ఆధునిక తెలుగు సాహిత్యంలో ‘సాహిత్య చరిత్రలకు’ ఒక ప్రత్యేక స్థానం వుండడం అందరికీ తెలిసిన విషయమే. అలనాటి కందుకూరి వీరేశలింగం పంతులుగారి మొదలు నేటి వెలిమల సిమ్మన్నవరకు ఎందరో ఎనె్నన్ని రకాల ‘సాహిత్య చరిత్రలో’ ఎనె్నన్ని పేర్లతోనో కొల్లలుగా రచించారు.
అయితే వీటిలో ఇటీవల ‘డిమాండు’ పెరిగిన అంశం ‘సివిల్ పరీక్షలు’ వ్రాసే వారికి ప్రత్యేకంగా ఉపయోగకరంగా పరీక్షలకు మాత్రమే అవసరమైనంత తీరున వ్రాస్తూన్న ‘సాహిత్య చరిత్రలు’. వీటినీ చాలామంది వ్రాసే ప్రయత్నం చేసినా ఏ యిద్దరో ముగ్గురో చరిత్ర రచయితలు మాత్రమే ఈ పరుగుపందెంలో ముందుండడం గమనించదగ్గ విషయం.
సివిల్ పరీక్షలంటేనే ఒక ప్రత్యేకత కలిగినవి. సమున్నత స్థాయి పరీక్షలకవి తార్కాణమనీ, ఆ పరీక్షలు వ్రాసే అభ్యర్థులు బహుమేధావులైయుంటే తప్ప ఆ పరీక్షలలో ఉత్తీర్ణులు కాలేరనీ ఒక పరంపరయా విశ్వాసం. అలాంటి మేధావులకందించే సాహిత్య చరిత్రలూ అంతటి స్థాయిగల విషయ బాహుళ్యంతో, వివేచనకు, విశే్లషణకు, విజ్ఞానానికి మార్గదర్శకంగా రచింపబడాలి. అలానే రచనలుంటున్నాయి అనేందుకు సందేహమే లేదు.
కాకపోతే- ఈ విధమైన సాహిత్య రచనలో విషయ బాహుళ్యంతోపాటు, దోష రహితంగా కూడా వుండాలి. పరీక్షకు సిద్ధపడే విద్యార్థులందరికీ తెలుగు సాహిత్యమూర్తులతో, రచనలతో పరిచయం వుంటుందని అనుకునే వీలులేదు. అందుచేత- ఒకవేళ ఈ సాహిత్య చరిత్రలలో ఎక్కడైనా పొరబాటు దొర్లితే- ఆ విద్యార్థి అదే ఒప్పనుకుని వాని దురదృష్టవశాత్తు అదే ప్రశ్నపత్రంలో కనిపిస్తే, ఈ చరిత్రలో దొర్లిన ‘తప్పు సమాధానమే’ వ్రాస్తాడూ, మార్కులు చేతులారా పోగొట్టుకొంటాడు. ఈ నేరం ఎవరిదవుతుంది? సాహిత్య చరిత్ర రచయితది.
కనుక- సాహిత్య చరిత్ర రచన చేసే మేధావి రచయితలు నూటికి నూరు శాతమూ ఇలాంటి దోషాలు దొర్లకుండానే చూడాలి. అవశ్యత చూడాలి. ఒక ‘సాహిత్య చరిత్ర గ్రంథం’లో నాటకాల గురించి తెలిపే అధ్యాయాల్లో ఇలాంటి తప్పు దొర్లింది. ‘వేణీసంహార నాటకం’ సంస్కృతంలో భట్ట నారాయణుడు రచించాడు. అయితే సాహిత్య చరిత్రలో మాత్రం భట్టుబాణుడు అని ముద్రితమయింది. పరీక్షార్థులందరి మెదళ్లలో ఈ భట్టబాణుడే మెదలుతాడు కదా! అది దోషం కాదా! అలాంటివి ప్రూఫ్ రీడింగ్ దశలో రచయితలు శ్రద్ధగా కళ్లూ, మనస్సూ రెండూ పెట్టుకొని సవరించి వుండాల్సింది.
అలాగే ప్రాచీన, నవీన కవుల గురించీ, వారి కావ్యాలను గురించీ, వారి పద్యాలూ, గీతాలూ ఉటంకించే పట్టులలో ఆ ఉదాహృత రచనలలో ముద్రణాదోషాలుండకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఆ సాహిత్య చరిత్రకారులదే.
ఒక సాహిత్య చరిత్రలో అలాంటి ఉదాహరణలలో ముద్రణా దోషాలు అతి బహుళంగా కనబడతాయి. పరీక్షార్థులకేం తెలుస్తుంది? ఆ పద్యమంతే, ఆ గీతమంతే కదాని ఆ పాదాల్ని అలానే తప్పులతోనే అభ్యసించి అవే పరీక్షలలో వ్రాస్తారు, వచ్చే మార్కులు పోగొట్టుకుంటారు. తప్పెవరిది? కనుక తప్పుల్లేకుండా చూడవలసిన గురుతర బాధ్యత రచయితలదే. మరో ముఖ్య విషయం - ఒక అధ్యాయంలో ఒక అంశానికి సంబంధించిన విశేషాలందించటంలో సమగ్రతతోపాటు సమ్యగ్వీక్షణమూ ఉండాలి. పాక్షిక దృక్పథాలకు చరిత్ర రచనలో చోటులేదు.
ఒక ‘సాహిత్య చరిత్ర’లో ఆధునికులలో ప్రసిద్ధులయిన పద్య కవులను చెప్పేచోట దుర్భా సుబ్రహ్మణ్యశాస్ర్తీ, షద్దర్శనం సోదర కవులు, యస్వీ జోగారావు, పాణ్యం సోదర కవులు, బెళ్లూరి శ్రీనివాసమూర్తి, దుగ్గిరాల రామారావు, చిడిప్రోలు కృష్ణమూర్తి, గాడేపల్లి సీతారామమూర్తి వంటి ఆధునిక పద్యపోషకులూ, లబ్ధప్రతిష్ఠులు అయిన వారిని విస్మరించి, జాన దుర్గా మల్లికార్జునరావు పేరును గ్రంథస్థం చేశారు. పరీక్షార్థులు నిజంగానే ఈ ‘జాన’ మహాకవి కాబోలు- అనుకునే ప్రమాదం వున్నది కదా!
అలాగే మరో అధ్యాయంలో ఒక సాహిత్య చరిత్రలో-లాక్షణిక మహోదయులను చెప్పేచోట తాతా సుబ్బరాయశాస్ర్తీ గురించి చెప్పటం సమంజసమే అయినా దువ్వూరి వేంకట రమణశాస్ర్తీ, వెంపరాల సూర్యనారాయణశాస్ర్తీ, సన్నిధానం సూర్యనారాయణశాస్ర్తీ, వడ్లమూడి గోపాలకృష్ణయ్య లాంటి హేమాహేమీలను మాత్రం విస్మరించారు. కాశీభట్ట బ్రహ్మయ్యశాస్ర్తీ, చర్ల బ్రహ్మయ్యశాస్ర్తీ, జటావల్లభుల పురుషోత్తం పంతులు, తంగిరాల వేంకట కృష్ణసోమయాజ, తాడేపల్లి రాఘవనారాయణశాస్ర్తీ, చెరువు సత్యనారాయణ శాస్ర్తీ వంటి ఉద్దండుల గురించి ఈ సాహిత్య చరిత్ర రచయితలకు తెలియదేమోనని కొందరు విజ్ఞులయిన పాఠకులు భావించే ప్రమాదమూ వుంది. వారికి తెలియదని కాదు, విస్మృతి- అంతే! ఈ ‘విస్మృతే’ సాహిత్య చరిత్ర రచనలు చోటుచేసుకోకూడదనేది పిండితార్థం.
ఆధునిక తెలుగు సాహిత్యంలో ‘సాహిత్య చరిత్రలకు’
english title:
civil
Date:
Monday, September 3, 2012