ఎటియం నుంచీ వచ్చిందో
ఏ దుకాణంనుంచీ వచ్చిందో
ఆ వంద నోటు -
పట్టుకోగానే చెయ్యి కాలింది!
పొయ్యిమీది పెనంలా ఉన్న నోటు
బల్లమీద పడగానే
వానలో తడిసినట్లు
ఆర్ద్రమైపోయింది!
నోటూ, నోటూ, ఎందుకు ఏడుస్తున్నావు?
నోటు నోరు విప్పింది.
రోజంతా చెమటోడ్చిన
ఓ అనామకుడి చేతికి
తాను రోజు కూలీగా చేరింది
శ్రమజీవి చెమట వాసన
పన్నీటి పరిమళమైతే
మూడు సింహాలూ ముక్కు పుటాలెగరేసినై
కండలు కరిగించుకొన్న
కష్టార్జితంతో
కడుపుకు తిన్నదేం లేదు.
రేషన్ కార్డుకోసం
తప్పైనా, తప్పనిసరై
లంచంగా సమర్పణమయింది.
రాత్రికి బ్రాందీ షాపుకి-
అర్ధరాత్రి సానివాడకి
ఇలా
భూలోక రౌరవాదులన్నీ
తిరిగి తిరిగి నలిగి నలిగి
ఇప్పుడిలా.....
ఎప్పటికైనా
చిరిగి, చివికి శిథిలమయ్యే లోపు
మళ్ళీ
మట్టి తట్టలు మోసే చేతుల
మట్టివాసనలో
మల్లెపువ్వై పరిమళించాలని
ఆశ!
ఎటియం నుంచీ వచ్చిందో ఏ దుకాణంనుంచీ వచ్చిందో
english title:
v
Date:
Monday, September 3, 2012