూపులకు వడ్డీలేని రుణాలు ఇచ్చి వారిని అభివృద్ధి చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాట్రగడ్డ స్వరూపరాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఎల్‌బిజి భవన్‌లోని ఐద్వా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో స్వరూపరాణి మాట్లాడుతూ ఇటీవల ఐద్వా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 23 జిల్లాలలో పొదుపు సంఘాల ఎలా పనిచేస్తున్నాయన్న విషయంపై సర్వే నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వం మహిళలు సాధికారత సాధించారని ప్రకటిస్తోందని అందులో వాస్తవం లేన్నారు. గతంలో దివంగత ముఖ్యమత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో డ్వాక్రా గ్రూపులకు పావలావడ్డీ రుణాలు అందజేసి లక్షాధికారులను చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా మహిళా గ్రూపులను గ్రేడింగ్ సిస్టం అమలుచేసి రుణాలు తీసుకున్న మహిళా గ్రూపులు సక్రమంగా తిరిగి బ్యాంకులకు చెల్లిస్తే అటువంటి వారికి పావలావడ్డీ రుణాలు వర్తింప చేశారని తెలిపారు. అయితే ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి పొదుపు గ్రూపులకు వడ్డీలేని రుణాలను ఇచ్చి వారిని అభివృద్ధి చేస్తామని చెప్పారని, అయితే వడ్డీలేని రుణాలు ఎక్కడా ఇస్తున్న పరిస్థితి లేదన్నారు. స్ర్తినిధి బ్యాంకులను ఏర్పాటుచేసి 1500 కోట్ల రూపాయలు కేటాయించి పొదుపు గ్రూపులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారని, అయితే స్ర్తినిధి బ్యాంకులు ఏర్పాటుచేసి రుణాలు ఇచ్చిన పరిస్థితి కనిపించలేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా గ్రేడింగ్ పద్ధతిని ప్రవేశపెట్టి పొదుపు సంఘాలు, పొదుపు గ్రూపులు వాయిదాల పద్ధతిలో చెల్లించే వారికే వడ్డీలేని రుణాలు ఇస్తామని చెబుతున్నారని, అది మంచి పద్ధతి కాదన్నారు. రాష్ట్రంలో 9 లక్షల 30 వేల పొదుపు గ్రూపులు ఉండగా 1 కోటి 50 లక్షల మంది పొదుపు గ్రూపుల్లో చేరినట్లు తెలిపారు. పొదుపుగ్రూపుల్లో చేరిన మహిళలకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. కొంతమంది రుణాలు తీసుకొని సరిగా బ్యాంకులకు చెల్లించడంలేదన్నారు. దీనితో సక్రమంగా కట్టే పొదుపు గ్రూపుల మహిళలు కూడా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అభయ హస్తం పెన్షన్ పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టారని, ఈ పథకంలో చేరిన మహిళలు ప్రతినెల 30 రూపాయలు తమ పేరు మీద ఖాతాలో పొదుపు చేస్తున్నారని తెలిపారు. అభయ హస్తంలో చేరి పొదుపు చేసుకుంటున్న మహిళలకు 60 సంవత్సరాల తరువాత వారికి సుమారు 2 వేల రూపాయలకుపైగా పెన్షన్ రానున్నట్లు తెలిపారు. అభయ హస్తం పెన్షన్ స్కీంలో చేరేందుకు ఇంకా 73 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అభయహస్తం కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికి అభయహస్తం పెన్షన్ అమలు జరిగేలా చూడాలని ఆమె కోరారు. విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌ను సక్రమంగా అందించకుండా ఇబ్బంది పెట్టడం తగదన్నారు. రోగులకు ప్రభుత్వం సరైన వైద్య సేవలు అందించాలని ఆమె డిమాండ్ చేశారు. విలేఖర్ల సమావేశంలో ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి సుబ్బరావమ్మ, జిల్లా అధ్యక్షులు ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.