రాజమండ్రి, ఆగస్టు 24: కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ విధానాల కారణంగానే రాష్ట్రంలో విద్యుత్ కోతలు విధిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు బివి రామారావు విమర్శించారు. విద్యుత్ కోతల కారణంగా రాష్ట్రంలోని పరిశ్రమలకు రోజుకు రూ. 400 కోట్ల నష్టం వాటిల్లుతోందన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. పరిశ్రమలు నష్టాల్లో ఉన్న నేపథ్యంలో ఏడాదిపాటు పారిశ్రామిక రుణాల చెల్లింపుపై మారటోరియం విధించాలన్నారు. లేనిపక్షంలో పరిశ్రమలు ఖాయిలాపడే అవకాశం ఉందన్నారు. కార్మికులకు చెల్లించాల్సిన జీతాల్లో సగం ప్రభుత్వం భరించాలన్నారు. ఇంతటి గడ్డు పరిస్థితులను గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు.
వారానికి మూడు రోజులు విద్యుత్ హాలిడే విధిస్తుండటంతో ఉత్పత్తులు పడిపోయి కార్మికులకు జీతాలు, బ్యాంకు రుణాలు చెల్లించలేని స్థితిలో పరిశ్రమలు ఉన్నాయన్నారు. విద్యుత్ సంక్షోభం కారణంగా రాష్టవ్య్రాప్తంగా సుమారు 30లక్షల మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. పరిశ్రమల గోడు పట్టని ముఖ్యమంత్రి ఇందిరమ్మబాట పేరిట జిల్లాలు తిరుగుతున్నారన్నారు.
రాష్ట్రంలో 9 గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయని, గ్యాస్ కొరత కారణంగా 1263 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. ప్రభుత్వ అసమర్థత, పార్లమెంటు సభ్యుల చేతకానితనం వల్లే గ్యాస్ సరఫరా కావడం లేదని విమర్శించారు. ప్రత్యామ్నాయ సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిపై ద్రృష్టిసారించడం లేదన్నారు.
విద్యుత్ సరఫరా లేకపోయినా డిమాండ్ చార్జీల పేరిట కిలోవాట్‌కు నెలకు రూ.250 వసూలు చేస్తున్నారన్నారు. జనరేటర్లు పనిచేసేందుకు వీలుగా డీజిల్‌పై వ్యాట్‌ను పూర్తిగా ఎత్తివేయాలన్నారు. విద్యుత్ సంక్షోభంపై ఈనెల 4న విశాఖపట్నం, 11న విజయవాడ, 22న తిరుపతి, 27న హైదరాబాద్‌లలో పారిశ్రామిక సదస్సులు నిర్వహించి, యాక్షన్ కమిటీ, కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసమర్థపాలనపై ఇటీవల యుపిఏ అధినేత్రి సోనియాగాంధీని కలిసి వివరించామని రామారావు తెలిపారు.
* ఎపి పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు రామారావు డిమాండ్
english title:
p
Date:
Saturday, August 25, 2012