ఈ సంవత్సరం మరొక పదిహేను ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతి నివ్వడం సహేతుకంగా లేదు. ఇప్పటికే ప్రభుత్వ అపసవ్య విధానాలవలన ఇంజనీరింగ్ విద్య రాష్ట్రంలో ఒక ప్రహసనంగా మారింది. గ్రామానికొక ఇంజనీరింగ్ కాలేజీ వెలిసింది. ఈ సంవత్సరం ఎంసెట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ సీట్లు యిచ్చినా ఇంకొక ఇరవై వేలు సీట్లు మిగిలిపోతాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో అదనపు కాలేజీలకు అనుమతి యివ్వడంలోని ఆంతర్యం అర్థం కావడంలేదు. రాష్ట్రంలో ఉన్న సింహభాగం కళాశాలల్లో వౌలిక వసతులు, అనుభవజ్ఞులైన సిబ్బంది కొరత తీవ్రంగా వుండడంవలన నాణ్యమైన విద్య లభించక విద్యార్థులు వృత్తినైపుణ్యం అలవరచుకోలేకపోతున్నారు. ఏటేటా లక్షల సంఖ్యలో విద్యార్థులు డిగ్రీలు తెచ్చుకొని నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఇంజనీరింగ్ విద్య మరింత అధమ స్థాయికి దిగజారకముందే ప్రభుత్వం స్పందించి విద్యారంగం ప్రక్షాళనకు చర్యలు చేపట్టాలి!
- సి.ప్రతాప్, విశాఖపట్నం
రేవ్ పార్టీలను నిషేధించాలి
దేశంలో సంచలనం సృష్టిస్తున్న రేవ్ పార్టీల ముఖ్యోద్దేశం మాదక ద్రవ్యాల వ్యాపారం. మధ్య, ఉన్నత తరగతి యువత ఈ మాదక ద్రవ్యాలకు అలవాటుపడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటుండడమే కాక తమపై ఆధారపడిన దేశాభివృద్ధిని ప్రశ్నార్థకం చేస్తున్నారు. ప్రస్తుతం మద్యం కంటే మత్తుమందుల కారణంగానే దేశంలో ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ప్రపంచం మొత్తంమీద వాడే కెటమిన్‌లో 90 శాతం భారత్, చైనాలలోనే ఉత్పత్తి అవుతోందంటే దేశంలో మాదక ద్రవ్యాల మాఫియా ఎంత బలంగా విస్తరించిందో అర్థవౌతోంది. నేతలు, సెలబ్రిటీలు, అధికారుల అండదండలు వీరికి పుష్కలంగా లభిస్తున్న కారణంగానే వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. ప్రభుత్వం తక్షణం స్పందించి దేశంలో మాదక ద్రవ్యాల నియంత్రణకోసం చర్యలు చేపట్టాలి.
- సి.సాయిమనస్విత, విశాఖపట్నం
విద్యుత్ సంక్షోభం
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యుత్ సంక్షోభం నివారించటానికి చర్యలు చేపట్టకుండా సర్‌చార్జీలు వసూలుచేయటానికి అనుమతి యిచ్చింది. దీనివలన ప్రజలు గత రెండేళ్ళుగా వాడుకున్న విద్యుత్‌కు 8వేల కోట్ల రూపాయల భారాన్ని భరించవలసి వస్తున్నది. బొగ్గును విదేశాలనుంచి దిగుమతి థర్మల్ విద్యుత్ ఉత్పత్తికోసం ప్రయివేటు రంగానికి లైసెన్స్‌లు యివ్వటం వల్ల రాష్ట్రం ఎక్కువ ధరకు వారినుంచి విద్యుత్తును కొని 12వేల కోట్ల సబ్సిడీ భరిస్తున్నది. ఇంకా పరిశ్రమలకు సరఫరా పూర్తిగా లేదు. దానితో పరిశ్రమ మూతపడి కార్మికులు రోడ్డునపడ్డారు. ఇకనైనా విద్యుత్తుకు సరియైన పథకాలు రచించాలి. పల్లెలలో పవన విద్యుత్తు రైతులకు కరెంట్ అందించాలి. దీనికి నాబార్డ్ సహాయం తీసుకోవాలి. పట్టణాలలో సౌర విద్యుత్ ఉత్పత్తిచేయాలి. అన్ని బిల్డింగులపై సౌర విద్యుత్ పానెల్, రోడ్లపై సౌర విద్యుత్ ప్యానెల్స్ ఏర్పరచాలి. కొండలపై పవన విద్యుత్ ఏర్పాటు (తిరుమలలో) చేయాలి. ఇకనైనా గుజరాత్‌లో లాగా ప్రజలకు విద్యుత్తు సక్రమంగా అందజేయాలి.
- ఐ.యస్.వి.యస్.శర్మ, హైదరాబాద్
ఈ సంవత్సరం మరొక పదిహేను ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతి నివ్వడం సహేతుకంగా లేదు
english title:
sahetu
Date:
Saturday, August 25, 2012