Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కవిత చిన్నది.. భావన పెద్దది

$
0
0

ఏ ప్రక్రియ అయినా ప్రక్రియ సృష్టికోసం కాకుండా కవిత్వంకోసం పుట్టాలి. అప్పుడే అందులోని కవిత్వమైనా, ప్రక్రియ అయినా గుర్తించబడుతుంది. ప్రక్రియ లక్ష్యం కవిత్వమే కావాలి తప్ప, తనకు తానుగా గుర్తింపునకు ఉబలాటపడేది కాదు, కాకూడదు. కవిత్వంకోసం పుట్టే కవిత్వం ‘ప్రక్రియ’గా మారవచ్చు లేదా ప్రక్రియగా గుర్తించబడవచ్చు. కానీ ప్రక్రియకోసం మాత్రమే పుట్టే కవిత్వం, ప్రక్రియగా కాదు కదా, చివరికి కవిత్వం కూడా కాకుండా పోవచ్చు. కవిత్వ ప్రపంచంలో వాదాలు, వివాదాలు, చర్చలు, విమర్శలు ఎప్పుడూ ఉన్నవే. ప్రక్రియల పరంగా, కవుల పరంగా, సిద్ధాంతాల పరంగా కవిత్వం ఎప్పుడూ చర్చనీయమే. ఆయా వాదాలు, వివాదాలు, చర్చలు, విమర్శలు తేల్చేది కవిత్వం యొక్క కవితాత్మకతనే. సమకాలినంగా వచ్చిన వాటిలో చిన్న కవితలు చాలా వ్యాప్తిని పొందాయి. అదే స్థాయిలో చర్చనీయాంశాలు అయ్యాయి. ఇప్పటివరకు వచ్చిన లఘు కవితా రూపాలలో ప్రముఖమైనవి, ఎక్కువ ప్రచారాన్ని, ఆదరణ పొందిన వాటిలో ప్రధానమైన వాటిని ఇలా వర్గీకరించవచ్చు.
మొదటి విభాగం మినీ కవిత; రెండవ విభాగం హైకూ, నానీ, రెక్కలు; మూడవ విభాగం కూనలమ్మ పదాలు, రుబాయిలు, ప్రపంచ పదులు. మొదటి విభాగం ప్రధానంగా ఎలాంటి నియమిత లక్షణాలు లేని లఘు కవిత. రూపం వీలైనంత తక్కువ. పదాలు తప్ప ఇనే్నసి పాదాలు లేదా, ఇన్ని అక్షరాలు ఉండాలనే నియమం ఉండనిది. రెండవ విభాగంలోని రూపాలకి పాదాల నియమం ప్రధానంగా వచన కవిత లక్షణాలు ఉండాలి. హైకూలో మూడు పాదాలు నానీలో నాలుగు పాదాల, రెక్కలులో ఆరు పాదాలు ఉంటాయి. (అయితే హైకూ, నానీలలో అక్షరాల సంఖ్య కూడా ఉంది). ఇలా పాదాల సంఖ్యను నిర్దేశిస్తూ వచ్చిన వాటిని రెండవ విభాగంలో చేర్చవచ్చు.
మూడవ విభాగంలోని రూపాలకి మాత్రల నడక ప్రధానం. ఇవి మాత్రం ఛందో రీతిని పోలి వినడానికి కూడా ఇంపుగా ఉంటాయి. ప్రపంచ పదులలో పాదాల సంఖ్య ఉన్నప్పటికి గేయ నడక పరంగా ఇందులో చేరుతుంది. వీటిల్లో ఎక్కువ ప్రచారాన్ని వ్యాప్తిని పొందినవి మినీ కవిత, హైకూ నానీ.
మినీ కవిత - హైకూ - నానీ అనేవి వేటికవి రూపంలో సంక్షిప్తంగా ఉన్న ఈ మూడు కలిసి లఘు కవిత్వ ప్రక్రియ గొడుగు క్రింద కాక ప్రత్యేక ప్రక్రియ గుర్తింపుతో ఉండటానికే ఇష్టపడుతున్నాయి. ఆయా రూపాలను ప్రక్రియలుగా ప్రతిపాదించే వారి వలన ఇది తెలుస్తుంది. ఇందుకు వారు ఆయా రూపాలకు గల నిర్మాణ, శిల్పపరమైన కారణాలను విశే్లషించి చూపుతున్నారు. ఇందులోనే భాగంగా మినీ కవితకు ధ్వని, కొసమెరుపు, కొస చరుపు; హైకూకి తాత్విక దృక్పథం, ప్రాకృతిక ప్రేరణ; నానీకి భావాంశ నిర్మాణం మొదలైనవి. అయితే వాటికంటూ ప్రత్యేకంగా చెప్పుకుంటున్న ఈ లక్షణాలు. ఇతర కవితలకు లేవా? ఒక లఘు కవిత్వం తాలూకూ అంశాలు మరో లఘు కవితలో ప్రతిఫలించడం లేదా? ప్రతిఫలిస్తున్నాయి. అయితే ఆయా రూపాలలో అంత విస్తృతంగా కాకపోవచ్చు. పోనీ ఆయా రూపాలకు గల ప్రత్యేక లక్షణాలు, ఆయా మినీ కవిత, హైకూ, నానీలలో ప్రతి దానిలోనూ తు.చ. తప్పకుండా పాటింపబడుతున్నాయా? లేవు. మరి ఎందుకింత వితండ వాదనలు. మినీ కవిత- హైకూ- నానీ ఈ మూడింటికీ రూపాల పరంగా గల ప్రత్యేక వాదనలు కొన్ని ఇక్కడ గమనించడం అవసరం. మినీ కవిత ప్రత్యేక వాదన ఏమంటే మినీ కవితకి- హైకూకి, హైకూ కన్న కూడా నానీలకి తేడా లేదని అసలు ఇవన్నీ కూడా మినీ కవితలే అవుతాయి. కనుక అన్నింటికీ మినీ కవిత గుర్తింపు సరిపోతుంది అని.
మినీ కవిత పుట్టిన సందర్భాలను గమనిస్తే విస్తృతంగా వస్తున్న వచన కవిత్వం పట్ల విసుగును పొందిన పాఠకులకు, కాస్త వినూత్నత లాగా ముందుకు వచ్చింది. పైగా కాగితం కరువు వచ్చి పత్రికలు వీటిని ప్రోత్సహించాయి. ఇది కూడా ఒక కారణం. మినీ కవిత ఎలా వచ్చినా, ఆ రోజుల్లో ఇది బాగా ప్రచారం పొందింది.
అయితే మినీ కవిత్వం వచన కవిత్వంతోపాటు సమానంగా ఎందుకు విస్తృతంగా రాలేదు. వచన కవిత్వం సంపుటాలు పొందిన ఖ్యాతిని అంతే ఎక్కువ సంఖ్యలో మినీ కవితలు కానీ, మినీ కవితా సంపుటాలు కానీ ఎందుకు పేరొందలేదు. అంటే మహా ప్రస్థానం, అమృతం కురిసిన రాత్రి వంటి వన కవితా సంపుటాలు పొందిన ఖ్యాతిని మినీ కవితలలో సంపుటాలు పొందాయా? పైగా మినీ కవిత్వం అనేది లావాలా పొంగి చల్లారిపోయింది. అది విస్తృతంగా వెలువడిన కాలం నాటి ప్రవాహాన్ని కొనసాగించలేకపోయింది. మినీ కవిత 1990-95 తరువాత దాదాపుగా నిలిచిపోయినంత స్థితిని పొందింది. మళ్ళీ ఎప్పుడైతే నానీల వ్యాప్తి 2000 సం. తరువాత బాగా పెరిగిన తరువాత ఇది మళ్ళీ ఎక్కువగా రావడమూ, ప్రచారం కావడమూ కనిపిస్తుంది. మినీ కవిత అనేది కాలంతోపాటు సాహిత్యంలో ఏర్పడిన ఒక కవితా రూపం. కాలం ప్రవాహంలో సాహిత్యంలోని ప్రతి అంశం ప్రభావానికి గురి అవుతుంది. ఒకప్పుడు వచ్చిన ఇతిహాస రూపం ఇప్పటికీ నిలిచిందా? ఒకప్పుడు వచ్చిన ప్రబంధం ఇప్పటికీ కొనసాగుతుందా? ఒకప్పటి ముత్యాల సరం ఇప్పటికీ కొనసాగుతుందా? కాలం మారినకొద్దీ పలు కొత్త అంశాలు ముందుకు వస్తాయి. ఒకప్పుడు మహా దివ్య ప్రభతో ఒక వెలుగు వెలిగిన అంశం, మరో కాలంలో తన ప్రాభవాన్ని కోల్పోవచ్చు. ఒకప్పుడు వ్యాప్తిలో లేని అంశం, తరువాత కాలంలో విస్తృత వ్యాప్తిని పొందవచ్చు. అసలు ఉనికిలోనే లేని కొత్త అంశం, ప్రచారంలోకి రావచ్చు. ఈ విషయం అందరూ అంగీకరించవలసిందే. కాలం మారుతున్నకొద్దీ సమాజమూ మారుతుంది. కాలమే ఇతిహాసం సృష్టించింది, కాలమే ప్రబంధాన్ని ముందుకు తెచ్చింది, కాలమే వచన కవితనూ ప్రోత్సహించింది, కాలమే దీర్ఘకావ్యాలను తెచ్చింది, కాలమే కవితా ఖండికలను తెచ్చింది, కాలమే మినీ కవితనూ తెచ్చింది, కాలమే హైకూలను తెచ్చింది, కాలమే నానీలను తెచ్చింది. (కాలం అంటే ఇక్కడ కాలంతోపాటు గడిపిన సమాజమే). కాబట్టి కాలాన్ని అనుసరించి వస్తున్న కొత్త ప్రయోగాలను ఒప్పుకోవాలి. అంతేకాని నానీలు, మినీ కవితలు అనడం సమంజసం కాదు. కాకపోతే ఇవి రెండూ లఘు కవిత్వం. ఇది సరైన వాదన.
నానీలను మినీ కవితలు అనడానికి మినీ కవితకు గల లక్షణాలు కూడా కొంత అడ్డంకిగా నిలుస్తాయి. మినీ కవితలో కొసమెరుపు, కొస చరుపు ఉండాలి అంటారు. మరి నానీలలో ఇవి ఉన్నాయా? నానీకంటూ ప్రత్యేకమైనది భావాంశ కూర్పు. హైకూ అనేది తెలుగు సాహిత్యంలో పుట్టలేదు. ఇది విదేశంలోనే ఏర్పడిన కవితా రూపం. కనుక ఇది తెలుగులో ప్రత్యేక ప్రక్రియ. హైకూకి ప్రాకృతిక ప్రేరణ, తాత్త్విక భావజాలం ప్రధానం. ఇవి దీని ప్రత్యేక లక్షణాలు కనుక ప్రక్రియగా గుర్తించాలి. విదేశాల్లో పుట్టినది, అక్కడ దీనికి అస్తిత్వం ఉంది. ప్రక్రియగా గుర్తింపు ఉంది. కనుక ఇక్కడ లఘు కవిత్వం ప్రక్రియ గొడుగు క్రిందికి కాక ప్రత్యేక ప్రక్రియగానే గుర్తించాలి అనడం హైకూ వాదుల అభిప్రాయం. ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాలి. లక్షణాలు అనుసరించి లక్ష్యం ఏర్పడుతుందా లక్ష్యాన్ని అనుసరించి లక్షణం ఏర్పడుతుందా. రెండవదే సరైనది. ఎప్పుడైనా లక్ష్యాలనుంచి లక్షణము, ఉదాహరణల నుంచే సూత్రము, సాధారణ విషయాల నుంచే సిద్ధాంతమూ ఏర్పడుతుంది. హైకూలకి తాత్విక పునాది. తెలుగులో వెలువడిన హైకూలను అనుసరించి, స్వేచ్ఛను, విభిన్నతనూ ఒప్పుకోవాలి. అద్దంలో చందమామను చూపి మోసం చేయడమంత సులభం కాదు సాహిత్యంలో సిద్ధాంతాన్ని చేయడం.
తెలుగు హైకూలను అనుసరించి తప్పనిసరిగా వాటిల్లో ఉన్న లక్షణాలు రెండే రెండు. ఒకటి - రూపం సంక్షిప్తంగా ఉండడం, రెండు కవితాత్వక వ్యక్తీకరణ కలిగి ఉండటం. ఇవి రెండింటి దృష్ట్యా చూస్తే హైకూ లఘు కవితా రూపం మాత్రమే కాదు, నిస్సందేహంగా లఘు కవిత్వ ప్రక్రియ. నిర్మాణపరంగా ప్రత్యేకతను కలిగిన సంక్షిప్తత, ముక్తక లక్షణం, కవితాత్మక అభివ్యంజనం లక్షణాల ద్వారా చిన్న కవితలు మంచి ‘లఘుకవిత్వ’ రూపాలు.

ఏ ప్రక్రియ అయినా ప్రక్రియ సృష్టికోసం కాకుండా కవిత్వంకోసం పుట్టాలి.
english title: 
kavita
author: 
- తన్నీరు సురేష్

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>