Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కలెక్టర్‌గారూ...మీకిది తగునా!

$
0
0

నెల్లూరు , ఆగస్టు 16: ఒకరం...ఇద్దరం కాదు పది వేల మందికి పైగా ఇక్కడకు చేరుకున్నాం.. .మీరు వస్తామని రాలేదు...అంతేగాక ఏ ఒక్క అధికారి కూడా ఇటుగా రానే లేదు...ఇది ధర్మమా అంటూ పెద్ద సంఖ్యలో ముస్లిం మహిళలు ఆవేదన వ్యక్తపరిచారు. గురువారం స్థానిక సర్వోదయ కళాశాల ప్రాంగణంలో ముస్లింమ్ మైనారిటీ మహిళల్ని స్వయం సహాయక గ్రూపులుగా చేర్పించేందుకు అజీజ్ చారిటబుల్ ట్రస్ట్ నేతృత్వంలో ప్రత్యేక సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు హైదరాబాద్ నుంచి మైనారిటీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ దన కిషోర్ నెల్లూరుకు తరలిరావడంతో తామెంతో తొలుత సంతోషించామంటూ మహిళలు సభాముఖంగా పేర్కొన్నారు. అయితే రాజకీయ కారణాల నేపథ్యంలో ఆ రాష్టస్థ్రాయి అధికారి ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడం విడ్డూరంగా ఉందని వాపోయారు. జిల్లా కలెక్టర్ అనుమతితో నిర్ణయించిన తేదీ, సమయానికి అనుగుణంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటికీ ఆయన కూడా తమపై దయతలచకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అంతేగాకుండా జిల్లాలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా రాజకీయ కారణాల నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం కోసం 370 పొదుపుగ్రూపులు ఏర్పాటయ్యాయన్నారు. అయితే తామంతా మరో రెండురోజుల్లో రంజాన్ పండుగ పర్వదినం ఉన్నప్పటికీ, బుధవారం రాత్రంతా జాగారం చేసినా ఈ కార్యక్రమానికి హాజరైనా అధికారులు కనీస మానవతా ధృక్పదం, నైతిక విలువలు పాటించకపోవడం దారుణమని దుయ్యబట్టారు.

సిలికా తవ్వకాల తనిఖీ
చిల్లకూరు, ఆగస్టు 16: మండలంలోని అద్దేపల్లి గ్రామంలో సిజెఎఫ్‌ఎస్ భూముల్లో అక్రమంగా సిలికా తరలిస్తున్న భూములను గురువారం మైనింగ్, జియాలజీ విభాగం ఏడి సుబ్బారెడ్డి, సర్వేయర్, జియాలజిస్టు, పోలీసులు గురువారం తనిఖీ చేశారు. ఆ గ్రామంలోని ఓ సర్వేనంబర్‌లో 11.80 ఎకరాల స్థలంలో హిటాచీ ద్వారా సిలికా తవ్వకాలు తవ్వుతుండగా హిటాచీని సీజ్ చేసి ఎంత లోతు వరకు సిలికా తవ్వకాలు జరిపారన్నదానిపై సర్వే నిర్వహించారు. ఇందుకు సంబందించి రెవిన్యూ అధికారులు, పోలీసులు అక్రమ సిలికా తవ్వకాల నిర్వహకులపై శాఖాపరమైన చర్యలు తీసుకొనడం జరుగుతుందని ఎడి సుబ్బారెడ్డి తెలిపారు.

ధర్మాన రాజీనామా ఆమోదానికి
గడువులేదు: మంత్రి ఆనం
నెల్లూరు టౌన్, ఆగస్టు 16: రోడ్లు భవనాల మంత్రిగా పనిచేస్తూ సిబిఐ చార్జిషీట్ నేపథ్యంలో రాజీనామా సమర్పించిన ధర్మాన ప్రసాదరావువ్యవహారాన్ని కాంగ్రెస్‌పార్టీ పరిశీలనలో ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక టౌన్‌హాల్‌లో జరిగిన ఆర్టీసీ కార్మికుల రక్తదాన శిబిరానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక విలేఖర్లతో మంత్రి ఆనం మాట్లాడుతూ ఇప్పటికే సిఎం గవర్నర్, పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ జాతీయ కమిటీ ప్రధాన కార్యదర్శితో ప్రత్యేకంగా చర్చించామన్నారు. రాజీనామా ఆమోదానికి ఎలాంటి గడువులేదంటూ మంత్రి ఆనం వ్యాఖ్యానించారు. ఇదిలాఉంటే నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయూ) ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాల్ని చేపట్టడం ఎంతో విశేషమంటూ కొనియాడారు. ఎన్‌ఎంయూకు గౌరవప్రదమైన పదవిలో రాణిస్తున్న స్థానిక డిఆర్ ఉత్తమ్ హోటల్ అధినేత కొడవలూరు ధనుంజయరెడ్డి తమ కుటుంబ సభ్యుడి వంటి వాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇంకా నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమూద్, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల్లో శాస్ర్తియ సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించేందుకే
విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలు
సూళ్లూరుపేట, ఆగస్టు 16: విద్యార్థుల్లో శాస్ర్తియ సాంకేతిక రంగాల్లో పెంపొందించేందుకే విద్యా, వైజ్ఞానిక ప్రదర్శలను నిర్వహిస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. గురువారం సూళ్లూరుపేటలోని జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి విద్యా,వైజ్ఞానిక ప్రదర్శనలను ఆయన ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీ్ధర్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులపై దృష్టిపెట్టి సైన్సు రంగం పట్ల అవగాహన పెంపొందించాలన్నారు. ఈ ప్రాంతంలో షార్ ఉన్నందున విద్యార్థులను శాస్త్ర సాంకేతిక రంగంలో ఎదిగే విధంగా కృషి చేయాలన్నారు. దేశం సాంకేతిరంగంలో ముందుకు వెళ్లాలంటే విద్యార్థులు ఆవైపు అడుగులు వేయాలన్నారు. ఇటువంటి ప్రదర్శనలను రాష్టస్థ్రాయిలో నిర్వహించి జాతీయ స్థాయిలో తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. ముందుగా సభను మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

విద్యార్థులకు మెరుగైన బోధన లేదు: ఎమ్మెల్సీ విఠపు
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన బోధన లేక శాస్తస్రాంకేతిక రంగాల్లో వెనుకబడి శాస్తవ్రేత్తలు కాలేకపోతున్నారని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం అన్నారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించి బోధన విధానంలో మార్పులు తీసుకొస్తే శాస్త్ర సాంకేతిక రంగంలో విద్యార్థులు ఎదిగేందుకు వీలుంటుందన్నారు. సూళ్లూరుపేటలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఈ ప్రాంతానికి ఎంతో మంచిదని ఎమ్మెల్యే పరసావెంటకరత్నం తెలిపారు. పక్కనే షార్ కేంద్రం ఉన్నందున ఈ ప్రదర్శనలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. చదువుతోపాటు విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుకెదగాలని ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి అన్నారు. విద్యార్థులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొంటే సైన్సురంగంలో
మందుకు వెళ్లెందుకు వీలుటుందని జిల్లా కలెక్టర్ శ్రీ్ధర్ అన్నారు. డిఆర్‌డిఎ పిడి వెంటకసుబ్బయ్య,డిఇవో మువ్వరామలింగం,డిప్యూటి డిఇవో ప్రసన్నంజనేయులు,గూడూరు డి ఎస్పీ సురేష్‌కుమార్,చెంగాళమ్మ ట్రస్టుబోర్డు చైర్మన్ ఇసనాక హర్షవర్ధన్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రామాపురం కేంద్రంగా తమిళనాడుకు ఇసుక అక్రమ రవాణా
తడ, ఆగస్టు 16: జిల్లా నుండి తమిళనాడుకు అక్రమంగా జరుగుతున్న ఇసుక రవాణాపై జిల్లా కలెక్టర్ బి శ్రీ్ధర్ సీరియస్ అయ్యారు. కలెక్టర్ గురువారం తడ మండలం భీముల వారిపాలెం చెక్‌పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో ఇసుక రీచ్‌ల నుండి తమిళనాడుకు అక్రమంగా ఇసుక తరలి పోతోందని గుర్తు చేశారు. మండలంలోని రామాపురం పేరుతో ఇసుక వ్యాపారులు బిల్లులు చూపిస్తున్నారని అక్కడున్న అధికారులు తెలిపారు. అందువల్ల తామేమి చేయలేక పోతున్నామని చెప్పడంతో కలెక్టర్ స్పందించి చెక్‌పోస్టుకు అవతల వైపు ఉన్న రామాపురంలో గృహాలు ఎన్ని నిర్మిస్తున్నారో అంతకంటే ఎక్కువ ఇసుక తరలి పోతూ అక్కడ నుండి తమిళనాడుకు చేరుస్తున్న దృష్ట్యా ఇక ముందు రామాపురానికి ఎవరైనా ఇసుక అనుమతికైతే జిల్లా అధికారులను సంప్రదించాలన్నారు. చెక్ పోస్టు అధికారులు తమకు తగినంత సిబ్బందిలేని కారణంగా ఇసుకలారీలను ఆపడానికి భయపడుతున్నామన్నారు. దీంతో ఆయన స్పందించి అవసరమైతే అదనపు సిబ్బందిని నియమిస్తామన్నారు. తనిఖీ కేంద్రానికి ఇరువైపులా రాత్రి వేళల్లో లారీలను గుర్తించడానికి మాక్స్ లైటింగ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక రవాణాను పూర్తిగా అరికట్టడానికి జిల్లా కేంద్రంలో శుక్రవారం టాస్క్ ఫోర్సు సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, అందులో కఠిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. తడ తహశీల్దార్ జాలిరెడ్డి ఉన్నారు.

విద్యుత్‌ను ఆదా అలవర్చుకోవాలి
సూళ్లూరుపేట,ఆగస్టు 16: సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయ సమీపంలోని కోటి 20 లక్షలతో నూతనంగా నిర్మించిన 33బార్ 11కెవి విద్యుత్ సబ్ స్టేషన్‌ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గురువారం ప్రారంభించారు. సూళ్లూరుపేట పట్టణంలో విద్యుత్ లోడు అధికం కావడంతో రాత్రి వేళల్లో తరచూ విద్యుత్ అంతరాయం ఏర్పడేది. ఈ నేపథ్యంలో డిస్కం ఇక్కడ మరో సబ్ స్టేషన్‌ను ఏర్పాటుకు అయిదేళ్ళ కిందట రంగం సిద్ధం చేసింది. డిస్కం అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధుల సాయంతో మంత్రి ఆనం దృష్టికి తీసుకెళ్లడంతో హైవే పక్కనే ఉన్న ఖాళీ స్థలం కేటాయించారు. దీంతో వెంటనే డిస్కం సబ్‌స్టేషన్ నిర్మాణం చేపట్టి మంత్రి చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విద్యుత్ సమస్య ఉండడమే కాకుండా రాత్రి వేళల్లో లోఓల్టేజి సమస్య తీవ్రంగా ఉండడంతో ప్రజలకు ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు మరో సబ్‌స్టేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ శ్రీ్ధర్ మాట్లాడుతూ వినియోగదారులు, రైతులు కరెంట్‌ను అవసరం మేర వాడి ఆదాచేస్తే మంచిదన్నారు. ఈ సబ్‌స్టేషన్ నుండి సూళ్లూరుపేట పట్టణంలోని సాయినగర్, సూళ్లూరు, జియన్‌టిరోడ్డు, తడ మండలం వెండ్లూరుపాడు, కాదలూరు, పొన్నపాడు, పులివేంద్ర గ్రామాలకు విద్యుత్ సరఫరా ఆగి పోతోందని డిస్కం అధికారులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే పరసావెంకటరత్నం, ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం, నెల్లూరుజిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, చెంగాళమ్మ ట్రస్టుబోర్డు చైర్మన్ ఇసనాక హర్షవర్దన్ రెడ్డి, దేవారెడ్డిసుధాకర్ రెడ్డి, డిస్కం ఎస్‌ఈ నందకుమార్, డిఈ అంజనీకుమార్, ఎడిఎ ప్రభాకర్, ఎఇలు శేషగిరిరావు, జ్ఞానప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
పర్యాటక రంగ అభివృద్ధికి కృషి
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చొరవ చొరవతీసుకుంటోందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మన్నారుపోలూరు ఆలయం వద్ద రూ. 2.73 కోట్లతో నిర్మించిన టూరిజం అతిథి భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టూరిజం అభివృద్ధిలో భాగంగానే మన్నారుపోలూరు ఆలయాన్ని టూరిజం కారిడార్‌లో చేర్పించి అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టామన్నారు. అందులో భాగంగానే టూరిజం కింద ఈ ఆయానికి రూ.2.73కోట్లు నిధులు మంజూరు చేశామన్నారు. తాగునీటి సౌకర్యార్థం 40 వేల లీటర్ల సామర్థ్యం గల ఓహెచ్‌ఆర్ నీటి ట్యాంకు కూడా నిర్మించామన్నారు. ఎంతో చరిత్ర కలిగిన మన్నారుపోలూరు ఆలయాన్ని జిల్లాలో చారిత్రిక ఆలయంగా తీర్చిదిద్దేందుకు స్థానిక ఎమ్మెల్యే పరసారత్నం, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొంటున్నారన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో టూరిజం అభివృద్ధికి మంత్రి ప్రత్యేక చొరవతీసుకొంటున్నారని ఎమ్మేల్యే పరసారత్నం ప్రశంసించారు. కలెక్టర్ శ్రీ్ధర్, ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రమణ్యం, వాకాటి నారాయణ రెడ్డి, జిల్లా టూరిజం శాఖాధికారి నాగభూషణం, పంచాయతీ రాజ్ ఎస్‌ఈ శ్రీరాములు, ఈఈ చంద్రశేఖరయ్య, డిఈ గిరినాథ్, ఎఇ మహీధర్ రెడ్డి పాల్గొన్నారు.

శంకరాచార్యులు అద్వైత స్థాపకులు కారు
ప్రచారకులు మాత్రమే
చాగంటి కోటేశ్వరరావు వ్యాఖ్య
వెంకటగిరి, ఆగస్టు 16: ఆదిశంకరాచార్యులు అద్వైత స్థాపకులు కారని ప్రచారం మాత్రమే చేశారని ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు బహ్మర్షి చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. పట్టణంలోని కర్మకమ్మవీధిలో శంకరమఠం నిర్మించి నేటికి వందేళ్లు కావడంతో గురువారం శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా స్థానిక జెడ్పి బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం రాత్రి శంకరవిజయం అన్న అశం పై చాగంటి కోటేశ్వరరావుతో ఆధ్యాత్మిక ఉపన్యాస కార్యక్రమన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ శంకరాచార్యులు తన జీవితంలో పరుల గురించి ఆలోచించారే తప్ప తన గురించి ఏనాడు ఆలోచించని మహా పురుషుడని తెలిపారు. ఎప్పుడు వాహనం ఎక్కకుండా పదహారేళ్లలోపే ఆశేతు హిమాచాలన్ని మూడు సార్లు చుట్టుముట్టారన్నారు. వివాహం చేసుకుంటే దేశాన్ని చుట్టడం సాధ్యం కాదని, తన తండ్రి కోరికను కూడా కాదని సన్యాసం పుచ్చుకున్నారన్నారు. దేశంలో జాతీయ సమైక్యత గురించి మాట్లాడిన వారు ఉన్నారంటే అది ఆదిశంకరాచార్యులు మాత్రమేనన్నారు. అనంతరం శంకరమఠంలో ఆధ్వర్యంలో చాగంటి దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముందుగా చాగంటి కోటేశ్వరరావు, స్థానిక రాజ కుటుంబీకులు, సరస్వతీ పుతుడ్రు, సంగీతగేయధార సృష్టికర్త డాక్టర్ సాయికృష్ణ యాచేంద్ర, ఎస్వీబీసీ భక్త్ఛినల్ ఈవో రామానుజం, ధర్మప్రచార పరిషత్ సభ్యులు వెంకటశర్మ, జ్యోతి ప్రజ్వలన చేశారు.

పైపు లైను పనులకు శంకుస్థాపన
నెల్లూరు కల్చరల్, ఆగస్టు 16: నగరంలోని 3,4 డివిజన్లు ఎక్స్‌టెన్షన్ ప్రాంతాలైనప్పటికీ అభివృద్ధే ధ్యేయంగా పనులు చేస్తున్నామని నగర శాసనసభ్యులు ముంగమూరు శ్రీ్ధరకృష్ణారెడ్డి పేర్కొన్నారు. స్థానిక మంగలదిబ్బలో 13వ ఫైనాన్స్ కింద 97 లక్షల 30 వేల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న పైపు లైను పనులకు గురువారం ముంగమూరు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని డ్రైనేజీ వాటర్, వర్షపు నీరు, పొల్యూటెడ్ వాటర్‌ను ట్రీట్‌మెంట్స్ ప్లాంట్ల ద్వారా మురికిని తొలగించి శుద్ధి చేసిన నీటిని సర్వేపల్లి కాలువలోకి పంప్ చేస్తామని చెప్పారు. నీరు భూమిలోకి ఇంకిపోకుండా కాలువలోకి వదులుతామన్నారు. మంగలిదిబ్బ ప్రాంతంలో నిర్మించే డ్రైనేజీ ప్రాజెక్టు తో పాటు పంప్ హౌస్ కూడా నిర్మిస్తామని చెప్పారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కోసం 6 వందల కోట్లు మంజూరైందని త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. రూరల్ శాసనసభ్యులు ఆనం వివేకానందరెడ్డి మాట్లాడుతూ నగరం విస్తరించిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. మరో 97 లక్షల 30 వేల రూపాయలతో ట్రీట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. మంగలిదిబ్బ ఉన్న 130 ఎకరాల స్థలంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నీరు శుద్ధికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి జరిగే ప్రతి కార్యక్రమంలో నగర ప్రజలందరూ భాగస్వాములేనన్నారు. మోహన్, మాదవరెడ్డి, నారాయణరెడ్డి, మధు, శేషారెడ్డి, పవన్, గురవయ్యనాయుటు, వైవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వినాయక చవితి ఉత్సవాలు, ప్రజల ఇబ్బందులపై
19న రౌండ్ టేబుల్ సమావేశం
నెల్లూరు కల్చరల్, ఆగస్టు 16: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ప్రగతిశీల ప్రజావేదిక ఆధ్వర్యంలో ఈనెల 19న ఉదయం 10 గంటలకు స్థానిక వర్ధమాన సమాజం గ్రంథాలయం మిద్దెపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ నైనప్పగారి దశరథరామయ్య తెలిపారు. గురువారం వేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భక్తిని వ్యక్తిగత విశ్వాసంగా గుర్తించి గౌరవిస్తామని, అయితే భక్తిపేరుతో ప్రజలకు అసౌకర్యం కలిగించే హక్కు ఎవరికీ ఉండదని తాము విశ్వసిస్తామని చెప్పారు. వినాయక ఉత్సవాల సందర్భంగా జరిగే అసౌకర్యాలను నివారించేందుకు ఆయా భక్త బృందాలే బాధ్యతలు చేపట్టాలన్నారు. ఆధ్యాత్మిక తత్వాన్ని జీర్ణించుకున్నవారు ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. భక్తి పేరుతో సాగుతున్న అశ్లీల ,బూతు సాంస్కృతిక కార్యక్రమాలను నిరోధించాలన్నారు. రోజుల తరబడి రోడ్లను ఆక్రమించి వాహనాలు పోకుండా నిరోధించడాన్ని, మైకుల హోరును భరించలేక ప్రజలు మనస్సులోనే తిట్టుకుంటున్నారని చెప్పారు. అదేవిధంగా చవితి సందర్భంగా బలవంతపు చందాలు వసూళ్లనుండి ప్రజలు రక్షణ కోరుతున్నారని చెప్పారు. ఒక బాధ్యత కలిగిన సంస్థగా ప్రగతిశీల ప్రజావేదిక పౌర సమాజంతో చర్చ జరిపి పరిస్థితిలో జోక్యం చేసుకునేందుకు పూనుకుంటోందన్నారు. లౌకికవాదులు, భక్తిపరులు, వివిధ వృత్తి సంఘాలు, వ్యాపార సంస్థల ప్రతినిధులు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని వారి అభిప్రాయాలు, సూచనలు తెలియచేసి ప్రజల ఇబ్బందులు నివారణ కోసం చేపట్టవల్సిన చర్యల గురిచి చర్చించాలని దశరథరామయ్య కోరారు. విలేఖర్ల సమావేశంలో పి కొండమ్మ, ఎంవి సుబ్బారావు,కిషోర్‌బాబు పాల్గొన్నారు.

ముస్లిం మైనార్టీ మహిళల అభివృద్ధికి కృషి
నెల్లూరు కల్చరల్, ఆగస్టు 16: జిల్లాలోని ముస్లిం మైనార్టీ మహిళల అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తామని హాజీ అబ్దుల్ అజీజ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. స్థానిక సర్వోదయ కళాశాల ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన ముస్లిం మైనార్టీ మహిళల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ముస్లింలను ఓటు బ్యాంక్‌గా చూస్తున్నారని, రాజకీయ నాయకుల ఒత్తిడికి అధికారులు లొంగిపోరాదని కోరారు. ముస్లిం మహిళలను స్వయం సహాయక బృందాలుగా ఏర్పాటుచేసేందుకు 10వేల మంది మహిళలను సమీకరిస్తే అధికారులు రాకపోవడం శోచనీయమన్నారు. సెంటర్ ఫర్ సోషల్ జస్టీస్ ప్రతినిధి ఆరీస్ మహ్మద్ మాట్లాడుతూ అధికారులు రాలేదని నిరుత్సాహ పడవద్దని పథకాన్ని సమష్టిగా సాధించుకునేందుకు కృషి చేద్దామన్నారు. ఇర్ఫాన్ అజీజ్ మాట్లాడుతూ స్టేట్ ప్లానింగ్ కమీషన్ ద్వారా జరిగే ఈ కార్యక్రమం తప్పకుండా విజయవంతం అవుతుందన్నారు. ట్రస్టు వైస్ చైర్మన్ అబ్దుల్ జలీల్, వౌలానా అజీజ్, యస్థాన్, హాజీమునీర్ తదితరులు పాల్గొన్నారు.

కన్నుల పండువగా శివపార్వతుల కల్యాణం
నెల్లూరు కల్చరల్, ఆగస్టు 16: కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి భక్త మండలి ఆధ్వర్యంలో గురువారం రాత్రి స్థానిక బాలాజీనగర్‌లోని వాకాటి నరసయ్య త్యాగరాజ కల్యాణ మండపంలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. వివిధ రంగుల పుష్పాలు, ఆభరణాలతో ముస్తాబుచేసిన శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను కల్యాణ వేదికపై ఉంచి భక్తుల జయజయధ్వానాలు, మేళతాళాలు, వేద పండితుల మంత్రోచ్చాటనల మధ్య కల్యాణాన్ని వేదోక్తంగా, శాస్త్రోక్తంగా కమనీయంగా నిర్వహించారు. శివపార్వతుల కల్యాణ వైభవాన్ని, కల్యాణ తంతును అవధాన ప్రాచార్య, రాజమండ్రి ఆంధ్ర యువతీ సంస్కృత కళాశాల విశ్రాంత ఆచార్యులు డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి కళ్లకు కట్టినట్టు వివరిస్తూ చేసిన ప్రత్యక్ష వ్యాఖ్యానం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వేద పండితులు ముప్పిరాల రాఘవయ్య, నూతలపాటి సుబ్బయ్యశాస్ర్తీ కల్యాణానికి ఆచార్యులుగా వ్యవహరించారు. జంగా శివకుమార్, పద్మప్రియ కల్యాణ ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈసందర్భంగా కల్యాణ వేదికను అరటిపిలకలు, మామిడితోరణాలు, పుష్పతోరణాలతో ముస్తాబుచేశారు. కల్యాణం అనంతరం భక్తులకు ప్రసాదాలు, కల్యాణ అక్షింతలు పంచిపెట్టారు. లోక కల్యాణార్థం నిర్వహించిన ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి శ్రీ్ధర్, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ టిఎస్‌ఆర్ ఆంజనేయు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని సింహపురి ధార్మిక సంస్థ వ్యవస్థాపకులు ఉచ్చి భువనేశ్వరీ ప్రసాద్, నిరంజన్ తదితరులు పర్యవేక్షించారు.

ఉపవాస దీక్షలు భక్త్భివాన్ని పెంపొందిస్తాయి
ముస్లింలకు ఎమ్మెల్యే బీదా ఇఫ్తార్ విందు
కావలి టౌన్, ఆగస్టు 16: మతాలు ఏవైనా భక్తులు చేసే ఉపవాసదీక్షలు భక్తి భావాన్ని పెంపొందించి ప్రజలలో ప్రేమతత్వాన్ని వ్యాప్తి చేస్తాయని ఎమ్మెల్యే బీదా మస్తాన్‌రావు అన్నారు. గురువారం ఆయన పట్టణంలోని వివిధ మసీదులలో ఉపవాసదీక్షల్లో వున్న ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముందుగా ఆయనకు ముస్లిం మత పెద్దలు వారి ఆచార సాంప్రదాయాల ప్రకారం ఆహ్వానం పలికారు. అనంతరం ఆయనను శాలువాలు, గజమాలలతో సత్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలు చేసే ఉపవాస దీక్షలు అత్యంత పవిత్రమైనవని చెప్పారు. ఎంత పెద్ద ధనవంతులకైనా ఉపవాసాలతో పేదల ఆకలి బాధ తెలుస్తుందన్నారు. అందుకే ముస్లింలు తమ సంపాదనలో కొంత మొత్తాన్ని ఈమాసంలో విరాళంగా దానం చేస్తారని చెప్పారు. తన తల్లిదండ్రులు కసుమూరులోని మస్తాన్‌షావలి దర్గాలో ప్రార్థనలు చేయగా తాను జన్మించానని అందుకే ఆయన పేరుపెట్టారన్నారు. అనంతరం ఆయన స్వయంగా ముస్లింలకు వడ్డించి తాను స్వీకరించారు. సర్దార్ కిర్మాణి, ఖలీల్, జానీ, ఖమర్‌బాబు, హజరత్ తదితర ముస్లిం పెద్దలు, పార్టీ నాయకులు మలిశెట్టి వెంకటేశ్వర్లు, పూనూరు రవికుమార్, పోట్లూరి శ్రీనివాసులు, గాదంశెట్టి వేణుగోపాల్, తటవర్తి వాసు, ఆత్మకూరి బ్రహ్మయ్య, సుకుమార్, జ్యోతిబాబురావుతోపాటు పట్టణంలోని వివిధ వార్డులోని నాయకులు పాల్గొన్నారు.

రైతులందరికీ న్యాయం చేస్తా
కావలి టౌన్, ఆగస్టు 16:మండలంలోని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలో తమ ధాన్యాన్ని అమ్ముకుని నేటికీ నగదును పొందలేకపోయిన రైతులందరికీ న్యాయం చేస్తానని ఎమ్మెల్యే బీదా మస్తాన్‌రావు తెలిపారు. గురువారం ఆయన పట్టణంలోని పంచాయితీ రాజ్ కార్యాలయంలో వివిధ గ్రాంట్‌ల ద్వారా రోడ్ల అభివృద్ధికి మంజూరైన నిధులు, టెండర్ల ప్రక్రియ, ప్రగతిలో వున్న పనులు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా రుద్రకోట, బుడంగుంట, చలంచర్ల తదితర ప్రాంతాలకు చెందిన పలువురు రైతులు ఆయనను కలిసి త్వరితగతిన డబ్బులు ఇప్పించాలని విన్నవించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలోనే ఈవిషయమై జిల్లా డిఆర్‌డిఏ, పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్షించగా 70 లక్షల రూపాయిలు ఇటీవలనే ఐకెపి ఖాతాలో వేసారని కొంత మంది రైతులకు నగదుపంపిణీ చేసినట్లు చెప్పారు. అయితే మరో 25 మంది రైతులకు సుమారు 22 లక్షల రూపాయిలు రావాల్సి ఉందని, ధాన్యాన్ని అమ్ముకున్న రైతులకు రవాణా చార్జీలు సుమారు 13లక్షల రూపాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. వీటిని త్వరితగతిన రైతులకు ఇచ్చేలా మరోమారు ఐకెపి, డిఆర్‌డిఏ తదితర శాఖల అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు.

విద్యతోనే ఉన్నత స్థానం
కావలి టౌన్, ఆగస్టు 16: ఎంత నిరుపేదలైనప్పటికీ విద్యాభ్యాసంపై ఆసక్తిపెంచుకొని ఉన్నతవిద్య అభ్యసించడం ద్వారా సమాజంలో అత్యున్నత స్థానానికి చేరుకోవచ్చని వైఎస్‌ఆర్‌సిపి మండల కన్వీనర్ చింతం బాబుల్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఎడ్యుకేషనల్ ట్రస్టు ద్వారా వైఎస్‌ఆర్‌సిపి కావలి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రతాప్‌కుమార్‌రెడ్డిసరఫరా చేసిన నోట్ పుస్తకాలను మండలంలోని వివిధ గ్రామాలలోగల పాఠశాలల్లో విద్యార్థులకు పంపిణీ చేసారు. అల్లిగుంటపాలెం, కోనేటిపాలెం, మాతినవారిపాలెం, సర్వాయపాలెం ప్రాధమిక పాఠశాలల్లో విద్యార్ధులకు పంపిణీ చేసారు. ఈసందర్భంగా సర్వాయపాలెంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మొత్తం 400 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలను అందించామని చెప్పారు. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులతో పాటు పార్టీ నాయకులు కందుల శ్రీనివాసులు, పాలడుగు వెంకటరావు, బ్రహ్మయ్య, శ్రీను, సురేష్, ఉప్పాల వెంకయ్య గౌడ్, షాహుల్ హమీద్, ఎస్ వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, భరత్‌కుమార్, గోవింద తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని 21వ వార్డులో గల పాఠశాలలో విద్యార్థులకు పార్టీ నాయకులు ఎం ప్రభాకర్‌రావు, నాగభూషన్, పవిత్రన్, చిరంజీవి, కిరణ్ తదితరులు ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ జరిగింది.

ఒకరం...ఇద్దరం కాదు పది వేల మందికి పైగా ఇక్కడకు
english title: 
collector

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>