పటమట, ఆగస్టు 16: పాఠశాలల్లో విద్యార్థులకు వౌలిక వసతులు కల్పించి ఫలితాల సాధనలో జిల్లాలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేయాలని కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి విద్యాశాఖాధికారులను ఆదేశించారు. విద్యాశాఖ పనితీరు పాఠశాలల వౌలిక వసతుల కల్పనపై గురువారం ఉదయం కలెక్టర్ జిల్లా విద్యాశాఖ, రాజీవ్ విద్యా మిషన్ అధికారులతో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది పదవ తరగతి పరీక్షల్లో ఆశించినమేర ఫలితాలు సాధించలేకపోవడం జరిగిందన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన వౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడు సిద్ధంగా వుంటుందని అన్నారు. నూరు శాతం ఫలితాలు సాధించి జిల్లాను ఆగ్రగామిగానిలిపేందుకు ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేయవలసిన బాధ్యత విద్యాశాఖ అధికారులపై వుందన్నారు. పాఠశాలల్లో నిర్వహిస్తున్న త్రైమాసిక అర్ధ సంవత్సరం యూనిట్ టెస్ట్‌ల అనంతరం సబ్జెక్ట్‌లలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధవహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యనుండే కంప్యూటర్ విద్యను అందించేలా ప్రభుత్వ లక్ష్యాలు నెరవేర్చేవిధంగా ప్రతి విద్యార్థికి ఉత్తమ బోధన అందించాలన్నారు. క్లాసు రూమ్‌లలో అందరూ పాఠ్యాంశాలపై కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్ (డిజిటల్ విద్య)ను భోదించేలా చర్యలు తీసుకోవాలన్నారు. భోదన విధానంలో వస్తున్న ఆధునిక పద్దతులను అవలంబించి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్వహించి విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలన్నారు. ఉచిత విద్యాహక్కు చట్టాన్ని కచ్చితంగా అమలుపరచాలన్నారు. ప్రాథమిక స్థాయిలో పాఠశాలల్లో చేరిన విద్యార్థి జిల్లా పరిషత్ పాఠశాలల్లో పదవ తరగతి విద్యను పూర్తియ్యేవరకు బడి మానకుండా పర్యవేక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. బడిమానిన పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులతో సమావేశమై పిల్లల భవిష్యత్ గురించి వివరించి తిరిగి వారిని బడిలో చేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో ఎటువంటి అవకతవకులకు తావులేకుండా సమర్థంగా పథకాన్ని అమలుపరచాలని అన్నారు. పథకం అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పధకానికి మంజూరు చేసిన దీపం గ్యాస్ కనెక్షన్‌ను వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు. పౌర సరఫరాల సరఫరా చేస్తున్న బియ్యం నాణ్యతలో లోపాలు గుర్తిస్తే వాటిని త్రిప్పి పంపాలన్నారు. జిల్లాలో రాజీవ్ విద్యా మిషన్ అధ్వర్యంలో చేపట్టిన అదనపు తరగతి గదులు, మరుగు దొడ్ల నిర్మాణం వంటి వౌళిక వసతుల పనులను త్వరితగతిన పూర్తిచేసి నివేదికలు అందజేయాలన్నారు. జవహర్ బాల ఆరోగ్య రక్ష పధకాన్ని ప్రతి పాఠశాలలో అమలు పరిచి విద్యార్ధుల ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్దవహించాలన్నారు. మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశాలను ప్రతి మాసం తప్పక నిర్వహించాలని, పాఠశాల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను కమిటీ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు. పాఠశాలల నిర్వహణ, విద్యాభోదనలో అలసత్వం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా ప్రమాణాలను మెరుగపరిచి, ఉత్తమ ఫలితాల సాధన వ్యక్తిగత బాధ్యతగా ప్రతి అధికారి గుర్తించినప్పుడు ఆశించిన లక్ష్యాలను సాధించగలుగుతామని కలెక్టర్ తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి దేవానందరెడ్డి, రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు ఆఫీసర్ మురళీకృష్ణ, డిప్యూటీ డిఇఓలు ఎంవి.కృష్ణారెడ్డి, వెంకటేశ్వరరావు, నరసింహారావు, సాంఘీక సంక్షేమ శాఖ ఇ.ఇ.లు నిరుపాక్షి, ఆర్‌విఎంఇఓ రమణరావు తదితరులు పాల్గొన్నారు.
కూలిన స్కూలు గోడ
* విద్యార్థికి తీవ్రగాయాలు
జి.కొండూరు, ఆగస్టు 16: గుర్తింపు లేని ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల పాలిట యమపాశాలవుతున్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలో గురువారం గోడ కూలి విద్యార్థికి తీవ్రగాయాలు కాగా, ఉపాధ్యాయురాలికి స్వల్పగాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి వెలగలేరులో విజ్‌డమ్ పబ్లిక్ స్కూల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రస్తుతం 150 మంది విద్యార్థుల వరకూ 1 నుంచి 6 తరగతుల వరకూ విద్యనభ్యసిస్తున్నారు. వెలగలేరుతోపాటు పరిసర గ్రామాలకు చెందిన వారు ఈపాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నారు. విజ్‌డమ్ పబ్లిక్ స్కూల్‌కు కోనేరు శారద అనే మహిళ ప్రిన్సిపాల్, కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. విజ్‌డమ్ పబ్లిక్ స్కూల్‌కు ప్రభుత్వ గుర్తింపు లేకుండా యాజమాన్యం పాఠశాలలో తరగతులను నిర్వహిస్తోంది. పాఠశాలను పురాతనమైన రేకుల షెడ్డులోనే కొనసాగిస్తున్నారు. రేకుల షెడ్ పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలకు గోడలు బాగా నానిపోయి కూలిపోయే దశకు చేరుకున్నాయి. ఈ పరిస్థితి కళ్లకు కనిపిస్తున్నా యాజమాన్యం స్పందించలేదు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. దీని ఫలితంగా గురువారం ఉదయం పాఠశాలలో తరగతులు ప్రారంభించిన కొద్ది సమయానికే నాలుగు అడుగుల ఎత్తులో ఉన్న పిట్టగోడ ఒక్కసారిగా కూలింది. పిట్టగోడ కూలి ఐదవ తరగతి చదువుతున్న రాజవరపు మహేష్ అనే విద్యార్థిపై పడింది. దీంతో మహేష్ రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ఈవిషయాన్ని బయటకు పొక్కనీయకుండా పాఠశాల యాజమాన్యం అన్ని ప్రయత్నాలు చేసింది. అయితే ఎట్టకేలకు మీడియా ద్వారా విషయం వెలుగు చూసింది. తీవ్రగాయాలకు గురైన విద్యార్థి మహేష్‌ను అతని తల్లిదండ్రులు విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. విద్యార్థి మహేష్‌తో పాటు క్లాస్ టీచర్ కడియాల పద్మావతికి కూడా స్వల్పగాయాలయ్యాయి. దీనిపై కరస్పాండెంట్ కోనేరు శారదను వివరణ కోరగా పాఠశాల నిర్వహణ కోసం ప్రభుత్వ గుర్తింపుకై సొమ్ము చెల్లించినట్లు తెలిపారు. ప్రమాదవశాత్తు పిట్టగోడ కూలిపోయిందన్నారు. ఈవిషయంపై ఎంఇఓను వివరణ కోరగా జరిగిన ప్రమాద సంఘటనపై ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిపారు. విజ్‌డమ్ పబ్లిక్ స్కూల్‌కు గుర్తింపు లేదని ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్లు వివరించారు. విద్యాసంవత్సరం ఆరంభంలోనే విద్యార్థుల తల్లిదండ్రులకు, గ్రామస్థులకు గుర్తింపు లేని విషయాన్ని తెలియచేశామన్నారు.
అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్ల...
రేషన్ బియ్యం పట్టివేత
ముసునూరు, ఆగస్టు 16: లారీలో అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్ల రేషన్ బియ్యంను ముసునూరు వద్ద గురువారం పట్టుకున్నారు. ఎస్‌ఐ సి వెంకటేశ్వరరావు గురువారం మధ్యా హ్నం వాహనాలను తనిఖీచేసే క్ర మంలో నూజివీడు వైపు నుండి ఏలూరు వెళ్తున్న లారీని నేలపాటివారికుంట సమీపంలో ఆపి తనిఖీ చేశారు. డ్రైవర్ సరైన సమాధానం చెప్పకపోవటంతో లారీని స్థానిక పోలీసు స్టేషన్ వద్దకు తీసుకువచ్చారు. లారీ అక్కడకు చేరుకున్న అనంతరం లారీ డ్రైవర్‌ను ఎస్‌ఐ గట్టిగా ప్రశ్నించటంతో బియ్యం ఉన్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని తహశీల్దార్ శర్మకు తెలిపారు. వెంటనే తహశీల్దార్ లారీ వద్దకు చేరుకుని బియ్యంను పరిశీలించగా అవన్నీ రేషన్ బియ్యంగా గుర్తించారు. ఈ లారీ లోడు సూర్యాపేట నుండి తూర్పుగోదావరి జిల్లా చెల్లూరుకు వెళ్తున్నట్లుగా లారీడ్రైవర్ తెలిపారు. లారీలో ఉన్న బియ్యం సంచులు సక్రమంగా రవాణా చేస్తున్నట్లు అయితే గోనె సంచులలో రవాణా చేయటం జరుగుతుందని, అయితే వేరు వేరు సూపర్ సంచులలో రవాణా చేయటంతో అక్రమంగా తరలుతున్నట్లుగా గుర్తించారు. ఈ బియ్యంను శాంపిల్ తీసి నూజివీడు పౌరసరఫరాల గోదాముకు పంపుతున్నట్లు తహశీల్దార్ శర్మ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
గౌతు లచ్చన్న సేవలు చిరస్మరణీయం
* ఎంపి కొనకళ్ల నివాళి
మచిలీపట్నం టౌన్, ఆగస్టు 16: కార్మిక పోరాట యోధుడు, స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఆయన సేవలు చిరస్మరణీయమని నివాళి అర్పించారు. సర్దార్ గౌతు లచ్చన్న ఆశయ సాధన కమిటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక బస్టాండ్ సెంటరులో 104వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. బందరు పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు, మైలవరం శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు, పలు రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు సర్దార్ గౌతు లచ్చన్న జీవిత విశేషాలను వివరించారు. లచ్చన్న కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాగిత వెంకట్రావు, బచ్చుల అర్జునుడు, కొల్లు రవీంద్ర, కొనకళ్ళ జగన్నాధరావు, బూరగడ్డ రమేష్ నాయుడు, లంకిశెట్టి బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.
అక్రమంగా నిల్వ చేసిన
బియ్యం బస్తాలు స్వాధీనం
జగ్గయ్యపేట, ఆగస్టు 16 : పట్టణంలోని శివాలయం వీధిలో ఒక పీర్ల కొట్టంలో అక్రమంగా నిల్వ ఉంచిన 91 బియ్యం టిక్కీలను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం సాయంత్రం అందిన సమాచారం మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డిటి మురళీకృష్ణ, డివిజన్ పౌరసరఫరాల అధికారిణి సంధ్యారాణిల ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. 25 కేజీల చొప్పున ఉన్న 91 బియ్యం మూటలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి స్థానికంగా ఉన్న ఒక బియ్యం వ్యాపారివిగా భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో విఆర్‌ఒలు ఏలూరి రాంబాబు, రామ్మోహనరావు, సిహెచ్ శ్రీనివాసరావులు పాల్గొన్నారు.
వృద్ధుల సంక్షేమ పథకాల్ని వెంటనే అమలు చేయాలి
గుడివాడ, ఆగస్టు 16: వృద్ధుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా స్థానిక ఎన్టీఆర్ స్టేడియం నుండి తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ప్లకార్డులతో వృద్ధులు ర్యాలీగా బయలుదేరారు. మున్సిపల్ కార్యాలయానికి వచ్చి కమిషనర్ ఎన్ ప్రమోద్‌కుమార్‌కు, అక్కడి నుండి మండల తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ టి దేవదాసుకు, ఆర్డీవో కార్యాలయానికి వెళ్ళి ఆర్డీవో పి రంజిత్ బాషాకు వినతిపత్రాలను అందజేశారు. ఈసందర్భంగా జరిగిన సభలో అసోసియేషన్ డివిజన్ అధ్యక్షుడు వి వెంకట్రావ్ మాట్లాడుతూ దేశ జనాభాలో 10శాతం మంది పైగా ఉన్న వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వాలు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయన్నారు. ప్రభుత్వ జీవోలు, పథకాలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయని, ఒక్కటి కూడా అమలు కావడంలేదన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆలిండియా సీనియర్ సిటిజన్స్ కాన్ఫడరేషన్ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా నిరసన, ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ వృద్ధులకు ఆర్టీసి నుండి ప్రభుత్వరంగ సంస్థల్లో కనీస రాయితీలు కూడా ఇవ్వడంలేదన్నారు. జాతీయ ప్రణాళికలో వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రకటించిన అంశాలను తక్షణం అమలు చేయాలన్నారు. పొరుగు రాష్ట్రాల మాదిరిగా మనరాష్ట్రంలో కూడా 60ఏళ్ళు నిండిన వారికి పింఛన్లు ఇవ్వాలన్నారు. లేకుంటే జాతీయ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డిఎస్‌ఎన్ మూర్తి, కోశాధికారి జె సుబ్బారావు, సభ్యులు ఎన్ సాంబశివరావు, జి సాల్మన్‌రాజు, పి సత్యనారాయణ, షేక్ కరీముల్లా, తుర్లపాటి జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
తోట్లవల్లూరులో...
తోట్లవల్లూరు : వృద్ధుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన పథకాలను అమలు చేయాలని ఆలిండియా సీనియర్ సిటిజన్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపులో భాగంగా గురువారం తోట్లవల్లూరులో వృద్ధులు ర్యాలీ నిర్వహించారు. మండల సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం నాయకులు అమిరిశెట్టి బోస్, గనే్న శ్రీనివాసరావు, కళ్ళం సాంబిరెడ్డి ఆధ్వర్యంలో పలువురు వృద్ధులు ప్రదర్శనలో పాల్గొన్నారు. వృద్ధాప్య పింఛన్‌ని 1000 రూపాయలకు పెంచాలని, వృద్ధుల వయోపరిమితిని 65నుంచి 60సంవత్సరాలకు తగ్గించాలని, ఒక కుటుంబంలో వృద్ధులైన భర్తలకు పింఛన్‌లు ఇవ్వాలని బోస్ డిమాండ్ చేశారు. ప్రదర్శన అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈడ్పుగంటి పోతురాజు తదితరులు పాల్గొన్నారు.
డెంగ్యూతో బాలుడి మృతి
గూడూరు, ఆగస్టు 16: మండల పరిధిలోని రాయవరం గ్రామంలో డెంగ్యూ జ్వరం బారినపడి ఆరేళ్ళ బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన కందుల గోపాలకృష్ణ, రాజేశ్వరి దంపతుల కుమారుడైన భరత వంశీకృష్ణ(6) కొంతకాలంగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ నెల 8నుండి ఆరోగ్య పరిస్థితి క్షీణించటంతో బందరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డెంగ్యూ జ్వరం సోకిందని, మెరుగైన వైద్యం కోసం మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి తీసుకెళ్ళాలని వైద్యులు సూచించటంతో 11న అక్కడకు తీసుకెళ్ళారు. అక్కడ చికిత్సపొందుతూ బుధవారం రాత్రి 10గంటలకు వంశీకృష్ణ మృతిచెందాడు. దీంతో రాయవరంలో విషాదఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న ఎండివో లక్ష్మీకుమారి, తహశీల్దార్ స్వర్ణమేరి, గూడూరు పిహెచ్‌సి వైద్యాధికారి డా. శేషుకుమార్ రాయవరం చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. డా. శేషుకుమార్‌ను వివరణ కోరగా ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి నుండి రిపోర్టులు అందాల్సి ఉందన్నారు. రిపోర్టులు అందిన వెంటనే డెంగ్యూనా, కాదా? అనేది నిర్థారిస్తామని వారు వివరించారు.
మద్యం షాపు తరలించలేదని ధర్నా
తోట్లవల్లూరు, ఆగస్టు 16: తోట్లవల్లూరులో జనావాసాల మధ్య ఉన్న సిరివైన్స్ షాపుని ఆగస్టు 16లోపు వేరేచోటికి తరలిస్తామని షాపు నిర్వాహకులు ఎక్సైజ్ ఎస్‌ఐ, పెద్దల సమక్షంలో రాతపూర్వకంగా ఇచ్చిన హామీని విస్మరించటంతో గురువారం గ్రామస్థులు షాపు ఎదుట ఉదయం 10నుంచి సాయంత్రం 9గంటల వరకు ధర్నా నిర్వహించారు. తాగుబోతులు ఇళ్లలోకి ప్రవేశించటం, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించటం, తదితర కారణాల వల్ల మద్యం షాపుని ఇళ్ళ మధ్య నుంచి వేరేచోటికి తరలించాలని జూలై 16న ప్రజలు ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో ఆరోజు ఎక్సైజ్ ఎస్‌ఐ మాధవి వచ్చి ఆందోళనకారులతో, మద్యం షాపు నిర్వాహకులతో చర్చించారు. మద్యం షాపుని వేరేచోటికి మార్చేందుకు తమకు నెలరోజుల గడువు కావాలని, ఆగస్టు 16లోపు మారుస్తామని షాపు నిర్వాహకుడు ఎన్ రమణ లేఖ రాసిచ్చారు. దీనికి ఆందోళనకారులు సమ్మతించారు. కాని ఆగస్టు 16వచ్చినా షాపుని మార్చకపోవటంతో గురువారం ఉదయం 10గంటలకు వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు కిలారం శ్రీనివాసరావు, డక్కమడుగుల ఏసు, అబ్దుల్ సత్తార్, బాబావలీ ఆధ్వర్యంలో తాడికొండ దుర్గారావు, సుధాకర్, టి కిషోర్, కె ధర్నాకి కూర్చున్నారు. దీంతో షాపుని తెరవటానికి అవకాశం కలగలేదు. అయితే షాపు నిర్వాహకులు వెనుక వైపుగా రహదారిని ఏర్పాటు చేసి మద్యం షాపుని తెరచి అమ్మకాలు సాగిస్తున్నారు. వెనుక వైపు 50 మీటర్ల దూరంలో సాయిరాం రిజిస్టర్డ్ కానె్వంటు, 70 మీటర్ల దూరంలో శివాలయం ఉన్నాయని, బడిగుడి నిబంధనలకు విరుద్దంగా షాపుని నిర్వహిస్తున్నారని శ్రీనివాసరావు ఆరోపించారు. ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందించినా వారు స్పందించలేదని తెలిపారు. లేఖ రాసిచ్చిన రమణను అడిగితే మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండని అంటున్నాడని విమర్శించారు. ఉదయం 10గంటలకు మొదలైన ధర్నా రాత్రి 9గంటల వరకు కొనసాగింది.
ఆరు ఇసుక ట్రాక్టర్‌లు పట్టివేత
వత్సవాయి, ఆగస్టు 16: అక్రమంగా రవాణా చేస్తున్న ఆరు ఇసుక ట్రాక్టర్‌లను రెవెన్యూ అధికారులు బుధవారం రాత్రి పట్టుకున్నారు. మండలంలోని లింగాల మునే్నటి నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న సమాచారం తెలుసుకున్న తహశీల్దార్ వెనె్నల శ్రీను, ఆర్‌ఐ నాగరాజులు తమ సిబ్బందితో దాడి చేసి ట్రాక్టర్‌లను స్వాధీనం చేసుకొని తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఈ దాడిలో విఆర్‌ఒ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
కొండచిలువను
చంపిన గ్రామస్థులు
వత్సవాయి, ఆగస్టు 16: ప్రమాదకర కొండచిలువను స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద కూలీలు గుర్తించి చంపివేశారు. గురువారం స్థానిక గాంధీ బొమ్మ సెంటర్‌లో దాదాపు 9 అడుగులు ఉన్న కొండచిలువ వెళుతూ ఉండగా స్థానికులు దాన్ని గుర్తించారు. వెంటనే దాన్ని కర్రతో కొట్టి చంపారు. కొండచిలువ సెంటర్‌లోకి చేరడంతో ప్రజలు ఆందోళన చెందారు. చంపివేసిన కొండచిలువను చూసేందుకు పెద్దఎత్తున జనం అక్కడ పోగయ్యారు.
వణికిస్తున్న మలేరియా
పాతబస్తీ, ఆగస్టు 16: మలేరియా జ్వరాలతో పాతబస్తీవాసులు వణికిపోతున్నారు. ప్రత్యేక పారిశుద్ధ్య పక్షోత్సవాలు- పరిశుభ్రతంటూ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినాగాని మలేరియా జ్వరాలను నివారించలేకపోయారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికున్ గున్యా తదితర వ్యాధుల బారిన పడుతున్న బాధితులను కాపాడాలని, పారిశుద్ధ్యాన్ని పాటించాలని మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ అజీమ్ చేసిన కసరత్తు కొంత మేరకు చెత్తా చెదారాన్ని నియంత్రించడానికి ఉపయోగపడిందేగాని ప్రజలను రోగాల బారి నుండి కాపాడలేకపోయిందని పాతబస్తీవాసులు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా కొండ ప్రాంతవాసుల్లో, నగర ప్రజల్లో చెత్తా చెదారంపై అవగాహన సదస్సులు నిర్వహించినా ఇంటింటా చెత్త సేకరణ పకడ్బంధీగా సేకరించినా గాని దోమకాటు బారినుండి పాతబస్తీవాసులు తప్పించుకోలేకపోతున్నారు. కెఎల్‌రావు నగర్, మొహంతిపురంలో మలేరియా వ్యాధి పీడితులు ఎక్కువయ్యారు. కలరా ఆసుపత్రిలోని మలేరియా రక్తపరీక్షల కేంద్రంలో రానురాను మలేరియా కేసుల నమోదు ఎక్కువయింది. సిబ్బంది పరుగులు తీస్తున్నాగాని అంతకు మించిన విధంగా మలేరియా వ్యాధి కారకమైన క్యూలెక్స్ దోమ కాటు చకచకా జరిగిపోతోంది. స్థానికులు దోమల నిరోధానికి ఎన్ని మార్గాలు అవలంబించినా, పలు రకాల కంపెనీల ఉత్పాదకాలు వాడినా దోమలను పూర్తి స్థాయిలో నియంత్రించలేకపోతున్నారు. నగరపాలక సంస్థ ప్రజా ఆరోగ్య శాఖ అధికారులు దోమల నియంత్రణకు చేపట్టిన చర్యలు ఏమాత్రం ఫలించలేదు. కెఎల్ రావు నగర్, ధీనదయాల్ నగర్, బ్యాంకు కాలనీ, అంబేద్కర్ కాలనీ తదితర ప్రాంతాల్లో ఒక్కరోజే 14 మలేరియా కేసులు నమోదవడంతో మలేరియా సిబ్బంది పరుగులు తీశారు. బాధితుల ఇళ్లకు వెళ్లి పరిసరాలు గమనించి దోమల నివారణకు పైరాత్రిన్ పిచ్‌కార్ చేశారు. అలాగే బాధితులకు మలేరియా నివారణ మందులు పంపిణీ చేశారు. కొండప్రాంత వాసులది కూడా ఇదే స్థితి. అలాగే మొహంతిపురం, కుమ్మరివీధి, తదితర ప్రాంతవాసులు మలేరియా జ్వరాలతో వణికిపోతున్నారు. షేక్ రాజాసాహెబ్ నగరపాలక సంస్థ ప్రసూతి వైద్యశాల ప్రాంగణంలో ఉన్న మలేరియా విభాగపు అధికారులు నిరంతరం శ్రమిస్తున్నాగాని క్యూలెక్స్ దోమలు రానురాను పెరుగుతూనే ఉన్నాయి. పలు రకాల కంపెనీల ఉత్పాదకాలు వాడుతూ దోమ కాటు నుండి తమని తాము కాపాడుకోవాలని చూస్తున్న స్థానికులు తలనొప్పి, వొళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. దోమల కోసం వాడుతున్న రసాయనాల వల్ల దుష్పలితాలెక్కువవుతున్నాయేగాని దోమలు మృతి చెందడంలేదని పాతబస్తీవాసులు ఆవేదన చెందుతున్నారు.
దోమతెరలే సరైన మార్గం
దోమల నియంత్రణకు ఎన్నిరకాల మందులు, రసాయనాలు, గుళికలు వాడినా వాటివల్ల వాతావరణం కలుషితమవుతుందేగాని దోమలను నియంత్రించలేమని దోమ తెరలే సరైన మార్గమని వైద్యులు సూచిస్తున్నారు. ఎంతటి రసాయనాలనైనా తట్టుకునే స్థితికి దోమలు పరిణామం చెందాయని వాటికి హాని కలుగకుండా దేహంలో ప్రతి రక్షకాలు ఏర్పాటు చేసుకుంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. వాటిని నియంత్రించాలని పలు రకాల కంపెనీల ఉత్పదకాలు వాడడంవల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువవుతున్నాయని, 10 సంవత్సరాలలోపు చిన్నారుల మానసిక అలజడికి కారకాలైన రసాయనాల వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని సలహా ఇస్తున్నారు. దోమ తెరలే సరైన మార్గాలంటున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి ఎన్ని రకాల పరిశుభ్రతలు పాటించినా దోమల జననాలను, వాటి లార్వాలను నియంత్రించలేము. అందుకే స్వచ్ఛంద సంస్థలు, లేదా నగరపాలక సంస్థలు పేదవారికి ఉచితంగా దోమతెరలు అందించాలని పాతబస్తీవాసులు కోరుతున్నారు.
అయోమయంలో బిఆర్‌టిఎస్!
పాయకాపురం, ఆగస్టు 16: బిఆర్‌టిఎస్ (బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం) పరిస్థితి ప్రస్తుతం అయోమయంగా తయారైంది. కేంద్ర ప్రభుత్వ జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద దాదాపు 153 కోట్ల వ్యయంతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బిఆర్‌టిఎస్ పథకం వాస్తవానికి ఎన్నో ఉన్నత ఆలోచనలతో ప్రవేశపెట్టింది. సత్యనారాయణపురం రైల్వేట్రాక్ స్థానంలో చేపట్టిన ఈ రోడ్డు నిర్మాణం ఇప్పటికీ 4.3 కిలో మీటర్ల దూరం వరకు పూర్తయింది. మధ్యమధ్యలో బస్‌షెల్టర్ల నిర్మాణం కూడా పూర్తయింది. దీనిలో భాగంగా గుణదల సమీపంలో వంతెనల నిర్మాణం కూడా జరిగింది. అయితే, ఏలూరురోడ్డులోను, కేదారేశ్వరపేట వైపు మీసాలరాజారావు వంతెన నుండి రైల్వే స్టేషన్ వైపు రోడ్డు కొనసాగింపు నిలిచిపోయింది. ఇంత ఖర్చు చేసినప్పటికీ పూర్తిస్థాయిలో బిఆర్‌టిఎస్ రోడ్డు నిర్మాణం జరుగలేదు. ఈ రూట్‌లో ప్రత్యేక బస్సులు నడిపేందుకు తాము సిద్ధంగా లేమని రెండు నెలల క్రితం నగరానికి విచ్చేసిన ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఎకె ఖాన్ స్పష్టం చేశారు. ఇక ఈ రూట్‌లో ప్రత్యేక బస్సుల్ని ఎప్పుడు నడుపుతారో విజ్ఞులైన పాలకులే చెప్పాలి. వాస్తవానికి ఈ బిఆర్‌టిఎస్ కారిడార్ 15.5 కిలోమీటర్లకు పరిమితం కావాల్సి ఉంటే కేవలం నాలుగు కిలోమీటర్లకే పరిమితమైంది. మీసాల రాజారావు వంతెన తర్వాత ఇతర బస్సులతో సమానంగా ఆంధ్రపత్రిక సెంటర్ నుంచి రైల్వేస్టేషన్, అటుపై పోలీసుకంట్రోల్ రూంకు వెళ్లాలి. మరోవైపు గుణదల మేరీమాత గుడి సమీపంలో ఏలూరురోడ్డు నుండి ఇతర బస్సులతో తిరగాల్సి ఉంది. అసలు బిఆర్‌టిఎస్ రోడ్డులో ప్రత్యేక బస్సులతోపాటు ఇతర బస్సులు తిరగాల్సి ఉంది. ఇందుకు వీలుగా రోడ్డు సదుపాయం ఉంది. అసలు ఈ ప్రాజెక్టు విజయవంతం కోసం నగర పాలక సంస్థ, ఆర్టీసీ, ఉడా, ఆర్టీఎ, పోలీసు శాఖలు సంయుక్తంగా పనిచేసేలా ‘స్పెషల్ పర్పస్ వెహికల్ బోర్డు’ ఏర్పాటైనా దీనివల్ల ఒనగూడిన ప్రయోజనం మాత్రం శూన్యంగానే చెప్పొచ్చు. ఈ ప్రాజెక్టును నడపటానికి వర్కింగ్ క్యాపిటల్‌ను 50 లక్షలు, లాభనష్టాల్ని భరించేందుకు షేరింగ్ వాటాను ఖరారు చేశారు. పైగా ఈ కారిడార్‌లో నడిపే బస్సుల కనీస ఛార్జీ 7కాగా, గరిష్ఠంగా 11రూపాయలకు నిర్ణయించారు. ఏదేమైనా ఈ కారిడార్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. అందుకే నేటికీ బిఆర్టీఎస్ బస్సుల కోసం పూర్తి స్థాయి ఎక్స్‌క్లూజివ్ కారిడార్ ఏర్పాటు కాలేకపోవడం, ఈ మార్గంలో బస్సుల్ని నడిపేందుకు ఆర్టీసీ ముందుకు రాకపోవడం వంటివి జరుగుతున్నాయని చెప్పొచ్చు.
అస్సోం ప్రత్యేక రైళ్లపై నిఘా
విజయవాడ , ఆగస్టు 16: అస్సోంలో జరుగుతున్న విధ్వంసకాండలో వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న అస్సోం వాసులు తమతమ గమ్య స్థానాలకు తిరుగు ప్రయాణమవుతున్నారు. వీరిలో అత్యధిక శాతం బెంగళూరు ప్రాంతంలో పనిచేస్తున్నారు. వీరి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే బెంగళూరు నుండి గౌహతికి ప్రత్యేక రైలు నడుపుతోంది. ఈ రైలు గంటన్నర ఆలశ్యంగా విజయవాడకు చేరుకుంది. ప్రత్యేకంగా వెళుతున్న ఈ రైలు విజయవాడకు చేరుకోగానే రైల్వే ప్రొటక్షన్ ఫోర్సుకు చెందిన అసిస్టెంట్ సికార్డు కమిషనర్ పొన్నురాజు, ప్రభుత్వ రైల్వే పోలీస్ డెప్యూటి పోలీస్ సూపరింటెండెంట్ మహేష్, జిఆర్‌పి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చిరంజీవి, ఆర్‌పిఎఫ్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వర్‌రెడ్డితోపాటు వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది ఆ రైలు వద్దకు పరుగులు తీశారు. దీంతో ఏం జరుగుతుందోనని రైలులో ఉన్న ప్రయాణికులు బెంబేలెత్తి బోగీ తలుపులు బిగించుకున్నారు. ఈ సంర్భంగా రైల్వే ఎడిఆర్‌ఎం సుబ్బారావు మాట్లాడుతూ అస్సోంలో జరుగుతున్న అల్లర్ల దృష్ట్యా స్వస్థలాలకు వెళ్లడం మంచిదే అయినా ప్రశాంత వాతావరణం కోసం ముందు జాగ్రత్త చర్యగా తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
సిపి ఎదుట లొంగిపోయిన హత్యకేసులో నిందితుడు
విజయవాడ , ఆగస్టు 16: భార్య హత్య కేసులో నిందితునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్త గురువారం తన న్యాయవాది సాయంతో పోలీసు కమిషనర్ ఎన్ మధుసూదనరెడ్డి ఎదుట లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే... కొద్దిరోజుల క్రితం కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్‌కు చెందిన లక్ష్మీకుమారి అనే వివాహిత హత్యకు గురైన విషయం తెలిసిందే. కాగా ఆమె భర్త గవిర్నేని సురేష్‌బాబు చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండటమే ఇందుకు కారణం. అక్రమ సంబంధమే హత్యకు కారణమని పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. కాగా నిందితుని కోసం హనుమాన్ జంక్షన్ పోలీసులు గాలిస్తున్నారు. కాగా అతను తన న్యాయవాది సాయంతో గురువారం కమిషనర్ కార్యాలయానికి వచ్చి సీపి ఎదుట లొంగిపోయాడు. దీంతో సీపి ఆదేశాల మేరకు సూర్యారావుపేట పోలీస్టేషన్‌లో సరెండర్ అయ్యాడు. సూర్యారావుపేట పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్న మీదట సమాచారం అందించగా హనుమాన్ జంక్షన్ పోలీసులు వచ్చి అతని అదుపులోకి తీసుకుని వెళ్ళారు.
దుర్గగుడికి ట్రస్ట్‌బోర్డు ఏర్పాటు?
ఇంద్రకీలాద్రి, ఆగస్టు 16: శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానానికి ‘ట్రస్ట్‌బోర్డు’ను ఏర్పాటు చేయటానికి దాదాపు రంగం సిద్ధం ఆయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా లభించిన కీలక సమాచారం. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్, శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తదితరులు సమష్టిగా నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఒక జాబితాను తయారుచేసి వారికే ఈనామినేటెడ్ పదవులను ఇప్పించాలని నాయకులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావుకు తొలి నుండి పార్టీలకు రహితంగా అన్ని విధాలుగా వెన్నంటి ఉంటున్న పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు మాత్రం వెలంపల్లి సిఫారస్ చేసిన జాబితాలోని పేర్ల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. యంపి లగడపాటి రాజగోపాల్ నగరాల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బాయన వెంకట్రావు, కమిలి సత్యనారాయణ, వెస్ట్ శాసన సభ్యుడు వెలంపల్లి వర్గం నుండి బుద్ధా రాంబాబు, కొనగళ్ళ విద్యాధరరావు, సెంట్రల్ నియోజక శాసన సభ్యుడు మల్లాది విష్ణు తరఫున విక్రం మోహన్, కొండపల్లి సత్యం, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు పైలా సోమినాయుడు తరఫున యస్‌సిసెల్ అధ్యక్షుడు కాలే పుల్లారావు, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ బచ్చు మాధవీ తదితరుల నుండి ఈసిఫార్స్‌ల పేర్లతో జాబితా తయారు చేసినట్లు సమాచారం. వారితోపాటు డోనర్స్, అర్చకుల వర్గాల నుండి మరో ఇద్దరు మొత్తం 9మంది కమిటీ సభ్యులతో కూడిన బోర్డు ఎర్పాటు తర్వాత చైర్మన్ ఎంపికపై మరోసారి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకొంటారని సమాచారం. రాష్ట్రంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత ఆంతటి పేరు కలిగి ఆదాయంలో సైతం రెండవ స్థానంలో ఉన్న శ్రీకనకదుర్గమ్మ దేవస్థానానికి ట్రస్ట్‌బోర్డు లేకుండానే పార్టీ అధిష్ఠాన వర్గం ఇప్పటివరకు కేవలం ఆర్‌జెసితోనే పాలన సాగిస్తోంది. నాయకులు అందరు కలిసి సమష్టిగా ఈ జాబితాను రూపొందించినట్లు వార్తలు రావటంతో ఈసారి దుర్గగుడికి ట్రస్ట్‌బోర్డు ఏర్పాటు చేయటం ఖాయమని సీనియర్ నాయకులు తెలిపారు.
ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
అజిత్‌సింగ్‌నగర్, ఆగస్టు 16: గ్రామాల్లో ఏడాదిపాటు పనిచేయాలన్న ప్రభుత్వ నిబంధనలకు నిరసనగా జూనియర్ డాక్టర్లు, హౌస్ సర్జన్లు పిజి మెడికల్ విద్యార్థులు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గురువారం మధ్యాహ్నం ప్రభుత్వ ఆస్పత్త్రిలో సుమారు ఐదు వందల మంది తమ విధులను బహిష్కరించి తమ నిరసన తెలిపారు. పిజి మెడికల్ పిజిని పూర్తి చేసినవారు తప్పనిసరిగా గ్రామాల్లో పనిచేసి తీరాలని నిబంధన విధించిన ప్రభుత్వం అందుకనుగుణంగా ఎటువంటి మార్గదర్శకాలను నిర్దేశించకుండా విద్యార్థులను ఇబ్బందుల పాల్జేస్తున్న తీరుపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై తక్షణమే స్పష్టమైన హామీ ఇవ్వాలని పేర్కొంటూ వారు డిమాండ్ చేసారు.