పడమటి కేగు పొద్దు కను పట్టుచునుండె;
నిదాఘశాంతి యయ్యెడు మలిసంజ వేళకు
ఒకింత ప్రసన్నములయ్యెగాడుపుల్;
నడకల బొక్కు కూరె
నలినాక్షికినైన నిశాభయమ్మునెన్
నడవల సాగు గ్రొంజిగిననల్
తొగ కన్నుల కయ్యె కాంతులై ...
నీలి దుప్పటి మీద రాలి పడిన వెన్ని
మరు లల్లుకొని వచ్చు మల్లెపూలు
పూల జల్లును మించి పుప్పొళ్ల చినుకుల
పుక్కిలించినవేమొ మొగలిపూలు
లీలచల్లని మంచు నొలయించి హేలను
జాలుకట్టించెనొ జాజిపూలు
రెల్లు పూల తురాయి రేయికి తలపాగ
గాలికూగుచునున్న కలువపూలు
ఎన్ని పూవులు! పూవులో నెన్ని రేకు
లెన్ని మధుర వాసనలు! ఈ హృదయమందు
యుగ యుగమ్ముల కాలమ్ము నొదిగి యొదిగి
తిరుగుచున్నదొ భ్రమరమ్ము తిరిగి తిరిగి
కొలువు దీరిన నిండురే వెలుగు కిరణ
డోలికల లోన తూగుటుయ్యేల లూగి
సేద గొన వేకువన్ తూర్పు సీమనుండి
కించి దరుణ చిత్రముల రచించిపోవు
ముగ్ధ రాగచ్ఛాయ మొనయంచి
తమ్ములు
గాలి యూయెల త్రాళ్ల
గరసు లల్లు
పవమాన వలమాన పరిమళమ్మున
తేలి
వలపు నిట్టూర్పులు
కలయ తిరుగు
విరహంపు కలవాక వెల్లువ
కెదురీది
బడలిన చేతులు
బారగిలును
మంచుం జలువ యాకు మదుగులో
మృదువుగా
నెలిగించు పులుగు
గొంతెత్తి పిలుచు
అలపు సొలపున నిలువక నిలచి నిలచి
తొగరు చివురాకు విలుకాడు మొగముద్రిప్ప
సగము తెరిచిన వాకిలి పగటి వెలుగు
తెల్లవారిన రాత్రికి తీపి గుర్తు ...!
బింబ ప్రతిబింబ వివిక్త విధా
నంబై - ఇనరాగలసత్కమనీ
యందైన మయూఖ సహస్రముల్
బింబించె జగంబు నవీన రుచిన్ !